పాశవికతకు అద్దంపట్టిన చిత్రం

by Ravi |   ( Updated:2023-05-06 02:50:13.0  )
పాశవికతకు అద్దంపట్టిన చిత్రం
X

పోలీసు హీరోయిజాన్ని ఎత్తిపట్టడంలో భారతీయ సినిమాకు దశాబ్దాల చరిత్ర ఉంది. మాఫియా, రాజకీయ నాయకుల దురాగతాలపై ఒంటిచేత్తో పోరాడుతూ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అన్యాయంపై న్యాయం గెలుపు సాధిస్తుందంటూ మన హీరోలు, హీరోయిన్‌లూ పోలీసు యూనిఫారంలో హీరోయిజానికి నిలువెత్తు నిదర్శనంగా ఉంటూ దశాబ్దాలుగా అభిమానుల చేత చప్పట్లు కొట్టించుకోవడం మనందరికీ తెలిసిందే. నిజానికి పోలీసు పాత్రలను గ్లోరిఫై చేయడమే అర్థ సత్యం. రాజకీయ నేతలకు, పార్టీలకు, వ్యవస్థకు మన పోలీసులు ఎంత గులాంగిరీ చేస్తారో, ఒత్తిళ్లకు లొంగి సహజన్యాయాన్ని కూడా తుంగలో తొక్కి కేసులను ఎలా తల్లకిందులు చేస్తారో తెలిసిందే. అధికార స్థానాలకు నిరంతరం లొంగిపోయి బతుకుతున్న పోలీసు పాత్రలకు హీరోయిజం అంటగట్టడమే ఒక అభాస. దీనికి భిన్నంగా మన సమాజంలో పోలీసు వ్యవస్థ ఒక బ్రూటల్ ఫోర్స్‌గా ప్రజలను అణిచిపెట్టే సాధనంగా ఎలా తయారవుతుందో చాలా కాలంగా కమర్షియల్ సినిమాల్లో కూడా గత నలభై ఏళ్లుగా చూపిస్తూ వస్తున్నారు.

జైభీమ్ నుంచి విడుదల1 వరకు...

1980లో తమిళ దర్శకుడు బాలూమహేంద్ర తీసిన 'నిరీక్షణ' సినిమా పోలీసు పాశవితకను, వారిలోని క్రూర హింసాత్మక ధోరణిని నాటి సమాజానికి షాక్ తెప్పిస్తూ తొలిసారిగా సెల్యులాయిడ్‌పై చూపించింది. కొన్నేళ్ల క్రితం 'విశారణై' పేరిట వచ్చిన తమిళ సినిమా తెలుగు భాషలో కూడా విడుదలై షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చింది. లాక్ డౌన్ కాలంలో నేరుగా ఓటీటీలో వచ్చిన సూర్య 'జైభీమ్' సినిమా ఆదివాసీలపై పోలీసు హింసాకాండను పచ్చిగా చూపించి లక్షలాది మందిని భయకంపితులను చేసింది. 2023లో సెల్యులాయిడ్‌పై పోలీసు పాశవికతను అదేస్థాయిలో నిర్భీతిగా చూపించిన సినిమా వెట్రిమారన్ తీసిన విడుదలై ( Viduthalai Part 1 - తెలుగులో విడుదల పార్ట్ 1). మార్చి 31న థియేటర్లలో విడుదలైన 'విడుదలై 1' సినిమా (తెలుగులో ఏప్రిల్ 15 విడుదల) బలహీనులపై పోలీసు బ్రూటాలిటీ స్థాయిని కళ్లకు కట్టినట్లు చూపించింది. అధికారాన్ని పాలనా వ్యవస్థ, పోలీసు యంత్రాంగం ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తుందో, నిజాయితీగా ఉండాలనుకునే సాధారణ కానిస్టేబుల్‍ని అది ఎంతగా మానసిక వ్యథకు గురి చేస్తుందో విడుదలై పార్ట్ 1 మరోసారి కళ్లకు కట్టినట్లు చూపించింది. ఉద్యోగ బాధ్యత, సత్య శోధనకు మధ్య నలిగిపోయే ఈ కానిస్టేబుల్ కోణంలోంచి ఆదివాసీలపై, నిరుపేదలపై సాగే దౌర్జన్యం, ఘోర హింసాకాండను ఈ సినిమా మరోసారి చూపించింది. ఒక ప‌క్క ప్రేమ‌, ఇంకోవైపు నక్సల్స్ నేత కోసం సాగించే వేట‌లో కుమ‌రేశ‌న్ ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి గుర‌వుతాడ‌న్న‌ది మిగ‌తా క‌థ‌.

కథ సారాంశం

ఆదివాసీ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్లాన్‌కి వ్యతిరేకంగా వాత్తియార్ తిరుగుబాటు చేపడతాడు. అతడిని సజీవంగా కానీ శవం రూపంలో అయినా సరే పట్టుకోవాలని ప్రభుత్వం స్పెషల్ టాస్క్‌ని నియమిస్తుంది. ఈ టాస్క్ ఫోర్సులో చేరిన కుమరేశన్ అడవిలో ఎలుగుబంటి దాడికి గురైన ఆదివాసీ ముదుసలిని కాపాడి అధికారులచేత చీవాట్లు తింటాడు. ప్ర‌జ‌ల‌కి క‌ష్టం వ‌స్తే ఆదుకోవ‌డ‌మే పోలీస్ విధి అనేది తాను న‌మ్మిన సిద్ధాంతం. ఆ ముదుసలి మనవరాలు పాప (భవాని శ్రీ)ని ప్రేమిస్తాడు. పాపను టాస్క్ పోర్స్ అనుమానించడంతో ఆమె ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఈ క్రమంలోనే నక్సల్స్ గ్రూప్ నాయకుడి ముఖాన్ని యాధృచ్ఛికంగా చూసిన సూరి తానే స్వయంగా వాత్తియార్‌ని పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు.

విజయ్ సేతుపతి‌ ఆధునిక సినిమా నట చరిత్రలో ఒక విరాణ్మూర్తిగా వెలుగొందుతుండటం తెలిసిందే. తిరుగుబాటు నేతగా తన పాత్రకు ఆద్యంతం జీవం పోశాడు. అమాయక పోలీసుగా సూరి పాత్రధారి నక్సల్స్ నేతకు పోటీగా దీటుగా నటించి వీక్షకులను పలు సీన్లలో దిగ్భ్రాంతికి గురిచేస్తాడు. ఇక తమిళరసి పాత్ర పోషించిన భవాని శ్రీ జీవితంలో ఒక్కసారి మాత్రమే దక్కే పాత్రను దక్కించుకుంది. ప్రభుత్వ ఉన్నతాధికారిగా రాజీవ్ మీనన్, డీఎస్పీగా గౌతమ్ మీనన్, శాడిస్ట్ పోలీసుగా చేతన్ సినిమాకు జవజీవాలను కల్పించారు. విజయ్ సేతుపతి పట్టుబడే దృశ్యంతో ముగిసిన సినిమా రెండో భాగం కోసం కూడా ఎదురుచూసేలా సస్పెన్స్ సృష్టించింది.

స్థానిక నక్సల్స్ గ్రూప్ అయిన పీపుల్స్ ఆర్మీ నాయకుడు వాతియార్ (విజయ్ సేతుపతి)ని బంధించడానికి వేటాడుతున్న పోలీసు దళంలో కుమరేశన్ చేరుతాడు. పోలీసు శాఖలో అరుదుగా కనిపించే మంచికి ఈ పాత్ర ప్రతినిధి. పెద్ద పెద్ద ఆశలతో, స్వప్నాలతో పోలీసు విభాగంలో చేరిన కుమరేశన్ (సూరి) చెక్ పోస్టుల్లో కాపలా కాస్తున్నవారికి ఆహారం సప్లయ్ చేయడం, రాత్రిపూట టవర్ డ్యూటీలో కావలి కాయడం వంటి యాత్రిక బాధ్యతలతో వేసారిపోతుంటాడు. అనుకోని విధంగా నక్సల్స్ నాయకుడు వాత్తియార్‌‌ ముఖాన్ని చూడగలిగిన కుమరేశన్ తర్వాత అతడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషిస్తాడు. ఈ క్రమంలో ఏది నిజం, ఏది తప్పు అనే విషయంలో అతడి నమ్మకాలు ప్రశ్నార్థకమై నిలుస్తాయి.

పోలీసే ప్రశ్నిస్తే...

సినిమా ప్రారంభంలోనే కనిపించే ట్రెయిన్ బ్లాస్ట్, దాని విజువల్స్ భారతీయ సినిమాల్లో ఇటీవలి కాలంలో ఎన్నడూ చూడని అరుదైన దృశ్యాన్ని చిత్రికపట్టాయి. ఈ పేలుడుకి పీపుల్స్ ఆర్మీ కారణమని అరోపిస్తారు. ఈపేలుడులో 28 మంది మరణించగా పలువురు గాయపడతారు. పీపుల్స్ ఆర్మీ నాయకుడు వాత్తియార్ (విజయ్ సేతుపతి)ని ప్టటుకోవడానికి పోలీసు శాఖ ఘోస్ట్ హంట్ పేరిట ఆపరేషన్ మొదలెడుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ షాట్‌లో చెక్ పోస్టు వద్ద బస్సును ఆపిన పోలీసులు, పారిపోవడానికి ప్రయత్నించిన ఇద్దరు సాయుధులను కాల్చిపడేస్తారు. పై రెండు ఘటనల్లో ప్రాణహాని కలుగుతుంది. కానీ మరుసటి రోజు పతాక శీర్షికల్లో పోలీసులు చేసిన హత్యలు హైలైట్ అవుతాయి. పోలీసుల పాశవికత వెనుక ఉన్న నీతిని సూరి ప్రశ్నిస్తాడు. ఒక అమాయకుడైన కానిస్టేబుల్ మనసులోంచి దూసుకొచ్చిన ఈ ప్రశ్న యావత్ సమాజాన్ని తట్టి లేపేలా ఉంటుంది.

తన కెరీర్‍లో ఇంతవరకు కమెడియన్ పాత్రల్లోనే నటిస్తూ వచ్చిన సూరి ఈ సినిమాలో కీలకపాత్రను దక్కించుకోవడం గమనార్హం. పోలీసు దర్యాప్తు పేరుతో జరిగే అమానుష చర్యలకు సూరి మౌన ప్రేక్షకుడిగా చూస్తుండిపోతాడు. వియత్నాంలో అమెరికన్ సేనల దురాగతాన్ని హృద్యంగా, దయనీయంగా చూపించిన 'కాజువాలిటీస్ ఆఫ్ వార్' అనే సినిమాలోని అమాయక సైనికుడి పాత్రను సూరి చాలా చోట్ల ప్రతిబింబిస్తాడు. ఒకవైపు నిజాయితీతో కూడిన అమాయకత్వం, మరోవైపు నిస్సహాయత్వాన్ని సూరి అత్యంత ప్రతిభావంతంగా తన పాత్రలో చూపిస్తాడు. ప్ర‌జాద‌ళం నాయ‌కుడైన పెరుమాళ్‌గా విజ‌య్ సేతుప‌తి క‌నిపించేది కొన్ని స‌న్నివేశాల్లోనే. కానీ ఆ ప్ర‌భావం సినిమా మొత్తం క‌నిపిస్తుంది. ఇక కథానాయక పాత్రధారి భవాని శ్రీ పోలీసు అత్యాచారాలకు బలైన మహిళగా వీక్షకులను కలవరంలో ముంచెత్తుతుంది. ప్ర‌త్యేక‌ద‌ళంలో మ‌న‌స్సాక్షికి క‌ట్టుబడిన ఓ కిందిస్థాయి పోలీస్ జీవితం ఎలా ఉంటుందో? అధికారుల తీరు ఎలా ఉంటుందో? ఈ సినిమాలో బాగా చూపించారు. సూరి, విజ‌య్ సేతుప‌తి, గౌత‌మ్ మేన‌న్ చుట్టూ సాగే ప‌తాక స‌న్నివేశాలు కూడా ఆక‌ట్టుకుంటాయి. వాటితోనే పార్ట్‌-2పై ఆస‌క్తిని పెంచారు.

కె. రాజశేఖర్ రాజు

79893 74301

Also Read: రాముడిని కాపాడిన రాజమౌళి..నిజమా?

Advertisement

Next Story