- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంతవరకు 'ఇండియా'కి వరుస పరాజయాలే
అయోధ్యలో జనవరి 22న జరిగిన రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుండి ఆధ్యాత్మిక వేత్తలు, పీఠాధిపతులు, వివిధ మత సాంప్రదాయాలకు సంబంధించిన ప్రముఖులు, దేశ విదేశాల్లోని పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులు, ఆల్ ఇండియా ముస్లిం ఇమామ్ కౌన్సిల్ అధ్యక్షులు మహమ్మద్ ఇలియాసీతో సహా అనేకమంది హాజరయ్యారు. దేశంలోని హిందూ సమాజం ఈ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా, ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా జరుపుకున్నది. ఈ ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని ఇండియా కూటమిలోని అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించాయి. ఇందుకు ప్రతిఫలంగా హిందువులు రాబోయే లోక్‌సభ ఎన్నికలలో తగిన రీతిలో సత్కారం చేయబోతారని ఎన్నికల సర్వేలు ముందే తేల్చి చెప్పాయి. ఈ దేశ భద్రత, సమైక్యత, సమగ్రతల విషయంలో స్పష్టమైన అభిప్రాయం మోడీ వ్యతిరేకులకు రానంత వరకూ వరుస పరాజయాలు చవిచూడవలసిందే!
సనాతన భారతీయ సంస్కృతిని అనుసరించే హిందువులకు రామాయణం పరమ పవిత్రమైన గ్రంథం. అందులోని ప్రతీ పాత్రకు హిందువుల దృష్టిలో ఒక ప్రాధాన్యత ఉంది. శ్రీరాముడు ఒక అవతార పురుషుడని, మర్యాదా పురుషోత్తముడని హిందూ సంస్కృతిని విశ్వసించే వాళ్ళ భావాత్మకత. లౌకికవాద ముసుగు వేసుకొని, హిందువులను మోసం చేసే హిందూ వ్యతిరేక, హిందూ రాజకీయ నాయకుల దృష్టిలో మాత్రం రామాయణం ఒక కట్టు కథ. దీనికి ఒక చారిత్రక నేపథ్యం లేదనేది వారికుండే నిశ్చితాభిప్రాయం. అందుకే రామసేతు తొలగించే విషయంలో సోనియా గాంధీ ఆధ్వర్యంలో నడిచిన యూపీఏ ప్రభుత్వం 'రామాయణం ఒక మిథ్య'అని సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇదే సందర్భంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి 'శ్రీరాముడు తాగుబోతు'అని తన హిందూ వ్యతిరేక పైత్యాన్ని బాగానే ప్రదర్శించుకున్నాడు. ఆయన మనవడు ఉదయనిది స్టాలిన్ ఇటీవల హిందూమతంపై తన ప్రకోపిత పైత్యాన్ని ప్రదర్శించి సుప్రీంకోర్టు చేతిలో చివాట్లు తిన్న విషయం దేశ ప్రజలకు ఏరుకే.
రాముడు ఇప్పుడు అవసరమయ్యాడా?
కాగా, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును సాకుగా చూపి, మార్చి 31న దేశ రాజధానిలో 15 పార్టీలు ఏకమై,' ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది' అంటూ శ్రీరాముడు సత్యం కోసం రావణునితో యుద్ధం చేశాడని, రామాయణం లోని కొన్ని ఘట్టాలను ఉటంకించడంతో దేశంలోని హిందువులు సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు! కట్టుకథలోని పాత్ర 'ఇండియా' కూటమి నాయకులకు ఎందుకు అవసరం వచ్చిందబ్బా! అంటూ తలలు గీక్కుంటున్నారు. హిందువుల మత గ్రంథాలపై, సాంస్కృతిక విషయాలపై కాంగ్రెస్ పార్టీకీ, దానితో కూటమి కట్టిన పార్టీలకూ అతీతంగా ఏనాడూ సదాభిప్రాయం లేదు.
మోడీకే బ్రహ్మరథం పడతారు
దేశ విదేశాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి దేశంలోని మోడీ వ్యతిరేకులు తమ రాజకీయ, సైద్ధాంతిక వైషమ్యాలు కప్పి పుచ్చి ఒకటిగా ముందుకు సాగినా, ఈ దేశ భద్రత, సమైక్యత ,సమగ్రతల విషయంలో ఒక ఏకాభిప్రాయం కలిగిన జాతి హితైష సమాజం మాత్రం మోడీకి వచ్చే ఎన్నికలలో బ్రహ్మరథం పట్టడం ఖాయం. మోదీని మోడీ వ్యతిరేకులు వ్యక్తిగతంగా ఎంత దూషిస్తే అంత నష్టపోతారు అనే విషయం మోడీ వ్యతిరేకులు తెలుసుకుంటే వారికి భవిష్యత్తు ఉంటుంది. ఈ దేశ భద్రత ,సమైక్యత సమగ్రతల విషయంలో స్పష్టమైన అభిప్రాయం మోడీ వ్యతిరేకులకు రానంత వరకూ వరుస పరాజయాలు చవిచూడవలసిందే!
ఉల్లి బాల రంగయ్య,
సామాజిక, రాజకీయ, విశ్లేషకులు,
94417 37877