- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కథా సంవేదన: స్కైలాబ్
మా వూరి పక్కనే ఓ వ్యక్తి కోళ్ల ఫారం పెట్టాడు. కొత్త కావడం వల్ల వాటిని ఎలా పోషించాలో తెలియకపోవడం వల్ల కోళ్లు చనిపోవడం మొదలైంది. దాన్ని అమ్మేద్దామని చాలా మందికి చెప్పాడు. స్థలంతో పాటు కొనడానికి చాలా మంది ముందుకు వచ్చారు. ఎందుకంటే ఆ స్థలానికి చాలా డిమాండ్ ఏర్పడింది. మా వూరు అక్కడి దాకా పెరిగి పోయింది. మార్కెట్ విలువకి రెండింతలు ఇవ్వడానికి కొంతమంది ముందు కొచ్చారు. కానీ అతను అమ్మలేదు. ఇంకా ఎక్కువ డిమాండ్ చేసాడు. అది అలాగే వుండిపోయింది. మా వేములవాడలో అప్పటికింకా కోళ్ళ ఫారమ్‌లు పెద్దగా అభివృద్ధి చెందలేదు. అప్పుడప్పుడే కొంత మంది ఫారమ్‌లు మొదలు పెడుతున్నారు. బ్రాయిలర్ కోళ్లు కూడా ఎక్కువగా రాలేదు. కోడిగుడ్లు కావల్సిన వాళ్ళు కూరగాయల మార్కెట్‌కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. నాటుకోళ్ళు పెట్టిన కోడిగుడ్లని కూరగాయల మార్కెట్లలో పల్లెల నుంచి వచ్చిన రైతులు కూరగాయలతో బాటూ అమ్మేవాళ్ళు. కోడిగుడ్లు కావాల్సిన వాళ్ళు అక్కడికి వచ్చి కొనుక్కోవాల్సిందే. కోడిగుడ్లలో 'సీగుడ్లు' కూడా వుంటాయి. కాబట్టి ఆ రైతు దగ్గరే ఓ నీళ్ళు పోసిన గిన్నె వుండేది. అందులో కోడి గుడ్లను వేసి నిలువుగా వ్రేలాడిన వాటిని కొనుక్కునే వాళ్లు కాదు. పడుకున్నవాటినే. కొనేవాళ్లు. కోళ్ళు కావల్సిన వాళ్ళు అక్కడే కొనుక్కునే వాళ్ళు. మా బాపు దావాఖానా దగ్గరలో ఆ కూరగాయల మార్కెట్ ఉండేది. ఎప్పుడన్నా అక్కడికి వెళ్ళినప్పుడు ఈ కోడి గుడ్లు కొనుక్కునే పద్ధతిని గమనించేవాడిని.
మా ఇల్లు చాలా విశాలమైంది. ఇంటి చుట్టు ప్రక్కలా చాలా స్థలం ఉండటం వల్ల మా అమ్మ కోళ్ళను పెంచేది. వాటిని మా మల్లయ్య కమ్మేవాడు. పెద్దింటికి, వంటింటికీ మధ్య కొంత స్థలం వుండేది. అది కూర్చోవడానికి, ఎండాకాలం పడుకోవడానికి అనువుగా వుండేది. ఆ స్థలంలోనే మా మల్లయ్య కోళ్ళని కమ్మేవాడు. మా 'తాతర్ర 'లోనో, మా బాదం చెట్టు దగ్గర వున్న రేకుల షెడ్డులోనో మా కోళ్ళు గుడ్లు పెట్టేవి. వాటిని తెచ్చి మా అమ్మకు ఇచ్చేవాడు మల్లయ్య. అప్పుడప్పుడు కోడిపిల్లల కోసం మా 'తాతర్ర'లో కోడి గుడ్లని ఉంచేవాడు మా మల్లయ్య. మా కోళ్ళలో ఏదైనా పొదుగు పడితే దానితో పిల్లలు చేయించేవాడు. తాతర్రలో వున్న కోడిగుడ్లను ఆ పొదుగు పట్టిన కోడి పొదిగేది. ఇప్పటి మాదిరిగా ఇంటిలో డజన్ల కొద్ది కోడిగుడ్లు వుండేవి కావు, మా కోళ్ళు పెట్టిన కోడి గుడ్లు, మార్కెట్లో నుంచి కొనుక్కొచ్చిన కోడిగుడ్లు రెండో మూడో మాత్రమే వుండేవి. అందుకని ఒక రెండు గుడ్లతో వేసిన ఆమ్లెట్లు నలుగురమో, అయిదుగురమో పిల్లలం తినాల్సి వచ్చేది. చికెన్ షాపులు కూడా అప్పుడు లేవు. కోడిని తినాలంటే ఇంట్లో కోడిని కొయ్యాల్సి వచ్చేది. మా బావలు వచ్చినప్పుడు, లేదా దసరా లాంటి పండుగలప్పుడు మా మల్లయ్య మా బాదం చెట్టు కింద కోసేవాడు.
1979 ప్రాంతంలో ఓ పిడుగు లాంటి వార్త మా వూరి మీదకు వచ్చింది. అదే స్కైలాబ్ ఉపగ్రహం. మా కరీంనగర్ జిల్లాలో పడుతుందన్నది ఆ వార్త. అప్పుడు టీవీలు లేవు. ఇంటర్నెట్ అనేది ఊహలోనూ లేదు. కరీంనగర్ లాంటి పట్టణ ప్రాంతాల్లో టీవీలు వచ్చాయి. కానీ ఇన్ని చానల్స్ లేవు. మాకు వార్తా సమాచారం. త్వరగా అందించే సాధనం రేడియో మాత్రమే. దినపత్రిక మరుసటి రోజు తొమ్మిది గంటల వరకు మాకు అందే అవకాశం లేదు. స్కైలాబ్ మా కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా పడే అవకాశం వుందన్న వార్త, మా జిల్లా ప్రజలని భయభ్రాంతులకి గురి చేసింది. జిల్లాలో ఎక్కడ పడుతుందో తెలియదు. ఎవరికి వారు అది తమ వూరు మీదే పడుతుందని భయపడటం మొదలు పెట్టారు. ఏం చేయాలో ఎవరికీ అర్థం కాలేదు.
స్కైలాబ్ పడుతుందన్న వార్తతో మా ఊరు వాతావరణమే కాదు... మా కరీంనగర్ జిల్లా వాతావరణమే మారిపోయింది. అమెరికా మొదటి స్పేస్ స్టేషన్ భూమిని తాకి కరీంనగర్ జిల్లాలో ఎక్కడైనా పడిపోవచ్చన్న వార్త దావానంలా వ్యాపించింది. కొంత మంది కరీంనగర్ జిల్లాను వదిలి వెళ్ళిపోయారు. మరికొంతమంది తమ ఆస్తులని తక్కువలో అమ్ముకొని హైదరాబాద్ లాంటి నగరాల వైపు వెళ్ళిపోయారు. తిరుపతి, కాశీలాంటి ప్రదేశాలకు మరెందరో వెళ్ళిపోయారు. తమ దగ్గర ఆవులని, మేకలని తక్కువ ధరకే అమ్మివేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు మరెందరో, కోళ్ళూ, గొర్రెలు కూడా అతి తక్కువ ధరలకు వచ్చాయి. మాంసం ధరలు పూర్తిగా పడిపోయాయి. కోళ్ళని కూడా ఏదో ఒక ధరకు అమ్మడం మొదలు పెట్టారు. మా వేములవాడ పరిసర ప్రాంతాల్లో మాంసం తినడం ఎక్కువైపోయింది. గొర్రెలు కోయడం, కోళ్ళను కోయడం విపరీతంగా పెరిగిపోయింది.
మా ఇంటి వాతావరణం కూడా మారిపోయింది. ఒక కోడిగుడ్డుతో నలుగురికి ఆమ్లెట్ వేయడం కాకుండా రెండు గుడ్లతో ఒక ఆమ్లెట్ వేసే పరిస్థితి వచ్చింది. కోడి గుడ్లను కోడి పిల్లల కోసం వుంచే పరిస్థితి పోయింది. బజార్లో నుంచి కోడి గుడ్లు ఎక్కువగా రావడం మొదలైంది. ఇంట్లో కోళ్ళ సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. మా ఊరి లోని కోళ్ల ఫారంలోని కోళ్లు చాలా వరకు అమ్ముడు పోయినాయి. చివరికి కోళ్ల ఫారం యజమాని మార్కెట్ విలువ కన్నా తక్కువ ధరకే కోళ్ల ఫారాన్ని. దాని స్థలాన్ని అమ్మేసాడు. వేములవాడ వదిలి హైదరాబాద్‌కి వెళ్లి పోయాడు. మనుషుల భయానికి కోళ్ళూ, గొర్రెలూ బలైపోతున్నాయి.
ఇదిలా వుంటే మనుషులు మరో విధంగా..మనుషుల మధ్య ప్రేమలు కూడా ఎక్కువైపోయాయి. ఒకరి ఇంటికి మరొకరు వెళ్ళడం. పెరిగిపోయింది. ఉదయం ఒకరి ఇంట్లో దావత్ వుంటే సాయంత్రం మరొకరి ఇంట్లో దావత్. స్కైలాబ్ పడుతుందన్న భయంతో మనుషులు ఒక్క తిండి విషయంలోనే కాదు, చాలా విషయాల్లో మార్పులు తెచ్చుకున్నారు. మా మిత్రుడు రఫీక్ పట్ల గతంలో కోపం పెంచుకున్నాడు మరో మిత్రుడు శ్రీను.. ఇద్దరూ మాట్లాడుకోవడం మానేశారు. ఒక రోజు సాయంత్రం మేం బజార్లో రాజ్ హోటల్ నుంచి బయటకు వస్తుంటే శ్రీను ఎదురయ్యాడు. రఫీకు కౌగిలించుకొని మళ్ళీ మా అందరిని హోటల్‌కి తీసుకొని వెళ్ళి చాయ్ తాగించాడు. ఈ మార్పు స్కైలాబ్ వల్ల మరణం వస్తుందేమోనన్న భయం వల్ల. ఇలాంటి సంఘటనల గురించి ఎన్నో విన్నాం. చూశాం. స్కైలాబ్ భయం కోళ్ళని, గొర్రెలని మింగి వేసింది. మనుషుల్లోని ద్వేషాన్నీ, కోపాన్నీ కూడా మింగివేసింది. ఇలా ఎన్ని రోజులు గడిచిందో గుర్తులేదు. జూలై 12, 1979 రోజున స్కైలాబ్ హిందూ మహా సముద్రంలో పడిపోయింది. అలా పడిపోయే విధంగా శాస్త్రవేత్తలు కృషి చేశారు. కరీంనగర్ జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మరీ ముఖ్యంగా మా వేములవాడ ప్రజలు.
అయితే ఇక్కడ మనం తెలిసీ గుర్తించని విషయం ఒకటి ఉంది. స్కైలాబ్ లాంటి మరణం ఎప్పుడూ మన వెన్నంటే వుంది. దాన్ని గుర్తుపెట్టుకుంటే మనలోని ద్వేషం, పగ కోపం అన్ని ధ్వంసం అవుతాయి. మరణం కూడా స్కైలాబ్ లాంటిదని గుర్తుపెట్టుకునే విజ్ఞులు ఎంత మంది? ఈ స్కైలాబ్ సముద్రంలో పడదు. మన మీదే పడుతుంది.
(పాత్రలు కల్పితం)
-మంగారి రాజేందర్ జింబో
94404 83001