‘టూ వే స్ట్రీట్‌’ (Two Way Street) లఘుచిత్ర సమీక్ష

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-09 13:26:24.0  )
‘టూ వే స్ట్రీట్‌’ (Two Way Street)  లఘుచిత్ర సమీక్ష
X

భారతదేశం నుంచి ఇంగ్షీషు, హిందీ భాషలలో వచ్చిన లఘు చిత్రం ‘టూ వే స్ట్రీట్‌’ (“Two Way Street”). ఈ చిత్ర దర్శకుడు - అస్మిత్ పఠారే (Asmit Pathare). దీని రచయిత్రి ఆన్నీ జైదీ (Annie Zaidi). ఈ చిత్ర నిర్మాత డా. రాజ్ ఖవేర్ (Dr. Raj Khaware). దీని నిడివి 22 నిమిషాలు.

భిన్న మతాల వ్యక్తుల్లో సంక్షోభం

కథాంశం; రెండు భిన్న మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని సంక్షోభంలోకి నెట్టేసి, ఈనాటి మన సమాజ స్వరూపాన్ని క్రాస్ సెక్షన్‌లో చూపిస్తుందీ చిత్రం. కథ చాలా సరళంగా ఉంటుంది. ఎక్కడో దూరంగా ఉద్యోగం చేస్తున్న ఒక ఆధునిక యువకుడు, సుదీర్ఘ రైలు ప్రయాణం తర్వాత అతను ముంబై రైల్వే స్టేషన్ లో దిగుతాడు. కుటుంబం కోసం బోలెడంత సామాను కొని ఇంటికి ఎప్పుడెప్పుడు చేరుకుంటానా అని ఉద్వేగంగా, చాలా హుషారుగా ఉంటాడు. టాక్సీ మాట్లాడుకుంటాడు. టాక్సీ డ్రైవర్‌ సామానంతా టాక్సీలోపల కొంతా, టాక్సీపైన కొంతా తాళ్ళతో కట్టి చక్కగా సహాయం చేస్తాడు. ప్రయాణం మొదలయ్యేముందు “ఎక్కడికెళ్ళాలి” అని అడుగుతాడు డ్రైవర్‌. కస్టమర్ “ఫలానా రోడ్” అని చెప్తాడు కస్టమర్. ఆ రోడ్‌లో ఎక్కడ అని మళ్ళీ అడుగుతాడు డ్రైవర్‌. “అక్కడికెళ్ళాక చెప్తాను కదా” అంటాడు కస్టమర్. ఆయన ఇంటికెళ్ళబోతున్నాననే నిలువెల్లా ముంచెత్తుతున్న సంతోషంతో ఇంటి ఆహారంకోసం, అంతకుముందు ఊళ్ళోతిని ఉన్న చిరుతిళ్ళ రుచుల్ని ఎప్పుడెప్పుడు ఆస్వాదిస్తానా అని మహా ఆరాటపడుతూ ఉంటాడు. ముంబై వీధులగుండా టాక్సీ విస్తృతమైన ప్రయాణం సాగుతుండగా కుటుంబ సభ్యుల్లో ఎవరికో ఫోన్ చేసి తనకి తెలిసిన షాపునుంచి హల్వా తెచ్చి ఉంచమని ఫోన్ లో చెప్తాడు. ఇంతలో దారిలో ఆయనకలవాటైన ఒక బేకరీ కనిపిస్తుంది. జిహ్వ చాపల్యంతో టాక్సీని ఆపమని రెండు ప్యాకెట్లలో తినుబండారాలేవో కొని ఒకటి తాను తింటూ, ఇంకోటి చాలా స్నేహభావంతో టాక్సీ డ్రైవర్‌‌ని తినమంటాడు. ఆ టాక్సీ డ్రైవర్‌ పాన్ నములుతున్నానని చెప్పడంతో పక్క సీట్లో పెడతాడు.

ఆవిరైపోయిన స్నేహభావం

టాక్సీ ఫలానా రోడ్‌కి చేరుకున్నాక ఇంటి అడ్రస్ చెప్తాడు కస్టమర్. అది ముస్లింలు నివసించే ప్రాంతమని గ్రహిస్తాడు డ్రైవర్‌. ఇక ఇప్పటివరకూ ఉన్న స్నేహాభావమంతా ఆవిరైపోయి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారే అలా పటిష్టమైన విరోధంగా మారిపోతుంది. ఇంతకంటే ముందుకి వెళ్ళనని, అక్కడి జంక్షన్‌లో దింపేస్తాను, దిగి వెళ్ళిపొమ్మని నిర్మొహమాటంగా చెప్తాడు టాక్సీడ్రైవర్‌. ఇక ఘర్షణ మొదలవుతుంది. అది ఇద్దరు వ్యక్తుల మధ్య – రెండు మతాల ఆధారంగా యుద్ధభూమిని తలపించే శత్రుపూరితమైన సంఘర్షణగా మారుతుంది. అప్పుడు మనం గనక జాగ్రత్తగా గమనిస్తే ఆ టాక్సీ ముందుభాగంలో ఒక పెద్ద రుద్రాక్షమాల, ఎగురుతున్న ఆంజనేయుడి బొమ్మా వేలాడుతూ కనిపిస్తాయి. వెనకభాగంలో అద్దంమీద యాంగ్రీ హనుమాన్‌ స్టిక్కర్‌ అతికించి ఉంటుంది. ఇక ప్రేక్షకులకు హిందూత్వ ప్రచారాల హోరు ప్రభావంలో ఆ డ్రైవర్‌ పీకల్లోతు కూరుకుపోయాడని అర్ధమౌతుంది!

నిన్ను నావాడివే అనుకున్నాను

అతనొక ముస్లిం అని తెలిశాక అతన్ని ఇంటి దగ్గర దింపడం కుదరదంటే కుదరదని, “చెప్తుంటే అర్ధం కాదా” అంటూ చాలా అమర్యాదగా, కర్కశంగా ప్రవర్తిస్తూ సామానంతా రోడ్డుమీదకి విసిరికొట్టి తక్షణం దిగి పొమ్మంటాడు. నేను ఇంటిఅడ్రస్‌కి బుక్ చేసుకున్నాను నడిరోడ్డులో బండెడు సామానుతో దిగి వెళ్ళడం సాధ్యపడదని అతని వాదన. ఏదైతే అదవుతుందని అతను సీట్లో నుంచి కదలకుండా ఉడుంపట్టు పట్టినట్లు భీష్మించుకుని కూర్చుంటాడు. నిమిషాలు, గంటలు గడుస్తుంటాయి. ఇద్దరి మధ్యా వాతావరణం స్తంభించిపోతుంది. చూస్తున్న ప్రేక్షకులకు కూడా నిమిష నిమిషానికీ ఉత్కంఠ పెరిగిపోతుంటుంది. చీకటి పడబోతుంది. బోలెడంత టైమే కాదు, సంపాదించుకోవలసిన ఆదాయం కూడా రాకుండా నష్టపోతున్నానని గ్రహించి, చివరికి ఆ డ్రైవరే రోడ్డు మీద అంతకుముందు దౌర్జన్యంగా పడేసిన సామానంతా సర్ది అతన్ని ఇంటిఅడ్రస్‌కి తీసుకెళ్ళి దింపుతాడు. కస్టమర్‌ నుండి డబ్బు తీసుకుంటూ, “నువ్వెందుకు నా రోజంతా వృధా చేశావ్ మీ మతంవాడి బండి ఎక్కవలసింది కదా” అని అడుగుతాడు డ్రైవర్‌. డబ్బు చెల్లిస్తూ “నిన్ను నావాడివే అనుకున్నాను” అని చెప్తాడు కస్టమర్!

మేము - మీరు.. ఎంతకాలమిలా వేరుపడడం

సీన్ కట్ చేస్తే, ఇంట్లో వాళ్ళందరూ అతడి రాకతో సందడి చేస్తూ సంబరంగా ఉంటారు. వాళ్ళమ్మ అతడికిష్టమైన పదార్ధాలన్నీ వడ్డించి ప్లేట్ ముందు పెడుతుంది. రెక్కలుగట్టుకుని ఇంట్లో వాలాలని, జిహ్వ రుచులన్నీ తీర్చుకోవాలని ఆత్రంగా ఇంటికొచ్చిన అతడు మాత్రం పరిసరాలు పట్టనట్లు, మనసు మనసులో లేనట్లు పుట్టెడు విచారంతో బిక్కచచ్చినట్లు ఉంటాడు. బాల్యంనుంచి తాను చూసిన తననగరం ఇంతఘోరంగా “మేము – మీరు” గా వేరుపడి పోవడాన్ని అతడు జీర్ణించుకోలేకపోతుంటాడు. కొన్ని గంటలపాటు తాననుభవించిన మానసిక క్షోభ, తనకు జరిగిన అవమానాన్ని మర్చిపోయి అతడు మామూలు మనిషి కాలేకపోతుంటాడు. ఇంకోచోట ఒక హోటల్‌లో భోజనం ఆర్డర్ చేసిన టాక్సీడ్రైవర్‌ పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంటుంది. భోజనం ప్లేట్ ముందు కూర్చుని తెగని ఆలోచనల్లో మునిగిపోతాడు. సహజంగా ప్రతిమనిషిలో ఉండే మనిషితనం వల్ల “నిన్ను నావాడివే అనుకున్నాను” అన్న కస్టమర్ మాట గుండెల్లో సూటిగా గుచ్చుకుందేమో! సరే, వాళ్ళిద్దరూ ఆ సంఘటన వాడినీ, వేడినీ ప్రత్యక్షంగా అనుభవించినవాళ్ళు. కానీ ప్రేక్షకులకు మొత్తంగా ఒకేసారి షాక్ తగిలినట్లు పిన్ డ్రాప్ సైలెన్స్! ఆడియన్స్‌లో ఆనంద్ పట్వర్ధన్, అరుంధతీ రాయ్, సంజయ్ కాక్ వంటి వారితోపాటు ఇంకా నాకు పేర్లు తెలియని డైరెక్టర్లు, ఎంతోమంది ప్రముఖులున్నారు. ఎవరికీ నోటమాట రాలేదు! కొన్నిసార్లు కొన్ని సంఘటనలు ఎక్కడో జరుగుతాయి. మనకేమీ సంబంధం లేదనుకుంటాం. మన పక్కనే జరగకపోయినా మొత్తం చట్రంలో భాగంగా మనకూ ఆ సెగ తగిలితీరుతుంది! కథ ఇంతే! కానీ కథనాన్ని అద్భుతంగా మలిచాడు.

ప్రపంచవ్యాప్తంగా నేడు పాలకులు ఏ విరోధమూలేని ప్రజల మధ్య లేని సమస్యల్ని సృష్టించి విభజించి పాలిస్తున్న వైనాన్ని, అతి పెద్ద విశాలమైన స్కోప్ ఉన్న అంశాన్ని తీసుకుని అతి చిన్న లఘుచిత్రంలో ఇమిడ్చి చాలా బలమైన ప్రభావ ముద్ర వేశాడు దర్శకుడు అస్మిత్‌ పఠారే! టాక్సీ డ్రైవర్‌ గా గగన్ దేవ్ రియర్, కస్టమర్‌గా జాయ్ సేన్‌గుప్తా తమ పాత్రలకు జీవం పోశారు!

మన సమాజాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసిన ఈ లఘుచిత్ర ప్రత్యేకతలు;

మనజీవితాలకు ఏమాత్రం సంబంధంలేని మురుగును, ఉనికిలో లేని శృంగారం గురించి జబర్దస్త్ గా మనమీద రుద్దుతున్న మన డైరెక్టర్లు, నిర్మాతలు, నటుల త్రయాలతో పోలిస్తే ఈ యువకళాకారుడికి సమాజం పట్ల ఉన్న బాధ్యత, శ్రద్ధ, నిబద్ధతల గురించి కలిగే భరోసా గురించి అందరం తెలుసుకోవాలి. మన సమాజాన్ని ఎంతో అధ్యయనం చేసి, లోతైన అవగాహనతో ఈ చిత్ర నిర్మాణానికి దారి తీసిన పరిణామాలను అతని మాటల్లోనే విందాం.

ఇంకిపోయిన పక్షపాత ఆలోచనలు

భారతీయ సమాజంలో కొన్ని వర్గాలపట్ల అంతర్లీనంగా ఉన్న పక్షపాత ఆలోచనలు ఏ విధంగా కేంద్రీకృతమై ఉన్నాయో అనే విషయాన్ని అస్మిత్‌ పఠారే ఎంతో లోతుగా అర్ధంచేసుకున్నాడని అతను వ్యక్తీకరించిన అభిప్రాయాల వల్ల తెలుస్తుంది. ‘నేటి యువకుల్ని ‘నువ్వు ఇండియాలో ముందుగా ఇంజనీర్ అయిన తర్వాత నీ జీవితాన్ని ఏంచేయాలో నిర్ణయించుకో’ - అని చెప్పే మాటలు తలిదండ్రులు, వ్యవస్థల అసమర్థతను నిర్దేశిస్తున్నాయి. జీవిత లక్ష్యాలను ఎన్నుకోవడంలో వాళ్ళకి ఎలాంటి స్వేచ్ఛలేదు. వాళ్ళ ఉన్నత, అట్టడుగు వర్గాల ఆర్థిక వాస్తవాలు, కుల సామాజిక వాస్తవికతలలో మాత్రమే ఒక ప్రయోజనాన్ని కనుగొనేలా యువతరాన్ని సమాజం మలుస్తోంది. నేను ఒక దిగువ మధ్యతరగతి సవర్ణ కులానికి చెందినవాడిని. అందరిలాగే ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఒక బహుళ-జాతి సంస్థలో ఉద్యోగం తెచ్చుకోవాలని మా అమ్మా నాన్నలు భావించారు. ఎందుకంటే అది మాకు మొదటి-ప్రపంచదేశంలో పనిచేసే అవకాశాన్ని కలిగిస్తుంది. ఈ కల సాకారం అయిన తర్వాత, మేము ఆ దేశాన్ని మా నివాసంగా మార్చుకోవాలి. ఆ తర్వాత మేము వారి ఉత్పత్తిలో పాల్గొంటూ మా మూలాలకు దూరంగా జరిగిపోతూ క్రమంగా సొంత గుర్తింపుని కోల్పోవాలి అనే దిశగా మౌల్డ్ చేస్తున్నారు అని అంటున్నాడు.

అమెరికా కల... ప్రయోజన కళ

“నేను ఈ ‘నయా-ఉదారవాద భారతీయ కల' ని రెండు అంశాలలో ప్రతిఘటించడంలో విజయం సాధించాను. అమెరికా కలను విస్మరించి, ప్రదర్శన కళలలో ఒక ప్రయోజనాన్ని పొందాలనుకోవడం మొదటి ప్రతిఘటన. భారతీయ యువతరానికి ఈ వ్యవస్థ ముందే సృష్టించిన సెటప్‌కు అంతర్లీనంగా ఉన్న చట్రాన్ని విచ్ఛిన్నం చేయడం రెండవ సవాలుగా ఎంచుకున్నాను. కళాకారుడిగా నా ప్రారంభ వ్యక్తీకరణ ఎల్లప్పుడూ స్థానికంగా ఉండాలని, అది తక్షణ వాస్తవికత నుండి మాత్రమే రావాలనుకున్నాను” - అని అంటాడు.

కళ్లు తెరిపించిన రోహిత్ వేముల మరణం

మతపరమైన విభజన నన్ను బాధించింది, అలాగే కులం! నాకున్న కుల ప్రత్యేకత గురించి, నేనున్న సవర్ణ వ్యవస్థను ప్రశ్నించాల్సిన అవసరం గురించి రోహిత్ వేముల మరణం నన్ను కదిలించింది. ఈ సంఘటన మా తరానికి పూర్తిగా తెలియని వాస్తవికతతో కళ్ళు తెరిపించింది. ఆ సమయంలో భారతీయ మీడియా చూపిన పూర్తి ఉదాసీనత, తర్వాత శక్తివంతమైన, తిరోగమన శక్తుల ఎదురుదాడి జరిగింది. ఈ దుర్మార్గపు ఎదురుదాడిలో జే ఎన్‌ యూ ఘటన జరిగిన వెంటనే మొత్తం విద్యార్థి సంఘంపై దౌర్జన్యం జరిగింది. ఈ వరుస ఘటనలు మా తరంపై శాశ్వత ప్రభావాన్ని వేశాయి!

కుల ప్రతిష్ట ప్రయోజనం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ అప్పారావు ప్రవర్తన, అప్పటి హెచ్‌ ఆర్‌ డి మంత్రి స్మృతిఇరానీ ప్రతిస్పందన కారణంగా రోహిత్ వేముల వంటి తెలివైన విద్యార్థి సంస్థాగత హత్యకు బలయ్యాడు. ఈ దిగ్భ్రాంతికర సంఘటన మనదేశంలో “పుట్టుకతో వచ్చే కుల ప్రతిష్ఠ, ప్రయోజనా” లకు అసలైన అర్ధం అంటే ఏమిటో నాకు తెలిసివచ్చింది. ఆ వెంటనే జే ఎన్‌ యూ ఘటన వెలుగులోకి వచ్చింది. విద్యార్థి నాయకులను రాష్ట్రం లక్ష్యంగా చేసుకుంది, తప్పుడు సమాచారంతో ‘ప్రజల శత్రువు’ ని తయారు చేయడంలో ప్రధాన సాధనంగా చాలా సౌకర్యవంతంగా, వారి మతం ఆధారంగా ఎంచుకుంటున్నారు. రాజ్యానికి లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులందరిలో ఉమర్ ఖలీద్ మాత్రమే సంవత్సరాల తరబడి జైలు శిక్ష తర్వాత కూడా ఇప్పటికీ ఖైదీ నెం. 626710 గా కటకటాల వెనుకే ఉన్నాడనే వాస్తవం నుండి ఇది మరింత స్పష్టమవుతోంది!

టూ వే స్ట్రీట్ తయారైందిలా...

ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, మన చుట్టూ ఉన్న సమాజంలోని ఈ కొత్త వాస్తవికతకు ప్రతిస్పందించడం ఒక కళాకారుడిగా నా బాధ్యతగా భావించాను. భారతీయ సమాజమే కాదు, ఏ సమాజం లోని పండిత, పామరులమీదనైనా నేడు చలనచిత్రాలు చాలా గాఢమైన ప్రభావం వేస్తున్నాయి. కాబట్టి నా సమాజాన్ని విస్తృతస్థాయిలో అర్థం చేసుకోవడం, దాని గురించి లోతైన అవగాహనను ఏర్పరచుకోవడం - దానిని చాలా ముఖ్యమైనదిగా తక్షణం వ్యక్తీకరించవలసిన సమస్యగా ఒక చిత్రనిర్మాతగా, రెండువైపులా పదునైన కత్తిలాంటి ఛాలెంజ్ గా స్వీకరించాను! సరిగ్గా అదే సమయంలో అన్నీ జైదీ కథ ‘టూ వే స్ట్రీట్’ నా దగ్గరకు వచ్చింది. ఆమె గాఢమైన అవగాహన, క్లుప్తత, సొంత వ్యక్తీకరణ నామనసుకి తాజాగా, స్వచ్ఛంగా తోచింది. అలా ఈ చిత్రం మీముందుకొచ్చిందని తన హృదయాన్ని మనముందు పరిచాడు అస్మిత్‌ పఠారే. ఇక పెట్టుబడిదారుల వ్యతిరేకత మామూలే! అప్పుడు నిర్మాత డా. రాజ్ ఖవేర్ తో కలిసి ఈ బృందామంతా నాలుగు స్వతంత్ర చిత్రాలుగా నిర్మించాలనుకున్నారు. మొదటిది “ఎస్కార్ట్”. వెనిస్ షార్ట్స్‌ లో ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సాధించింది.

అడుగడుగునా ప్రశంసలు

ఈ ‘టూ వే స్ట్రీట్‌’ రెండవది. దీని గురించి దర్శకుడు అస్మిత్‌ పఠారే మాట్లాడుతూ “ఈ చిత్రానికి అడుగడుగునా ప్రశంసలు పొందుతున్నాం. మొదట్లో, మహారాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన చిత్రాలతో పూణె షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాను. ఆ తర్వాత ఈ చిత్రం దక్షిణాసియా నలుమూలల నుండి వచ్చిన చిత్రాలను ప్రదర్శించిన సౌత్ ఏషియన్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వి శాంతారామ్ గోల్డెన్ అవార్డును గెలుచుకుంది. ఇప్పుడు, ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత గల షార్ట్ ఫిల్మ్‌ ల కేటలాగ్ విభాగంలో 2024 అకాడమీ అవార్డ్స్‌కి అర్హత సాధించింది. తుది ఫలితం గురించి పట్టింపు లేదు. నమ్మశక్యంగా లేని ఈ ప్రయాణం మా బృందానికంతటికీ చాలా ఉత్తేజ భరితంగా ఉంది” అని అన్నాడు.

క్షణం క్షణం మారుతున్న ఈ కాలంలో మన విలువలకు కట్టుబడి ఉంటూనే మన వ్యక్తీకరణలో సున్నితమైన వైఖరిని కలిగి ఉండటం ఎంతో ముఖ్యమని మనకు నేర్పించే చిత్రమిది. ఆలోచించినప్పుడు చిన్నదిగా అనిపించవచ్చు. కానీ అమలు చేయాలంటే పెద్ద సమస్యే! ఫాసిస్టు సందర్భంలో లేనిపోని హంగులు, ఆర్భాటాలతో తీసే పనికిమాలిన ముదనష్టపు సినిమాలు ప్రజల జేబుల్ని కత్తిరిస్తూ, వాళ్ళ మనసుల్ని విద్వేషాలతో నింపుతున్న ఈ సమయంలో అస్మిత్‌ పఠారే వంటి యువచిత్ర దర్శకులు మనుషుల్ని సహానుభూతితో స్థిమితంగా ఆలోచించే వైపుగా మళ్లిస్తూ ద్వేషాన్ని- ప్రేమగా మార్చే ప్రయత్నం చేయడం ఎంతో ప్రశంసనీయం!

2024 జనవరి 24 నుంచి 28 వరకూ జరిగిన కోల్కతా పీపుల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ లఘుచిత్రం చూసినప్పటినుంచి నా మనసులో తిష్ట వేసుకుని కూర్చుండిపోయింది. అతనికి నేను వీరాభిమానినైపోయాను. అస్మిత్ పఠారే డైరెక్టరే కాకుండా స్క్రీన్ రైటర్, నటుడు, స్టేజ్ లైటింగ్ డిజైనర్‌గా కూడా పనిచేస్తాడు. అస్మిత్ పఠారే చాలా ప్రామిసింగ్ దర్శకుడుగా అనిపించి ఇతని సినిమాలన్నీ వెంటనే చూసేయాలనిపించింది!

మిత్రులారా, ఆగస్టు 11 న ఆదివారం మీరందరూ కూడా 'టూ వే స్ట్రీట్' అనే ఈ లఘుచిత్రాన్ని హైదరాబాద్ లక్డీకాపూల్ చాంప్స్ సీఏ అకాడమీలో మధ్యాహ్నం తర్వాత 3.30 గంటలకు చూడొచ్చు. అతను వస్తే కలవవచ్చు కూడా!

అదనపు సమాచారం

ఎంపిక చేసిన సినిమాలు:

ప్రతీక్ శేఖర్ దర్శకత్వం వహించిన చై దర్బారి

తథాగత ఘోష్ దర్శకత్వం వహించిన పాదముద్రలు

విక్రమ్ బోలెగావే దర్శకత్వం వహించిన మహాసత్తా

ఆనంద్ పాండే దర్శకత్వం వహించిన మిస్సింగ్ సీన్స్ 6.12.1956

సాక్షి గులాటి దర్శకత్వం వహించిన నియాన్

ఉమా చక్రవర్తి దర్శకత్వం వహించిన జైలు డైరీస్

అస్మిత్ పఠారే దర్శకత్వం వహించిన టూ వే స్ట్రీట్

సాను కుమ్మిల్ దర్శకత్వం వహించిన ది అన్నోన్ కేరళ స్టోరీస్

శ్రేయాస్ దశరథే & జంషెడ్ ఇరానీ దర్శకత్వం వహించిన వైరల్

ఈ సినిమాలను ప్రదర్శిస్తారు. ఆయా చిత్రాల దర్శకులను కూడా కలుసుకోవచ్చు

లఘుచిత్రాల ప్రదర్శన వివరాలు

తేదీ: 11.08-2024 (ఆదివారం)

సమయం: మధ్యాహ్నం 3 గం. నుండి రాత్రి 8.30 గం. వరకు

నిర్వహణ : మంచి సినిమాలను ప్రోత్సహించే కోల్కతాలోని ముందడుగు, ఫెడరేషన్ ఆఫ్ ఫిల్మ్ సొసైటీస్ ఆఫ్ సదరన్ రీజియన్ హైదరాబాద్ ఆధ్వర్యంలో

స్థలం : చాంప్స్ సీఏ అకాడమీ, లక్డీకాపూల్

11-06-865, మెహబూబ్ రెసిడెన్సీ, రెడ్ హిల్స్

అందరూ ఆహ్వానితులే


శివలక్ష్మి

మంచి సినిమా వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌లలో ఒకరు

94418 83949

70900 01275

Advertisement

Next Story

Most Viewed