- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరల్డ్ వాక్:పంజాబ్‌లో వేర్పాటువాదం
స్థానిక ముఠాలకు ఉత్తరప్రదేశ్, బిహార్, సరిహద్దు దేశాలు, ఇతర దేశాల నుంచి ఆర్థిక, ఆయుధ సహకారం లేకుండా చూడాలి. ఇంటెలిజెన్స్, పోలీస్, విదేశీ వ్యవహారాల, రక్షణ శాఖల సహాయ సహాకారాలు, సలహాలు సూచనలు తీసుకుంటూ రాష్ట్ర ప్రజల భద్రతపై విశ్వాసం కల్పించాలి. డ్రగ్స్ మాఫియాపై నిఘా పెంచాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ఆధునిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సహాయ సహకారంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. 'పంజాబ్ అంటే దేశానికి ఒక గొప్ప శక్తి' అనే భరోసా కల్పించేందుకు కృషి చేయాలి. పంజాబ్‌లో ఇప్పటికే ఉన్న డ్రగ్స్, నీటి, వ్యవసాయ, నిరుద్యోగం, కాలుష్యం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. దేశ అస్థిరతకు కారణమయ్యే ఏ శక్తినైనా కూకటివేళ్లతో పెకలించి, పంజాబ్ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి.
2000 సంవత్సరం నుంచి ప్రశాంతంగా ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ఏడాది కాలంగా ఖలిస్తాన్ రూపంలో వేర్పాటువాదం తిరిగి కోరలు చాస్తున్నది. మాఫియా, అంతర్గత ముఠాల దాడులు, మత్తు మందు ఇలా అనేక రకాల అసాంఘిక శక్తుల కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా పంజాబ్ పత్రికల పతాక శీర్షికలకు ఎక్కుతున్నది. ఇది ఆ రాష్ట్రానికే కాక, యావత్ భారతదేశానికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా నూతనంగా అధికారంలోకి వచ్చిన 'ఆప్' ప్రభుత్వానికి ఇది అగ్ని పరీక్షగా మారబోతోంది.
ఈ పరిస్థితులలో కొత్త ప్రభుత్వం నిర్ధిష్ట ప్రణాళికతో కఠిన చర్యలు తీసుకోవాలి. పరిస్థితిని అదుపులో ఉంచుకుంటూ, మెరుగైన పాలన అందిస్తూ 'ప్రోస్పరస్ పంజాబ్' గా తీర్చిదిద్దాలి. అవసరమైన సందర్భాలలో కేంద్ర ప్రభుత్వం కూడా తగిన సహాయం అందించాలి. ఎందుచేతనంటే దేశ భద్రత కూడా పంజాబ్ రాష్ట్రంతో ముడిపడి ఉన్నది. దీనికి ప్రధాన కారణం, మన దేశ సరిహద్దు పంజాబ్ రాష్ట్రం పాకిస్తాన్‌తో సుమారు 553 కి.మీ పంచుకుంటున్నది.
ఆనాటి నుంచే నినాదం
దేశానికి స్వాతంత్య్రం రాకముందు నుంచే అనగా, 1946 నుంచే సిక్కులు ప్రత్యేక దేశంగా ఉండాలని ఉద్యమాన్ని ప్రారంభించారు. అయితే, తరువాత క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఉద్యమాన్ని బలహీన పరిచి, సుస్థిర పాలన అందించాయి. 1972 నుంచి 1984 మధ్య కాలంలో ఖలిస్తాన్ వేర్పాటువాదం తారస్థాయికి చేరింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయం తీసుకుని 'బ్లూ స్టార్ ఆపరేషన్' ద్వారా వేర్పాటువాదులను, ఉగ్రవాదులను ముఖ్యంగా బింద్రన్‌వాలేను మట్టుపెట్టడం ద్వారా ఉగ్రవాదానికి, ఖలిస్తాన్ ఉద్యమానికి చెక్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తదుపరి కాలంలో ప్రధాని ఇందిర ఉగ్రవాద దాడులలో బలిదానం చేయవలసి వచ్చింది.
అయితే, ఇటీవల కాలంలో ఇతర దేశాలలో ఉన్న అనేకమంది ఖలిస్తాన్ నాయకులు, డ్రగ్స్ మాఫియా, వేర్పాటువాద సంస్థల నేతలు తిరిగి పంజాబ్‌లో ఖలిస్తాన్ సాధనకు స్థానిక ముఠాలతో చేతులు కలిపి అరాచకాలు సృష్టిస్తూ ప్రస్తుత ఆప్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. భారత సమగ్రతకు పెను సవాలు విసురుతున్నారు. మే నెల 8, 9 తేదీలలో జరిగిన దాడులు, ఇటీవల జరిగిన సెలెబ్రిటీ హత్య, ఆర్‌డీఎక్స్ పట్టివేత, విపరీతంగా పాక్ డ్రోన్స్, ఉగ్రవాద సంస్థలు, వ్యక్తుల ద్వారా మత్తు మందులు (డ్రగ్స్), ఆయుధాలు పంజాబ్‌కు తరలించడం ద్వారా అలజడి సృష్టిస్తున్నారు. పదుల సంఖ్యలో ఖలిస్తాన్ సంస్థలు, విదేశాల నుంచి ముఖ్యంగా కెనడా, అమెరికా, రష్యా, పాకిస్తాన్ నుంచి వివిధ రకాల సహాయ సహకారాలు పొంది పంజాబ్‌లో అస్థిరతకు కారణం అవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆప్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది.
నిరంతరం అప్రమత్తత అవసరం
గత సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో జరిగిన రైతు ఉద్యమాన్ని కూడా ఖలిస్తాన్ నేతలు (లేదా) అసాంఘిక శక్తులు ఉపయోగించుకున్నాయనే విషయం మరువరాదు. దీంతో ఇక్కడ కొంత అలజడి మొదలైంది. అలాగే సరిహద్దు రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్ శాసనసభ గోడల మీద ఖలిస్తాన్ రాతలు, జెండాలు ఎగురవేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా ఖలిస్తాన్ ఉద్యమం వెనుక ఐసిస్ హస్తం దండిగా ఉందనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. సిక్కు జాతీయవాదం, ప్రత్యేక దేశ ఏర్పాటువాదాన్ని బలంగా ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్ర భద్రత విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. ముఖ్యంగా ఇటీవల సెలెబ్రిటీలు, ప్రధాన నాయకుల భద్రత ఉపసంహరణ నిర్ణయం మీద పున: సమీక్ష చేసుకోవాలి. కనీసం పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ ఆచితూచి అడుగులు వేయాలని పలువురు సూచిస్తున్నారు.
సరిహద్దు వెంట నిఘా పెంచాలి. స్థానిక ముఠాలకు ఉత్తరప్రదేశ్, బిహార్, సరిహద్దు దేశాలు, ఇతర దేశాల నుంచి ఆర్థిక, ఆయుధ సహకారం లేకుండా చూడాలి. ఇంటెలిజెన్స్, పోలీస్, విదేశీ వ్యవహారాల, రక్షణ శాఖల సహాయ సహాకారాలు, సలహాలు సూచనలు తీసుకుంటూ రాష్ట్ర ప్రజల భద్రతపై విశ్వాసం కల్పించాలి. డ్రగ్స్ మాఫియాపై నిఘా పెంచాలి. దోషులను కఠినంగా శిక్షించాలి. ఆధునిక పరిజ్ఞానం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ సహాయ సహకారంతో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలి. 'పంజాబ్ అంటే దేశానికి ఒక గొప్ప శక్తి' అనే భరోసా కల్పించేందుకు కృషి చేయాలి. పంజాబ్‌లో ఇప్పటికే ఉన్న డ్రగ్స్, నీటి, వ్యవసాయ, నిరుద్యోగం, కాలుష్యం సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. దేశ అస్థిరతకు కారణమయ్యే ఏ శక్తినైనా కూకటివేళ్లతో పెకలించి, పంజాబ్ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించే దిశగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పనిచేయాలి.
ఐ.ప్రసాదరావు
63056 82733