సప్త సాగరాలు దాటి... సాధారణ ప్రేమ కథే కానీ...

by Ravi |   ( Updated:2023-10-07 00:15:54.0  )
సప్త సాగరాలు దాటి... సాధారణ ప్రేమ కథే కానీ...
X

చలనచిత్రాల ‘విజయసూత్రాల’లో మొదటి, చివరిది కూడా ప్రేమ కథలే. వీటికి ‘యువత’ శరవేగంగా ‘కనెక్ట్’ అవుతారు. పెద్దవారు కూడా కోల్పోయిన ‘తన ప్రేమ కథల గతాన్ని’ వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. భగ్న ప్రేమికుల(?) విషయం సరే సరి... ఇలా అన్ని వర్గాల వారిని సులభంగా చేరువయ్యేది ప్రేమ కథలే. నాగార్జున నుంచి.. నేటి వైష్ణవ్ తేజ్ వరకు అందరూ ప్రేమ కథలతోనే ‘లాంచ్’ అయ్యారు. సమంత ‘ఏం మాయ చేసావే’ ఎంతగా యువతను ఉర్రూతలూగించిందో చెప్పనవసరం లేదు. నాటి ‘దేవదాసు’, మొన్నటి ‘మరోచరిత్ర’, నేటి ‘సప్తసాగరాలు దాటి…’ చిత్రాల నడుమ విడుదలైన కొన్ని వేల ప్రేమ కథా చిత్రాలను పరిశీలిస్తే ‘ప్రేమ’ ‘విఫలం’ ‘విధి బలీయం’ అనే చాలా కామన్ త్రెడ్ కనిపిస్తుంది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా సెప్టెంబర్ 1న కన్నడలో, 29న తెలుగులో విడుదలైంది. కన్నడలో మంచి కలెక్షన్స్ రాబట్టిందని వార్తలు. కన్నడలో ‘సప్త సాగర దాచే ఎల్లో’ రక్షిత శెట్టి నిర్మించిన చిత్రం. కన్నడ సినిమాకు ‘కావలుదారి’ ఫేమ్ హేమంత్ ఎం. రావు దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దీన్ని తెలుగులో విడుదల చేసింది.

ప్రేమ కథను దృశ్యకావ్యంగా మలచి..

మను, ప్రియ ప్రేమికులు. లోకం అసూయపడే ప్రేమ వారిద్దరిదీ. వివాహం కూడా చేసుకుందామనుకుంటారు. మను ఓ పెద్ద వ్యాపారస్తుని ఇంట్లో కారు డ్రైవరు. చదువుకుంటూనే మంచి సింగర్‌గా ఎదగాలని ప్రియ జీవితాశయం. సముద్రం పక్కనే ఇల్లు కట్టుకొని జీవించాలనేది ఆమె కోరిక. మనుకు ఈ విషయం చెబుతుంది. అతను కూడా ఓకే అంటాడు. దీనికి డబ్బు కావాలి. కారు ఓనర్ అయిన బిజినెస్‌మన్ కారు నడుపుతూ యాక్సిడెంట్ చేస్తాడు. డబ్బు కోసం ఆ నేరాన్ని మను తన నెత్తి మీద వేసుకొని జైలుకెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందని తెరమీద చూడాలి. స్టోరీ లైన్ చిన్నది. గతంలో ఎన్నెన్నో చిత్రాలలో చూసింది కూడా. కానీ.. దర్శకుడు సినిమా స్క్రీన్ ప్లే కోసం ‘మనసు’ పెట్టి పని చేశాడు. ప్రేమలోని గాడతను, అమాయకమైన యువకుడు ప్రేయసి కోసం ఎలా ప్రమాదంలో చిక్కుకున్నాడు. వారిద్దరూ ఎలా ఒకటవుతారు అనే అంశాలలోని ‘ఎమోషన్స్’ ఎంతో హృద్యంగా, ఆర్ద్రంగా చిత్రించిన విధానం బాగుంది. ఇది 2010 నాటి కథ. ఆ కాలంనాటి వాతావరణాన్ని స్క్రీన్ మీదకు తెచ్చి ప్రేక్షకులను కొత్త లోకంలోకి తీసుకెళ్లారు. తర్వాత మను జైలు పాలైన వేళ జైలులో కొత్త ఖైదీలు ఎలాంటి ఇబ్బందులు పడతారు, పెడతారనేది ఓ ‘పాఠం’లా చెప్పాడు. ఎంతో సహజంగా దర్శకుడు చిత్రించిన విధానం మను, ప్రియ ప్రేమ పట్ల సానుభూతిని ప్రదర్శించే విధంగా చిత్రించాడు.

కాగితం పైన ఈ కథ ‘లైన్’ చాలా చిన్నది. ఊహించని మలుపులతో కథను నడపడం కష్టం. హీరో, హీరోయిన్స్‌ను సాంకేతిక నిపుణుల ప్రతిభను పూర్తి స్థాయిలో ఆకళింపు చేసుకునే దిశగా దర్శకుడు హేమంత్ శత శాతం కృషి చేశాడనేది తెరమీద కనిపిస్తుంది. కథానాయకుడు మను పాత్రలో రక్షిత్ శెట్టి తనవంతుగా చక్కగా నటించాడు. కథానాయక రుక్మిణి వసంత్ ఎక్కువ శాతం భావాలను కళ్ళతోనే ప్రదర్శించి, ఆమెలో ఓ మంచి నటి ఉన్నదని నిరూపించుకుంది. దర్శకుడు హేమంత్ సహితం ఆమెను పరిపూర్ణంగా ‘మను’గానే ఊహించుకొని సన్నివేశాలు అల్లుకున్నాడనిపిస్తుంది. సింగిల్ పేరెంట్‌గా పవిత్ర లోకేష్, కన్నింగ్ పాత్రలో అచ్యుత్ కుమార్ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.

ఈ చిత్రంలో ప్రధానమైన భాగస్వామి సంగీత దర్శకుడు చరణ్ రాజ్‌ గురించి ప్రస్తావించాలి. తొలి నుంచి చివరి వరకు ప్రతి ఫ్రేంలోని తనదైన ముద్రను వేశాడు. పాటలేవి గుర్తుండవు. కానీ.. ప్రతి సన్నివేశానికి కుదిరేలా ఆర్ద్రతతో కూడిన నేపధ్య సంగీతం అందించి ప్రేక్షకులను తనతో తీసుకువెళ్లేలా చేశాడు. ప్రేమ కథకు ఎంత అవసరమో అంతే సంగీతాన్ని ఆర్.ఆర్‌ను అందించారు. ప్రేమ కథలను దృశ్య కావ్యంగా మలచాలంటే ప్రధానమైన పాత్ర సంగీత దర్శకునిదేనని చెప్పక తప్పదు. ఈ విషయంలో నాటి ‘సీతాకోకచిలుక’ నుంచి ‘గీతాంజలి’ వరకు ఇళయరాజాది ఓ ప్రత్యేకమైన సరళి. ఏ.ఆర్. రెహమాన్ ‘బొంబాయి’ ‘రోజా’ వంటి వాటిని ప్రస్తావించుకోవాలి. ఆ కోవలోనే ‘సప్త సాగరాలు దాటి..’ చిత్రానికి చరణ్ రాజు ప్రత్యేకతను ప్రదర్శించారు. ప్రొడక్షన్, ఆర్ట్ విభాగాలు కూడా 2010 నాటి ప్రాపర్టీని చక్కగా ప్రజెంట్ చేయగలిగారు.

ఎక్కువ భాగం జైలు, కోర్టుల మధ్యే

‘ప్రేమ ప్రకృతిలో భాగమంటారు’ రవీంద్రుల వారు. ప్రసిద్ధ రచయిత చలం తన ‘రాజేశ్వరి’ పాత్రలో ఆమె మనసు ప్రకృతితో మమేకమని ‘మైదానం’లో రాస్తారు. ఈ కథలో కూడా ‘సముద్రం’ ఒడ్డున ఇల్లు, పాటలంటే ప్రాణం అనే హీరోయిన్ మనోభావాలకు అనుగుణంగా కథనం మలుచుకున్నారు దర్శకుడు హేమంత్. సముద్రంలోని ఆటుపోట్లు మను, ప్రియల ప్రేమ కథలో ఉన్నాయి. ప్రేమంటే వర్తమాన యువతీయువకులలో ఎక్కువ శాతం మందికి ఓ చులకన, నిర్లక్ష్య భావం ఉంది. కానీ ప్రేమంటే ఒకరికోసం ఒకరుగా జీవించడమని ఈ చిత్రం చెబుతుంది. చిత్రం మొదటి భాగం అంతా లవ్ ట్రాక్లో సరదాగా సాగితే, కారు ఓనరు మనుకు బెయిల్ కోసం ప్రయత్నిస్తానని చెప్పి గుండె నొప్పితో మరణించడంతో పరిస్థితులు తారుమారవుతాయి. అటువంటి క్లిష్ట పరిస్థితులలో తమ మధ్య దూరం పెరగకుండా చూసుకుంటారు ప్రియ, మనులు. చిత్రంలో ఎక్కువ భాగం జైలు, కోర్టుల మధ్య జరుగుతుంది. సన్నివేశాలలో ‘డ్రాగ్’ లేకుండా... నీట్‌గా చిత్రించాడు దర్శకుడు. ఫోటోగ్రాఫర్ అద్వైత గురుమూర్తి.

ద్వితీయార్థంలో సంఘర్షణలకు పెద్దపీట వేశారు. కష్టాలు దాటే క్రమంలో మన ఉద్వేగాల నడుమ ప్రబలే సంఘర్షణలు తట్టుకోవడం కష్టమే. అయినా ప్రేమ వాటిని జయించ గలుగుతుందని మను విశ్వాసం. ఓ మంచి ప్రేమ కథను అందించే ప్రయత్నంలో దర్శకుడు హేమంత్, నిర్మాత రక్షిత్ శెట్టి దీనికి పార్ట్- బి ఉందని కూడా చెప్పారు. కథ సుఖాంతానికి మరో భాగం చూడాలి. కథాకథనాలలో లోటుపాట్లు ఉన్నాయి. కానీ దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ‘కాంతార’ తరువాత అంతకుముందు కూడా కన్నడ చిత్రాలకు తెలుగునాట ఆసక్తి, ఆదరణ పెరిగాయి అనటం అతిశయోక్తి కాదు. అలాగని విడుదలైన ప్రతి చిత్రాన్ని ఆదరించలేదు. సుదీప్, ఉపేంద్ర చిత్రాలు అపజయం పొందాయి. చక్కని కథతో మానవ అనుభూతులను, ప్రేమ, సంఘర్షణ, ఆప్యాయతలు, సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చి వచ్చిన చిత్రాలను విజయం చేకూర్చారు. ఈ కోవకు చెందిన ప్రేమ కథాచిత్రం ‘సప్త సాగరాలు దాటి..’ యువతకు బాగా నచ్చవచ్చు.

ప్రియురాలి కోరిక నెర‌వేర్చ‌డం కోసం చేయని నేరాన్ని త‌న‌పై వేసుకున్న ఓ అభంశుభం తెలియని ఒక యువ‌కుడు ఆమెకు శాశ్వ‌తంగా ఎలా దూర‌మ‌వ్వాల్సివ‌చ్చింద‌నే విషయాన్ని ఎంతో ఎమోషనల్‌గా స్క్రీన్‌పై గుండెలు పిండేసేలా తెర మీద ఆవిష్క‌రించే ప్రయత్నం చేసి దర్శకుడు దాదాపు సఫలం అయ్యాడు. లవ్ స్టోరీస్ ఇష్టపడే వారి గుండెలు పిండేసే స్వచ్చమైన ప్రేమ కథ ఇది.

-భమిడిపాటి గౌరీశంకర్

94928 58395

Advertisement

Next Story

Most Viewed