న్యాయం కోసం పోరాటం.. సంఘటిత స్త్రీవాద కవిత్వం!

by Ravi |   ( Updated:2023-09-13 23:16:21.0  )
న్యాయం కోసం పోరాటం.. సంఘటిత స్త్రీవాద కవిత్వం!
X

విస్మరణను ఛేదించే ప్రయత్నం అంటూ.. అనాదిగా సకల వివక్షలకు గురవుతున్న అవుతున్న స్త్రీ జాతికి, వాటి తరఫున బాధ్యతతో ఐక్యంగా అంకిత భావంతో 115 మంది కవయిత్రులతో పొందుపరచిన సంఘటిత సంకలనాన్ని సాహితీ లోకానికి అందించారు సంపాదకురాలు డాక్టర్ జ్వలిత. 2010 సంవత్సరం తర్వాత వచ్చిన స్త్రీవాద కవిత్వంను భద్రపరచడంలో భాగమే సంఘటిత సంకలన ఉద్దేశమనీ, ఈ ప్రయాణంలో స్త్రీవాద కవిత్వం అంటే చర్విత చర్వణంగా భావించే విమర్శకులకు ఇందులో కొన్ని కవితలు ‘మేమున్నాం ఇక్కడ’ అని కొందరి తరపున సాక్ష్యం ఇస్తాయని సంపాదకురాలు విశ్వసించింది.

సమాజంలో చూసినవే.. అక్షరబద్ధం!

ఈ సంకలనంలో..‘ఆ చిత్రం ఎప్పటినుండో అక్కడే ఉంది యుగయుగాలుగా తరతరాలుగా భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సాక్షిభూతమై’ అంటూ కవయిత్రి అత్తలూరు విజయలక్ష్మి రాసిన ‘చిత్రం’ కవితతో మొదలుపెట్టిన ఈ కవితా సంకలనం ‘నేను స్వేచ్ఛని ఒక కాంక్షని ఒక కామనని చెలికాడా నీ అంతరాంతరాల్లో దోబూచులాడే కోరికల రూపికను స్వేచ్ఛ ప్రణయ జీవనం మనది’ అంటూ కవయిత్రి హిమజ రాసిన ‘లివింగ్ టుగెదర్’ కవితతో ముగిసింది. అలాగే ఎందరో కవయిత్రులు సంఘంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాల గురించి, తరతరాలుగా స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ ఒక పరిష్కార మార్గాన్ని శాశ్వతంగా అందించాలని ప్రయత్నం చేశారు. అలాగే అభం శుభం తెలియని చిన్నారులపై జరుగుతున్న హత్యచారాలను గూర్చి తెలియజేసిన కవిత ప్రతి పాఠకుడిని, సాహితీ మూర్తులను ఆలోచింపజేస్తుంది.

ఈ సంకలనంలో అమ్మనై అడుగుతున్నా! అన్న కవితలో అమ్మనై అడుగుతున్నా అమ్మకొడుకా ఆలోచించు రాఖీగట్టిన చెల్లెకు రక్షగా నిలబడతవ్ మరి రోడ్డు మీద చెల్లినెందుకు రోతకూతలు కూస్తవ్’ అంటూ సమాజంలో ఈవ్‌టీజింగ్‌పై తన విమర్శనాస్త్రాన్ని గుప్పించింది. అలాగే ఆమెకు ఏమి తెలియదా కవితలో ఎన్ని చుక్కలు ఎన్ని వరసలు పెట్టాలో తెలిసిన ఆమెకి వచ్చిన డబ్బులు దేనికెంత ఖర్చుపెట్టాలో తెలీదా ఈ చుక్కను ఆ చుక్కకి కలిపి మదిలోనే మెలికతిప్పే ఆమెకి సమస్యల సుడిగుండాలకి వ్యూహాలు తెలీదా అద్భుతమైన వంటలతో ఇంటిల్లిపాదిని ఆనందపరచగలిగిన ఆమెకి రకరకాల మనుషుల తీరుతో రాణించలేదా ఆలోచించమంటారు. అలాగే ఓ కవితలో మహిళకు కావాల్సింది అవార్డులు, రివార్డులూ కాదు కాసింత గౌరవం అంటూ నిలదీస్తుంది. ఇలా కవయిత్రులు రాసిన, ఎంచుకున్న కవితా వస్తువులు అన్ని స్త్రీ పుట్టినప్పటి నుంచి తన జీవితంలో జరిగే అన్ని సందర్భాలను, అవమానాలను ఏదో ఒక కవయిత్రి వివరిస్తూ నిత్యం సమాజంలో అందరికీ కళ్ళ ఎదుట కనిపించినవి, జరిగినవి, కొన్ని ఉమ్మడి కుటుంబాలలో, పేద తరగతి కుటుంబాలలో కూడా అనేక ఆర్థిక ఇబ్బందులను కవికోణంతో చూసి అక్షరబద్ధం చేయగలిగారు.

స్త్రీ యంత్రంగా పనిచేస్తూ..

‘సంఘటిత’ కవితా సంకలనం మొత్తం 115 మంది కవయిత్రులు స్త్రీవాదాన్ని అద్భుతంగా అక్షరీకరించారు. స్త్రీలలో ఉన్న సహజత్వాన్ని, వివిధ లక్షణాలను, స్త్రీ కుటుంబ పరంగా, వృత్తిపరంగా, సామాజిక రాజకీయంగా నేటి ప్రపంచానికి అందిస్తున్న సేవలను, స్త్రీ చేస్తున్న సేవలను గుర్తించి మనం స్త్రీని ఒక శక్తి స్వరూపిణిగా భావిస్తాము. స్త్రీలోని ఈ విశేష లక్షణం ఎక్కడ నుండో తను తెచ్చిపెట్టుకున్నది కాదు సహజసిద్ధంగా వచ్చినది! ఈ సామాజిక పరిస్థితులలో ప్రకృతి పరంగా తనలో ఉన్న లక్షణం. ఆ ఓపికతో కూడిన స్త్రీ సాధించలేనిది ఏదీ లేదు.

నిత్య అన్వేషిగా స్త్రీ తనని తాను సంస్కరించుకుంటూ ఇంటినీ పిల్లల్నీ, తన బాధ్యతలనీ, బరువుల్నీ, ఇరుగుపొరుగుల్నీ అన్నీ తనపై భారంగా ఒక తాటిమీదకి నడిపే శక్తి గలది. ఆహారం, సేవ, సంస్కారం, మంచిచెడుల విచక్షణా జ్ఞానం కుటుంబ సభ్యులందరికీ పంచిపెడుతూ పిల్లలని క్రమశిక్షణలో ఉంచుతూ భావి పౌరులుగా తీర్చిదిద్దగల నేర్పరి. ఒకరకంగా స్త్రీ యంత్రంగా తను అనునిత్యం పనిచేస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీ గురించి మరెన్నో చెప్పొచ్చు. ప్రతి తల్లి నుండి బిడ్డ పొందే ఆనందమే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం! తన త్యాగశీలత గురించి కళ్లకు కట్టినట్లుగా కూడా బాధ్యతలని పూర్తి చేస్తూ.. తాను అబల కాదు సబల అని నిరూపించుకోగల సమర్థురాలని చెప్పడానికి మరెన్నో ఉదాహరణలున్నాయి. ప్రతి పరిపక్వత చెందిన పరిపూర్ణమైన పురుషుడి వెనకాల ఒక స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీ వెనకాల దాగి ఉన్న ఓర్పూ, నేర్పూ, బాధ్యతా, త్యాగం అనేవి దాగి ఉన్నందున పురుషుడు ఒక సాధకుడవుతున్నాడని చెప్పవచ్చు. ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ తమని తాము రక్షించుకుంటూ.. తను ఇంటినీ తన పిల్లలనీ మాత్రమే కాకుండా తనలోని సంస్కారాన్ని, సంప్రదాయాలను రక్షించుకుంటూ ముందుకుపోతున్న ప్రతి స్త్రీ మూర్తికి నమస్సులు తెలియజేస్తూ.. ఇలాంటి కనువిప్పు కలిగించే రచనలు చదివాకనైనా నేటి సమాజంలో కుల, మత, వర్గ, ప్రాంతీయ విభేదాలను ప్రతి ఒక్కరూ వదిలిపెట్టాలని కోరుతున్నాను. సంఘటిత సంకలనంలో భాగస్వాములైన నేటి కవయిత్రులైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ.. సంపాదకురాలైన కవయిత్రి జ్వలిత ఆధ్వర్యంలో మరిన్ని కావ్యాలు వెలుపడాలని ఆశిస్తూ అక్షరాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో లభ్యం!

డా. చిటికెన కిరణ్ కుమార్

రచయిత, విమర్శకులు

94908 41284

Advertisement

Next Story

Most Viewed