విషాదాంతం, సుఖాంతమూ కానీ ప్రేమకథ '96'

by Harish |   ( Updated:2023-04-07 19:30:48.0  )
విషాదాంతం, సుఖాంతమూ కానీ ప్రేమకథ 96
X

ప్రేమ...అనంత పదాలతో అభివర్ణించినా, అంతులేని విషాదాన్ని అక్షరాల్లో పలికించినా ఇంకా ఎంతో కొంత చెప్పడానికి మిగిలే ఉన్న సబ్జెక్ట్. అందుకే సినిమాకి అప్పుడు, ఇప్పుడూ, ఎప్పుడూ ఉపయోగపడే కథావస్తువు. తెలుగులో విజయవంతమైన ప్రేమకథలే నడుస్తున్న సమయంలో విషాదంతో ముగించి చరిత్ర సృష్టించిన చిత్రం మరో చరిత్ర. ఆ తర్వాతా కొన్ని వందల ప్రేమకథా చిత్రాలు వచ్చాయి. వాటిలో దాదాపు 99 శాతం చివరకు ప్రేమికులైన హీరోహీరోయిన్లు కలుసుకొని శుభం కార్డు పడేవే ఎక్కువ. ఒక్క శాతం చిత్రాలు మాత్రమే విషాదాంతంగా ముగిసినవి ఉన్నాయి. కానీ హడావుడి, రక్తపాతం, హింస లేకుండా ఏకమవ్వని ప్రేమికుల కథను చెప్పిన సినిమాలు చాలా తక్కువ. విషాదాంతం కాకపోవచ్చు, సుఖాంతమూ కానీ చిత్రమే 96.

90 చివరి దశకం వరకూ కూడా డేటింగ్ ట్రెండ్ మనదేశంలో పూర్తిగా ఊపు అందుకోని సమయంలో అప్పటికీ యువత అనుభూతులు-ఆనందాలు, ఇష్టాలు-అభిరుచులు సరిపోల్చుకుంటున్న కాలం. టీనేజీలో ఆకర్షణ, ఇష్టం ఏర్పడటం సహజం. ఆ వయస్సులో కలిగే ఇష్టానికి, ద్వేషానికి నిజాయితీ ఉంటుంది. అన్నింటికీ మించి స్వచ్ఛత ఉంటుంది. కాలం గడుస్తున్న కొద్దీ, చదువులు, ఉద్యోగాలు, ఉన్నత స్థానాలను పొందేందుకు పడే కష్టాలతో ఇష్టాలు, అభిరుచుల్లో మార్పు రావచ్చు. కానీ ఫస్ట్ లవ్ ఎప్పటికీ ఒక స్వీట్ మెమొరీగానే ఉంటుంది. అంటే మొదటిసారి ఇష్టపడిన వ్యక్తిని ఎక్కడో జ్ఞాపకాల దొంతరలో దాచుకున్నప్పుడు ఫస్ట్ లవ్ ఎప్పుడూ స్వీట్ మెమొరీగానే ఉంటుంది. కానీ మరిచిపోకుండా అలాగే ప్రేమిస్తే, ఆ విషయం అవతలి వారికి తెలియకపోతే... అలాంటిదే 1996 టెన్త్ క్లాస్ బ్యాచ్ లో చదువుకున్న రామచంద్రన్-జానకిల ప్రేమకథ.

రామచంద్రన్ ఓ ట్రావెల్ ఫోటోగ్రాఫర్. తన టెన్త్ క్లాస్ బ్యాచ్‌మేట్స్ రీయూనియన్ ఏర్పాటు చేస్తే దానికి వాళ్ల క్లాస్‌మేట్స్ అందరూ వస్తారు. ఆ ఫంక్షన్‌కి జానకి సింగపూర్‌ నుంచి వస్తుంది. 22 ఏళ్ల తర్వాత క్లాస్‌మేట్స్ అందరూ కలుస్తారు. ఫంక్షన్‌కి వచ్చీ రాగానే జానకి కళ్లు రామ్ కోసం వెతుకుతుంటాయి. ఒకరికొకరు ఎదురుపడినప్పుడు 20 ఏళ్ల క్రితం ఉన్న ప్రేమ గుర్తొచ్చి అది కళ్లల్లో ఆనందమై మెరుస్తుంది. మరుక్షణం 22 ఏళ్ల తర్వాత కలిశామని గుర్తొచ్చి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత జానును హోటల్‌లో డ్రాప్ చేస్తాడు రామ్. లోపలికెళ్లిన జానుకి సరిగ్గా మాట్లాడలేకపోయానన్న వెలితి. రామ్‌కి కాల్ చేసి ఎక్కడున్నావ్ అని అడుగుతుంది.

“నువ్వు వదిలి వెళ్లిపోయిన చోటే ఉండిపోయాను అంటాడు”. ఆ ఒక్క మాటతో 22 ఏళ్లుగా నిన్ను ప్రేమిస్తూ అక్కడే ఉండిపోయాను అని చెప్పకనే చెప్తాడు. ఇద్దరూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ బయటికి వెళ్తారు. వర్షంలో తడవడంతో రామ్ ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నప్పుడు, స్కూల్ టైం నుంచి దాచుకున్న జానకి వస్తువుల్ని చూపిస్తాడు. ఆ సమయంలో చిన్న పిల్లవాడికి అడిగిన ఆట వస్తువు కొనిచ్చినప్పుడు ఆనంద పడినట్లు రామ్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది.

రామ్‌తో విడిపోయిన తర్వాత కాలేజీలో, ఇంటిదగ్గర ఆఖరికి పెళ్లిలో కూడా నువ్వు వస్తావని వేచి చూశానని జాను రామ్‌కి చెప్తుంది. కానీ నువ్వు కనిపించలేదని బాధ పడుతుంది. జాను టెన్త్ క్లాస్‌లో మార్కులు, డిగ్రీ కోర్స్, బస్సులో ఎలా వెళ్లేది అన్నీ తాను చూశానని ఆఖరికి పెళ్లికి కూడా వచ్చానని చెప్తాడు రామ్. అప్పుడు కానీ ఇద్దరికీ అర్థమవదు ఎక్కడో మిస్ కమ్యూనికేషన్ అవ్వడం వల్ల కలుసుకోలేకపోయామని. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉన్నా ఆ విషయాన్ని చెప్పలేని, చెప్పుకోలేని స్థితికి వచ్చామని.

22 ఏళ్ల తర్వాత కలిసినప్పుడు ఒకరినొకరు మోసం చేసుకోలేదన్న ఆనందం , ప్రేమ ఉందన్న సంతోషం, ఇప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయత. తెరపై ఉన్న పాత్రలకే కాదు చూస్తున్న ప్రేక్షకుడికీ ఒక్కసారిగా నరాన్ని మెలిపెట్టి లాగినట్లు అనిపిస్తుంది. చివర్లో జానకి రామ్‌ని వదిలేసి ఏడుస్తూ సింగపూర్ ఫ్లైట్ ఎక్కుతుంది. తన ఇంట్లో ఉండిపోయిన జానకి డ్రెస్‌ను భద్రంగా సూట్‌కేస్‌లో ఉన్న జానకి వస్తువుల్లో పెడతాడు. సూట్ కేస్ డోర్ మూయడంతో నల్లని తెరపడుతుంది. చూస్తున్న వాళ్లకి ఒక్క క్షణం శూన్యంలో ఉన్నట్లు అనిపిస్తుంది.

టీనేజీ లవ్, మెచ్యూర్డ్ లవ్, యూత్‌ఫుల్ లవ్ స్టోరీ పేరిట తీస్తోన్న చిత్రాల్లో 16 ఏళ్లు నిండని స్కూల్ పిల్లల ప్రేమల్నో లేదా రొమాన్స్ పేరిట లస్ట్ చూపించే చిత్రాలు ఎక్కువయ్యాయి. అలాంటిది ప్రేమ అనే అనుభూతిని అందంగా చూపించి దాని గౌరవాన్ని పెంచిన చిత్రమే 96. లవ్ స్టోరీ అంటే అందమైన లొకేషన్లు తెరను పూలతో పులిమేసి బ్యాగ్రౌండ్ స్కోర్ తో నింపేసే దర్శకులు ఓసారి 96 చూస్తే ప్రేమకథ ఇలా కూడా తీయ్యొచ్చని తెలుస్తుంది. ఇద్దరు ఇష్టపడ్డ వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనల్ని ఒక క్రమంలో పేర్చినా ఓ అద్భుతమైన ప్రేమకథ అవుతుందని జానకి-రామ్‌ల కథ చూస్తే అర్థమవుతుంది. కె.రామచంద్రన్‌గా విజయ్ సేతుపతి, జానకిగా త్రిష తెర అంతా నిండిపోయినా, నేను ఉన్నాను అని గుర్తుచేస్తుంది జానకి చిన్నప్పటి పాత్ర చేసిన గౌరీ కిషన్.

సినిమా మొదలైనప్పుడు ప్రేక్షకుడికి తన తొలిప్రేమ గుర్తొస్తుంది. కానీ సినిమా పూర్తయ్యే సరికి ఆలోచనల్లో జానకి-రామ్‌లే మిగులుతారు. కాదలే కాదలే అనే పాట మెదడుకు ఆనందాన్నిస్తుంటే అదేసమయంలో కళ్లల్లో తడిపుట్టిస్తుంది. సినిమా పూర్తయినా పక్కన ఎవరూ పాడకున్నా చెవుల్లో 'కాదలే..కాదలే..' పాట వినిపిస్తూనే ఉంటుంది.

దండు కిరణ్ కుమార్

81065 12340





Advertisement

Next Story