రైతుబంధును హేతుబద్ధీకరించాలి

by Ravi |   ( Updated:2024-01-24 01:00:58.0  )
రైతుబంధును హేతుబద్ధీకరించాలి
X

మనరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని హేతుబద్దీకరించాలని భావిస్తోంది, ఈ పథకం ద్వారా పేద రైతులకన్నా భూస్వాములకే ఎక్కువగా మేలు చేస్తుందనే భావన ప్రజల్లో బలంగా ఉండటంతో, ఈ పథకాన్ని హేతుబద్ధీకరించి రైతుభరోసాగా పేరు మార్చి కౌలు రైతులందరికీ ఈ సంవత్సరం జూన్‌ నుండి వర్తింపజేయానేది ప్రభుత్వ ఆలోచన. దీని సాధ్యాసాధ్యాలను ఓసారి పరిశీలిద్దాం.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం మన రాష్ట్రంలో సాగుకు అనువుగా ఉన్న భూమి 1 కోటి 48 లక్షల ఎకరాలు. సాగు విస్తీర్ణం ప్రతి సంవత్సరం ఒకే విధంగా ఉండదు. ఇది వర్షాలపై ఆధారపడుతుంది. సకాలంలో మంచిగా వర్షం కురిస్తే సాగు విస్తీర్ణం పెరుగుతుంది. లేకుంటే తగ్గుతుంది. సాగు విస్తీర్ణం మన రాష్ట్రంలో గరిష్టంగా నమోదవుతుంది ఒక కోటి పదిలక్షల ఎకరాలు మాత్రమే. అంటే సాగుకు అనువుగా ఉండి పంటవేయని భూమి ప్రతి సంవత్సరం 88 లక్షల ఎకరాలకు సైతం రైతుబంధు అందుతున్నది.

వీరికి రైతుబంధు వద్దు!

గతంలో ప్రభుత్వం ఒక కోటి 48 లక్షల ఎకరాలకు సంవత్సరానికి రెండు సార్ల చొప్పున రైతులకు పెట్టుబడి సహాయం కింద చెల్లించిన మొత్తం 14,300 కోట్లు. ఇందులో సాగుచేయని భూముల రైతులకు ఇచ్చింది రూ. 3,300 కోట్లు సాగు చేసి పంటపండించిన వారికి, సాగు చేయక ఎలాంటి పంట పండించని వారికి సమానంగా రైతుబంధు ఆర్థిక సహాయం అందించడం ఎంతవరకు సమంజసం? అసలు సాగుచేయని భూములకు ఆర్థిక సహాయం ఎందుకివ్వాలి? సాగుకు అనువైన భూమి ఉండి కూడా సాగుచేయని ఈ భూ స్వాములంతా పెద్ద భూకమతాలు కలిగివున్న వ్యాపారవేత్తలు, ఉన్నత ఉద్యోగస్థులు, ఎన్‌ఆర్‌ఐలు, వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకున్న బడా భూస్వాములు. నిజానికి వీరికి రైతుబంధు అవసరమే లేదు!

నూతన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు సహాయాన్ని ఎకరాకు 15 వేలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ లెక్కన రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 43 లక్షల ఎకరాలకు సాలీన అందించాల్సిన ఆర్థిక సహాయం రమారమి 21,450 కోట్ల వరకు ఉంటుంది. ఇందులో సాగుకు అనువుగా ఉండి సాగుచేయని 33 లక్షల ఎకరాల భూమికి సాలీన ఎకరాకు 15 వేల చొప్పున రాష్ట్ర ఖజానాపై పడే భారం రూ. 4,950 కోట్లు. వీరి లెక్కలు తీసి వీరికి రైతుబంధు ఆర్థిక సహాయాన్ని రద్దు చేస్తే అప్పుడు ప్రభుత్వంపై 16,500 కోట్ల భారం తగ్గుతుంది.

సన్నకారు రైతులను దెబ్బతీయొద్దు

రాష్ట్రంలో అర ఎకరం నుండి ఐదు ఎకరాల లోపు భూకమతాలు కలిగి వున్న రైతులు రమారమి 53 లక్షలు. మొత్తం రైతుల్లో వీరి శాతం 91. వీళ్లంతా బడుగు బలహీన వర్ణాలవారు. వీరికి గతంలో అందిన, ప్రస్తుతం అందబోతున్న ఆర్థిక సహాయం నామమాత్రంగానే ఉండబోతుందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఒక ఎకరంలోపు వ్యవసాయభూమి కలిగివున్న రైతులు 18 లక్షల మంది. వీరికి గతంలో అందిన ఆర్థిక సహాయం సాలీనా రూ. 415 కోట్లు, రెండెకరాల లోపు వ్యవసాయ భూమి వున్న వారి సంఖ్య 24 లక్షలు. గతంలో వీరికి అందిన ఆర్థిక సహాయం రూ. 1,292 కోట్లు. ఈ వ్యవసాయ కుటుంబాలు 90 శాతం రుణాల వూబిలో కూరుకుపోయినట్లు అనేక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒక్కో కుటుంబం సగటు అప్పు లక్ష రూపాయలకు పైగానే ఉన్నట్లు అంచనా. వీళ్లంతా సన్నచిన్నకారు రైతులే. రాష్ట్రంలో ఒకటి రెండు గుంటల భూకమతాలు కలిగివున్న దళిత కుటుంబాలు లక్షల్లోనే ఉన్నాయి. వీరికి అందుతున్న ఆర్థిక సహాయం నామమాత్రమే. పైగా భూమి లేని వారు ఎంతోమంది ఉన్నారు. అందుకే రైతు అంటే భూ యజమాని కాదు సాగుచేసే వాడే యజమాని అని ఈ పథకాన్ని సాగుదారులైనటువంటి కౌలు రైతులందరికీ ఇవ్వాలనే వాదన గత కొంతకాలంగా వినిపిస్తోంది. దీనిని లోతుగా పరిశీలించాలి.

ఎందుకంటే, మనరాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో 91 శాతం మంది రైతులు బడుగు బలహీన వర్గాల వారే. వీరిలో అత్యధికులు రమారమి 80 శాతం మంది రైతులు తమకున్న చిన్న కమతాల ద్వారా వ్యవసాయం గిట్టుబాటు కాక తమ భూములకు గ్రామంలోని ఇతర రైతులకు కౌలుకు ఇచ్చుకుని పట్టణాలకు వలస వెళ్ళి అక్కడ వివిధ పనులలో స్థిరపడి జీవితం గడుపుతున్నారు. ఇప్పటివరకు వీరికి అందిన రైతుబంధు ఆర్థిక సహాయాన్ని ఆపివేసి రైతు భరోసా పేరిట కౌలు రైతులకు చెల్లిస్తే నష్టపోయేది లక్షల్లో వున్న ఈ బడుగు బలహీనవర్గాల కుటుంబాలే అన్న విషయాన్ని గమనించాలి.

ఈ నేపథ్యంలో రైతుబంధు పథకాన్ని హేతుబద్దీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అసంఖ్యాకంగా ఉన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఇరువురూ నష్టపోని విధంగా ప్రభుత్వం వ్యవహరించాలి. రాష్ట్రంలోని భూకమతాలన్నింటిని సర్వే చేసి హద్దులు పెట్టాలి. ముఖ్యంగా ప్రభుత్వ భూములను, దేవాదాయ, వక్స్‌ భూములన్నింటిని సర్వే జేసి హద్దులు పెట్టాలి. ప్రభుత్వం అమలు జరుపుతున్న ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రైతుబంధు లాంటి పథకాలన్నీ క్షేత్ర స్థాయిలో అమలు జరుగుతున్న తీరుతెన్నులపై సమగ్రమైన అధ్యయనం జరిపించే నిమిత్తం వ్యవసాయరంగ, రెవెన్యూ సిబ్బంది నిపుణులతో ఒక కమిటీని వేసి వారిచ్చే సూచనలు సలహాల ప్రకారం ఈ పథకాన్ని హేతుబద్దీకరించినప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు సాకారమవుతాయి.

- ప్రొ. జి.లక్ష్మణ్‌

98491 36104

Advertisement

Next Story