పరిశోధనల్లో గ్రంథాలయాల పాత్ర

by Ravi |   ( Updated:2023-01-03 03:07:13.0  )
పరిశోధనల్లో గ్రంథాలయాల పాత్ర
X

గ్రంథాలయమనేది ఒక విషయ, విజ్ఞాన భాండాగారం. బాల్యదశలో బాల గ్రంథాలయం మొదలుకొని పాఠశాల, కళాశాల, యూనివర్సిటీ గ్రంథాలయం వివిధ స్థాయిలలో వివిధ రూపాలలో చదువరులకు జ్ఞానబిక్షను ప్రసాధిస్తూనే ఉంటాయి. ఇవి గ్రామ, మండల, జిల్లా, మున్సిపల్, రీజినల్, స్టేట్ గ్రంథాలయాలుగా విస్తరించి ఉన్నాయి. అయితే పరిశోధనలలో గ్రంథాలయం పాత్ర ఎంతో కీలకమైనది. పరిశోధకుడు తాను పరిశోధించే అంశంపై విస్తృతంగా సమాచారం సేకరించి, లోతుగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకోసం ప్రతి పరిశోధకుడు విధిగా గ్రంథాలయాలను సందర్శించవలసివుంటుంది.

అతని సలహా, సహకారం అవసరం

విశ్వవిద్యాలయ గ్రంథాలయాలలో సాధారణంగా పుస్తకాలు, పత్రికలు, మ్యాగజైన్‌లు, వ్యాస సూచీలు, గ్రంథ పట్టికలు, బిబిలోగ్రఫి ఇండెక్స్ లు, ఎన్సైక్లోపీడియాలు, డిక్షనరీలు, ఆడియో, వీడియోలు ,మైక్రోఫిలింలు, తాళపత్ర గ్రంథాలు, రాతప్రతులు(Manuscripts), ప్రభుత్వ రికార్డులు, జీఓలు, ప్రాచీన చారిత్రక మ్యాపులు అరుదైన, పురాతన గ్రంథాలు, రాజకీయ, ప్రముఖుల డైరీలు, ఉత్తరాలు వంటి వెలకట్టలేని వనరులను కలిగి ఉంటాయి. లైబ్రరీలు విద్యార్థులు నేర్చుకోవడానికి అద్భుతమైన,ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిశబ్ధంతో, తగిన వసతులతో కూడి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. పరిశోధకుడికి అవసరమైన సమాచారాన్ని గుర్తించడంలో విద్యార్థులకు సహాయపడేందుకు తగిన ఉన్నత విద్యార్హతలు, నైపుణ్యం కలిగిన లైబ్రేరియన్, ఇతర సిబ్బందిని గ్రంథాలయాలు కలిగి ఉంటాయి. నిజానికి ఒక్క సమర్ధుడైన, అధునాతన కంప్యూటర్ సాప్ట్‌వేర్ లలో శిక్షణ పొందిన లైబ్రేరియన్ వందమంది అధ్యాపకులతో సమానం.

అతని సహాయ, సహకారాలు లేనిదే పరిశోధకుని 'పరిశోధన అంశం' ఒక్క అడుగు ముందుకు సాగదు. నూతన పరిశోధక విద్యార్థి తన పరిశోధన శీర్షికను తీసుకుని విశాలమైన పుస్తకాల అరణ్యంలోకి ప్రవేశిస్తే ఎటు చూసినా పుస్తకాలు, మాగజైన్లు, జర్నల్స్ వాటిలో ఎటు వెళ్ళాలో, ఏ పుస్తకాలను ఎలా వెతకాలో, ఏ సమాచారం ఎక్కడ దొరుకుతుందో తెలియని ఒక అయోమయ స్థితిని ఎదుర్కొంటాడు. అప్పుడు పరిశోధనకు సంబంధించిన సమాచార సేకరణకు లైబ్రేరియన్ అవసరం ఏర్పడుతుంది. లైబ్రేరియన్ సలహా, సహకారం నూతన పరిశోధక విద్యార్ధికి నూతన ధైర్యం, ఉత్తేజం కలిగిస్తుంది. అందుకే ప్రతి పరిశోధకుడు తన సిద్ధాంత గ్రంథంలో తన సూపర్ వైజర్ , ఇతర అధ్యాపకులతో పాటు, తన పరిశోధనకు సహకరించిన లైబ్రేరియన్ కు సైతం కృతజ్ఞతలు తెలియచేస్తాడు.

డిజిటల్ లైబ్రరీ ప్రాముఖ్యత

ఈనాడు మారుతున్న శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిలో భాగంగా, నేడు చాలా లైబ్రరీలు క్రమబద్ధమైన డిజిటలైజ్డ్ సమాచారాన్ని కలిగి ఉంటున్నాయి. అందుకే ఆధునిక గ్రంథాలయాలు నూతన సమాచారమునకు, పుస్తకాలకు డిజిటల్ యాక్సెస్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుత సమాచార యుగంలో వాటి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. డిజిటల్ లైబ్రరీను పరిశోధకులు ముఖ్యమైన సేవగా భావించాలి. డిజిటల్ లైబ్రరీ అనేది ఒక కొత్త ట్రెండ్. దీని సహాయంతో విద్యార్థులు, పరిశోధకులు తాను ఉన్నచోటు నుంచే ఏదైనా సమాచారాన్ని శోధించే సౌలభ్యాన్ని కలిగివుంది. ఇది పరిశోధనలు మరింత ప్రభావవంతంగా ఉండడానికి, విద్యార్థులకు ఇతర పరిశోధన సిబ్బందికి సాంకేతిక శిక్షణ అందించాలి. అలాగే గ్రంథాలయ సాఫ్ట్‌వేర్లని అందించాలి. నూతన పరిశోధక విద్యార్థి తన పరిశోధన ను ప్రారంభించడానికి ముందే స్థానిక లైబ్రరీ లేదా ఆన్‌లైన్ లైబ్రరీ డేటాబేస్ యొక్క విధి, విధానాలు, రిఫరెన్స్ రూమ్, కార్డ్ కేటలాగ్, పీరియాడికల్స్ మరియు ఇన్ఫర్మేషన్ డెస్క్ గురించి తెలుసుకోవాలి.

1. ఇన్ఫర్మేషన్ డెస్క్:

ఈ డెస్క్ లైబ్రరీ ను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పరిశోధక విద్యార్థి అక్కడ ఉన్న పుస్తకాల గురించి ఇక్కడ తెలుసుకోవచ్చు. అలాగే అక్కడ ఉన్న బ్రోచర్ లు చార్ట్ లు ఎక్కడ ఏవి దొరుకుతాయో తెలుపుతాయి. అలాగే ఇప్పుడు చాలా లైబ్రరీలలో ఆడియో విజువల్ ఎయిడ్స్, ప్రింటర్స్, కాపీ రైటర్స్, జిరాక్స్ మెషిన్లు ఉన్నాయి. ఇవి లైబ్రరీలో రీసెర్చ్ స్కాలర్ సమయాన్ని పొదుపు చేయడానికి ఉపయోగపడతాయి.

2. రిఫరెన్స్ రూమ్:

ఈ రూంలో లైబ్రరీ పుస్తకాలు, ఇతర రిఫరెన్స్ మెటీరియల్స్ దొరుకుతాయి. ఇవి పరిశోధకులకు వేగంగా రిఫరెన్స్ మెటీరియల్‌ని అందించడంలో సహాయపడతాయి. ఈ పుస్తకాలు ఒక అంశం గురించి ప్రాథమిక సమాచారాన్ని అందిస్తాయి, ఈ సమాచారం పరిశోధనలో సహాయపడుతుంది. సాధారణంగా గ్రంథాలయాల్లో రిఫరెన్స్ విభాగంలో నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాలు(ఎన్సైక్లోపీడియాలు) దొరుకుతాయి. వీటిని బయటకు ఇవ్వరు కేవలం లైబ్రరీలో మాత్రమే వాటిని ఉపయోగించాలి.

3. బిబిలియోగ్రఫీస్:

లైబ్రరీలో రెండు రకాల గ్రంథ పట్టికలు ఉంటాయి. 1.ప్రామాణిక గ్రంథ పట్టిక 2. ప్రస్తుత గ్రంథ పట్టిక. ప్రామాణిక గ్రంథ పట్టికలో నిర్ణీత వ్యవధిలో ఫీల్డ్‌కు సంబంధించిన అన్ని అంశాల జాబితాలు ఉంటాయి. ప్రస్తుత గ్రంథ పట్టికలు ఏదైనా విషయం గురించి ప్రస్తుత ప్రచురణలను కలిగి ఉంటాయి. అయితే గ్రంథ పట్టికలు విడిగా లేదా ఎన్సైక్లోపీడియా లోపల సాధారణ సూచన పుస్తకాల వలె ప్రచురించబడతాయి. పరిశోధకులు వారి సబ్జెక్ట్‌కు సంబంధించిన అన్ని గ్రంథ పట్టికలను ప్రామాణిక లేదా ప్రస్తుత జాబితాలను తనిఖీ చేయాలి. లైబ్రరీ కేటలాగ్‌ను గ్రంథ పట్టిక అని పిలవరు.

4. కార్డ్ కేటలాగ్:

కార్డ్ కేటలాగ్ అనేది ఒక పుస్తకాన్ని దాని పేరుతో, రచయిత పేరు లేదా విషయం ద్వారా నమోదు చేసే చిన్న కార్డ్. లైబ్రరీలలో సాధారణంగా ప్రతి పుస్తకానికి మూడు రకాల కేటలాగ్‌లు ఉంటాయి. ఇది పుస్తకాన్ని శోధించడానికి సాధారణంగా ఉపయోగించే పద్ధతి.

5. పీరియాడికల్స్:

లైబ్రరీలోని సీరియల్ సాహిత్యాన్ని పీరియాడికల్స్ అని పిలుస్తారు. ఇందులో జర్నల్‌లు, మ్యాగజైన్‌లు, వార్తాపత్రికలు ఉంటాయి. పీరియాడికల్స్ ఏదైనా పరిశోధన కోసం ప్రస్తుత సమాచారాన్ని అందిస్తాయి. కాబట్టి పీరియాడికల్స్ పరిశోధనకు చాలా విలువైనవి. ఇవి ఆన్‌లైన్‌లోనూ, లైబ్రరీలోనూ దొరుకుతాయి. సాధారణంగా విద్యార్థులు లైబ్రరీలో ఈ వనరులను ఉపయోగిస్తారు, లైబ్రేరియన్‌కి ప్రత్యేక అభ్యర్థన తర్వాత కొంత మెటీరియల్‌ని అరువుగా తీసుకోవచ్చు. ప్రస్తుత పిరియాడికల్స్ సాధారణంగా ముందు భాగంలో ఉన్న రాక్‌లపై ప్రదర్శించబడతాయి. పాతవి ఎక్కడో వెనుక భాగంలో అల్మారాలలో లేదా స్టాకింగ్ ప్రదేశంలో అమర్చబడి ఉంటాయి. ఇలా గ్రంథాలయాలు పీజీ స్థాయి విద్యార్థులకు, పరిశోధక విద్యార్థులకు, ప్రొఫెసర్లకు విధ్యాబోధనలోనూ, పరిశోధనా వ్యాసాలు రాయడానికి , సిద్ధాంత గ్రంథాలు రూపొందించటానికి కావలసిన సమాచార సేవలను అందిస్తుంది.

డా.రాధికా రాణి

అసిస్టెంట్ ప్రొఫెసర్,

లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, కేయూ

&

డా.కోలాహలం రామ్ కిశోర్,

వరంగల్.

9849328496.

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Also Read..

తొలి మహిళా టీచర్ సావిత్రిబాయి ఫూలే


Advertisement

Next Story

Most Viewed