సిద్ధాంతం అలవర్చుకుంటే సిద్ధార్థుడే!

by Ravi |   ( Updated:2024-12-08 00:46:01.0  )
సిద్ధాంతం అలవర్చుకుంటే  సిద్ధార్థుడే!
X

కాంగ్రెస్ పార్టీ అధ్యర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనకు ఏడాది కాలం పూర్తయింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దివాళా తీసి తెలంగాణ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి నాయకత్వం వహించడం అంటే సాహసం చేయడమే. కనీసం మంత్రిగా కూడ అనుభవం లేని నేత రాష్ట్ర పగ్గాలు చేతబట్టడమే కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడం అనే లక్ష్యంతో తన ఆలోచనకు పదును పెట్టి సీనియర్ల సలహాలు, ఆర్థికవేత్తల సూచనలు, మేధావుల ఆలోచనతో ముందుకు సాగారు.

రాష్ట్రంలో 10 ఏండ్ల నియంత పాలనకు చరమగీతం పాడి ప్రజల ఆకాంక్షలతో ప్రభుత్వం కొలువు తీరి ప్రజల కోణంలో పాలన సాగడం దేశంలో కొత్త ప్రయోగమే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమనేది కేవలం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కృషి మాత్రమే సరిపోలేదు. రాహుల్ గాంధీ జోడో యాత్ర, తెలంగాణ పౌర సమాజం అసమాన కృషి ఫలితమే! తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు.

పాలనలో సకల భాగస్వామ్యం

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ పెద్ద కసరత్తునే చేస్తుంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీల అమలు దిశగా పాలన సాగుతుంది. ఆరు గ్యారంటీల అమల్లో కొంత జాప్యం జరిగినప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రజలు అర్థం చేసుకున్న అరుదైన పరిస్థితిని కూడా గమనించాలి. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, తమ అద్దె మైకుల మేధావులతో తప్పుడు ప్రచారాలు, కథనాలు చేసినప్పటికీ ప్రజల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవడం గమనార్హం. తెలంగాణాలోని రచయితలకు, మేధావులకు, విద్యార్థి నాయకులకు పాలనలో భాగస్వామ్యం కల్పించారు. తాజాగా పదేళ్ల కాలంలో ఆవిష్కరణకు నోచుకోక పనుల పెండింగ్‌లో ఉన్న తెలంగాణ ధిక్కారస్వరం ప్రజా కవి కాళోజీ భవనాన్ని ఓరుగల్లు నగరంలో శరవేగంగా పూర్తి చేయించి తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం ప్రజాపాలనకు మరో కలికితురాయి. సీమాంధ్ర పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై కాలుష్య కాసారంగా మారిన మూసీ ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి పూనుకోవడం గొప్ప విషయం. త్వరలోనే మూసీ నది పూర్తిగా ప్రక్షాళనకు గురై హైదరాబాద్ మహానగరానికి మణిహారం కానుంది.

కులగణన గేమ్ చేంజర్!

తమది తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకున్న పార్టీ కేవలం కమీషన్ల కక్కుర్తి తోటే పాలన సాగించడంతో పాటు తెలంగాణ ఉనికికి అస్తిత్వానికి ప్రమాదం తెచ్చిపెట్టే నిర్ణయాలు చేసింది. తెలంగాణ కోణంలో పాలన సాగిన తీరు 10 ఏండ్ల పాలనలో తెలంగాణ ప్రజలు ఎరుగరు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యమ నేపథ్యంపై ఎన్ని విమర్శలు చేసినా ఆయన ఆచరణ ముందు బీఆర్ఎస్ కుయుక్తులు తేటతెల్లం అయిపోయాయి. రాహుల్ గాంధీ కుల గణన సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన. విజయవంతంగా కొనసాగుతోంది. సాధారణ స్వతంత్ర జడ్పీటీసీగా స్వతంత్ర ఎమ్మెల్సీగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డికి ఉన్న అపారమైన రాజకీయ అనుభవం ఆయనకు తిరుగులేని నేతగా నిలిపింది.

నాయకుడే బ్రాండ్‌గా మారి..

రేవంత్ రెడ్డి నమ్మిన విశ్వాసాల కోసం మొండిగా నిలబడటం తాను నమ్మిన వారికి అండగా ఉంటూ ప్రజలకు ఏది మంచిదైతే అటువైపు నిలబడుతూ సాగిన తన సహజ లక్షణమే ప్రజా పాలకుడిగా కీర్తిని మూటగట్టుకుంటున్నాడు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి అంటే నాయకుడు మాత్రమే కాదు.. ఒక బ్రాండ్‌గా మారిన పరిస్థితిని చూస్తున్నాం. పాలకుడిగా తన ప్రస్థానం ఇప్పుడే మొదలుపెట్టినప్పటికీ, తనదైన ముద్రతో ఎదుగుతున్న ఆయనను ఏ శక్తి ఆపజాలదు. భిన్న భిన్న భావాజాలలో ఎదిగిన ఆయన తనకంటూ సిద్ధాంతాన్ని రూపొందించుకునే పనిలో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రజా కోణంలో తాను సిద్ధాంతాన్ని అలవర్చుకుంటే మరో సిద్ధార్థుడుగా మారడం ఖాయం.

దొమ్మాట వెంకటేష్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్.

98480 57274

Advertisement

Next Story

Most Viewed