ఆహార అలవాట్లపై ఆంక్షలా?

by Ravi |   ( Updated:2023-02-17 19:01:06.0  )
ఆహార అలవాట్లపై ఆంక్షలా?
X

చారిత్రికంగా చూస్తే ప్రాచీనకాలం నుండి మన దేశం వ్యవసాయక దేశం. వ్యవసాయంలో పశువులను మచ్చిక చేసుకొని వాటిని ఉపయోగించి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచడంలో వాటి వినియోగం తప్పనిసరి. వాటిలో కూడా గోవులను పవిత్రమైన జీవిగా ఆరాధించేది హిందువులనేది కాదనలేని సత్యం. ముఖ్యంగా పల్లెలలో గోవులకు మాతృస్థానం వుంది. గోవులతోపాటు, ఇతర పశువులను కలిగి వుండటం ఒక సంపదగా గ్రామీణ రైతులు భావించేవారు. హిందువులు దాన, ధర్మాలలో గోదానం శేష్టమైన పుణ్యకార్యంగా భావించారు. నూతన గృహప్రవేశ సమయంలో ఆవును పూజించి గృహ ప్రాంగణంలో తిప్పడం శుభ సూచకంగా భావిస్తారు.

గ్రామీణ రైతు కుటుంబాలు, లేగలకు ఇష్టమైన, అందమైన పేర్లను పెట్టి ముద్దుగా, మురిపంగా తమ సొంత బిడ్డలవలే, కుటుంబ సభ్యులతో పాటు సమాన ప్రేమాభిమానాలు చూపించేవారు హిందువులే. గోవులను వాటి పేర్లతో పిలిస్తే స్పందిచేవి. లేగదూడలతో పిల్లలు సరదాగా ఆడుకోవడం, అవి చెంగు, చెంగున గంతులు వేయడాన్ని చూస్తే చూడముచ్చటగా వుంటుంది. తల్లి పాలు లభించని పసిబిడ్డలకు పట్టి, బిడ్డలను పెంచటంలో గోవు పాలు శ్రేష్టమైనవి. అందుకే గోవులను గోమాతగా హిందువులు ఆరాధిస్తారు. గోవు పాలల్లో విశేషమైన పోషక విలువలతో పాటు పలుచగా ఉండి పసిపిల్లలకు తేలికగా జీర్ణం అవుతాయి. వృద్ధులకు, రోగులకు ఆవుపాలు శ్రేష్టమైన ఆహారం, దివ్యమైన ఔషధం కూడా. భారతదేశంలో హిందువులు గోవులను పూజిస్తారని, గోమాతగా భావిస్తారని చెప్పడంలో లేశమాత్రం అనుమానం లేదు. అయితే పూర్వ కాలంలో యజ్ఞ,యాగాలు చేసినప్పుడు గోవులను పశువులను బలి అర్పించి వాటి మాంసాన్ని నైవేద్యంగా స్వీకరించే దృష్టాంతాలు యజుర్వేదంలో వున్నాయని పండితులు చెబుతారు.

150 విమానాల్లో జంతు మాంసం

కానీ ఇటీవల కాలంలో, గ్లోబలైజేషన్ ప్రక్రియలో ప్రతి వస్తువూ, ప్రతి జీవి వ్యాపార వస్తువుగా మారడం, ఎలాంటి సెంటిమెంట్లు, ప్రజల మనోభావాలను పట్టించుకోకపోవడం, ప్రతి దాన్ని లాభదృష్టితో చూడటం, ఓ వృత్తిగా, ప్రవృత్తి గా మారింది. మానవత్వం, దయ, దాక్షిణ్యాలకు తావు లేకుండా పోతున్నాయి. పాప పుణ్యాలను పక్కకు పెట్టి తాము నిత్యం పూజించే గోవులను ఇతర పశువులను కబేళాలకు తరలించే వ్యాపారులలో అధికులు హిందువులే కనిపిస్తున్నారు. ఇదేమి చిత్రమో అర్థం కావటం లేదు. విదేశాలకు గోవులను బర్రెలను ఇతర జంతువులను క్రూరంగా వధించి, వాటి మాంసాన్ని ప్యాక్ చేసి, 150 కార్గో విమానాల్లో ప్రతిరోజూ విదేశాలకు, ఎగుమతి చేసే వ్యాపారులలో 85 శాతం హిందువులే ఉన్నారు. ముఖ్యంగా పూనా, ముంబాయి, నాగపూర్, కలకత్తా, గుజరాత్, ఉత్తర ప్రదేశ్ తమిళనాడు, జయపూర్, గోవా మొదలైన నగరాల నుండి ఎక్కువ గోమాంస ఎగుమతి జరుగుతోంది. ఈ వ్యాపారంలో, లక్షల, కోట్లు సంపాదించేది కూడా హిందువులే. అయితే, పశువులను యంత్రాల ద్వారా వధించి, వాటి మాంసాన్ని ప్యాక్ చేసే వృత్తిలో ఉన్న పనివాళ్ళు, జీతగాళ్ళు మాత్రం 97 శాతం ముస్లింలు ఉన్నారు. బడా వ్యాపార సంస్థలు, దేశీయంగా వ్యాపారంలో 28 శాతం ముస్లింలు కూడా ఉన్నారు. కానీ విదేశాలకు బహుళ మాంస ఎగుమతి వ్యాపార సంస్థలు హిందువుల చేతులలోనే వున్నాయి.

మాంస ఎగుమతిలో అధికవాటా

నేడు మన దేశ గోవులు పశువుల ఎగుమతి, పశువుల అక్రమ రవాణా, పశువుల మాంస ఎగుమతి వ్యాపారంపై ఇంటర్‌నెట్‌లో విస్తారంగా ఈ సమాచారం దొరుకుతుంది. ఒక అకడమిక్ అధ్యయనంలో భాగంగా ఇస్తున్న ఈ సమాచార గణాంకాలు ఎవరైనా పరిశీలన చేయవచ్చు. ఈ గణాంకాల ప్రకారం చూస్తే మన దేశంలో గోవులు, బర్రెల మాంసాహారం తీసుకొనే వారిలో 95 శాతం ముస్లింలు ఉన్నారు. గొర్రెలు, మేకలు, కోళ్ళు, బాతులు, ఇతర పశుమాంస భక్షకులలో హిందువులు 76 శాతం ఉన్నారు. ఇస్లామిక్ , ఐరోపా దేశాల్లో గోవులు, బీఫ్ భక్షకులలో అధిక శాతం ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు ఉన్నారు. ఆ దేశాలకు మన దేశ గోవులు ఇతర జంతువుల మాంస ఎగుమతి చేయటం ద్వారా మన దేశానికి విలువైన విదేశీమారక ద్రవ్యం లభిస్తుంది. ఈ గోవుల, ఇతర పశువుల మాంస ఎగుమతి దారులలో అధిక శాతం హిందువులే ఉన్నారు. మరి గణాంక నిజాలు స్పష్టంగా ఇలా కండ్లకు కట్టినట్లు కనిపిస్తూవుంటే, గత 8 ఏళ్ళుగా బీజేపి, ఆర్ఎస్ఎస్, భజరంగ్‌దళ్ లాంటి మూకలు ముస్లింలపై, బీఫ్ భక్షకులపై, దళితులపై దాడులు చేయటం ఏమి న్యాయం?

ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పోలీసులు మీచేతుల్లనే వున్నారు. పార్లమెంటులో కావాల్సినంత మెజారిటీ వుంది. కఠినమైన చట్టాలు తెచ్చి గోవులు ఇతర పశువులను వధించే కర్మాగార కేంద్రాలు, పశుమాంస విక్రయాలు, రవాణాపై నిషేధాలు విధించండి. విదేశాలకు ఎగుమతులు పూర్తిగా నిలిపేయమంటూ ధర్నాలు, ఉద్యమాలను బీజేపీ ప్రభుత్వంపై చేయండి. గోవధ, బీఫ్ మాంసం విక్రయం, అక్రమ రవాణా, విదేశాలకు తరలించే వ్యాపారం చేసి, లక్షల కోట్ల లాభాలు గడించే హిందూ వ్యాపార దిగ్గజాలను వదిలేసి, భారత్‌లో గోవులు, పశుమాంసం తినే దళితులు, ముస్లింలు ఇతర వర్గాల హోటళ్ళు, రెస్టారెంట్లపై దాడులు చేయడం ఎందుకు? నిజంగా మీకు రాజ్యాంగం గురించి తెలుసా? ప్రజల ఆహార అలవాట్లపై ఆంక్షలు విధించే అధికారం మీకు ఉందా? ఈ అవాంఛిత నైతికాధికారం మీకు ఎవరిచ్చారు?

డా. కోలాహలం రామ్ కిశోర్

98493 28496

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672

Advertisement

Next Story