- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జోడేఘాట్ ఉద్యమ కళా రూపకర్త
అనాటి నైజాం పాలకుల కబందహస్తాల నుంచి విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన కుమ్రంభీం దాదా పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. ఆ స్ఫూర్తికి చిహ్నమే జోడేన్ ఘాట్‌లో కుమ్రంభీం స్మృతి పథం. ఆ పోరాట చిరునామాకు సంకేతమే కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా. ఈ భూపోరులో భీమ్‌కు కుడిభుజంగా రౌట కొండల్ తుడుందెబ్బ మోగిస్తే, అతని ఎడమ భుజంగా తూటు కొమ్ముతో పోరాట ధ్వనిని పొలిమేరల్లో వున్న పన్నెండు గ్రామాల్లో ప్రతిధ్వనింప చేసింది మాత్రం వెడ్మ రాము. ఆదివాసీ తెగలలో కుమ్రంభీం, రౌట కొండల్ 'గోండు' యోధులైతే, వీరిద్దరికి 'తోటి వాద్య ప్రచారకుడు' వెడ్మ రాము.
తన కళా ప్రదర్శనతో..
కుమ్రంభీంకు అక్షరజ్ఞానం కొరవడినా అన్యాయాల్ని, భూ ఆక్రమణల్ని పసిగట్టే జ్ఞాన పిపాసి. జల్-జంగల్-జమీన్ పోరాట పంథాకు కుమరం సూరు ప్రణాళికలు రచిస్తే, రౌట కొండల్ తోడుండగా, వెడ్మ రాము వాద్య ప్రచారకర్తగా పనిచేశాడు. భారతదేశంలోని అతిపెద్ద గిరిజన సముదాయమైన గోండులలో పెళ్లిళ్లు, పండుగలు, కర్మకాండలు, జాతరలు, చారిత్రక విశేషాలను వాయిద్య సైతంగా వినిపించే ఒక అశ్రిత తెగ తోటీలది. అలాంటి తోటి తెగలో వెడ్మ రాము 1914, జూలైలో వెడ్మ మెంగు, జంగుబాయిల తొలి సంతానంగా జన్మించారు. వెడ్మ రాము గోండి, తోటీల సాంప్రదాయ వాయిద్యాలైన సొర డెంసా - అట్రావజంగ్, కర్నల్, దహ్కి (డమరు), పెప్రె, కాలికోం (తూటు కొమ్ము) వంటి పరికరాలను వాయించడం చిన్నప్పటి నుంచే తండ్రి దగ్గర నేర్చుకున్నాడు. కులవృత్తిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని గోండు గ్రామాలను సందర్శించి వారి చారిత్రక గాథలను విన్పించాడు. తమ జాతి మూలపురుషుడైన పహండి కుపార్లింగ్ మధ్యప్రదేశ్‌లోని కవర్ గడ్ ప్రాంతంలో గోండ్వానా జాతి నిర్మాణం చేశాడని నమ్మి అక్కడి నుండి వెడ్మ రాము ఆసిఫాబాద్ మీదుగా కుమ్రంభీం స్వయం పాలన ప్రకటించుకున్న 12 గ్రామాలను చూడాలని బాబేఝరికి చేరుకున్నారు. అక్కడున్న మడావి మెస్పతి ద్వారా వెడ్మ రాము వాయిద్య కళాప్రతిభ భీంకు తెలిసి, ఆ కళా ప్రదర్శనను స్వయంగా చూసిన భీమ్ భూ పోరాటంలో తుడుం దెబ్బకు తోడు తూటు కొమ్ముతో ప్రచార భేరి మోగించడానికి తనకు సహాయకుడిగా నియమించుకున్నాడు.
గోండుల వాయిద్యాల్లో తూటు కొమ్ము శబ్దం శత్రువుల రాకను ఒక శబ్దం లేరవేస్తే, ఆయుధాలతో బయటికి రమ్మని సంకేతంగా మరో శబ్దం చెబుతుంది. రౌట కొండల్, కుమ్రం సూరు మోగించిన తుడుం దెబ్బలతో పాటు వెడ్మరాము పలికిన తూటు కొమ్ము 'సమర శంఖం' పూరించడంతో వందల మంది గోండులను జోడెన్ ఘాట్ సాయుధ పోరులో చురుగ్గా పాల్గొనేట్లు చేశాయి. భీమ్ పోరాటం తదనంతరం తెలంగాణ ప్రజలకు వెడ్మ రాము తన కళా ప్రదర్శనతో స్పూర్తి నింపాడు. 1940, అక్టోబర్ 8న జోడేఘాట్ మా గుట్టల్లో నైజాం సైనికుల దాడిలో కుమ్రంభీం అమరుడైన తర్వాత అక్కడి గోండులు, కోలాములు, నాయకపోడు, తోటోళ్ళు చెల్లా చెదరైనారు. పరిసర గ్రామమైన గిన్నెధరికి చేరిన రాము భీమ్ చరిత్రను తొలిసారిగా కథారూపంలో గానం చేశాడు. అందుకే భీమ్ పోరాట విశేషాలను తెలుసుకునేందుకు గిన్నెధరి ఒక వేదికగా మారింది. ఆ తర్వాత రాము అధికంగా గోండులున్న ఏదుల పాడ్‌లో సాంప్రదాయ పూజారిగా చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు.
గోండుల గొప్పదనాన్ని చెప్పి..
కుమ్రంభీం పోరాట నేపథ్యాన్ని అధ్యయనం చేయడానికి నైజాం ప్రభుత్వం ప్రముఖ ఆంత్రోపాలజిస్ట్ హైమండార్ప్‌ను నియమించింది. డార్ఫ్ గిన్నెధరిలోని గోండు పెద్దలైన సిడాం మారుమాష్టర్, కోట్నాక సోంజీ, మార్సుకోల రాము, ఆత్రం లచుపటేల్ చెప్పిన వివరాలను బట్టి వెడ్మరాము నివసిస్తున్న ఏదులపాడ్‌కు వెళ్లాడు. వెడ్మ రాము కథారూపంలో చెప్పిన భీమ్ గాథను విని హైమండార్ఫ్ నిజాం ప్రభుత్వానికి పంపాడు. అంతేకాదు డార్ఫ్ గోండుల విశిష్టమైన సంస్కృతి సాంప్రదాయాలను వెడ్మరాము నుంచే తొలిసారి తెలుసుకున్నాడు. 1960 - 1980 మధ్య గోండు జీవనంపై సుమారు ఎనిమిది పుస్తకాలు రచించాడు. డార్ప్ రాసిన పుస్తకాలను చదివి ప్రభావితుడైన మరో విదేశీ మైఖేల్ యార్క్ గోండుల పోరాట చరిత్రను, గిన్నేదరి లోని రాయ్ సెంటరుకు పిలిపించి గోండు పెద్దల సమక్షంలో భీమ్ చరిత్రను, గోండులు రాజరిక, సాంస్కృతిక ఆధారాల గురించి వాద్యగాన సహితంగా ప్రదర్శన ఇప్పించాడు. దీనిపై మైఖేల్ యార్క్ డాక్యుమెంటరీ ఫిల్మ్ చేశాడు. ఇది మూడున్నర దశాబ్దాల కిందటే బీబీసీ చానెల్‌లో ప్రసారం జరిగింది.
కుమ్రంభీం భూ పోరాటంలో వెడ్మ రాము అతని ఎడమ భుజంగా ఉంటూనే... భీమ్ చరిత్రను, గోండుల గొప్పదనాన్ని కధా రూపంలో ప్రపంచానికి చాటిన ఘనత తోటి తెగలో వెడ్మ రాముకే దక్కింది. తన వాద్య సంగీత ప్రచారకుడిగా ఆదివాసీల్లో ఆత్మవిశ్వాసం నింపిన వెడ్మ రాము ఆనారోగ్యంతో 1987, అక్టోబర్ 22న కన్నుమూశాడు. జోడెన్ ఘాట్‌లో నిర్మించిన కుమ్రంభీం స్మారక మ్యూజియంలో భీమ్ శిల్పం ఎడమన వెడ్మరాము శిల్పం పెట్టారు. వెడ్మరాము తూటు కొమ్ముతో పాటు ఇతర వాయిద్య పరికరాలు, ఆయన వాడిన పళ్ళెం - చెంబు తదితర వస్తువులు మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. తోటి తెగలో ఎదిగిన వెడ్మ రాము అదివాసీ తొలి సంగీత కళాకారుడు అనడంలో అతిశయోక్తి లేదు.
(నేడు వెడ్మ రాము వర్ధంతి )
గుమ్మడి లక్ష్మీ నారాయణ
ఆదివాసీ రచయితల వేదిక.
94913 18409