- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దేశ సమైక్యత ముఖ్యం కావాలి!
ఒకే రాజకీయ పక్షానికి చెందిన ఇరువురు రాజకీయ ఉద్దండులను దేశ పాలక, ప్రతిపక్ష పార్టీలు ఎవరికి వారు తమకు సంబంధించిన వ్యక్తులుగా భావిస్తున్నారు. కానీ ఆ ఇరువురు నేతలను జాతికి చెందిన మహోన్నత సంపదగా భావించలేకపోవడం కేవలం రాజకీయాంశంగానే పరిగణించాలి. స్వర్గీయ ఇందిరాగాంధీ, సర్దార్ పటేల్‌లు భారతదేశానికి అందించిన సేవలు నిరుపమానం.
అమ్మగా జనం గుండెల్లో నిలిచి
భారతదేశంలో ఒకప్పుడు మహిళలు సాంప్రదాయాల ముసుగులో ఇంటికి మాత్రమే పరిమితమై, బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు దూరంగా బతుకీడ్చేవారు. అలాంటి పరిస్థితుల్లో కూడా కొందరు తమదైన శైలిని ప్రదర్శించి, ఎన్నో అడ్డంకులను అధిగమించి, సామాజిక, రాజకీయ,సాంస్కృతిక, ఆర్థికరంగాల్లో రాణించి, దేశ ఖ్యాతిని నలు చెరగులా విస్తరింపచేసారు. అలాంటి కోవకు చెందిన వారిలో ఇందిరాగాంధీ స్థానం ప్రత్యేకమైనది. తండ్రి జవహర్ లాల్ నెహ్రూ రాజకీయ వారసత్వం ఇందిరాగాంధీ రాజకీయ ఎదుగుదలకు కొంతవరకు కారణం కావచ్చునేమో కాని, రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కేవలం ఆమె ప్రతిభా సామర్ధ్యాలే ప్రధాన భూమిక పోషించాయి. పరిపాలనలో ఆమె చూపిన తెగువ, దేశ సమగ్రత పట్ల ఆమె చిత్తశుద్ధి అత్యంత ప్రశంసార్హం. నాటి రాజకీయాల్లో అనేక మంది ఉద్దండుల మధ్య, తలలు పండిన రాజనీతిజ్ఞుల మధ్య నిలబడి, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని ప్రధానిగా సుదీర్ఘకాలం పని చేయడం సాధారణమైన విషయం కాదు. నెహ్రూ తర్వాత అత్యధిక కాలం భారతదేశానికి ప్రధానిగా పనిచేసి, దేశానికి మూడో ప్రధానిగా, మొదటి మహిళా ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టి అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి, అమ్మగా జనం గుండెల్లో స్థానం సంపాదించిన ఇందిరా గాంధీ రాజకీయ చరిత్రను ఒకసారి సింహావలోకనం చేసుకోవాలి.
అలహాబాద్‌లో పుట్టి, హస్తినకు ఏలికై, చిన్నతనంలోనే స్వాతంత్య్ర సంగ్రామంలోకి అడుగుపెట్టి, జైలులో నుండి నెహ్రూ పంపే ఉత్తరాల ద్వారా రాజకీయ ఓనమాలు దిద్దుకుని, దాదాపు 16 సంవత్సరాల పాటు భారతదేశ ప్రధానిగా దేశ ఔన్నత్యానికి పాటుపడి ఒకానొక సమయంలో ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా అనే విధంగా జన హృదయాల్లో చోటు సంపాదించుకుని, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ వనిత ‘ఇందిరా గాంధీ’. రాజకీయాలను సమగ్రంగా వంట బట్టించుకుని, మహామహులనుకున్న వారిని రాజకీయంగా మట్టి గరిపించి, తన శక్తి సామర్థ్యాలతో భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన ధీర వనిత ఇందిర. లాల్ బహదూర్ శాస్త్రి హఠాన్మరణం తర్వాత ప్రధాన మంత్రి పదవి కోసం జరిగిన పోటీలో విజయం ఇందిరాగాంధీనే వరించింది.
ఎన్నో సంస్కరణలు..
ఆమె ప్రధానమంత్రి అయ్యాక, ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేసి సన్న, చిన్నకారు రైతుల మన్ననలు, సామాన్యులకు సైతం బ్యాంకు సేవలు అందుబాటులోకి రావడానికి ఇందిర చూపిన చొరవ ప్రశంసనీయం. ‘గరీభీ హఠావో’ నినాదం ద్వారా పేద ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకు వచ్చారు. ఆర్థిక దోపిడీ, నల్లధనం వెలికితీత, పరిశ్రమలను ప్రోత్సహించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విద్య, వైద్య సదుపాయాల పెంపు కోసం, ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడం కోసం, పేదరిక నిర్మూలన కోసం ఆమె ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక పథకం అత్యంత ప్రజాదరణ పొందింది. రాజభరణాల రద్దు ఇందిరా గాంధీ తీసుకున్న మరో సాహసోపేతమైన నిర్ణయం. అలాగే ఆమె హయాంలో ఫోఖ్రాన్ అణుపరీక్ష ప్రపంచానికి, శతృదేశాలకు భారత్ సత్తా ఏమిటో నిరూపించింది. ‘బంగ్లాదేశ్ ఆవిర్భావం’ ఇందిరాగాంధీ సాధించిన విజయాల్లో అత్యంత ప్రధానమైనది. అగ్రరాజ్యాల జోక్యం లేకుండా 13 రోజుల పాటు సాగిన భారత్- పాక్ యుద్ధంతో 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఆ యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ చూపించిన నాయకత్వ లక్షణాలు, ధైర్య సాహసాలకు మెచ్చి అటల్ బిహారీ వాజ్‌పాయ్ వంటి రాజనీతిజ్ఞుడు సైతం, తన ప్రత్యర్థి ఇందిరను ‘అపర కాళి’గా అభివర్ణించారు. 1975లో దేశ అంతర్గత సంక్షోభం పేరుతో ఇందిరా గాంధీ సుమారు 21 నెలల పాటు ఎమర్జెన్సీ విధించి ఎంతోమందిని జైలులో నిర్భంధించింది. ఫలితంగా 1977లో లోక్‌సభ ఎన్నికల్లో మొరార్జీ దేశాయ్ సారథ్యంలోని జనతా పార్టీ కేంద్రంలో అధికారం హస్తగతం చేసుకుంది. ఆ ప్రభుత్వం స్వల్ఫ కాలంలోనే అధికారం కోల్పోవడంతో, ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ 1980 లో జరిగిన ఎన్నికల్లో విజయదుందుభి మ్రోగించింది. అప్పటి నుండి మరణించేవరకు ఇందిరాగాంధీ ప్రధానిగా అధికారంలో కొనసాగారు.
ఇందిర రాజకీయ జీవితం ఎన్నో మలుపులు, ఎన్నో కుదుపులకు గురవుతూ వచ్చింది. ప్రధానంగా దేశ భద్రతకు సంబంధించిన సమస్యలు తలనొప్పిగా మారాయి. పంజాబ్‌లో ‘బింద్రన్ వాలే’ సారథ్యంలో ఖలిస్థాన్ వేర్పాటు వాద ఉద్యమం చెలరేగింది. పాక్ మద్ధతుతో పంజాబ్‌ను దేశం నుండి విడగొట్టడానికి సాగిన ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమం చిలికి చిలికి గాలి వానలా మారి, దేశ సమగ్రతను ప్రశ్నార్ధకం చేసింది. సిక్కులకు అత్యంత పవిత్రమైన అమృత్ సర్‌లోని స్వర్ణ దేవాలయాన్ని స్థావరంగా చేసుకుని ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్న సమయంలో మార్గాంతరం లేని పరిస్థితుల్లో ఇందిరాగాంధీ ‘ఆపరేషన్ బ్లూస్టార్’ పేరుతో స్వర్ణ దేవాలయంలో తిష్టవేసిన ఉగ్రవాదుల ఏరివేతకు మిలటరీ చర్య తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం ఆమె ప్రాణాలనే హరించింది. శత్రుదుర్భేద్యమైన భద్రతా వ్యవస్థ తన చుట్టూ ఉన్నా, కనురెప్పలే కంటిని కాటేసినట్టుగా తన రక్షణ చూడవలసిన అంగరక్షకులే భక్షకులుగా మారి, విశ్వాస ఘాతకులైనారు. 1984 అక్టోబర్ 31వ తేదీన తన అంగరక్షకుల తుపాకీ గుళ్ళకు ఇందిరాగాంధీ నేలకొరిగారు.
అందరి లక్ష్యం ఒక్కటే కావాలి!
ఒక మహిళగా, గృహిణిగా, రాజకీయ నాయకురాలిగా, కేంద్ర మంత్రిగా, దేశ ప్రధానిగా, అత్యంత సాహసవంతమైన పాత్ర పోషించిన ఇందిరా గాంధీ స్థానాన్ని ఈనాటికీ ఎవరూ భర్తీ చేయలేకపోయారన్న మాట వాస్తవం. తన వాగ్ధాటితో వైరి పక్షాలను తూర్పారబడుతూ, రాజకీయ పక్షాల వ్యూహాలను చిత్తు చేస్తూ, ఉక్కు సంకల్పంతో దేశం కోసం అహరహం శ్రమించిన ఒక రాజకీయ శిఖరం నేలకొరిగింది. కోట్లాది మంది ఆశాజ్యోతి అచేతనమై భువిని విడిచి నింగికెగసింది. దేశం కోసం నినదించిన గొంతు మూగబోయి ‘శక్తి స్థల్’ రూపంలో ఒక స్మారకంగా మిగిలింది. దేశ సార్వభౌమత్వ పరిరక్షణ కోసం, సమగ్రత కోసం అసువులు బాసిన వీరనారి ఇందిర చరిత్ర చిరస్థాయిగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖింపబడి, భావి తరాలకు బాసటగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలో ఎన్నో రాజకీయ పక్షాలుండవచ్చు. వారిలో ఎన్నో సైద్ధాంతిక విభేదాలు ఉండి ఉండవచ్చు. అందరి లక్ష్యం ఒక్కటే కావాలి. అందరి గమ్యం ఒక్కటే కావాలి. దేశ సమైక్యత, సమగ్రత కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలి. దేశం కోసం అసువులు బాసిన త్యాగధనులను స్మరించుకుంటూ కుల, మత, రాజకీయాలకు అతీతమైన భావజాలంతో దేశ ఐక్యతకు పాటుబడాలనే ఉద్దేశ్యంతో, భారతరత్న ఇందిరా గాంధీ వర్ధంతికి నివాళిగా జరుగుతున్న ‘జాతీయ సంకల్ప దినం’ ప్రజల్లో దేశ భక్తిభావాన్ని పెంపొందించాలి.
(నేడు ఇందిరా గాంధీ వర్ధంతి, జాతీయ సంకల్ప దినం)
- సుంకవల్లి సత్తిరాజు
సామాజిక విశ్లేషకులు
97049 03463