తెలంగాణ సాహిత్య గట్టి కోట

by Ravi |   ( Updated:2023-11-01 00:01:04.0  )
తెలంగాణ సాహిత్య గట్టి కోట
X

'స్వసుఖం కోరని వాడు, వారం వారం మారని వాడు, రంగులు అద్దుకోలేనివాడు, అబద్ధాసురుని పాలిట తల్వార్ అల్వార్' అని దాశరధి చేత కీర్తించబడిన వాడు, 'వాడు చరిత్రకారుడు కాదు వాడే ఒక చరిత్ర' అంటూ కాళోజిచే ప్రశంసలందుకున్న తెలంగాణ వైతాళికుడు, తెలంగాణ సాహితీ సరస్వతి కన్న మరో అక్షరం వట్టికోట ఆళ్వారుస్వామి. తెలంగాణ ప్రజల జీవితాన్ని, పోరాట తత్వాన్ని, సంస్కృతిని నరనరాన జీర్ణించుకుని గ్రంథ పఠనం ద్వారా లోకజ్ఞానం కలుగుతుందని సమాజాన్ని అర్థం చేసుకొని ప్రజలను చైతన్య పరచవచ్చని ఊరూరా గ్రంథాలయ ఉద్యమాన్ని నిర్వహించి ప్రజా చైతన్యానికి బాటలు వేసిన ప్రముఖ సాహిత్య దిగ్గజం వట్టి కోట.

నిబద్ధతను నిండుగా అవపోసన పట్టుకుని నైతిక విలువలను చెప్పి, చెప్పింది రాసి, రాసింది చేసి ఆచరించి చూపిన మహా వ్యక్తి. ఒక చేతిలో గన్ను ఇంకొక చేతిలో పెన్నుతో తెలంగాణ జాగృతి కోసం తెలంగాణ మట్టిగడ్డపై పోరు విత్తనాలు జల్లి ఉద్యమ సుమాలను పూయించిన సాహిత్య ఉద్యమ రైతు వట్టి కోట. తనకలాన్ని మర ఫిరంగుగా, అక్షరాలను ఇనుప గుళ్ళుగా మార్చి నిరంకుశ బూర్జువా గట్టి గోడలను కూల్చిన ఘనుడు. వెట్టిచాకిరిని నిర్మూలించడం కోసం వెట్టి కోటలను కాల్చిన కాగడా ఆయన. నవ తెలంగాణ నిర్మాణానికి సాంస్కృతిక పునాదులు వేసిన కవి, కార్మిక వైతాళికుడు వట్టికోట.

గ్రంథాలయాన్నే గురువుగా మార్చుకుని..

వలసవాదం, భూస్వామ్యం కింద నలుగుతున్న తెలంగాణను విముక్తి చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించిన వట్టికోట ఆళ్వారుస్వామి, 1915 నవంబర్ 1న నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం చెరువు మాదారం గ్రామంలో ఓ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి చిన్నతనంలోనే చనిపోవడంతో పొట్టకూటి కోసం అనేక పనులు చేశాడు. అదే క్రమంలో కాంచనపల్లి సీతారామారావు అనే ఉపాధ్యాయుని వద్ద వండి పెడుతూ విద్యాభ్యాసం, సారస్వతాభ్యాసం పూర్తి చేశాడు. తదుపరి సూర్యాపేట గ్రంథాలయంలోని నాలుగు గోడల మధ్య విద్యాభ్యాసం లోకజ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఆ గ్రంథాలయాన్ని గురువుగా మార్చుకొని సాహిత్య ఊపిరి పోసుకున్నారు. ఇంగ్లిష్, ఉర్దూ భాషలు కూడా నేర్చుకొని తనకు తానుగా ప్రపంచాన్ని పరిచయం చేసుకున్న గ్రహణశీలి. ఆ తర్వాత విజయవాడలో వెల్‌కమ్ హోటల్లో సర్వర్‌గా పని చేస్తూ సాహిత్యకారులతో సంబంధాన్ని అనుబంధాన్ని కొనసాగించారు అక్కడే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు.

1936 -37లో గోల్కొండ పత్రిక ప్రూఫ్ రీడర్‌గా, తరువాత మీర్జాన్ పత్రికకు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాడు. ఇదే సమయంలో ఆంధ్ర మహాసభ సమావేశాలకు హాజరయ్యేవాడు. ఆంధ్ర మహాసభ నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా, కమ్యూనిస్టు పార్టీ నాయకునిగా, స్టేట్ కాంగ్రెస్, ఆర్య సమాజం, అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘం వంటి సామాజిక రాజకీయ సాహిత్య సంస్థలన్నింటికీ కార్యకర్తగా నాయకుడిగా పని చేశారు. గ్రంథాలయ ఉద్యమ ప్రేరణ నుండి బయలుదేరి నిజాం వ్యతిరేక ఉద్యమం దాకా నడిచిన ప్రజా చైతన్య శీలి వట్టికోట. అతని చర్యలు నిజాంకు కోపం తెప్పించడంతో వట్టి కోట జైలు పాలయ్యాడు.

సామాజిక స్పృహ ఉన్న రచయిత

నిజామాబాద్ జైలులో దాశరథి తో పరిచయం వారి ఇరువురికి విడదీయరాన్ని బంధాన్ని ఏర్పరిచింది వారి మధ్య ఎప్పుడూ సాహిత్య చర్చలు జరిగేవి. దాశరధి పద్యాలను వట్టి కోట బొగ్గుతో గోడలపై రాసి దెబ్బలు తిన్నాడు. నిజాంపై రాసిన పద్యాలను కంఠస్థం చేసిన సాహిత్య అభిలాషి. విజ్ఞానానికి విలువ కట్టని సమాజం వృద్ధి చెందదు, వికసించదు అని బలంగా నమ్మి హైదరాబాదులో దేశోద్ధారక గ్రంథమాలను స్థాపించారు. సురవరం రాసిన హైందవ ధర్మాలు ప్రాథమిక సత్యాలు, ప్రజాకవి కాళోజీ రచించిన నా గొడవ మొట్టమొదటగా దేశోద్ధారక నుండే ప్రచురింపజేశారు. తెలంగాణ ప్రముఖ రచయితలు రచించిన 35 పుస్తకాలు ఈ దేశోద్ధారక గ్రంథమాల నుంచి ప్రచురించబడ్డాయి. ఊరూరా తిరుగుతూ కవితలు రచనలు సేకరిస్తూ గ్రంథాలను పంచుతూ ప్రజా చైతన్యానికి బాటలు వేసిన సాహిత్య బాటసారి వట్టి కోట.

కడివెండిలో పోలీసుల కాల్పులలో దొడ్డి కొమురయ్య మరణించడంపై ఆవేదన చెంది ఆ కాల్పులపై పద్మజా నాయుడుతో కలిసి నిజనిర్ధారణ నిర్వహించిన మొదటి పౌరహక్కుల నాయకుడు వట్టికోట. నాటి తెలంగాణ సామాజిక స్థితిగతులను తెలియపరుస్తూ రాసిన తెలంగాణ మొట్టమొదటి నవల 'ప్రజల మనిషి'. జైల్లో ఖైదీల స్థితిగతులను సమూలంగా తెలియపరుస్తూ 'జైలు లోపల' అనే నవలలు రాశాడు 1951లో గుమస్తా పత్రికను స్థాపించారు. గుమస్తా సంఘం నాయకునిగా గుమస్తాల సమస్యలపై పోరాటాలు చేసి కొన్ని హక్కులు సాధించటంలో సఫలీకృతుడైనాడు. ధర్మరాజు అనే కలం పేరుతో ఎన్నో కథలు కథానికలు రాశాడు. తెలంగాణ రాజకీయ సామాజిక స్థితిగతులను తెలియపరుస్తూ రాసిన అసంపూర్తి నవల గంగు. సామాన్యుడి జీవితాన్ని సాహితీ పీఠం ఎక్కించిన సాహితీ ద్రష్ట. దళితుల దుర్భర స్థితిని అద్దం పట్టే కాపీర్లు కథ రాశాడు. సాయుధ పోరాట విరమణ వ్యతిరేకిస్తూ రాజకీయ బాధితుడు కథలో కమ్యూనిస్టు విధానాన్ని తప్పుపట్టిన దీశాలి. ఎవరి తిండి వారు తినొచ్చు అంటూ తెలుగు సాహిత్యంలో ఎద్దు మాంసంపై చర్చ లేవనెత్తిన సామాజిక స్పృహ కలిగిన రచయిత. దొరలు జాగీర్దార్ల ఆగడాలను పూస గుచ్చినట్టు గిర్ధవర్ కథలో వివరించాడు.

నవతెలంగాణ దివిటీ

తన రచనల ద్వారా ప్రసరించిన అభ్యుదయ కిరణాలు నేటి నవ తెలంగాణ నిర్మాణానికి దిశా నిర్దేశం చేయగల దివిటీలని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. తెలంగాణ భాషకు, యాసకు పెద్ద పీట వేసిన సాహిత్య మేరు నగధీరుడు. 1961 ఫిబ్రవరి 5న వట్టి కోట ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. తనతో జైలు జీవితం గడిపిన వట్టికోటకు దాశరధి తన అగ్ని ధార సంకలనాన్ని అంకితం చేశారు. కథకునిగా, వ్యాసకర్తగా, నవలా రచయితగా, విమర్శకుడిగా, కవిగా, ఉపన్యాసకుడిగా, పత్రికా రచయితగా, ప్రచురణ కర్తగా, పరిశోధకుడిగా, గ్రంథాలయ నిర్వహకుడిగా, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన బహుముఖ ప్రజ్ఞాశాలి వట్టికోట. తెలంగాణ ఏర్పడిన తర్వాత వట్టికోట శతజయంతిని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ కేంద్ర గ్రంథాలయానికి వట్టికోట పేరుని నామకరణం చేశారు. అంతేగాక అతని స్వగ్రామంలో, హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై వట్టి కోట విగ్రహాలని ఏర్పాటు చేశారు. హోటల్లో స్వీపర్‌గా జీవితాన్ని ప్రారంభించి, ఉద్యమాన్ని ఊపిరిగా గ్రంథాల సుగంధాలను ఊరూరా వ్యాపింపజేసి ప్రజా చైతన్యాన్ని పెంపొందించి మనిషి జీవితానికి సమాజమే పరమార్థంగా జీవనాన్ని గడిపిన వట్టికోట మనందరికీ స్ఫూర్తిదాయకం.

(నేడు ప్రజల మనిషి వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి)

మలక సురేష్

తెలంగాణ సమాఖ్య

94413 27666

Advertisement

Next Story