తెలుగు నేలపై ఓ ధిక్కార స్వరం!

by Ravi |   ( Updated:2024-08-06 00:46:21.0  )
తెలుగు నేలపై ఓ ధిక్కార స్వరం!
X

గద్దర్, ఇది ప్రజలకు పరిచయం అక్కరలేని పేరు. యావత్ తెలుగు నేలపైన ఆయన పాట ఒక అలజడి, ఒక కదలిక, ఒక ప్రవాహం, ఒక ధిక్కారపు స్వరం, ఒక ఎక్కుపెట్టిన తుపాకి తూట, యుద్ధ చైతన్యపు గీతం, ఇంతకీ గద్దర్ పాటకు ఇంత శక్తి ఎక్కడినుంచి వచ్చింది.. అసలు ఎవరు ఆ గద్దర్?

ఉద్యమాల యుగం కొనసాగుతున్న రోజులలో మెదక్ జిల్లాలోని తూప్రాన్ గడ్డమీద నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అట్టడుగుకు నెట్టివేయబడ్డ కులంలో పుట్టిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. భగత్‌సింగ్ వారసత్వం ఏర్పరచిన గదర్ రాజకీయ పార్టీ స్ఫూర్తితో ఆయన ఆ పేరును పెట్టుకున్నారు. పంజాబీ భాషలో గదర్ అంటే విప్లవం. ఆనాటి నుండి గదర్ అనే పదం ఉచ్ఛారణ దోషం వలన గద్దర్‌గా రూపాంతరం చెంది. అదే ఆయన పేరుగా స్థిరపడింది.

ప్రజల కన్నీళ్లకు చలించి...

చిన్నప్పటి నుండి చురుకైన మేధస్సు, ఆదర్శవంతమైన భావాలున్న గద్దర్‌కు రోజూ వార్త పత్రికలను అనేక సాహిత్య పుస్తకాలను చదవటం అలవాటు. తల్లి దండ్రుల కారణంగా అప్పటికే అంబేద్కర్, ఫూలే దంపతుల ఆలోచనలతో పరిచయం ఉన్న గద్దర్ పత్రికల్లో విప్లవకారుల కథనాలను, వార్తలను చదివి వారి పోరాటాన్ని అర్థం చేసుకుంటూ విప్లవ మార్గాని కి ఆకర్షితులయ్యారు. దొరలు, భూస్వాముల దోపిడికీ, పైసాచిక ఆనందానికి ఆహుతి అవుతున్న అభాగ్య జీవుల ఆర్తనాదాలను విన్న గద్దర్ సమాజంలో మార్పు తీసుకురావాలని దోపిడీ లేని సమాజాన్ని నిర్మించాలని తపనపడేవారు. క్రమంగా 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశారు.

బుర్రకథకు మళ్లీ జీవం పోసి..

నిరక్షరాస్యులైన ప్రజలకు అర్థం చేయించడం కోసం ఆయన బుర్రకథను ఎంచుకొని గ్రామాలలో ప్రదర్శించారు. రైతులు, పారిశుద్ధ్య, రిక్షా కార్మికుల కష్టాలు సామాజిక సమస్యలు ఇలా వివిధ అంశాలపైన వందలాది పాటలు, బుర్రకథలు రాసి పాడుతూ ప్రదర్శనలు ఇస్తూ అవగాహన కల్పించేవారు. మా భూమి సినిమాలో అప్పటి సాయుధ రైతాంగ పోరాటంలోని పరిస్థితులను తెలంగాణ వ్యాప్తంగా రజాకార్ల, దొరల అకృత్యాలకు వ్యతిరేకంగా సాగిన వీరోచిత పోరాటం నాటి తీరును కథాంశంగా బి.నరసింగరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో గద్దర్‌ యాదగిరి పాత్రను వేసి నిజాంకు వ్యతిరేకంగా యాదగిరి పాడిన పాటను... బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లె వస్తవు కొడుకో నైజాం సర్కారోడా అంటూ స్వయంగా పాడి ఆడారు. 1980 నుంచి ప్రజా జీవితంలో అనేక కళారూపాలలో ప్రజాచైతన్యం కోసం ఆడి పాడాడు. ప్రజా జీవితంలో తలెత్తే అనేక సమస్యలపై వందలాది పాటలు రాశారు.

తెలంగాణ పాలకుల తీరునూ వదల్లే...!

మలిదశ తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాత్ర అక్షరాలకు అందనిది. తెలంగాణ ప్రతి పల్లెలోను తన పాటలతో కదిలించాడు. తన మాట, ఆట, పాటలతో యావత్ తెలంగాణను హోరెత్తించారు. ఉద్యమ తొలినాళ్లలో ఆయన పాట అమ్మా తెలంగాణమా ఆకలికేకల గానమా అంటూ మొదలెట్టిన ఈ పాట ఎంతో ప్రజాదరణ పొందింది. ఆ తరువాత ఎన్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ సినిమాలో ... పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ రాసి గద్దర్ స్వయంగా నటిస్తూ ఆడి పాడిన పాట. ఇది తెలంగాణలోని అన్ని తరాల ప్రజలను ఆకట్టుకోవడమే కాకా మలిదశ ఉద్యమానికి ఒక మార్చి ఫాస్ట్ గీతంగా ప్రజలను తట్టి లేపింది. ఉద్యమ సమయంలో ఏడు పదుల వయసు గల గద్దర్ గోసి కాటి గొంగడి బుజాన వేసుకొని ఊరు ఊరు తిరిగి వందలాది పోరు పాటలు పాడి ఆడాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కళ్లారా చూడగలిగాడు. తరువాత పాలకుల పనితీరును అనేక విధాలుగా ప్రశ్నించాడు.

'భూగోళమున అగ్గిపెట్టెదను' తీరులో

గద్దర్ మరణానికి ముందు ఇండియా ఫైల్స్ సినిమాలో ‘బానిసలారా లెండిరా ఈ బాంఛన్ బతుకులు వద్దురా’ అంటూ గద్దర్ స్వయంగా రాసి నటిస్తూ ఆడి పాడిన పాట జనాలను ఎంతో ప్రేరేపించింది. గుండె పోటు కారణంగా చికిత్స పొందుతూ 2023 ఆగస్టు 6న గద్దర్ తుది శ్వాస విడిచారు. గద్దర్ ఒక సాహితీ శిఖరం. ‘నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళమున అగ్గిపెట్టెదను’ అని దాశరథి ‘అగ్నిధార’లో అన్నట్లుగా గద్దర్ తెలుగు సాహిత్య చరిత్ర ఉన్నంత కాలం అమరుడు. ఆయన ఒక యుగ కర్త. నేటి సాహితీ విద్యార్థులకు ఆయన సాంస్కృతిక విశ్వవిద్యాలయం. గద్దర్ లాంటి గొప్ప కవి, గాయకుడిని ఈ నేల మరువదు.

(నేడు గద్దర్ తొలి వర్ధంతి)

- ఎనుపోతుల వెంకటేష్

డా. బి. ఆర్. అంబేద్కర్ కాలేజ్, తెలుగు శాఖ.

95733 18401

Advertisement

Next Story

Most Viewed