- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిలువెత్తు రూపం... నినదించిన గళం...
దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నిటినీ, కమ్యూనిస్టులతో సహా కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మలిచి నేషనల్ ఫ్రంట్ అనే సంకీర్ణాన్ని ఏర్పాటు చేయటంలో ఎన్టీఆర్ విజయం సాధించారు. ఒక ప్రాంతీయ పార్టీని దేశ రాజకీయాలకు దిక్సూచిగా మార్చారు. "70 సంవత్సరాల పాలనారంగంలో ఎన్టీఆర్‌దే స్వర్ణయుగం. పరిపాలనా సంస్కరణలు, అధికారుల నియామకంలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట, అవినీతికి చండశాసనుడయ్యారు. ఏడు దశాబ్దాల చరిత్రలో సామాజిక న్యాయానికి ఆయన ఆద్యుడయ్యారు. జేబులో రూపాయి లేని నాయకులతో కురుమ, ముదిరాజు, గౌడ తదితర కులాలు, అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కులాల వారికి కేవలం విద్య అనే అర్హత ద్వారా టిక్కెట్టిచ్చి మరీ చరిత్ర సృష్టించారు. విద్య వైద్య రంగాల్లో ప్రైవేటీకరణను వ్యతిరేకించారాయన. సంక్షేమంలో స్వర్ణ లిఖితం ఎన్టీఆర్ కాలం".
వారి హృదయాల్లో సుస్థిరంగా నిలిచి
ఎన్టీఆర్ తెలుగు జాతి మొత్తానికి ఆత్మబంధువు. తెలుగుదనం ఉట్టిపడే ఆయన నిండైన విగ్రహం చూస్తుంటే ఆరాధనాభావం తొణికిసలాడుతుంది. సినీ రాజకీయ, నిజ జీవితాలపై విశ్లేషణాత్మక దృక్పథం ఆయన సొంతం. ఎన్.టి. ఆర్.... ఈ మూడు అక్షరాలు చెబితే తెలుగు వారి హృదయాలు ఉప్పొంగుతాయి. ఏ ప్రాంతంలో, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా ఎన్టీఆర్ "మావాడు అంటూ సగర్వంగా చెప్పుకుంటారు. ఇందుకు కారణం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన జీవితం సాగింది. తెలుగు సినిమాలలో ఆయన వేసిన పాత్రల ప్రభావం ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసింది. సినిమాల్లో ఉన్నా, రాజకీయాల్లో ఉన్నా విలువల విషయంగా ఆయన ఏనాడు రాజీపడలేదు. మాటకు కట్టుబడి ఉండేవారు. తన పాలనలో పేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందించడం ద్వారా అందరికీ దగ్గరయ్యారు. సినిమాల్లో ఆయన పోషించిన పాత్రలు సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు చేయడం, పేదలకు అండగా నిలబడటం ఇత్యాది పేదల హృదయాల్లో సుస్థిరంగా నిలవడానికి దోహదమయ్యాయి.
ఆంధ్రప్రదేశలోని కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1928 మే 28న నందమూరి తారక రామారావు జన్మించారు. 1996 జనవరి 18న ఎన్టీఆర్ మరణించినా ఆయన జ్ఞాపకాలు మరువలేనివి. 2022 మే 28 న ఆ మహానటుడి శత జయంతిని తెలుగు జాతి యావత్తూ గుర్తుకు తెచ్చుకోవడం ప్రశంసనీయ సందర్భం. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆయన సేవలను, పాలనను గుర్తెరిగి జిల్లాల పునర్విభజనలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అని నామకరణం చేయడమూ పేర్కొనదగినదే.
వారికి రుణపడి ఉన్నానంటూ
రామారావు... విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో యుక్త వయస్సులో జీవనం కోసం అనేక పనులు చేసినా ఎక్కడా నిబద్ధతను, నిజాయితీని వీడలేదు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తర్వాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని నడిపినప్పుడు కూడా హుందా వ్యక్తిత్వాన్ని వీడలేదు. 1947లో పట్టభద్రుడయ్యారు. తదుపరి మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసిన 1100 మందిలో ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలవడంలో ఆయన పట్టుదల స్పష్టమౌతుంది. నటనపై మక్కువ, అఖిరుచితో సినిమాలలో చేరాలనే బలమైన ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో 3 వారాల కంటే ఎక్కువ ఉండలేకపోయారు.
సినీ రంగంలో నటసార్వభౌమునిగా ఎదిగారు. నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో పుట్టిన తనను తెలుగు ప్రజలు ఎంతగానో ఆదరించినందుకు వారికి ఎంతో రుణపడి ఉన్నానన్న భావనతో తన షష్టిపూర్తి నాటినుంచి ప్రతి నెలలో 15 రోజులు తెలుగు ప్రజల సేవ కోసం కేటాయించాలన్న సేవా గుణం చివరకు ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణానికి తొలి సంకేతమయింది. తెలుగు ప్రజల
ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించింది. అప్పుడే ఆయన రాష్ట్రానికి పరిమితం కాకుండా జాతీయ రాజకీయాల్లో సైతం ప్రముఖ పాత్ర పోషించారు. రాష్ట్రాలపై కేంద్రం చేస్తున్న పెత్తనం, అణచివేతలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేషనల్ ప్రంట్‌ను ఏర్పాటు చేసి దానికి ఛైర్మన్‌గా వ్యవహరించి 1989లో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారారు.
గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దుర్వినియోగం చేయడంపై ఆయన గొప్ప పోరాటాన్నే సాగించారు. రాష్ట్రంలో గవర్నర్ ద్వారా అక్రమంగా తెలుగు దేశం ప్రభుత్వాన్ని దించివేయడంతో ఎన్టీఆర్ కేంద్రంపై రగిలిపోయారు. కేంద్రంపై మొదలు పెట్టిన పోరాటమే ఆయన జాతీయ రాజకీయాల్లోకి అడుగిడటానికి కారణమైంది. రాజకీయ రంగం అంటే అనేక సమస్యలు, ఒడిదుడుకులు, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు పై ఎత్తులతో నిండినటువంటివి... దానిలోకి వెళ్లి ఎందుకు సమస్యలు కొని తెచ్చుకుంటావని, ప్రశాంత జీవనం గడపొచ్చు కదా అని అక్కినేని నాగేశ్వరరావు లాంటి సహచరులు హెచ్చరించినా, మొత్తుకున్నా ఎన్టీఆర్ లెక్క చేయలేదు. ఎన్ని సమస్యలొచ్చినా, కష్టాలు ఎదురైనా ఎదుర్కొని నిలబడగలననే అచంచల విశ్వాసంతో ఆయన రాజకీయ రంగంలో అడుగు పెట్టారు.
రైతు సంక్షేమం కోసం
ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వం నుంచి అందే అనేక సౌకర్యాలను కాదన్నారు. నిరాడంబరంగా జీవించారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకున్నారు. సొంత ఇంట్లోనే నివసించారు. అంబాసిడర్ కారునే వాడేవారు. జిల్లాల ప్రయాణానికి వెళితే అతి సాధారణంగా గడిపేవారు. అభిమానులు తెచ్చిపెట్టిన భోజనాన్నే ఆరగించేవారు. సహపంక్తి భోజనం అంటే ఇష్టపడేవారు. మహిళల పట్ల ఎనలేని ప్రేమ, వాత్సల్యాన్ని చూపేవారు. మహిళలకు సమాన హక్కులు కావాలని నినదించిన వ్యక్తి కూడా ఎన్టీఆరే. అధికారంలో ఉన్నప్పుడు... మహిళలకు ఆస్తిలో సమాన వాటా ఉండాలంటూ చట్టం తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుంది.
రైతు కుటుంబంలో జన్మించిన ఆయన తన సినిమాల్లో సైతం రైతు పాత్రల్లో నటించి జీవించారు. ఈ స్ఫూర్తిలోనే ముఖ్యమంత్రి అయ్యాక రైతుల సంక్షేమం కోసం పాటు పడ్డారు. సింగిల్ విండో విధానానికి శ్రీకారం చుట్టారు. వ్యవసాయ బావులకు మీటర్ల విధానానికి స్వస్తిపలికి హార్స్ పవర్ రూ. 50కే రైతులకు విద్యుత్ అందించారు. రైతులకు ఉచితంగా పట్టాదారు పాస్ పుస్తకాలను అందించి భూ సమస్యల పరిష్కారానికి నాంది పలికారు. అన్నం పెట్టే రైతన్న దగ్గర పన్ను వసూలు చేయటం ఏమిటని భావించి వ్యవసాయ భూములకు శిస్తు వసూలు చేయటాన్ని ఆయన నిలిపివేశారు. సహకార బ్యాంకులను బలోపేతం చేశారు.
పూర్వం రోజుల్లో తిరుపతి వెంకన్న దర్శనం తర్వాత నేరుగా మద్రాసు వెళ్లి తెల్లవారుజామునే అన్న ఎన్టీఆర్ దర్శనం చేసుకొన్న తర్వాత భక్తులు సొంత గ్రామాలకు వెళ్లేవారు. మద్రాసులోని ఎన్టీఆర్ ఇంటి ముందు నిత్యం టూరిస్టు బస్సులు బారులు తీరేవి. ఉదయం ఐదున్నర, ఎనిమిది గంటల మధ్య యాత్రికుల సమూహం కనిపించేది. ఎన్టీఆర్ వారికి కనిపించి అప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేసేవారు. ప్రపంచంలో ఎంతోమంది నటులు, నాయకులు ఉన్నారు కానీ జనం దేవుడిలా కొలిచిన ఏకైక నటుడు, నాయకుడు, శ్రీ కృష్ణుడు నందమూరి తారక రామారావే !!
(నేడు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా)
చెన్నుపాటి రామారావు
99590 214838
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672
Also Read....