తెలంగాణను స్వప్నించిన ముద్దుబిడ్డ

by Ravi |   ( Updated:2024-08-06 00:46:21.0  )
తెలంగాణను స్వప్నించిన ముద్దుబిడ్డ
X

అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా' (ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్లారా చూడాలి, తర్వాత మరణించాలి) తెలంగాణ రాక తప్పదు ఎందుకంటే, ఇది కేవలం పార్టీలకు వ్యక్తులకు పరిమితమై లేదు. ఇది సిసలైన ప్రజా ఉద్యమం. తెలంగాణను తప్పకుండా జూస్త. నాకైతే ఏం సందేహం లేదు. ఆ తర్వాత తెలంగాణ పునర్నిర్మాణం అనేది మేజర్ ఎజెండా... అంటూ రాబోయే తెలంగాణను స్వప్నించి, పునర్నిర్మాణాన్ని ఆకాంక్షించిన తెలంగాణ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ జయశంకర్.

జయశంకర్ సార్ హనుమకొండ జిల్లాలో 1934 ఆగస్టు 6న జన్మించారు. హన్మకొండ మర్కజీ పాఠశాలలో, వరంగల్‌లోని మిడిల్ స్కూల్లో ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ నుండి బీఏ, బీఈడీ పూర్తిచేశా‌రు. బెనారస్ అలీఘడ్ యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్‌లో పీజీ చేశారు. అదే ఎకనామిక్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పీహెచ్‌డీ చేశారు. విద్యార్థి దశ నుండే ఉద్యమాలలో చురుకుగా పాల్గొనేవారు. నాన్ ముల్కీ ఉద్యమం, విలీన ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమం మొదలైన పోరాటాలలో ఆయన పాత్ర మరువలేనిది.

ఉద్యోగుల సమస్యల నుంచి...

ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఆయన ఆనాడు ఉపాధ్యాయుల సమస్యలైన సర్వీస్ రక్షణ, పే స్కేలు మొదలైన అంశాలపై పోరాడుతున్న రాష్ట్రోపాధ్యాయ సంఘం(ఎస్టీయూ)లో చేరి ఆనాటి సంఘ అధ్యక్షులైన వి.పి రాఘవాచారి స్ఫూర్తితో ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఊరూరా తిరిగి ఉపాధ్యాయులందరినీ ఏకం చేసి రాష్ట్రోపాధ్యాయ సంఘం బలోపేతానికి కృషి చేశారు. వరంగల్ జిల్లాలో హనుమకొండ పంచాయతీ సమితి ఎస్టీయూ విభాగానికి అధ్యక్షునిగా నాయకత్వం సైతం వహించారు. తర్వాత పదోన్నతిపై కళాశాల లెక్చరర్‌గా చేరారు. గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా, సెక్రెటరీగా ఉన్నారు. అంతేకాదు ఆల్ ఇండియా యూనివర్సిటీ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కూడా పనిచేశారు.

తెలంగాణ సాధనకే అంకితమై

ఆయన ఒకపక్క ఉద్యోగపరమైన సమస్యలపై పోరాడుతూనే ప్రత్యేక తెలంగాణోద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ సాధనే నాకు 24 గంటలు పని అంటుండేవారు. తెలంగాణ దేనికొరకు ఎవరి కొరకు అంటూ పలు రంగాలలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని విశ్లేషణాత్మకంగా గణాంకాలతో సహా వివరించి ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను ప్రజలందరికీ తెలియజేశాడు. ఆ భావజాల వ్యాప్తికి నిరంతరం శ్రమించారు. ప్రజలను జాగరూకులను చేశారు. రాజకీయ పోరాటం అవసరాన్ని గుర్తించి పార్టీలను ఏకం చేశారు. ఆ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి దగ్గరయ్యారు. పదవులను కోరుకోకుండా తెలంగాణను మాత్రమే జపించిన అసలు సిసలు తెలంగాణ వాది జయశంకర్ సార్.

చెట్లు కాదు.. అమరుల స్మృతులు....

‘అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తాయి. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తూ కనిపిస్తారు... వారు గుర్తుకొస్తే దుఃఖమొస్తది’ అనేవారు. ‘అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు. అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని... వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయ నాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా?' తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష గురించి మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుండి శాసక దశకు తెలంగాణ రావాలి!’ అని జయశంకర్ ప్రస్తావించారు.

ప్రజల మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయి..

రాష్ట్ర ప్రభుత్వం వీరి జయంతిని రాష్ట్ర పండుగగా జరపడం, వీరి పేరు విశ్వవిద్యాలయాలకు పెట్టడం, వీరి పేరుతో భూపాలపల్లి జిల్లాను ఏర్పాటు చేయడం. వీరి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాలలో ప్రచురించడం ముదావహం. ప్రాణాంతకమైన కేన్సర్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పని పోరాటం చేస్తూనే ఉన్నారు. చివరికి తెలంగాణ ఇవ్వక తప్పని పరిస్థితి తీసుకువచ్చారు. ఎన్నో ఉన్నత స్థానాలను పొందిన ఆయన ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని పొందారు. తెలంగాణను తప్పకుండా జూస్త అన్న ఆయన క్యాన్సర్ వ్యాధి కారణంగా 2011 జూన్ 21న కన్నుమూశారు. జయశంకర్ ఆకాంక్ష నెరవేరింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ సిద్ధాంతకర్త, స్వాప్నికుడైన జయశంకర్ సార్ తెలంగాణ జాతిపితగా తెలంగాణ ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోయారు.

(నేడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి )

- సుధాకర్.ఏ.వి

రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed