- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చరిత్ర మరువని మహానేత
మన దేశానికి రష్యాతో ఉన్న బంధం కేవలం దేశాల మధ్య మాత్రమే కాదు. నాయకులు, రచయితలు, విధానాలు, ప్రణాళికలు అంటూ అనేక విధాలుగా ఒక స్నేహ బంధాన్ని, ఆత్మీయతా బంధాన్ని ఏర్పరిచాయి. సోవియట్ రష్యా నాయకులైన లెనిన్, స్టాలిన్ పేర్లు మనకు ఎవరో విదేశీ నాయకులవిగా అనిపించవు. వాళ్లు మనకు బాగా తెలిసిన వాళ్లే అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి. స్టాలిన్‌ని అభిమానించడానికో, వ్యతిరేకించడానికో ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చు కానీ ఆనాటి భౌతిక స్థితిగతుల నేపథ్యంలో చూసినప్పుడు చరిత్రలో స్టాలిన్ పాత్రను, తనే ఒక చరిత్రగా ఎదిగిన స్టాలిన్ ‘యుద్ధం ఎంత భయంకరమైనది? మన ప్రజల ప్రాణాలెన్ని బలిగొన్నది, తమ ఆప్తుల్ని కోల్పోని కుటుంబాలు బహుకొద్ది మాత్రమే’అని రెడ్ ఆర్మీ సుప్రీం కమాండర్ ఝకోవ్‌తో విచారంగా చెప్పిన మాటలను విస్మరించలేము.
1922 నుంచి 3 దశాబ్దాల పాటు సోవియట్ యూనియన్‌కి నాయకత్వం వహించిన స్టాలిన్ అసలు పేరు జుగాష్ విలి. తండ్రి చెప్పులు కుట్టుకునే వాడు. అతిసామాన్య కుటుంబం నుంచి సోవియట్ యూనియన్‌కు అధినేతగా ఎదిగి భూ ప్రపంచంలో దాదాపు సగ భాగాన్ని శాసించిన స్టాలిన్‌పై వచ్చిన విమర్శలు, నిందలు అనేకం. అవి కృశ్చేవ్ లాంటి నాయకులు చేసిన ఆరోపణలా లేక సామ్రాజ్యవాద అమెరికా పనిగట్టుకు చేసిన ప్రచారమా అనే విషయాలపై చర్చలు చేయడం కంటే స్టాలిన్ పాలనా కాలంలో సోవియట్ యూనియన్‌లో జరిపిన సంస్కరణలు, సామ్యవాదం వైపు వేసిన అడుగులు అంతలోనే ముంచుకొచ్చిన రెండవ ప్రపంచ యుద్ధం అందులో రెడ్ ఆర్మీ విజయం వీటన్నింటిలో స్టాలిన్ కృషి గురించి తెలుసుకోవడం ముఖ్యం.
చరిత్రకెక్కిన పంచవర్ష ప్రణాళిక
“తాత్వికులు ప్రపంచానికి వ్యాఖ్యానం మాత్రమే చెబుతారు కానీ ప్రపంచాన్ని మార్చడం మన వంతు” అన్న కార్ల్ మార్క్స్ మాటలు స్టాలిన్‌పై చిన్నతనంలోనే ప్రభావం కలిగించాయి. సోషలిస్టు ఉత్పత్తి విధానాన్ని నిర్మించాలంటే అభివృద్ధి చెందిన అనేక దేశాల కార్మికుల ప్రయత్నం అవసరమని, ఒక్క దేశపు కృషి అందునా రైతాంగ దేశమైన రష్యా కృషి చాలదని తొలుత భావించినా స్టాలిన్ 1924 ఆగస్టులో బయట సహాయం లేకుండానే రష్యాలో సోషలిజాన్ని నిర్మించగలమని ప్రకటించారు. అంతకు కొన్నాళ్ల ముందు వరకు పాలక బోల్షెవిక్ పార్టీ సోషలిజాన్ని ప్రబోధించినదే కానీ దేశాన్ని సోషలిజం వైపు నడిపించే నిర్దిష్ట ప్రణాళికలు చేయలేదు. సారవంతమైన వోల్గా నదీ తీరంలో చింపిరి దుస్తులతో చలిలో బయటకు పోలేక, చలికాలంలో చలిమంట కాగుతూ పొయ్యి దగ్గర కూర్చుని, వేసుకోవడానికి చెప్పులు కూడా లేక పాఠశాలలకు వెళ్లలేకపోయిన రైతు బిడ్డలెందరో ఉండేవారు అలాంటి స్థితిలో 1928లో పంచవర్ష ప్రణాళికలు చేసుకున్నారు. అది 9 నెలల ముందుగానే లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. దాంతో కార్మికులు రెట్టింపు అయ్యారు, ఉత్పత్తి రెట్టింపు అయింది, ఇది వరకు లేని ఇనుము, ఉక్కు పరిశ్రమలు ఏర్పరుచుకున్నారు. వైమానిక పరి శ్రమ, వ్యవసాయ యంత్రాలు, రసాయన పరిశ్రమలు అన్నింటిలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించింది. అప్పటి సోవియట్ రష్యా ప్రగతి ముందు యూరప్ వృద్ధి రేటు చిన్నబోయింది. పరిశ్రమలు నిర్మించడం, ఆర్థిక విధానాలన్నీ సాంకేతికంగా పునర్నిర్మించడం వంటి లక్ష్యాలను పెట్టుకుని వాటిని సులువుగా చేరుకుని 1935 నాటికి తృప్తికరమైన ఆర్థిక పరిస్థితికి చేరింది.
రైతుకు పట్టం కట్టి..
వర్షాలు పడేందుకు భజనలు చేయడం, వర్ణం, వారం ప్రకారం విత్తనాలు జల్లడం, ట్రాక్టర్లను దయ్యాలుగా భావించి వాటిపై దాడి చేయడం లాంటి ఆలోచనలతో ఉన్న రష్యా రైతులు కేవలం ఏడేళ్లలో అద్భుతమైన పురోగతి సాధించారు. 1936 డిసెంబర్‌లో మాస్కోలోని క్రెమ్లిన్ భవనంలో 2016 మంది ప్రతినిధులతో కూడిన రాజ్యాంగ సభ జరిగింది. విచ్చేసిన వారు పరిశ్రమల్లో, వ్యవసాయంలో కొత్తగా ఆధిపత్యం సాధించిన నూతన ప్రజలకు ప్రతినిధులు.. రైతు అంటే ధాన్యం పండించేవారుగా కాదు. వ్యవసాయ నిపుణులుగా, ట్రాక్టర్ నడిపే వారిగా అలాగే పెద్ద పరిశ్రమల డైరెక్టర్లు, ప్రసిద్ధ కళాకారులు, శస్త్రచికిత్స నిపుణులు, శాస్త్రజ్ఞులు. రెండవ పంచవర్ష ప్రణాళిక పూర్తయేసరికి సోవియట్ యూనియన్‌లో తయారైన నూతన ప్రతినిధి వర్గం ఇది. ఈ అద్భుతమైన పురోగతికి కారణం ఉక్కు మనిషిగా పేరొందిన స్టాలిన్ ఉక్కు సంకల్పం. అయితే 'చక్రవర్తుల ఏలుబడిలో వంద సంవత్సరాలు వెనుకబడి ఉండటం చేత మన దేశ ఉనికే ప్రమాదంలో పడింది. అటువంటి దేశాన్ని ముందుకు నెట్టడానికి ముల్లు కర్రతో పొడవకపోతే ఆధునిక ఆయుధాలు ధరించి ఉన్న పెట్టుబడి దారీ దేశాల మధ్య నిరాయుధులమై అసహాయులుగా మిగిలిపోతాం' అన్న స్టాలిన్ వ్యాఖ్యలని బట్టి లక్ష్యాల సాధనలో ప్రజలెంత కఠినమైన పరిస్థితులు అనుభవించారో అర్థం చేసుకోవచ్చు.
భీకర యుద్ధంలోనూ మాస్కో వదలక..
సోవియట్ రష్యా అంతర్గత అభివృద్ధిపై దృష్టి పెట్టి లక్ష్య సాధనలో విజయాలు అందుకుంటున్న స్టాలిన్, 1939లో హిట్లర్ పోలాండ్ ఆక్రమణ, ఫిన్లాండ్ సోవియట్ రష్యాపై దాడికి ఉపక్రమించడం లాంటి సవాళ్ళను ఎదుర్కోవలసి వచ్చింది. ఆర్థిక స్థిరత్వం, సోషలిజం వైపు పయనిస్తూ పూర్తిస్థాయి నిర్మాణాత్మక స్థితికి చేరని రష్యా రెండో ప్రపంచ యుద్ధంలో నిర్ణయాత్మక పాత్ర పోషించవలసిన పరిస్థితులు ఏర్పడడంతో నాయకుడిగా స్టాలిన్ అనేకమైన ప్రతికూల పరిస్థితులు, ఒత్తిళ్లకు గురికావల్సి వచ్చింది. 1941 జూన్ 22 వేకువ ఝామున హిట్లర్ సేనలు సోవియట్ యూనియన్‌పై దండయాత్రకు పూనుకున్నాయి. మాస్కో పొలిమేరల్లోకి హిట్లర్ సైన్యం చొచ్చుకొస్తున్న సమయంలో సోవియట్ ప్రభుత్వం క్యూబిషేవ్‌కు తరలిపోయిన సమయంలోను స్టాలిన్ మాస్కో నుంచి కదలలేదు. ఆ ఉద్రిక్త పరిస్థితుల్లోనే విప్లవ వార్షికోత్సవం సందర్భంగా రెడ్ స్క్వేర్‌లో ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఆయన ముందు ప్రదర్శన చేస్తున్న సైనిక దళాలు సరాసరి యుద్ధ రంగంలోకి ఉరికాయి, స్టాలిన్ మాస్కోలోనే ఉన్నాడు, ఆయన మాటలు వినబడుతున్నాయి అని తెలుసుకున్న ప్రజలకు ధైర్యం అందించడంలో ఆ ఘటన ఎంతో గొప్పగా పనిచేసింది.
చర్చిల్ ప్రశంసలు పొందిన రెడ్ ఆర్మీ
ఓ నెల రోజుల మెరుపు యుద్ధంతో రష్యా ప్రతిఘటన అంతమవుతుందని లండన్, వాషింగ్టన్‌లోని రాజకీయ వర్గాలు తొలుత భావించినప్పటికీ పక్షం రోజుల తర్వాత జర్మన్లను ఇంత బలంగా ప్రతిఘటించినది రష్యన్ సేనలే అని ప్రకటించాయి. బ్రిటన్ ప్రధాని విన్ స్టన్ చర్చిల్ రష్యన్లు అకుంఠిత దీక్ష ప్రదర్శిస్తున్నారని వారి సైనిక శిక్షణ, నిర్మాణ నైపుణ్యాలు విజయానికి నూతన పంథాను చూపించనున్నాయనీ, అన్నింటికీ తెగించి సిద్ధమైన అంత బలగాన్ని హిట్లర్ ముందె న్నడూ ఎదుర్కోలేదని తెలిపారు. యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలోని నాజీ సేనలపై స్టాలిన్ నాయకత్వంలోని రెడ్ ఆర్మీ విజయం సాధించింది. అయితే ఆ యుద్ధంలోనే స్టాలిన్ కొడుకు యాకోవ్‌తో పాటు లక్షలాది సోవియట్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు పోకుండా, రక్తపాతాలు జరక్కుండా ముగిసిన యుద్ధాలు ఎక్కడైనా ఉన్నాయా? విజేతలు ఎవరైనా ఉన్నారా? మన పురాణ ఇతిహాసాలైన రామాయణం, మహా భారతాల్లో చెప్పింది ఇదే కదా.
(నేడు స్టాలిన్ జయంతి సందర్భంగా)
నరసింహ ప్రసాద్ గొర్రెపాటి
మాభూమి సాహితీ సాంస్కృతిక చైతన్య వేదిక
94407 34501