- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హక్కుల దారికి దిక్సూచి.. కె. బాలగోపాల్
పెరియార్‌ను కులం ముఖ్యమా, పేదరికం ముఖ్యమా అని ఒక విలేఖరి అడిగితే కులమే ముఖ్యం అంటాడు. భారతదేశంలో సంపద ఉండటానికి కులమే కారణం. సంపద లేకపోవటానికి కులమే కారణం. ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం ఆవిర్భావ దశలో యజమాని, శ్రామికులు, భూస్వాములు, వ్యవసాయ కూలీలు వాళ్ల అణచివేత వాళ్ల హక్కులు మాత్రమే వారి ప్రణాళికలో భాగంగా ఉండింది. కులవివక్ష అణచివేత ప్రస్తావన లేదు. అందుకే బాలగోపాల్ మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేశాక కులాన్ని ఒక సామాజిక సమస్యగా మాత్రమే గుర్తించకుండా, ప్రధానమైన హక్కుల సమస్యగా గుర్తించాడు.
విదేశాలలో హక్కులు అనే భావన రాజ్యాధికారానికి వ్యతిరేకంగా వచ్చింది. కానీ భారతదేశంలో హక్కు లు అనే భావన బ్రాహ్మణీయ ఆధిపత్య సంస్కృతికి వ్యతిరేకంగా వచ్చింది. దీనికి పునాది బుద్ధుడితో ఆరంభమై పూలే, అంబేడ్కర్లు తమ రచనల ద్వారా ప్రజలలో హక్కుల భావన పెంపొందించారు. అదే తాత్వికత బాలగోపాల్ ఆలోచనలో భాగంగా ఉండింది. అందుకే కులం గురించి విస్తృతంగా రాయడం, మాట్లాడటం, ప్రతి చర్చలో భాగంగా కులం గురించి చర్చ చేయడం ప్రారంభించాడు. లౌకికవాదం అంటే (సెక్యులరిజం) కుల నిర్మూలనే అంటూ బలమైన వాదన వినిపించాడు.
ఎక్కడ ఉల్లంఘనలు జరిగినా..
శ్రీకాకుళం ఇచ్చాపురం నుండి చిత్తూరు, మదనపల్లి వరకు, కడప, ఇడుపులపాయ, అదిలాబాద్ నుండి భైంసా, వికారాబాద్‌లోని తాండూరు వరకు ఎక్కడ హక్కుల ఉల్లంఘనలు జరిగినా నిజ నిర్ధారణ చేసి రిపోర్ట్‌గా రాసి అన్ని పత్రికలకు ప్రకటనలు పంపించేవారు. అందులో జరిగిన అన్యాయాలను ఖండిస్తూ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండుగా ఉండేది. విషయాన్ని మనం దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలకు వెళ్లేలా చూసేవారు. అన్ని ప్రజా ఉద్యమాలను సమర్థిస్తూ వారితో కలిసి నడుస్తూ అవకాశమున్న ప్రతిచోటా ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేసేవారు. ఆయన రచనలు, వ్యాసాలు, ఉపన్యాసాలు, వ్యాఖ్యానాలు, పుస్తకాలు కొన్ని లక్షల మందిని ప్రభావితం చేశాయి.
సిద్ధాంతం కాదు.. విషయ సేకరణ ముఖ్యం
నిరంతర వేధింపులు, ఎన్నో కేసులు ఉన్న ఆయన పట్టించుకునే వారు కాదు. రాత్రి పగలు ఎన్ని కోర్టు పనులు ఉన్నప్పటికీని శని, ఆదివారాలు ఏజెన్సీ ప్రాంతవాసుల వద్దకు వెళ్లి వారికి సంబంధించిన అటవీ హక్కుల ఉల్లంఘనలు వారు ఎదుర్కొంటున్న రాజ్యహింసను స్వయంగా చూసేవారు. వాళ్లను కలిసి వారితో మాట్లాడటం, అవసరాలకు తన రచనల ద్వారా, ఉపన్యాసాల ద్వారా, న్యాయ ప్రక్రియల ద్వారా వారికి దక్కవలసిన ప్రజా ప్రయోజనాలను ప్రభుత్వాలకు గుర్తు చేసేవారు. అందు కని ముందుగానే విషయ సేకరణ జరగాలి, వీలైనంత వరకు వ్యాఖ్యానం చేయాలి, కానీ ఒక చారిత్రక సిద్ధాంతంతో మొదలుపెడితే సైద్ధాంతిక పరిమితుల వలన సంఘటనలను పాక్షికంగానే చూస్తాము. విషయ సేకరణ అసమగ్రంగానే ఉండిపోతుంది. అందుకని ఉల్లంఘన జరిగిన స్థలానికి తప్పకుండా వెళ్లడమే పనిగా ముందుకు వెళ్లారు. ఆ కృషిలో భాగమైన సామాజిక పరిశీలన సమాజం గురించి విశ్లేషించడం ప్రజలకు మెరుగైన జీవనం అందించడంలో ఆయన నిర్వహించిన పాత్ర ఆదర్శప్రాయమైనది.
ఎక్కడా రాజీ పడకుండా..
జమ్మూ కశ్మీర్ ప్రజలతో మాట్లాడటం అసలు వాళ్లకు ఏం కావాలో తెలుసుకోవడానికి ఒక నిజనిర్ధారణ చేయాలని, ఇతర సంఘాలతో కలిసి వెళ్లడం జరిగింది. స్వయంగా హక్కుల కార్యకర్తగా వెళ్లడం వారి ఆకాంక్షలను తెలుసుకుని పుస్తకంగా రాశారు. ఎన్నో కరపత్రాల ద్వారా వాస్తవాలను తెలియజేశారు. కశ్మీరీ ప్రజలకు వాళ్ల హక్కులు ఎలా హరించబడుతున్నాయో దేశ ప్రజలకు ప్రపంచానికి తెలియజేశారు. చుండూరు మారణహోమంతో, రాష్ట్రమంతా అతలాకుతలమైంది. ఆ సంఘటనతో భారతదేశంలో కులం పునాదిగా నిరుపేద కులాలను ఎస్సీ, ఎస్టీ అత్యంత వెనుకబడిన కులాలు ఎన్ని వేల సంవత్సరాల నుండి ఏ స్థాయిలో హింసకు గురి కాబడుతున్నారో ఆయనకు పూర్తిగా అవగాహన ఏర్పడింది. ఈ అవమానాలు, అంటరానితనాలు, వివక్ష, దోపిడి, పీడనలు ఎండగట్టే విషయంలో ఎక్కడ రాజీ పడ కుండా లోతైన విశ్లేషణతో ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ లాంటి అంతర్జాతీయ స్థాయి పత్రికకు ఎన్నో వ్యాసాలు రాశారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో సానుకూలమైన స్పష్టతతో ఉండేవారు. మన గురించి మనం మాట్లాడుకోవడంలో ఫలితం ఉండదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఎందుకు అవసరమో కోస్తా, రాయలసీమ ప్రాంత ప్రజలు అర్థం చేసుకునేలా వివరించగలగాలి అంటుండేవారు.
ఇప్పుడుంటే ఏం చేసేవారు..!
భారతదేశం ప్రస్తుతం సామాజికంగా ఒక సంక్లిష్టమైన సందర్భంలో ఉంది. ఒకవైపు హిందుత్వ శక్తులు బలపడి రాజ్యాధికారంలోకి వచ్చి తమ హిందూత్వ ఎజెండాను అమలు చేయాలని చూస్తు న్నాయి. ఈ ప్రమాదంపై బాలగోపాల్ ఆనాటికే ఒక అంచనాకు వచ్చాడు. ఈ ప్రమాదం ఎంతో దూరం లో లేదు అనే మాట కూడా ఆనాడు ఊహించాడు. ఆ మాట నిజమని నిరూపితమైంది. కేంద్రం మాట్లాడే వారిపై, ప్రజాసంఘాల పైన కేసులు పెడుతూనే ఉంది. సామాజిక శాస్త్రాల ప్రాధాన్యతలు కొరవడుతున్నాయి. యువతలో సామాజిక స్పృహ తగ్గిపోయింది. కొత్తగా ప్రజాసంఘాలలో ప్రజా ఉద్యమాలలో పనిచేసే వారు రోజురోజుకూ కనుమరుగు అవుతున్నారు. ఈనాటి పరిస్థితులపై బాలగోపాల్ ఉండి ఉంటే, ఏం మాట్లాడేవారు, ఏమి చేసేవారు. ఎలా ఆలోచించేవారు అంటూ చాలా వెలితితో కలవర పడుతున్నాము. 2009 నుండి దశాబ్దన్నర గడిచిపోయింది. ఆయన యాదిలోనే మానవ హక్కుల వేదిక, ఆయన సంస్మరణ సభ ఆదివారం నేడు (06-10-2024) సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. అందరం వెళ్దాం. నిజానికి సమాజానికి ఉపయోగపడే వారి ఆరోగ్యాన్ని కాపాడడం కూడా సమాజం బాధ్యత అవుతుంది. మేధావులను గాని, ప్రజా సంఘాలలో పని చేసే వారిని గాని ఎవరినైనా వారు ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవలసిన పని ఆయా సమాజాలది అవుతుంది.
(నేడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బాలగోపాల్ 15వ సంస్మరణ సభ)
వి. బాలరాజు
మానవ హక్కుల వేదిక
94409 39160