వ్యావహారిక భాషకు పట్టంగట్టి..

by Ravi |   ( Updated:2024-08-29 00:30:36.0  )
వ్యావహారిక భాషకు పట్టంగట్టి..
X

తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు, వ్యావహారిక భాషోద్యమ మూలపురుషుడు, బహుభాషా వేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, శాసన పరిశోధకుడు, తెలుగు భాషకు గొడుగు.. గిడుగు రామ మూర్తి. శ్రీకాకుళం జిల్లాలో జన్మించిన ఆయన ఉపాధ్యాయుడిగా జీవితం మొదలు పెట్టి 1911 వరకు విద్యాభివృ ద్ధికై కృషి చేశారు.

అప్పటిదాకా గ్రాంథికంలో ఉండగా..

భారతదేశ విద్యా విధానంలో భాషల గురించి బ్రిటీషు ప్రభుత్వం అనేక చర్చలు జరిపింది. 1899 నుండి 1905 వరకు భారతదేశంలో వైస్రాయిగా పనిచేసిన లార్డ్ కర్జన్ విద్యకు సంబంధించి ఎన్నో సంస్కరణలు చేయగా ఆ నేపథ్యంలో తెలుగు భాష కై ఎంతో శ్రమించిన గిడుగు "స్వభాష స్వగృహం" వంటిదని వ్యవహారిక భాష గొప్పతనాన్ని తెలియజేసారు. 1906లో విశాఖపట్టణానికి పర్యవేక్షణాధికారిగా వచ్చిన యేట్స్ ఆలోచనలు గిడుగుని శిష్ట వ్యావహారికం వైపు నడిపాయి. అప్పటిదాకా పుస్తకాలూ, పరీక్షలూ అన్నీ కృతక గ్రాంథికంలో ఉండగా వాటి స్థానంలో వ్యావహారిక భాషను ప్రవేశపెట్టాలని గిడుగు వాదించారు. గురజాడ, గిడుగు, శ్రీనావాస అయ్యంగారు, యేట్సు దొరల కృషి వ్యవహారిక భాషోద్యమానికి పురుడు పోసింది. ప్రధాన గిరిజన ప్రాంతమైన పర్లాకిమిడి సవరల స్థితిగతులను చూసి వారి అభ్యున్నతికై 1892లో గిడుగు సవర భాష నేర్చు కొని వారికై ఒక పాఠశాలను తెరిచి విద్యాభివృద్ధికై 1894లో ఒక మెమొరాండంను ఆనాటి మద్రాసు గవర్నర్‌కు నివేదించగా 1913 నాడు మద్రాసు ప్రభుత్వం వారు "రావు బహుదూర్" అని బిరుదునిచ్చారు.

గ్రాంధిక భాష జీవరహితం

1906 నుండి 1940 వరకు తెలుగుభాషకై కృషిచేసిన గిడుగు ప్రామాణికమైన భాష జీవరహితమైనదని నిరూపిస్తూ "బాలకవి శరణ్యం", "ఆంధ్ర పండితుల భిషక్కుల భాషా భేషజము", "గద్యచింతామణి" వంటి రచనలు చేసి వాటి ఆధారంగా 1912లో "A Memorandum of Modern Telugu"ను ప్రభుత్వానికందించారు. 1919-20 మధ్య వ్యవహారిక భాషోద్యమ ప్రచారం కోసం "తెలుగు" అనే మాసపత్రిక ప్రారంభించి శాస్త్రీయ వ్యాసాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించగా ఆ పత్రిక ఒక యేడాది మాత్రమే నడిచినా చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి, తల్లావఝ్ఝల శివశంకర శాస్త్రి, కందుకూరి వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి వంటివారు వ్యవహారిక భాషకే ప్రాధాన్యతనిచ్చారు. మద్రాసులో జయంతి రామయ్య పంతులు అధ్యక్షతన "ఆంధ్ర సాహిత్య పరిషత్తు "ఏర్పడగా వావిలి కొలను సుబ్బారావు, వేదం వేంకటరాయ శాస్త్రి గ్రాంథిక భాషకు ప్రాధాన్యతనిచ్చి ఉద్యమం చేశారు.

గ్రాంథిక భాష కనపడేదే కానీ..

1925 తణుకులో ఆంధ్ర సాహిత్య పరిషత్తులో వ్యావహారిక భాష గురించి అనర్గళంగా ప్రసంగించగా సాహితీ సమితి, నవ్యసాహిత్య పరిషత్తు మొదలైన సంస్థలు గిడుగు వాదాన్ని బలపరిచాయి. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి అధ్యక్షతన గిడుగు కార్యదర్శిగా "వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం "స్థాపించారు. 1924లో ఆంధ్ర సాహిత్య పరిషత్తు అధికారికంగా వ్యావహారభాషపై నిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో శిష్టవ్యవహారికాన్ని ప్రోత్సహించే "ప్రతిభ" పత్రిక ప్రచురించగా, 1937లో తాపీ ధర్మారావు సంపాదకత్వంలో "జనవాణి" పత్రిక వాడుక భాషలో వార్తలకు, సంపాదకీయాలకు శ్రీకారం చుట్టింది. గిడుగు జీవితకాలం పాటు చేసిన కృషిని రచనలని కీర్తిశేషులు వేదగిరి రాంబాబు గారి చొరవ వల్ల తెలుగు అకాడమీ 2014- 2016లో రెండు పెద్ద సంపుటాలు వెలువరించింది. గిడుగు శిష్యురాలు మిస్ మంట్రో "భారతదేశంలోని ఉదాత్తతకీ, సౌందర్యానికీ సంపూర్ణ ప్రతినిధి గిడుగు" అని చాటి చెప్పారు.

గ్రాంథిక భాష గ్రంథాలలో కనబడేదే కానీ వినబడేది కాదు అని "విజ్ఞాన సముపార్జనకు వ్యావహారిక భాషే ఉత్తమం" అంటూ "జీవద్భాషకు నియమకారుడు రచయితే కానీ, లాక్షణికుడు, వ్యాకరణ కర్త కాడన్న గిడుగు మాటలు అక్షర సత్యం. వ్యవహారిక భాషకు పుస్తక భాషకు గల తేడా వల్ల విద్యావిధానానికి జరిగే అన్యాయం ఆయన్ని వేధించింది. భాషా శాస్త్రంలోనూ, ధ్వని శాస్త్రంలోనూ ఆయన చేసిన కృషికి గొప్ప భాషావేత్తయనీ, కాలంకన్నా ముందున్న భాషావేత్తయని అంతర్జాతీయ లింగ్విస్టుల ప్రశంసలందుకున్నారు. అహరహం తెలుగు భాషకై కృషి చేసి తన సర్వస్వాన్ని అర్పించిన ఆమహోన్నత మూర్తి జయంతిని "తెలుగు భాషా దినోత్సవంగా"జరుపుకోవడం తెలుగు వారిగా మన కర్తవ్యం.

(నేడు తెలుగు భాషా దినోత్సవం)

- అడ్డగూడి ఉమాదేవి

తెలుగు అధ్యాపకురాలు

99080 57980

Advertisement

Next Story

Most Viewed