- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వర్తమాన స్త్రీ దృక్కోణం 'సీత జోస్యం'
నాకు కావలసింది మీ ఆమోదం కాదు. మీలో ఆలోచన, నేను కోరేది మీ ప్రశంస కాదు. మీలో జిజ్ఞాస. ఎప్పటికప్పుడు పాత విషయాలను కొత్త దృష్టితో చూడడానికి మనం ప్రయత్నించాలి. పాత విశ్వాసాలను కొత్త పరీక్షలకు పెట్టుకోవాలి. కొత్త వ్యాఖ్యానాలను చెప్పుకోవాలి.' ఇవి నార్ల వారి పౌరాణిక నాటకాలకు రాసుకున్న పీఠికలోనిది.
పురాణాలపై తొలి సమగ్ర విమర్శ ప్రారంభించిన వారు కవిరాజు త్రిపురనేని రామస్వామి. ఆయన తర్వాత పురాణాలలోని అంశాలను విపులంగా చర్చించింది నార్ల వెంకటేశ్వరరావే. ఆయన రాసిన పౌరాణిక నాటకాల్లో 'జంబాలి, 'సీతజోస్యం' 'నరకంలో హరిశ్చంద్రుడు' ఇందుకు నిదర్శనాలుగా నిలుస్తాయి. 'సీతజోస్యం' పీఠికలో ఆయన లేవనెత్తిన ప్రశ్నలు రామాయణ గాథకున్న చారిత్రక ఆధారాలేమిటి? రాముని కాలంలో మునులు వనవాసం ఏ ప్రాంతంలో చేశారు? రాక్షసులెవరు? వారి స్థితిగతులేమిటి? రుషులెవరు? యజ్ఞయాగాదులకు ప్రాధాన్యత ఎందుకు? ఆనాటి ఆయుధాలు ఎలాంటివి అని పురాణాలపై పరిశోధనలు చేసిన వారిలో రమేష్‌చంద్రదత్ ప్రముఖుడు. నార్ల పీఠికలో దత్ మాటలు ప్రాతిపదికగా, ప్రాతినిధ్యంగా కనిపిస్తాయి. అలాగే సీతారాముల వ్యక్తిత్వాన్ని విశ్లేషించి సీత వ్యక్తిత్వం గొప్పదంటారు. పురాణాల నుండి చరిత్రను వేరుచేయాలి. మతం నుంచి నీతిని విడదీయాలి. చరిత్ర వేసిన పురాణం మన మేథాశక్తిని బలహీనపరుస్తుంది. హేతు దృష్టిని మందగింపజేసి వాస్తవికతను దూరం చేస్తుందంటారు నార్ల. ఆయన 'రామాయణం పూర్తిగా కల్పిత గాథ' అని చారిత్రక ఆధారాలతో నిరూపించారు. రామాయణాన్ని చదివే చదువరులకు ఓ కొత్త మేథా దృక్పధాన్ని కలిగిస్తారు. రామాయణాన్ని చదివిన ఎందరో పండితుల విశ్లేషణలను పేర్కొంటూనే తనదైన కొత్త చూపును నార్ల ప్రకటిస్తారు.
నార్ల వారి జీవనరేఖలను సృశిస్తే ఆయనలోని నిర్భీతి మనకు అర్థమవుతుంది. 'నచ్చని నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పే హక్కు గాంధీజీతో సహ ఎవరికీ లేదని తెగేసి చెప్పారు. అలాగే 'నిజము కప్పిపుచ్చి నీతిని విడనాడి స్వామి సేవ చేయు జర్నలిస్టు తార్చువాని కంటే ఎక్కువ వాడురా' 'ఏ ఎండకు ఆ గోడకు పట్ట నేర్చినవాడు ఏమైనా కావచ్చునేమో కాని, నిజమైన ఎడిటర్ కానేకాడు అని నిష్కర్షగా చెప్పిన ధీశాలి నార్ల. ఆయనకు స్ఫూర్తి బెర్నార్డ్ షా, గురజాడ, కందుకూరి, వేమన, త్రిపురనేని రామస్వామి. ఎంఎన్ రాయ్‌కి వీరాభిమాని అయిన నార్ల క్రమంగా హేతువాదిగా, మానవవాదిగా జీవించారు.
ఆయన రాసిన సీతజోస్యం రచనలో రెండు అంకాలున్నాయి. మొదటి అంకంలో సీతా, లక్ష్మణుడు, బుషుల సంవాదం, రెండవది బుషులు, రాముడు, సీతల సంవాదం ఉంది. ఈ నాటకంలో సీతను ఓ వ్యక్తిత్వం ఉన్న ధీమంతురాలైన స్త్రీగానే చిత్రించారు. ఛాందసభావాలతో రామాయణం చదివేవారు ఈ నాటకంలో సీత ధోరణిని భరించలేరు. ఒక బాణీకి అలవాటుపడిన 'రొటిన్ వాదాలను' 'సీత' ఎదురించి నిలుస్తుంది. లక్ష్మణుడు ఆమెను వారించలేకపోతాడు. సీత ఈ నాటకంలో రాక్షసులను ఎందుకు చంపాలని ప్రశ్నిస్తుంది. 'ఈ అడవులను మీరు ధ్వంసం చేస్తే వారి బతుకులే ధ్వంసం కావా', 'సేద్యం పట్ల వారికి ఆసక్తి లేదు. వారు హోమ గుండాలు ఎందుకు వెలిగించుకోవాలి, తన జీవిత విధానాన్ని ఎందుకు మార్చుకోవాలి', "జంతువులను వేటాడినట్టు తోటి మానవులను వేటాడి, వారి నివాస స్థానాలలో తిష్ట వేయడమే మీ నాగరికత" "భక్తుల స్వభావాన్ని బట్టి దేవతల స్వభావాన్ని నిర్ణయిస్తే మీ దేవతలే క్షుద్ర దేవతలేమో అని ప్రశ్నలను సంధిస్తుంది.
రెండవ అంకంలోనూ రాక్షస వధలో తాను అర్షధర్మం పాటిస్తున్నానని రాముడంటే వారు ఆత్మరక్షణ కోసం పోరాటం చేస్తున్నారంటుంది సీత. తల్లిదండ్రులకు మునీంద్రుల వలే జీవిస్తానని రాముడు ఇచ్చిన మాటను ఎత్తిచూపుతూ 'మునీంద్రులు అస్త్రశస్త్రాలను ధరిస్తారా, నిరాయుధులను చంపేస్తారా' అని గుర్తు చేస్తుంది. ముని వలె జీవించలేనప్పుడు ముని వేషం ఎందుకని ప్రశ్నిస్తుంది. ఒక సామాన్య స్త్రీ వలె భర్త పాదాలను తాకి, పట్టుకొని ప్రార్ధిస్తుంది. అమాయకులైన అటవికులను, బుషుల మాటలు విని వధించడం ఆపమని కోరుతుంది. ఆమె వ్యధలో న్యాయముంది. స్త్రీగా సాటి స్త్రీలకు మాంగల్య భిక్ష పెట్టమని కోరుతుంది. దీనికి రాముడు 'నిన్ను, లక్ష్మణుడిని విడుస్తాను. అవసరమైతే ప్రాణాలను విడుస్తాను కానీ బుషులకిచ్చిన మాట తప్పను' అంటాడు. అందుకు సీత.. 'వంశ గౌరవం కోసం ఎప్పుడో ఒకప్పుడు నట్టడవిలో నన్ను దిక్కులేని దాన్నిగా మీరు దిగ విడుస్తారం'టుంది. అందుకే సీతజోస్యం నిజమయిందని భావించాలి.
సీతజోస్యం రచనలో నార్ల సీతను అద్భుత స్త్రీ మూర్తిగా చిత్రించారు. సీతజోస్యంలో నార్ల వారే కనిపిస్తారు. సీతజోస్యం నాటికకు 1981లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
(నేడు నార్ల వర్ధంతి)
భమిడిపాటి గౌరీశంకర్
94928 58895