అమరుల ఆశయాలు నెరవేరేదెన్నడు...

by Ravi |
అమరుల ఆశయాలు నెరవేరేదెన్నడు...
X

ననం మరణం సహజమే అయినప్పటికీ, మరణం రకరకాలుగా సంభవిస్తుంది. అది ప్రమాదవశాత్తు, అనారోగ్య కారణంగా, కక్షలు కార్పణ్యాలతో ఇతరులు చేసే హత్య రూపంలో లేదా ఒత్తిడితో తనకు తాను తెచ్చుకునే బలవన్మరణాలు కావచ్చు. ఇవన్నీ కూడా మరణించే వ్యక్తి మూలంగా సంభవించేవి. అలా కాకుండా ఇతరుల ప్రయోజనాల కోసం, అభివృద్ధి సంక్షేమం కోసం ప్రాణ త్యాగం చేస్తే అది అమరత్వం.. దేశ ముక్తి కోసం 20 సంవత్సరాల వయసులోనే కర్తార్ సింగ్ శరభ ప్రాణాలర్పించడంతో అతని స్ఫూర్తిగా భారతదేశ దాస్య శృంఖలాలను తెంచడానికి ఉరికొయ్యని ముద్దాడిన విప్లవ వీరులు, భారత వేగుచుక్కలు సర్దార్ షహీద్ భగత్ సింగ్, శివరాం రాజ్ గురు, సుఖ్ దేవ్ థాపర్‌లు .. స్వేచ్ఛ, సార్వభౌమాధికారం, సమానత్వాలకై తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన త్యాగమూర్తులు. సామ్రాజ్యవాదానికి, పెట్టుబడిదారీ వ్యవస్థకు, భూస్వామ్య సమాజానికి మతోన్మాదం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమరవీరులు.

విద్యావతి, కిషన్ సింగ్ దంపతులకు 1907 సెప్టెంబరు 28న రాయల్ పూర్ జిల్లా బంగా గ్రామంలో దేశభక్తియుత కుటుంబంలో భగత్ సింగ్ జన్మించాడు. ప్రస్తుతం ఆ గ్రామం పాకిస్తాన్‌లో ఉంది. అధిక భూమి శిస్తు, కాల్వ పన్నులను వ్యతిరేకిస్తూ బ్రిటిష్ ప్రభుత్వంపై పంజాబ్ కేసరి లాలాజపతిరాయ్‌తో కలిసి భగత్ సింగ్ మామయ్య అజిత్ సింగ్ శక్తివంతమైన రైతాంగ పోరాటానికి నాయకత్వం వహించినందుకు బర్మాలోని మాండలే జైలుకు పంపించారు. భగత్ సింగ్ పుట్టిన సమయంలో ఆయన తండ్రి కిషన్ సింగ్, మరో మామయ్య స్వరణ్ సింగ్ జాతీయోద్యమంలో పాల్గొన్నందుకు జైల్లో ఉన్నారు. ఇటువంటి కుటుంబ వాతావరణంలో పెరిగిన భగత్ సింగ్ దేశభక్తి భావాలకు ఆకర్షితుడయ్యాడు. భగత్ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు 1915 నవంబర్ 16,17 తేదీల్లో లాహోర్ కుట్ర కేసులో ఏడుగురు గదర్ వీరులను బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది. వారిలో పంజాబ్‌కు చెందిన కర్తార్ సింగ్ శరభ ఒకరు. ఆయన సాహసం, త్యాగపూరిత మరణం భగత్ సింగ్‌ను తీవ్రంగా కలిచివేసింది. అప్పటినుండి భగత్ సింగ్ తన జేబులో కర్తార్ సింగ్ ఫోటో పెట్టుకునేవాడు.

భగత్ సింగ్‌కు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు 1919 ఏప్రిల్ 13న అమృత్‌సర్ లోని జలియన్‌వాలా బాగ్ పార్కులో జనరల్ డయ్యర్ సేనాని నిర్వహించిన మారణకాండ తనను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ఆ ఘటన తర్వాత జలియన్‌వాలా బాగ్ వెళ్లిన భగత్ సింగ్ భారత ప్రజలకు ఎదురైన ఘోర అవమానాన్ని సదా గుర్తుంచుకునేందుకు అక్కడి మట్టిని ఒక సీసాలో తెచ్చి ఉంచాడు. పాఠశాల విద్యను పూర్తి చేసుకుని భగత్ సింగ్ డిఏవి స్కూల్ వదిలి లాలాలజపతిరాయ్ ఏర్పాటుచేసిన నేషనల్ కాలేజీలో చేరాడు. భగవతి చరణ్ వోహ్ర్, సుఖదేవ్, యశ్‌పాల్ భగత్ సింగ్‌కి సహచరులు. చదువు, రాజకీయాలపైన భగత్ సింగ్ ఎంతో శ్రద్ధ కనబరిచేవాడు, ఎక్కువ సమయం అధ్యయనం చేసేవాడు. తండ్రి, నానమ్మ వివాహానికి బలవంతం చేయడంతో 1924లో భగత్ సింగ్ తన బిఏ చదువు మధ్యలోనే ఆపి లాహోర్‌కి వెళ్ళాడు.

ఇది పెండ్లికి సమయం కాదు, దేశం నన్ను పిలుస్తోంది. భౌతికంగా మానసికంగా ఆర్థికంగానూ నా దేశానికి సేవ చేస్తానని ప్రతిజ్ఞ తీసుకున్నాను, మాతృభూమికి సేవ చేయడం అనే అత్యున్నత లక్ష్యానికి నా జీవితాన్ని అంకితం చేశాను. ప్రాపంచిక సుఖాలు అనుభవించాలన్న కోరిక లేదు అని భగత్ సింగ్ తన తండ్రికి లేఖ రాసి విప్లవోద్యమంలో చురుకుగా పనిచేయడం ప్రారంభించాడు. 1924లో కాన్పూర్ చేరుకొని, ప్రతాప్ పత్రిక సంపాదకుడు గణేష్ శంకర్ విద్యార్థి దగ్గర షెల్టర్ తీసుకొని చంద్రశేఖర్ ఆజాద్, బట్కేసర్ దత్, జోగేష్ చంద్ర చటర్జీ, శివవర్మ, విజయకుమార్ సిన్హాలను కలుసుకున్నాడు. 1923లో ఏర్పాటైన హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ లో సభ్యుడయ్యాడు. 1926 మార్చ్‌లో నవజవాన్ భారత సభ అనే మిల్టెంట్ యువజన సంఘాన్ని స్థాపించారు.

ఈ రెండు సంస్థలు బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా యువతను సమీకరించడం ముఖ్య లక్ష్యంగా , యువకులు రైతాంగం కార్మికుల్లో రాజకీయ కార్యక్రమాలు నిర్వహించేందుకు, విస్తృత ప్రజా పునాది కలిగిన ఉద్యమాలు మాత్రమే విప్లవాలకు దారితీస్తాయని తద్వారా దేశాన్ని బ్రిటిష్ వారి కబంధహస్తాల నుండి విముక్తి చేయాలని పని చేశారు. రాజ్యాంగ సంస్కరణలపై విచారించేందుకు శ్వేత జాతీయులతో కూడిన సైమన్ కమిషన్ 1928 భారతదేశానికి వచ్చింది. ఆ కమిషన్‌ని బహిష్కరించాలని దానికి వ్యతిరేకంగా ఆధ్వర్యంలో ప్రదర్శనలు చురుకుగా నిర్వహించాలని హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ నిర్ణయించింది. లాహోర్లో లాలా లజపతిరాయ్ ఆధ్వర్యంలో జరిగిన భారీ ప్రదర్శనపై లాఠీచార్జి జరగడంతో, ఆ దెబ్బలకు తాళలేక నవంబర్ 17న లాలాలజపతిరాయ్ మరణించారు.

లాలా లజపతిరాయ్ మరణానికి, జాతికి జరిగిన అవమానానికి స్కాట్‌ని చంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని హెచ్ఎస్ఆర్ఏ నిర్ణయించింది. లాలా లజపతిరాయ్ మరణించిన సరిగ్గా నెల రోజులకు 1928 డిసెంబర్ 17న భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్ గురు, సుఖదేవ్ లాఠీ చార్జీలో పాల్గొన్న జెపి సాండర్స్ అనే మరో పోలీస్ అధికారిని హత్య చేశారు. సాండర్స్‌ని స్కాట్ అనుకోని త్వరపడి చంపారు. సాండర్స్ హత్య తరువాత భగత్ సింగ్ తన సహచరుడైన రాజ్ గురుతో కలిసి మారు వేషాలతో కలకత్తా చేరుకున్నాడు. ఉద్రిక్తమవుతున్న కార్మిక వర్గ పోరాటాలను ప్రాబల్యం పెంచుకుంటున్న కమ్యూనిస్టులను అణచివేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం పబ్లిక్ సేఫ్టీ బిల్ కార్మిక వివాదాల బిల్లును ఢిల్లీలోని సెంట్రల్ లెజిస్లేచర్ అసెంబ్లీలో చర్చకు పెట్టింది. ఈ రెండు దుర్మార్గపు బిల్లుల ఆమోదానికి, కార్మిక, కమ్యూనిస్టు నేతల అరెస్టుకు నిరసన తెలియజేసేందుకు సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేయాలని నిర్ణయించారు.

అయితే బాంబులు ఎవరిని చంపడానికి ఉద్దేశించినవి కాకుండా కేవలం ఒక హెచ్చరిక జారీ చేయడానికి, బాంబులు విసిరి పారిపోకుండా స్వచ్ఛందంగా అరెస్టయి విచారణ సందర్భంగా హెచ్ఎస్ఆర్ఏ కార్యక్రమాలు సిద్ధాంతాలు దేశం మొత్తానికి తెలియజేసేలా కోర్టు హాలును వేదికగా వాడుకోవాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్, భట్కేసర్ దత్ పాల్గొన్నారు. 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్, భట్కేసర్ దత్ అసెంబ్లీలో బిల్లులు ఆమోదం పొందిన వెంటనే రెండు బాంబులు విసిరేశారు. బాంబులు ఎందుకు విసిరేసారో తెలియజేస్తూ కరపత్రాలు వెదజల్లి పారిపోకుండా స్వచ్ఛందంగా అరెస్ట్ అయ్యారు. పార్లమెంటులో బాంబులు విసరడం సాండర్స్ హత్య ఈ రెండింటిపై విచారణ జరిపి అమానుషంగా 1931 మార్చి 23న ఉత్తర్వులకు విరుద్ధంగా ఒకరోజు ముందుగానే రాజ్ గురు, సుఖదేవ్, భగత్ సింగ్లను ఉరి తీశారు.

జీవితాన్ని ప్రేమిస్తాం

మరణాన్ని ప్రేమిస్తాం

మేము మరణించి

ఎర్ర పూల వనంలో పూలై పూస్తాం

ఉరికంబాన్ని ఎగతాళి చేస్తాం

నిప్పు రవ్వల మీద నిద్రిస్తాం

అంటూ పోరాటం ఊపిరిగా మార్గం ఒకటిగా, శ్రామిక వర్గ సిద్ధాంతం లక్ష్యంగాా, స్వాతంత్రం కోసం సోషలిస్టు రాజ్య స్థాపన కోసం అంకితం చేశారు. ఉరి కంబం ఎదురుగా కనిపిస్తున్నా అధైర్యపడక చిరునవ్వుతోనే మృత్యువును కౌగిలించుకొని దేశస్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన త్యాగమూర్తుల ఆశయాలు నెరవేరాయా? నెరవేరుతున్నాయా? వారి స్వప్నించినట్లుగా దేశ విముక్తి జరిగిందా? వారు ఊహించిన అసమానతలు లేని, అంతరాలు లేని సమ సమాజం ఏర్పడిందా వారు ఆశించినట్లుగా దోపిడీ పీడనా అణచివేతలు నిర్మూలించబడినవా? వారు ఏ ఆశయాల సాధన కోసం ప్రాణ త్యాగం చేయవలసి వచ్చిందో ఆ ఆశయాల కొనసాగింపు జరుగుతోందా? ఆ దిశగా ప్రజలు, పాలకవర్గాలు కృషి జరుపుతున్నాయా అంటే వర్తమాన పరిస్థితులలో కూడా వారి ఆశయాల సాధన, కొనసాగింపు కనుచూపుమేరలో లేవు. పోగా వాటికి విరుద్ధంగా, వ్యతిరేకంగా జరుగుతుండడం విచారకరం.

23 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరి తాడును ముద్దాడిన త్యాగశీలురు. భగత్ సింగ్ రాజకీయ జీవితం ఏడు సంవత్సరాలు మాత్రమే. భగత్ సింగ్ యుక్త వయసు నాటికే మహా మేధావి, ఆలోచనపరుడు. జైల్లో ఉన్న కాలంలో మార్క్స్ ఎంగెల్స్, లెనిన్ రచించిన 43 పుస్తకాలు సహా 108 వివిధ పుస్తకాల నుండి ముఖ్యమైన అంశాలను సేకరించి, సామ్రాజ్యవాదం అంటే దోపిడీ కుతంత్రాలతో నిండిన భారీ కుట్ర తప్ప మరొకటి కాదని, ఒక మనిషిని మరొక మనిషి ఒక దేశాన్ని మరొక దేశం దోచుకునే దుర్మార్గపు సామ్రాజ్యవాదం చరమదశ అని అభిప్రాయానికి వచ్చారు. మతం అనేది వ్యక్తిగత అంశం, మతతత్వానికి, కుల ఉన్మాదానికి దూరంగా లౌకికవాదాన్ని ఆచరించారు. మతం, మూఢనమ్మకాల నుండి ప్రజలు తమంతట తామే విముక్తులు కావాలని విశ్వసించాయి. 21 సంవత్సరాల వయసులోనే మతం స్వాతంత్ర ఉద్యమం, మత ఘర్షణలు పరిష్కారాలు, అంటరాని సమస్య వంటి వాటిపై పదునైన వ్యాసాలు రాశాడు.

కానీ భారతదేశాన్ని లౌకిక సామ్యవాద దేశంగా రాజ్యాంగం చెబుతుంటే, లౌకికం అనే పదాన్ని తొలగించాలని నేడు పాలకవర్గాలు ప్రచారం చేస్తుండటం విడ్డూరం. ఆనాడు విదేశీ పెత్తనం, ఆర్థిక దోపిడీ కారణంగా ప్రజలు కుంగిపోగా, నేడు స్వపరిపాలనలో కూడా ఆర్థిక దోపిడీ సంపన్నుల లాభాల ధ్యేయంగా కొనసాగుతుండడం, తమ అనుయాయులకు ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించి లక్షల కోట్ల రూపాయలు అర్జించి పెట్టే కార్పొరేట్ పన్నులను తగ్గించి, సామాన్య ప్రజలపై అధిక భారం పడే విధంగా అధిక ధరలు, పన్నులు విధించటం... అసమానతలను అంతరాలను పొంచి పోషించడమే.. దేశంలో నలభై శాతం సంపద ఒక శాతంగా ఉన్న సంపన్న వర్గాల వద్ద ఉన్నది. మిగతా 50 శాతం జనాభా వద్ద మూడు శాతం సంపద కలదు.

దేశంలో ఆధునికత పెరిగిపోతున్న కొద్దీ కులం రాజకీయ వ్యవస్థ పుణ్యమా అని వెర్రి తలలు వేస్తోంది. పెంపుడు కుక్కను ఒళ్లో కుర్చోబెట్టుకుంటాం, కానీ సాటి మనిషిని ముట్టుకుంటే మైల పడిపోతాం ఎంత సిగ్గుచేటు అని 90 ఏళ్ల క్రితం అంటరానితనం సమస్య అనే వ్యాసంలో భగత్ సింగ్ ఉటంకించారు. 75 వసంతాల అమృత్యోత్సవాల తరువాత కూడా దాదాపు 30 కోట్ల మంది అంటరానితనం, కుల వివక్షతో అణచి వేయబడుతున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటికీ భారత సమాజాన్ని పట్టిపీడిస్తున్న భయంకరమైన వ్యాధి కుల వ్యవస్థ. 2014లో దేశవ్యాప్తంగా 28 కుల హత్యలు జరిగితే 2015 నాటికి 251 కి పెరగడం కుల జాడ్యం ఎంతగా పెరిగిపోతుందో అర్థం చేసుకోవచ్చు. యువకులు దేశానికి పట్టుకొమ్మలని, వారు చదివే చదువు ఒక తరగతి గదికే పరిమితం కాకూడదని, దేశంలో ప్రతి పేదవాడి కన్నీళ్లను తుడిచేదిగా ఉండాలని , యువతలో నైరాశ్యం ఉండకూడదని, పరాజయాలకు కృంగిపోకుండా సింహంలా దూసుకుపోవాలని, దేశమంతా అన్యాయం నిండి ఉన్నప్పుడు సింహాలై మేల్కొనాలని భగత్ సింగ్ పిలుపునిచ్చారు.

ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న భారతదేశం అన్ని సూచికలలోవెనకబడి ఉన్నది . దోపిడీ లేని సమాజాన్ని ఆకలి కేకలకు దూరంగా అందరికీ కూడు గూడు గుడ్డ అందించే విధంగా నూతన భారతాన్ని నిర్మించాలని ఆకాంక్షించి అసువులు బాసిన అమరవీరుల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రపంచ ఆహార సూచీలో 107 స్థానంలో ఉండటం బాధాకరం. సమకాలీన భారతదేశానికి భగత్ సింగ్ ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాడు. భగత్ సింగ్ ఆలోచన విధానం అనుసరణీయం, ఆచరణీయం. నయా వలసవాద ఉదార ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక రాజకీయ, సార్వభౌమ అధికారాలను ప్రమాదంలోకి నెట్టివేశాయి. ఈ ప్రమాదం నుండి రక్షించేందుకు భగత్ సింగ్ వారసులుగా యువత ప్రజాస్వామ్యవాదులు, బుద్ధి జీవులు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. భగత్ సింగ్ భావజాలానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వారు కూడా భగత్ సింగ్ వారసులమే అంటున్నారు. ఏ ఆశయ సాధన కోసం, దోపిడీ పీడన లేని సమ సమాజం కోసం అమరవీరులు తమ ప్రాణాలను అర్పించారో, ఆ ఆశయాలను కొనసాగించే వారే నిజమైన వారసులవుతారు. ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడుతాయని ఆశిద్దాం. అప్పుడే వారికి నిజమైన నివాళి.

(మార్చి 23 షాహీద్ దివస్ సందర్భంగా)

తండ సదానందం

భగత్ సింగ్ స్టడీ సర్కిల్

99895 ౮౪౬౬౫

Also Read: నిత్య కష్టాల్లో ముంచేవాడు దేవుడా?

Next Story

Most Viewed