పిడికిలికి ప్రాణం పోసిన ఓంకార్

by Ravi |   ( Updated:2023-05-16 23:16:13.0  )
పిడికిలికి ప్రాణం పోసిన ఓంకార్
X

సందర్భమేదైనా దాని తాలూకు జ్ఞాపకాలను చరిత్రలోనే వెతుక్కోవాలి. ఆయా సందర్భాలను కూడా చరిత్రలో లిఖించే స్థాయి ఉండాలి. కార్మిక దినమైన మే ఒకటిన హైదరాబాద్ లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన అత్తినేని చిన్న ఓంకార్ మరణం కూడా ఓ సందర్భమే. వందలాది మిత్రులకు, అభిమానులకు తనవంటూ కొన్ని జ్ఞాపకాలను మిగిల్చిపోయిన సార్థక బతుకు ఆయనది. సముద్రాలకు ఆవల ఉన్న కవి నారాయణస్వామి వెంకటయోగి... 'ఓంకార్ జ్ఞాపకాలతో గుండె బరువెక్కుతోంది' అన్న కంటి చెమ్మ ఇక్కడికి తాకుతోంది. మౌనం ద్వారా నిరంతరాయంగా అనునిత్యం దిన, జన కదలికలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన మనకాలపు వీరుడు ఓంకార్ ' అని అంబటి సురేంద్రరాజు తన జ్ఞప్తి పేటికను తెరిచారు. మల్లయ్య క్యాంటీన్‌లో వందలాది గంటల కలబోతను ఎన్. వేణుగోపాల్ తలచుకొని దిగులు పడ్డారు. యూనివర్సిటీలో పనిచేయాలి తమ్మీ! అని ఎప్పుడూ పలకరించేవాడని కవియాకుబ్ తలపోసుకుంటున్నారు. ఇలా వందలాది మిత్రుల జోహార్ కామ్రేడ్, అన్న వీడ్కోలు మాటలతో ఓంకార్ తరలిపోయాడు.

పిడికిళ్ల ఓంకార్‌గా పేరు పడిపోయేలా..

1975 ఎమర్జెన్సీ తదనంతరకాలం... దేశంలోని మధ్య తరగతి యువత ఆలోచనాధోరణి, జీవనగతిని చాలా ప్రభావితం చేసింది. పట్టణ, గ్రామీణ యువజనం డిగ్రీ చదువులు పూర్తిచేసి పై చదువుకోసం వర్సిటీల బాట పట్టారు. కాకతీయ, ఉస్మానియాలు వారి ఆధిక్యతతో కొనసాగాయనవచ్చు. విద్యార్థి, వామపక్ష ఉద్యమాలు వీరి రాకతో బలపడి కొంతకాలం యూనివర్శిటీలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అలా 1978లో జగిత్యాల నుండి ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో అడుగుపెట్టిన ఓంకార్. ఎం.ఎ. ఫిలాసఫీలో చేరాడు. ఆ నేలపై అడుగుపెట్టగానే పీడీఎస్‌యూ వైపు ఆకర్షితులైన విద్యార్థుల్లో ఓంకార్ ఒకరు. వ్యక్తిగా ఆయన తెగువ, చొరవ, మాటల చెలిమె గల మంచి మనిషి. ఆయన మాట్లాడే తీరు. వాడే భాష... తెలంగాణ గ్రామీణ, పట్టణ మిశ్రమంతో వెరైటీగా ఉంటుంది. దానికో సొంతశైలి ఉందనవచ్చు. మాటమాటకీ కొత్త సామెత కలిపి ఆకట్టుకొనేవాడు. అనేది అనేసి ఇందులో వింతేముంది అన్నట్లు చూసేవాడు. తెగువ ఎప్పుడూ స్విచ్ ఆన్‌లోనే ఉండేది. వీడిట్ల, వాడిట్ల అని ఎవరైనా అంటే, వింటూ ఉండలేక, 'నీయవ్వ, ఏం సంగతో సూద్దాంపా, అయ్యేదైతది' అని ఓ సామెత జోడించేవాడు.

ఓంకార్ పీడీఎస్‌యులో చేరాక అది ఆయన జీవన గమ్యాన్నే మార్చివేసింది. అదే తనపని.. మరింకేదీ లేదు అన్నట్లుగా వ్యవహరించేవాడు. ఆయన చేతిరాత ఎంతో అందంగా ఉంటుంది. చిత్రకారుడు కూడా. దాంతో యూనివర్శిటీ ప్రాంగణంలోని గోడలపై పీడీఎస్‌యూ రాతలను, దాని చిహ్నమైన బిగించిన పిడికిలిని చిత్రించడంలో ఆయన స్పెషలిస్టుగా అయిపోయాడు. 'ఎ' హాస్టల్ నొసట తిలకంలా దిద్దిన పిడికిలి ఎంత సహజంగా ఉండేదో చూసి అబ్బురపడిపోయేవారు. సైజు ఎంతైనా చకచకా గీస్తూ పోయేవారు. గోడపైన అయినా, కాగితంపైనైనా, బ్యానర్ బట్టపైన అయినా పిడికిలి వేయాలంటే ఓంకార్ వెళ్లవలసిందే. నగరంలో ఎక్కడ పీడీఎస్‌యూ సభ జరిగినా స్టేజీ బ్యానర్ రూపకల్పన కోసం ఆయన్ని తీసుకెళ్లేవారు. వేళాపాలా లేకుండా, సమయం పట్టింపు లేకుండా, తన్మయత్వంతో తనపని పూర్తి చేసేవాడు. అలా ఆయనకు పిడికిళ్ల ఓంకార్‌గా పేరు పడిపోయింది.

పీడీఎస్‌యూ చిరస్థాయి నేతగా..

ఉద్యమమే తప్ప ఉద్యోగ ధ్యాస లేని ఓంకార్ తనతో వచ్చిన ఎందరో విద్యార్థి మిత్రులను సాగనంపి తాను మాత్రం యూనివర్సిటీలో ఉండిపోయాడు. ఫిలాసపీలో డాక్టరేట్ పూర్తిచేసి కొంతకాలం పాటు అదే డిపార్ట్‌మెంట్‌లో బోధనావృత్తిలో కొనసాగాడు. సొంత జీవితం పట్ల పెద్ద అంచనాలు వేసుకోని ఆయన ఒంటరిగానే కాలం గడిపాడు. 'పెళ్లి కాలేదే' అని ఎవరైనా అడిగితే 'పురుడు పోసుకునేందుకు తల్లిగారింటికి వెళ్లింది' అని తమాషాగా మాట్లాడేవాడు. 1989లో సిరిసిల్లా అసెంబ్లీ స్థానం నుండి కమ్యూనిస్టు పార్టీ (మా-లె) తరఫున పోటీచేసి గెలుపోందిన ఎన్.వి. కృష్ణయ్య తరఫున ఎన్నికల ప్రచార బాధ్యతను ఓంకార్ చేపట్టాడు,. వాల్ రైటింగ్, బ్యానర్ల తయారీలతో ఆ ప్రచారానికి నిండుదనం తెచ్చి గెలుపునకు దోహదపడ్డాడు. ఓంకార్, కృష్ణయ్యల మధ్య ఏర్పడిన సాన్నిహిత్యంతో ఆయన కొంతకాలం ఎంఎల్ఏ క్వార్టర్స్‌లో గడిపాడు. ఉద్యోగ విరమణ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ చుట్టూ గల కాలనీల్లో ఒంటరిగా నివాసముంటూ మిత్రులు ఆహ్వానించిన ప్రతి ఫంక్షన్‌కు హాజరై తన మైత్రీ బంధాన్ని నిలబెట్టుకునేవాడు. ఆయన రాకతో మళ్లీ యూనివర్సిటీ వైభవకాలాన్ని నెమరేసుకునే అవకాశం అందరికీ దొరికింది. గత కొంత కాలంగా వాస్క్యులర్ వ్యాధితో బాధపడుతున్న ఓంకార్ చికిత్స పొందుతూ వచ్చాడు. ఏప్రిల్ నెల చివరలో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన అనుకోకుండా వచ్చిన గుండెపోటుతో మరణించాడు. ఉద్యమతరంలో ఒక్కొక్క కెరటం తీరం చేరి చరిత్రలో కలిసిపోతోంది. బిగించిన పిడికిలికి ప్రాణం పోసిన ఓంకార్ పీడీఎస్‌యూ నేతల జాబితాలో చిరస్థాయిగా ఉంటాడు.

( పిడికిళ్ల ఓంకార్ స్మృతిలో)

బి. నర్సన్

94401 28169

Advertisement

Next Story