- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్ఫూర్తి భావితరాలకు అనుసరణీయం!
వర్తమాన చరిత్రలో ఏదో విధంగా జీవించడమే గొప్పదనంగా మారింది. నిజాయితీగా, విలువలతో కూడిన జీవితం గడపడానికి ఆసక్తి చూపకపోవడం అవాంఛనీయ పరిణామాలకు దారితీస్తున్నది. ఏదో విధంగా జీవించి, తరతరాలకు తరగని ఆస్తిని గడించి, బ్రతుకు చాలించడం వలన ఫలితమేమి? బ్రతికున్నంత వరకు జనం గుర్తించడం, మరణించిన తర్వాత మరచి పోవడం వలన జీవితానికి సార్ధకత చేకూరదు. మరణించినా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా జీవించగలగడం కొందరికే సాధ్యం. అలాంటి జీవితాలు ఆదర్శప్రాయం. భౌతిక దేహాన్ని త్యజించినా, తరాలు మారినా తరగని ఖ్యాతితో మరణమంటూ లేని మహనీయులెందరో మనదేశంలో జన్మించారు. లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీ లాల్ నందా వంటి నిజాయితీ పరులు, నిస్వార్థ దేశభక్తులు జన్మించిన భరత భూమిపై నేటి తరం జనానికి తెలిసిన ఆణిముత్యం అబ్దుల్ కలాం.పేదరికంలో జన్మించి, అంచెలంచెలుగా ఎదిగి, ఎంతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించినా, ఎన్ని అవార్డులు పొందినా, ఎన్ని పదవులు అధిరోహించినా అత్యంత నిరాడంబరంగా జీవించి ప్రజల మన్ననలు పొంది, మరణించిన తర్వాత కూడా భరతజాతి గుండెల్లో సజీవంగా నిలిచిన అబ్దుల్ కలాం ఖ్యాతి చిరస్మరణీయం.
విద్యార్ధులను జ్వలింపచేయాలని..
విజ్ఞాన సాగరాన్ని మధించి, యువ విద్యార్థుల్లో తన ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా చైతన్యాన్ని రగిలించి, భారతదేశ ఔన్నత్యాన్ని శిఖరాగ్ర పథాన నిలబెట్టిన అబ్దుల్ కలాం ఒక మానవతావాది, నిగర్వి. అతనొక విజ్ఞానపు వింధ్యామర చైతన్య స్వరం. కలాం ఆశయాలకు, ఆదర్శాలకు విశ్వమంతా సలాం కొడుతుంటే, భారత జన హృదయాలు ఉప్పొంగిన కెరటంలా ఉల్లాస భరితమై, గర్వంగా తలెత్తుకుని, జయజయధ్వానాలు సమర్పించాయి. కనురెప్పలు కంటికి కాపలా, సైనికులు దేశానికి కాపలా, యువశక్తి దేశానికి ఆలంబన, విద్యార్థుల నైపుణ్యం దేశం అభ్యుదయానికి బాసట. జాతికి జవసత్వాలు కల్పించే విద్యార్థులను అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తీర్చిదిద్దినప్పుడే ప్రగతి పరుగులు పెడుతుంది. విద్యార్థులు కేవలం పట్టాల కోసం యత్నించరాదు. విజ్ఞాన గంధంతో పరిమళించాలి. వ్యక్తిత్వంతో వికసించాలి. నైపుణ్యం కొరవడిన విద్యార్ధుల చదువులు, వ్యక్తిత్వం, వికాసం, వెన్నెముక లేని యువశక్తి... దేశానికి బరువే తప్ప, పరువు కాదు. విద్యార్ధుల్లో విజ్ఞాన పిపాస ఉత్తుంగ తరంగంలా ఎగసిపడాలి. పడిన కెరటం మరింత శక్తిలో లేచి, ఆకాశాన్ని అంటాలి. యువశక్తి సకారాత్మకంగా స్పందించాలి. దేశాభ్యున్నతి కోసం తపించాలి. అలాంటి తపనతో, ఉన్నతమైన, ఉత్తమమైన ఆలోచనలతో విద్యార్థి లోకాన్ని జ్వలింప చేయాలని అహరహం శ్రమించిన నిత్య శ్రామికుడు, స్వాప్నికుడు, యువత స్వప్న సౌధాల సాకారానికి తుదిశ్వాస వరకు యత్నించిన తపస్వి, యశస్వి, విజ్ఞాన గని ఎ.పి.జె అబ్దుల్ కలాం.
భౌతికంగా గతించినా..
కలాం ఒక శాస్త్రవేత్తగా, ప్రజల మనిషిగా, రాష్ట్రపతిగా, క్షిపణి పితామహుడిగా వేనోళ్ళ కొనియాడబడి, చరిత్రలో నిలిచిపోయారు..కలాం రచనలు నేటి యువతకు ఉత్ప్రేరకాలు. కలాం రచనలు, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, ఆయన సందేశాలు నేటి యువతరానికి ఎంతగానో ఉపయుక్తకరంగా ఉంటాయి. కలలు ఆలోచనలుగా పరివర్తన చెంది, ఆలోచనలు ఆచరణ సాధ్యం కావడానికి శ్రమించాలనే కలాం ఆశయాలు విద్యార్థులకు స్ఫూర్తిదాయకం. తాను ఆశించిన స్పప్న సౌధాల సాకారానికి విద్యార్ధులే పునాదులని నమ్మిన అబ్దుల్ కలాం ఆలోచనలకు గౌరవ సూచకంగా ఐక్యరాజ్య సమితి ఆయన జన్మదినమైన అక్టోబర్ 15ని ప్రపంచ విద్యార్థుల దినోత్సవం గా ప్రకటించింది. ఈ ప్రపంచంలో ఎంతో మంది మహనీయులు ఎంతో శ్రమించి తమ తరువాతి తరాల సుఖమయ జీవనానికి బాటలు వేసారు. ఈ ఆధునిక కాలంలో మనముందు నడయాడిన, మనకు తెలిసిన, మనం చూసిన మహా ప్రజ్ఞావంతుడైన శాస్త్రవేత్త, మానవతా వాది, క్షిపణి పితామహుడు, భారత రత్న అబ్దుల్ కలాం జీవితం అన్ని రంగాల్లోని ప్రజ్ఞావంతులకు ఆదర్శప్రాయం కావాలి. ప్రతిభ స్వార్థ ప్రయోజనాలకు కాకుండా, దేశ ప్రయోజనాలకు వినియోగపడాలని చాటి చెప్పి, అంతిమ శ్వాస వరకు, ఆశయాల కోసం, ఆదర్శాల కోసం జీవించి, భౌతికంగా గతించినా భారత ప్రజల హృదయాల్లో సజీవ స్థానం సంపాదించిన కలాం ప్రాతః స్మరణీయుడు. నేటి విద్యార్థి లోకం అబ్దుల్ కలాం జీవితాన్ని, ఆయన సచ్ఛిరిత్రను ఆకళింపు చేసుకుని, నవ్య ప్రపంచ నిర్మాణానికి కృషి చేయాలి.
(నేడు అబ్దుల్ కలాం జయంతి)
సుంకవల్లి సత్తిరాజు
సామాజిక విశ్లేషకులు
97049 03463