ప్రియాంక సెంటిమెంట్ మంత్రం...!

by Ravi |   ( Updated:2023-05-11 02:50:10.0  )
ప్రియాంక సెంటిమెంట్ మంత్రం...!
X

“నన్ను మరో ఇందిరమ్మ అని అంటున్నారు.. ఇలా అంటూ ఉంటే నాపై మరింత బాధ్యత పెరుగుతున్నది.. మీరంతా నన్ను అలా పిలవడం వల్ల నేను అబద్ధాలు మాట్లాడలేను.. ఇక రాష్ట్రానికి నిరంతరం వస్తూ ఉంటాను.. మిమ్మల్ని కలుస్తూ ఉంటాను..” అని ప్రియాంకాగాంధీ సెంటిమెంట్ రాజేశారు. నలభై ఏళ్ళ కింద ఇందిరాగాంధీకి తెలంగాణతో ఉన్న అటాచ్‌మెంట్‌ను ఆమె తెరపైకి తెచ్చారు. 1980లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆమె మెదక్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1984 అక్టోబర్ 31న ఆమె హత్యకు గురయ్యే సమయానికి మెదక్ పార్లమెంటు సభ్యురాలిగానే ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ.. అని దేశవ్యాప్తంగానే గుర్తింపు ఉన్నట్లే తెలంగాణలోనూ అప్పటి తరానికి చెందిన చాలా మందికి ఆమె పట్ల ప్రత్యేకమైన అభిమానం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ ఉన్నదనే తరుణంలో సిటీలో జరిగిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ స్పష్టమైన రాజకీయ వ్యూహంతోనే ఇందిరాగాంధీ ప్రస్తావన చేశారు. నాలుగు దశాబ్దాలకు పైగా తెలంగాణతో గాంధీ కుటుంబానికి అనుబంధం ఉందనే అంశాన్ని తనదైన శైలిలో బహిర్గతం చేశారు. ఈ కారణంగానే “ఇకపైన రాష్ట్రానికి నిరంతరం వస్తూనే ఉంటాను.. మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను..” అని ఆ బంధాన్ని మరింత పెంచే ప్రయత్నం చేశారు.

ఆ ఫ్యామిలీకి తెలంగాణ అటాచ్‌మెంట్

తెలంగాణతో గాంధీ కుటుంబ సభ్యులకు మూడు తరాల అనుబంధం ఉన్నది. మెదక్ నుంచి ఇందిరాగాంధీ పోటీచేసి గెలిచి నాలుగేళ్లకు పైగా ప్రాతినిధ్యం వహించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని దేశానికి పరిచయం చేశారు. ఆ సమయంలోనే హైదరాబాద్‌ సైబర్ టవర్స్ నిర్ణయం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 2004లో కేంద్రంలో యూపీఏ-1 ప్రభుత్వం ఏర్పడినప్పుడు అనంతపురం టూర్‌‌కు వచ్చిన సోనియాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అంకురార్పణ చేశారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యూపీఏ-1 హయాంలోనే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (కనీస ఉమ్మడి ప్రణాళిక)ను చైర్‌పర్సన్ హోదాలో సోనియాగాంధీ హామీ ఇచ్చారు. దానికి అనుగుణంగానే ప్రణబ్‌ముఖర్జీ నేతృత్వంలో దయానిధిమారన్, రఘువంశ్ ప్రసాద్‌ సింగ్‌లతో సబ్ కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఉద్ధరించిందేమీ లేకపోవడంతో 2009 నవంబరు నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణలో ఉద్యమం మొదలైంది. చివరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమై 2013 జూలై 20న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తీర్మానం చేసింది. 2014 ఫిబ్రవరిలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ఈ రకంగా తెలంగాణతో సోనియాగాంధీకి ప్రత్యేకమైన అటాచ్‌మెంట్ ఏర్పడింది.

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైపోతుందని సీనియర్ నేతలు హెచ్చరించినా “తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో హామీ ఇచ్చాం. ఆ మాటకు కట్టుబడి ఉన్నాను. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ఆలోచన లేదు..” అంటూ వారికి నచ్చచెప్పారు. పార్టీ నష్టపోయినా ఫర్వాలేదనే ధైర్యాన్ని ప్రదర్శించారు. ఆమె అంచనాకు తగినట్లుగానే ఆంధ్రప్రదేశ్, రాయలసీమ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. తెలంగాణలో కొద్దోగొప్పో అస్థిత్వాన్ని నిలబెట్టుకున్నది. రాష్ట్ర ఏర్పాటుతో ఆమె ‘తెలంగాణ తల్లి’గా స్థిరపడ్డారు.

రాహుల్‌గాంధీకి తెలంగాణతో పెద్దగా అనుబంధం లేకపోయినా గతేడాది వరంగల్ డిక్లరేషన్ సభకు హాజరై భారీ హామీలతో ప్రజలకు చేరువయ్యారు. ఆ తర్వాత భారత్ జోడో యాత్రతో పలు జిల్లాల ప్రజలతో ముచ్చటించారు. ఇప్పుడు ఆయన సోదరి ప్రియాంకాగాంధీ సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన ‘యువ సంఘర్షణ సభ’కు హాజరై ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ను ప్రకటించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. అమరవీరుల కుటుంబాలకు నెలకు పాతిక వేల రూపాయల చొప్పున పింఛన్ ఇవ్వనున్నట్లు ప్రకటించి వారి సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. సోనియాగాంధీ చొరవ తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తుచేశారు.

ఆకాంక్షల్ని చిదిమేసిన పాలన

“ఏ ఒక్కరి కారణంగానో తెలంగాణ రాలేదు.. వేలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటూ ఉంటే మా అమ్మ సోనియాగాంధీ ఆ ప్రజల ఆకాంక్షలను గుర్తించారు.. రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తేలికైంది కాదు.. కఠినమైన డెసిషన్. అప్పుడు అధికారం గురించో లేక పార్టీ గురించో, రాజకీయాల ప్రయోజనాల గురించో సోనియాగాంధీ ఆలోచించలేదు.. నిజంగా అలాంటి ఆలోచనే చేసి ఉంటే రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకునేవారే కాదు... తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినే రాష్ట్రాన్ని ఇచ్చారు. వారి ఆకాంక్షలను గుర్తించారు..” అని ప్రియాంక చేసిన ప్రస్తావన వెనక తెలంగాణ సెంటిమెంట్ స్పష్టంగా అర్థమవుతున్నది.

“కేసీఆర్ కుటుంబం కోసం ప్రజలు పోరాడలేదు.. ప్రజల హక్కుల కోసమే ఉద్యమం జరిగింది.. నీళ్లు, నిధులు, నియామకాలు దక్కుతాయని ప్రజలు భావించారు.. కానీ ఇప్పుడు అవి అధికార పార్టీ నేతలకు చేరుతున్నాయి.. వారి బంధువులు, స్నేహితులకు ఉద్యోగాలు దక్కుతున్నాయి.. ప్రజల ఆకాంక్షలను అధికార బీఆర్ఎస్ నెరవేర్చడంలేదు..” అంటూ కేసీఆర్ పాలనపై ప్రియాంక ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ ప్రభుత్వం ఉన్నంతవరకు యువతకు న్యాయం జరగదని, కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే మీకూ, మీ భావితరాలకు నష్టం తప్పదంటూ విద్యార్థులను, యువతీ యువకులను ఉద్దేశించి ఆమె స్పష్టమైన మెసేజ్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే భవిష్యత్తు ఉంటుందని నొక్కిచెప్పారు.

యువత త్యాగాలను గుర్తించేదెలా?

గాంధీ కుటుంబంలో మూడు తరాలకు చెందిన నేతలకు తెలంగాణతో ఉన్న అనుబంధాన్ని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు పదేపదే గుర్తుచేస్తున్నారు. నిజాయితీ, ధైర్యం కలిగిన నాయకురాలు ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణాలర్పించారని ప్రియాంక గుర్తుచేయడంతోనే సరిపెట్టుకోకుండా యువత బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదేనంటూ యువతకు, రాష్ట్ర ప్రజలకు గుర్తుచేశారు. దేశం కోసం ప్రాణాలు అర్పించడం తమ కుటుంబానికి స్వీయానుభవమని ఎమోషన్‌ను రాజేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగాన్ని గుర్తుచేసిన ఆమె తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆత్మబలిదానాలు చేసిన యువత త్యాగాలను ప్రస్తావించారు.

తొమ్మిదేళ్ల పాలనను గుర్తు తెచ్చుకుని రానున్న ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇవ్వాలని కోరారు. రానున్న తరాలకు పూర్తి హక్కులు దక్కాలన్నా, రైతులకు గిట్టుబాటు ధరలు లభించాలన్నా, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కావాలన్నా.. నీళ్ళు, నిధులు, నియామకాల నినాదం సాకారం కావాలన్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమనే సందేశాన్ని సరూర్‌నగర్ వేదికగా అందించారు. ఇది హామీ మాత్రమే కాదని, కచ్చితంగా అమలు చేస్తామని ఇస్తున్న భరోసా అని, దీన్ని సాకారం చేయకుండా అధికారం నుంచి తొలగించే స్వేచ్ఛను కూడా ప్రజలకే ఇస్తున్నామంటూ భరోసా నింపే ప్రయత్నం చేశారు.

యూత్ డిక్లరేషన్ మంచిదే కానీ...

“తెలంగాణ అంటే భూమి తునక కాదు.. మ్యాప్‌లో గీసే చిత్రమూ కాదు.. ఇది మీ అందరి తెలంగాణ తల్లి.. మీ అందరి హృదయాల్లో చోటు ఉన్నది..” అని భావోద్వేగాలను రగిలించారు. తొమ్మిదేళ్ళ క్రితం రాష్ట్ర ప్రజల్లో ఉన్న ఆకాంక్షలను మరోమారు గుర్తుచేశారు. ఫస్ట్ టైమ్ రాష్ట్రానికి వచ్చిన ఆమె రాజకీయ ప్రసంగం చేయడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. ఉత్తరప్రదేశ్‌లో వైఫల్యాన్ని మూటగట్టుకున్న ప్రియాంకాగాంధీ తెలంగాణలో ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది కాలమే తేలుస్తుంది. ‘హైదరాబాద్ యూత్ డిక్లరేషన్’ పేరుతో ఐదు హామీలు ఇచ్చిన ప్రియాంకాగాంధీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపడం మాత్రమే కాక యూత్‌లో కొత్త ఆశల్ని చిగురింపజేశారు.

తెలంగాణలో ప్రియాంకాగాంధీ మంత్రం ఫలిస్తుందా? తెలంగాణ ఉద్యమం ఊపుమీద ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పనిచేయని సెంటిమెంట్ అస్త్రం ఇప్పుడు పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి లాభిస్తుందా? గ్రూపులు, వర్గాలుగా చీలిపోయిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీని గాడిన పెట్టడం ఆమెతోని అయ్యే పనేనా? స్థిరమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్న ప్రజలకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రత్యామ్నాయమవుతుందా? ఇందిరాగాంధీని ప్రస్తావించిన ఫార్ములా వర్కవుట్ అవుతుందా? తెలంగాణతో తమ కుటుంబానికి అనుబంధం ఉందన్న ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఏ మేరకు ప్రభావం చూపుతుంది? పార్టీ శ్రేణుల్లో జోష్ సంగతేమోగానీ ఓటర్లను ఆకర్షించడం ఆమెకు సాధ్యమేనా? వీటన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది.

ఎన్. విశ్వనాథ్

99714 82403.

Also Read..

ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ భారీ ప్లాన్.. అన్ని నియోజకవర్గాలను కదిలించేలా వ్యూహం!

Advertisement

Next Story