- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇప్పటికైనా ఆ ఉద్యోగులను క్రమబద్ధీకరించండి!
తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో సర్వతోముఖాభివృద్ధి చెందుతూ, తాను సాధించిన విజయాలను దశదిశల చాటుతూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగం, ఈ దశాబ్దికాలంగా తాము సాధించిన విజయాలను దేశానికి చాటుతూ సగౌరవంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది. దశాబ్దిన్నర కాలం క్రితం తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అనే పదం ఉండకూడదన్నారు నాటి ఉద్యమకారులు, నేటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయనన్నట్లే జూనియర్, డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్‌తో పాటు ఇప్పటివరకు 40 శాఖలలో పనిచేస్తున్న సుమారు 5,544 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీస్‌ను రాష్ట్ర ప్రభుత్వం క్రమబద్దీకరించింది. మరోపక్క గత 20, 30 సంవత్సరాలుగా వంశపారంపర్యంగా పనిచేస్తున్న కావలికార్లను(గ్రామ సేవకులను), రాత పరీక్ష ద్వారా ఎంపికైన వీఆర్ఏలను, అదేవిధంగా టీఎస్‌పీఎస్సీ ద్వారా ఎంపికైన గ్రామ పంచాయతీ సెక్రెటరీల సర్వీస్‌ను కూడా క్రమబద్దీకరించే ప్రక్రియ ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.
వారి డిమాండ్ న్యాయబద్ధమైనదే..
2004వ సంవత్సరంలోకేజీబీవీ పాఠశాలలను భారత ప్రభుత్వం ప్రారంభిస్తే, మన రాష్ట్రంలో 2005-2006లో కేజీబివిలను ప్రారంభించారు. అంటే గత 18 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా దశలవారిగా 475 కేజీబివి పాఠశాలల్లో సుమారు 11వేల బోధన, బోధనేతర సిబ్బంది నియామకమై ఉన్నారు. ప్రారంభంలో ఇవి 10వ తరగతి వరకే బోధిస్తున్నా, తర్వాత కొన్ని పాఠశాలలు ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ అయ్యాయి. కానీ ఆయా తరగతులకు సరిపోయిన ఉద్యోగ, ఉపాధ్యాయులను నియమించకపోవడం వల్ల పని ఒత్తిడి పెరిగింది. ప్రారంభంలో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్, ఆర్‌విఎమ్‌లలో భాగంగాకేజీబీవీలు ఉన్నప్పటికీ ప్రస్తుతం సమగ్రశిక్ష అభియాన్‌లో భాగంగా ప్రభుత్వ, లోకల్ బాడీ ఉపాధ్యాయులలాగా జిల్లా విద్యాశాఖ అధికారి పరిధిలో రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా నియామకం అవుతూ, వారి పర్యవేక్షణలోనే పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియామకం జరిగి రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే వేతనాలు పొందుతున్నారు. కాబట్టి రెగ్యులర్ చేయాలనే వారి డిమాండ్ న్యాయబద్ధమైనదే. రాష్ట్రంలో ఉన్న ఇతర ఆశ్రమ పాఠశాలలతో పోల్చితే వీరి వేతనాలు చాలా తక్కువ. రెగ్యులర్ ఉపాధ్యాయుల కంటే మంచి ఫలితాలు సాధిస్తున్నా, వారి మినిమం బేసిక్‌పేలో సగం జీతం వీరికి లేదు. వార్డెన్ లేకపోవడం వల్ల వారంలో ఒకరోజు తప్పనిసరిగా, ఆదివారాల్లో, పండుగ రోజుల్లో రాత్రి డ్యూటీ చేయాల్సి వస్తుంది. చాలా కాలంగా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరుతున్నప్పటీకి, గత పీఆర్‌సీ కమిషన్ మినిమం టైం స్కేల్ ఇవ్వాలని సిఫారసు చేసినప్పటికీ, 30 శాతం జీతాలు మాత్రమే పెంచారు. మినిమం టైం స్కేల్ ప్రస్తావనే రాలేదు. ఇతర కాంట్రాక్ట్ అధ్యాపక, ఉపాధ్యాయులకు టైం స్కేల్ ఇచ్చి వీరిని విస్మరించారు. ప్రస్తుతం వారి సర్వీసును కూడా రెగ్యులర్ చేశారు, చేస్తున్నారు. కానీ ఎంతో కష్టపడి బాలిక అక్షరాస్యతకు కృషి చేస్తున్నా కేజీబివి ఉపాధ్యాయినిలను మాత్రం రెగ్యులర్ చేయకపోవడం శోచనీయం.
పని ఎక్కువ, పైకం తక్కువ!
దేశవ్యాప్తంగా 2001-2002 సంవత్సరంలో సర్వశిక్ష అభియాన్ ప్రారంభం కాగా, 2018లో దాన్ని సమగ్ర శిక్ష అభియాన్‌గా పేరు మార్చారు. 2004 సంవత్సరం నుంచి అంటే సుమారు 19 సంవత్సరాలుగా మండల వనరుల కేంద్రంలో సీసీఓలు పనిచేస్తున్నారు. గత 17 సంవత్సరాలుగా భవిత కేంద్రాలలో ప్రత్యేక ఉపాధ్యాయులు(ఐఈఆర్పీలు) ఇప్పటికీ కాంట్రాక్టు ప్రాతిపదికనే పనిచేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా సీఆర్పీలు స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ఎమ్‌ఐఎస్ కోఆర్డినేటర్లు, మెసెంజర్స్ ఎంఆర్సీ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. గత 15 సంవత్సరాలుగా మెసెంజర్స్ కూడా ఎంఆర్సి పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. పాఠశాల స్థాయిలో పీటీఐఎస్‌లు, డిఈఓ కార్యాలయంలో ఏపీఓలు, సిస్టం అనాలసిస్టులు, డీపీఓ ఆపరేటర్లు, అటెండర్లు సమగ్ర శిక్ష అభియాన్‌లో భాగంగా అనేక మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్దతిలోనే పని చేస్తున్నారు. వీరు చాలిచాలని వేతనాలతో జీవితాలు కొనసాగిస్తున్నారు. అందరూ అతి తక్కువ వేతనానికే గత పదిహేను, పద్దెనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. తెలంగాణ పల్లెల్లో బాలికల చదువుకు బంగారు బాటలు వేస్తున్నది సమగ్ర శిక్ష అభియాన్ లో భాగమైన కేజీబివి ఉపాధ్యాయినిలు, దివ్యాంగులకు విద్యాబుద్ధులు నేర్పుతున్నది ఐఈఆర్‌పీలు. ఇంతటి సేవలందిస్తున్నప్పటికీ, స్వరాష్ట్రంలో ప్రకటించిన సర్వీస్ రెగ్యులరేజేషన్‌లో వీరి ప్రస్థావన లేకపోవడం శోచనీయం. అలాగే ఈ విద్యా సంవత్సరం కేజీబివి పాఠశాలలు, జిల్లాపరిషత్తు పాఠశాలల కంటే మెరుగ్గా ఉత్తీర్ణత శాతం ఉంది. అలాగే ప్రభుత్వం వారికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు సైతం కల్పించింది. మరి ఓటు హక్కు కల్పించిన ప్రభుత్వం రెగ్యులరైజేషన్ ఊసెత్తకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. కేంద్రప్రభుత్వం వీరికి 40వేలకు పైగా జీతం కోసం చెల్లిస్తున్నా, రాష్ట్రం మాత్రం అందులో సగానికి పైగా కోత పెడుతూ సగం వేతనం మాత్రమే అందిస్తోంది.
ఈ ఉత్సవాల్లో భాగంగానైనా...
సమగ్ర శిక్ష అభియాన్‌లో భాగంగా సీఆర్టీలను జమ్ము కాశ్మీర్, హర్యానాలో, సీఆర్పీలను ఒరిస్సా, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్రలో, ఐఆర్పీలను హర్యానా, కేరళలో రెగ్యూలర్ చేయగా, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు వారికి ఇస్తున్నారు. ఎమ్ఐఎస్ కోఆర్డినేటర్స్‌తో పాటు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులందరిని ఇప్పటికే పంజాబ్, మణిపూర్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడులో రెగ్యులర్ చేశారు. ఢిల్లీలో రెగ్యులరైజేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇన్ని రాష్ట్రాల్లో వారి సర్వీస్ క్రమబద్ధీకరణ సాధ్యం అయినప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు? రెగ్యులర్ ఉద్యోగ, ఉపాధ్యాయులు చేసే పని కాంట్రాక్టు వారు చేసే పని ఒక్కటే అయినప్పటికీ, సమాన వేతనాలు ఇవ్వకపోవడం వెట్టిచాకిరి కాదా? గత 19 సంవత్సరాలుగా పనిచేస్తున్నా రెగ్యులరైజేషన్ దేవుడెరుగు కనీసం మినిమం టైం స్కేల్ అయినా వర్తింపజేస్తే బాగుంటుందని సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు వాపోతున్నారు. ఇలా విద్యావ్యవస్థకు వెన్నముకగా నిలిచిన సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను ముఖ్యమంత్రి ప్రకటన ప్రకారం వెంటనే రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేయడం ఆలస్యమైతే వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనైనా వారిని క్రమబద్ధీకరించి తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఉద్యోగ, ఉపాధ్యాయులకు మరోమారు చాటాలి.
జుర్రు నారాయణ యాదవ్,
తెలంగాణ టీచర్స్ యూనియన్,
94940 19270