పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు..

by Vinod kumar |   ( Updated:2023-05-02 23:30:28.0  )
పౌరసత్వాన్ని వదులుకుంటున్న భారతీయులు..
X

ఇటీవల భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగింది. మెరుగైన జీవన ప్రమాణాల కోసం సంపన్నులు కుటుంబ సమేతంగా విదేశాలకు తరలిపోతున్నారు. ఇతర దేశాల్లో పౌరసత్వం కోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయడానికి కూడా వెనకాడటం లేదు. కోట్లకొద్ది ఆస్తులున్న కుబేరులు దేశం విడిచి వెళ్లడం ఆశ్చర్యంగా ఉంది. అమెరికాలో ఈబీ-5 ఇన్వెస్ట్ మెంట్ వీసా ద్వారా గ్రీన్ కార్డు పొంది పౌరసత్వం పొందుతున్నారు. దీనికి 8 లక్షల డాలర్లు ఖర్చవుతుంది.

ఇలా వచ్చిన వారు 10 మంది స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. పోర్చుగీసు, దుబాయి తదితర దేశాల్లో అయితే గోల్డెన్ వీసా పేరుతో శాశ్వత నివాసం పొందుతున్నారు. దీనికి కూడా భారీగా ఖర్చవుతుంది. ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నిబంధనలు ఉన్నాయి. వాటికనుగుణంగా అమెరికా, ఆస్ట్రేలియా, పోర్చుగీస్, కెనడా, బ్రిటన్, గ్రీస్, దుబాయ్, జర్మనీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలకు ఎక్కువమంది వెళ్తున్నారు.

లోక్‌సభలో మంత్రి వెల్లడి..

గడచిన దశాబ్ద కాలంలో భారతదేశ పౌరసత్వాన్ని 16,21,561 మంది వదులుకున్నారు. 2011లో 1,22,819 మంది, 2012లో 1,20,923, 2013లో 1,31,405, 2014లో 1,29,328, 2015లో 1,31,489, 2016లో 1,41,603 మంది, 2017లో 1,33,049, 2018లో 1,34,561, 2019లో 1,44,017 మంది భారత పౌరసత్వాన్ని వదులుకోగా.. కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న 2020లో 85,256 మంది మాత్రమే భారత్‌ను వీడి వెళ్లారు. 2021లో 1,63,370 మంది, 2022 అక్టోబర్ 31 వరకు ఏకంగా 1,83,741 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ విషయాన్ని సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇటీవల లోక్‌సభలో వెల్లడించారు.

వలసబాటలో సంపన్నులు..

పొట్టచేతబట్టుకుని బతుకుదెరువు కోసం విదేశాలకు తరలివెళ్లడం సహజంగా జరిగేదే. కానీ తాజాగా బాగా సంపాదించిన ధనవంతులు, చదువుకున్న మేధావులు విదేశాలకు తరలిపోతున్నారు. మన దేశంలో మానవ నాగరికతా వికాసంలో విజ్ఞానం, సాంకేతికత, సౌకర్యాలు బాగా పెరిగాయి. అయితే వీటితో పాటు కాలుష్యం కూడా పెరిగింది. అభివృద్ధి, సాంకేతికత పేరుతో విశృంఖలంగా వెర్రితలలేసిన అసాంఘిక పోకడలతో ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. నదులు, నీటిని, భూమిని కలుషితం చేశాం. అనేక రాష్ట్రాల్లో వేర్పాటువాదం, నక్సలిజం, తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో నిత్యం అభద్రత, కాలుష్యంతో బతకలేక సంపన్నులు పాశ్చాత్య దేశాల వైపు చూస్తున్నారు.

పొరుగుదేశాలకు వెళ్లేందుకు క్యూ కడుతూ అక్కడ పౌరసత్వం కోసం పడిగాపులు కాస్తున్నారు. దీని కారణంగా వేలకొద్ది దరఖాస్తులు ఆయా దేశాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్క అమెరికాలోనే శాశ్వత నివాసం కోసం 4,16,000 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 78 వేల మంది అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ తదితర దేశాల్లో భారతీయులు పౌరసత్వం తీసుకున్నారు.

అత్యంత సంపన్నులు ఉన్న దేశాల్లో మన దేశం నాలుగో స్థానంలో ఉంది. అమెరికా, చైనా, జపాన్ తర్వాత భారత్ ఉంది. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారి నుంచి మన దేశానికి విదేశీ మారక ద్రవ్యం భారీగా వస్తున్నప్పటికీ శ్రీమంతులు దేశం వదిలి వెళ్లడం వల్ల ఇక్కడి సంపద కొంత తరలిపోతోంది. దీని ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై ఎంతో కొంత ఉంటుంది.

వలసలకు గాలంలో అమెరికా ముందంజ..

గత మూడేళ్లలో భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో ఎక్కువ మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. 2019లో అమెరికాలో 61 వేల మంది, 2020లో 30,828 మంది.. 2021లో 78,284 మంది పౌరసత్వాన్ని పొందారు. గత ఏడాది భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారిలో సుమారు 48 శాతం మంది అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఆ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. 2021 ఏడాది 23,533 మంది భారతీయులు ఆస్ట్రేలియా పౌరసత్వం పొందారు. 2019లో 21,340 మంది, 2020లో 13,158 చొప్పున ఆస్ట్రేలియా పౌరసత్వాన్ని పొందారు. కెనడా పౌరసత్వం కోసం కూడా భారతీయులు ఎక్కువగానే ఆసక్తి చూపుతున్నారు.

2019, 2020, 2021లో వరుసగా 25,381 మంది, 17,093 మంది, 21,597 మంది చొప్పున భారతీయులు కెనడా సిటిజన్‌షిప్ పొందారు. తర్వాత బ్రిటన్ పౌరసత్వాన్ని పొందిన వారిలో 2021లో 14,637 మంది, 2020లో 6,489 మంది ఉన్నారు. ఇటలీ పౌరసత్వాన్ని 2021లో 5,986 మంది, 2020లో 2,312 మంది ఉన్నారు. న్యూజిలాండ్ పౌరసత్వం విషయంలో 2021లో 2,643 మంది, 2020లో 2,116 మంది ఉన్నారు. సింగపూర్ పౌరసత్వాన్ని పొందిన వారిలో 2021లో 2,516 మంది, 2020లో 2,289 మంది ఉన్నారు. ఇక జర్మనీ, నెదర్లాండ్స్, స్వీడన్, పోర్చుగల్, దుబాయ్, అరబ్ ఎమిరేట్స్, గ్రీస్ తదితర దేశాలకు కూడా భారీగానే తరలివెళ్లారు..

వీరితో పాటు ఉన్నత చదువులు, ఉద్యోగ, ఉపాధి కోసం వచ్చి ఆయా దేశాల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని పౌరసత్వం పొందుతున్న వారి సంఖ్య కూడా బాగా పెరిగింది. ఇలా వచ్చిన వారు గ్రీన్ కార్డ్ పొంది, పౌరసత్వం పొందడానికి రెండు దశాబ్దాలకు పైగా పడుతుంది. ఈ అవకాశాన్ని సంపన్నులు తమకున్న ఆర్థిక వనరులతో త్వరగా పొందుతున్నారు. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న చైనా, భారత్ నుంచి ఈ వలసలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పౌరసత్వం వదులుకుంటున్న దేశాల్లో చైనా ముందువరుసలో ఉంది. ద్వితీయ స్థానంలో భారత్ ఉంది. ముంబై, కలకత్తా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి సంపన్నులు పెద్దఎత్తున విదేశాలకు తరలిపోతున్నారు.

పౌరసత్వం కోల్పోతే..

ప్రపంచంలోని 199 దేశాలకు సంబంధించిన గ్లోబల్ పాస్ పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్‌లో భారతదేశం 85వ స్థానంలో ఉంది. మనదేశ పాస్ పోర్టుపై 59 దేశాలకు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. అత్యంత శక్తివంతమైన పాస్ పోర్టుల జాబితాలో జపాన్, సింగపూర్, అమెరికా తదితర దేశాలు ముందువరసలో ఉన్నాయి. ద్వంద్వ పౌరసత్వ విధానాన్ని భారతదేశం అనుమతించదు. వేరే దేశాల పౌరసత్వం కలిగి ఉన్నప్పుడు మన దేశ పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి. భారత పౌరసత్వం కోల్పోయినప్పుడు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదు. వ్యవసాయ భూములు కొనుగోలు చేయకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అవకాశం కూడా ఉండదు. భారతీయులు తిరిగి స్వదేశానికి రావాలంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ద్వారా, లేదా వీసా ద్వారా మాత్రమే రావాలి.

భారతదేశ సంస్కృతి, నాగరికత అతి ప్రాచీనమైంది. ప్రపంచంలో ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలిచింది. ఆ వైభవ, ప్రాభవాలు క్రమేణా అంతరించిపోతున్నాయి. మెరుగైన విద్యా, వైద్య సౌకర్యాలు, సరళమైన పన్నుల విధానాలు లేకపోవడం, చట్టాలు సక్రమంగా అమలుకాకపోవడం, తరచూ హింసాత్మక సంఘటనలతో శాంతిభద్రతలకు భంగం కలుగుతోంది. ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైంది. దీంతో నిత్యం భయం గుప్పిట్లో బతకలేక వలసపోతున్నారు. దీనికి తోడు పాలనా వ్యవస్థలో ఉన్న అవినీతి, లంచగొండితనం, ఆశ్రిత పక్షపాతం పేరుకుపోయింది. రవాణా, ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సౌకర్యంలాంటివి అధ్వానంగా ఉన్నాయి.

శ్రమదోపిడి, అభద్రతాభావం, స్వేచ్ఛా స్వాంతంత్ర్యం లేకపోవడం, మనిషిని మనిషిగా గౌరవించే తత్వం లోపించడంతో వేరే దేశాలవైపు చూస్తున్నారు. వృద్ధాప్యంలో ఆనందంగా, విలాసవంతంగా బతకాలని కోరుకుంటున్నారు. వివిధ దేశాల్లో లభిస్తున్న సౌకర్యాలు, అక్కడి ప్రజల్లో ఉన్న క్రమశిక్షణ, పరిశుభ్రత, ప్రకృతి వనరులను కాపాడుకోవడంలో ఉన్న శ్రద్ధ, సమయపాలన లాంటి కారణాలతో ఆకర్షితులవుతున్నారు. అవినీతి, లంచగొండితనం, రెడ్ టేపిజం వంటివి మచ్చుకు కూడా కనిపించవు. ముఖ్యంగా తమ జీవితాలకో భద్రత, భరోసా, ప్రశాంతమైన వాతావరణం ఉంటుందనే నమ్మకం భారతీయులను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. దీంతో సంపన్నులు విదేశాల బాట పడుతున్నారు.

మన్నవ సుబ్బారావు,

గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్

99497 77727




Advertisement

Next Story