బీజేపీది జనహితమా.. జగన్ హితమా!?

by Ravi |   ( Updated:2023-06-07 00:30:13.0  )
బీజేపీది జనహితమా.. జగన్ హితమా!?
X

నిజం మాట్లాడితే నిష్టూరంగా వుండవచ్చు ఎవరికైనా. కానీ వాస్తవాలు చెప్పకపోతే మనల్ని మనం మోసం చేసుకోవడం అవుతుంది. రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు అయినా వుండాలి. లేకుంటే తమ కనుసన్నల్లో నడిచే, తమ అడుగులకు మడుగులోత్తే ప్రభుత్వం అయినా వుండాలి. ఇది బీజేపీ లక్ష్యం, గిట్టని రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరించినట్లు, ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం పట్ల వ్యవహరించి వుంటే జగన్ ప్రభుత్వానికి ఒక్క పూట గడిచేది కాదు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్లు జగన్ రెడ్డిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దత్త పుత్రుడుగానే పరిగణిస్తున్నారు.

రాష్ట్రంలో బీజేపీ- వైసీపీ పైకి కత్తులు దూసుకొన్నట్లు కనిపిస్తున్నా రెండు పార్టీల దోస్తీ ప్రత్యక్షంగా కనిపిస్తూనే వున్నది. నాలుగేళ్లుగా బీజేపీ జగన్ రెడ్డి దుష్పరిపాలనకు దన్నుగా నిలుస్తుందన్న విషయం విదితమే. గత నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించింది కేంద్రప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వంపై చార్జిషీట్లు వేస్తున్నాం, వైసీపీ నాయకుల అవినీతి నిగ్గు తేలుస్తాం, మేము జగన్‌కి మద్దతుగా లేము అంటూ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎన్ని బీరాలు పలికినా, కేంద్ర ప్రభుత్వం ఎవరి పక్షమో వారి చర్యలు ద్వారా అవగతం అవుతుంది. బీజేపీ-వైసీపీలను అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదు ప్రజలు.

మోడీ దత్తపుత్రుడు జగన్

జగన్ ప్రభుత్వానికి కేంద్ర అండదండలు దండిగా ఉన్నాయని అనేక అంశాల్లో వెల్లడైంది. వివేకా హత్య కేసులో పాపాలన్నిటికి ప్రత్యక్ష ముద్దాయి ఎంపీ అవినాశ్ రెడ్డే అని తేలినా అతనిపై ఈగ వాలకుండా, అరెస్టు చేయకుండా సీబీఐ ఆడుతున్న నాటకం వెనుక కేంద్ర పెద్దలు వున్నారని జగమెరిగిన సత్యం. బీజేపీ-వైసీపీ మధ్య బంధం లేకపోతే అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్టు చెయ్యరు? ఇదే తరహా ఘటన బీజేపీకి గిట్టని ప్రభుత్వాల్లో జరిగి వుంటే ముద్దాయిని అరెస్టు చేయకుండా ఉండేవారా? తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, కేరళలో జరిగివుంటే కేంద్ర బలగాల సాయంతో అరెస్టు చేసి ఉండేవారు కాదా? విభజన అనంతరం ఏర్పడిన రెవెన్యూ లోటును భర్తీ చెయ్యాలని 2014-15 నుంచి 2018-19 వరకు రెవెన్యూ లోటు నిధులు విడుదల చేయకుండా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును ముప్పుతిప్పలు పెట్టి అవమానించింది బీజేపీ ప్రభుత్వం. ప్రధాన మంత్రి మోడీని, అప్పటి ఆర్థిక మంత్రిని కలిసి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఆర్థిక ఇబ్బందులపై మొరపెట్టుకున్నా, మీకు రెవెన్యూ లోటు నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్లు బుకాయించిన కేంద్ర పెద్దలు. ఇప్పుడు జగన్ రెడ్డి అడగగానే 2014-15 ఆర్థిక సంవత్సరం నాటి రెవెన్యూ లోటు కింద రూ 10,460. 87 కోట్లు ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద మంజూరు చేశారు. గత ప్రభుత్వ హయాంలో అడిగినా విడుదల చేయని కేంద్రం నేడు జగన్ అడగగానే సానుకూలంగా స్పందించి నిధులు విడుదల చేసిందంటే బీజేపీ -వైసీపీ బంధం ఎంత బలంగా ఉందో అర్ధం అవుతుంది. దీంతో మోడీకి జగన్ రెడ్డి దత్త పుత్రుడు అని మరొకసారి రుజువయింది. అందుకే ప్రజలు బీజేపీది జన హితమా లేక జగన్ హితమా అని చర్చించుకుంటున్నారు.

ఏపీ సీఎంపై అంతిష్టం ఎందుకంటే...!

దక్షిణాదిన అత్యంత ఆప్త మిత్రుడుగా జగన్ రెడ్డిని చూస్తున్నారు కమల నాధులు.. వారికి కావాల్సింది వారు ఆడమన్నట్లు ఆడే జగన్ రెడ్డి వంటి ముఖ్యమంత్రి కావాలి. అందుకే రాష్ట్రంలో అరాచక పాలన చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, ప్రతిపక్షాల సభలను,రోడ్ షోలను అడ్డుకోవడం, నిర్బంధించడం వంటి చర్యలతో రాక్షస పాలన సాగించినా, ఆర్థిక అరాచకానికి పాల్పడి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా ఒక్క మాట అనలేదు కేంద్ర ప్రభుత్వం. కేంద్రం అండదండలు లేకుండా ఇంత నిరంకుశంగా, ఫాసిస్టు పాలన సాగిస్తున్నా జగన్ ప్రభుత్వానికి అండగా నిలిచింది బీజేపీ. తొమ్మిది ఏళ్లుగా బీజేపీ దగా పాలనను రాష్ట్ర ప్రజలంతా చూస్తూనే వున్నారు. రాష్ట్రానికి బీజేపీ అనేక అంశాల్లో ద్రోహం చేసింది. విభజన చట్టంలోని ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. తానే చట్ట సభల్లో, బహిరంగ సభల్లో ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా ఆంధ్ర ప్రజలను అవమానించింది. పార్లమెంటులో ఏ బిల్లు పెట్టినా, అదెంత వివాదస్పద అంశమైనా వైసీపీ ఎంపీలు జై కొడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని జగన్‌ ప్రభుత్వం తు.చా తప్పక అమలు చేస్తోంది. పైగా రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించినా, కేంద్రాన్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా జగన్‌ సహకరిస్తున్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించాలని కేంద్రం ఆదేశిస్తే బీజేపీ రాష్ట్రాల కంటే ముందుగానే ఏపీలో అమలు చేశారు. రాష్ట్రాన్ని బాగు చేయడానికి సహకరించక పోయినా పర్వాలేదు. కానీ రాష్ట్రాన్ని సర్వ నాశనం చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచింది బీజేపీ. రాష్ట్రానికి ద్రోహం చేస్తూ, ప్రజా ప్రయోజనాలకు హాని చేస్తూ, రాష్ట్ర హక్కులు హరించింది బీజేపీ.

పోలవరంని ముంచేశారు...

రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు దాటినా ఆంధ్రప్రదేశ్‌ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్, జాతీయ ప్రాజెక్టుగా పోలవరం నిర్మాణం, కడప ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి అంశాలను పార్లమెంటే ఆమోదించింది. తర్వాత అదే చట్టాన్నిపార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం చాపచుట్టింది. ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు కాలేదు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని, వంద శాతం నిధులు కేంద్రమే ఇవ్వాలని విభజన చట్టంలో స్పష్టంగా ఉన్నప్పటికీ తొమ్మిదేళ్లు దాటినా ప్రాజెక్టు పూర్తికి అవసరమైన నిధులను ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మడత పేచీలు పెడుతున్నది. నిర్వాసితులకు పునరావాసం తమ బాధ్యత కాదన్నట్లు కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తున్నది. 2013-14 అంచనా వ్యయం రూ 20,398,61కోట్లకే పరిమితం అవుతామని, ప్రాజెక్టు భూసేకరణకు నిధులు కేంద్రం భరించదని, పోలవరం నిర్వాసితుల విషయంలోనూ కేంద్రం చేతులెత్తేసి ప్రాజెక్టు భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేశారు.

విశాఖ ఉక్కు అమ్మడం ఖాయం

బీజేపీ రాష్ట్రానికి తలపెట్టిన మరో అతిపెద్ద ద్రోహం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ. రాష్ట్రానికే మణిహారం అయిన విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా అమ్మెయ్యాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం నయవంచనకు పరాకాష్ట. మన హక్కుగా చెప్పుకునే విశాఖ ఉక్కును ముక్కలు,ముక్కలు చేసి తెగ నమ్మడానికి కేంద్రం శరవేగంగా ముందుకుపోతున్నది. రాజధాని నిర్మాణానికి భూమి పూజ చేసి, ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆ హామీకి విలువ లేకుండా పోయింది.నేడు ఢిల్లీ వంటి రాజధాని దేవుడెరుగు అసలు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినా నోరు మెదపడం లేదు. నూతన రాజధాని అమరావతికి ప్రధాని చేసిన శంకుస్థాపనకు విలువ లేకుండా చేశారు. అమరావతి రెక్కలు విరిచినా కేంద్ర ప్రభుత్వం మాట్లాడలేదు. బహుళ నాల్కలతో వ్యవహరిస్తూ, అమరావతి పక్షాన నిలిచినట్టుగా నటిస్తున్నది బీజేపీ.

అడ్రస్ లేని రాజధాని

గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఇళ్ల స్థలాల పేరుతో ఆర్ 5 జోన్ తెచ్చి దానిని జగన్ ప్రభుత్వం ధ్వంసం చేసినా కేంద్రం నోరు మెదపడం లేదు . రాష్ట్ర విభజన జరిగి తొమ్మిదేళ్లు అయినా ఇంకా రాజధాని విషయంలో అనిశ్చితి కొనసాగుతున్నా పట్టించుకోవడం లేదు. రాజధాని లేకుండా ఆంధ్రప్రదేశ్ దయనీయ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. ఈ మొత్తం వ్యవహారంలో కేంద్రమే అసలు దోషి. కేంద్రం తలచుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని నాటకానికి క్షణాల్లో తెరదించగలదు. ఏపీ ప్రజలు ఏమి పాపం చేశారని కేంద్ర పెద్దలు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? కేంద్ర ప్రభుత్వ అండ లేకుండా జగన్ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి అప్పులు మీద అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా అంచుకు చేరుస్తారా? దొంగచాటుగా కేంద్రం కళ్ళు కప్పి, రిజర్వ్ బ్యాంక్ కళ్ళు కప్పి, ఇష్టానుసారం అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా కేంద్రం కన్నెర్ర చేయకుండా అదనపు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇస్తుంది. కాబట్టి పరిణామాలు అన్నీ అర్ధం చేసుకున్న జనం అసలు బీజేపీది జనహితమా లేక జగన్ హితమా అని ప్రశ్నిస్తున్నారు.

నీరుకొండ ప్రసాద్

98496 25610

Advertisement

Next Story

Most Viewed