- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సామాజికశాస్త్రం:రెడీమేడ్ నేతల రాజకీయం
నాయకత్వం అనేది కొనుక్కుంటేనో, అమ్ముడుపోతేనో, పార్టీలు ఫిరాయిస్తేనో వచ్చేది కాదు. రాజకీయ నాయకత్వం వహించేవారు ప్రజలకు భరోసా కల్పించాలి. దానిని నిలుపుకోవాలి. నాయకత్వం ఓ గొప్ప బాధ్యత. నాయకులు ప్రజలందరినీ తనవారుగా ప్రేమించాలి. వారికే సమాజ స్థితిని ఉన్నతంగా మార్చే అవకాశం ఉంటుంది. స్వార్థ రాజకీయాల కారణంగా ఈ సమాజం ఎటుపోతోందో, ఏమవుతోందో ఎవ్వరూ, ఏ విధంగానూ పట్టించుకోవడం లేదు. మానవత్వం మచ్చుకు కూడా కనిపించడం లేదు.
లాటరీల మాదిరిగా పదవులు కొనుగోలు చేసే నాయకత్వం వలన ప్రజల స్థితిగతులు ఏ మాత్రం మారడం లేదు. ప్రజల చుట్టూ తిరిగేవారే నిజమైన నాయకులవుతారని గ్రహించడం లేదు. సుదీర్ఘకాలం ప్రజా క్షేత్రంలో పని చేసేవారికే ప్రజా సమస్యలు అర్థమవుతాయి. బాధ్యతల మీద స్పష్టమైన అవగాహన ఉంటుంది. వారు ఎక్కడ ఉన్నా ప్రజలకు ఉపయోగపడుతూనే ఉంటారు. పదవులు ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన, ఈ సమాజం పక్షాన బాధ్యతగా ఉంటారు.
హోదా కోసమే పాట్లు
ప్రస్తుత పరిస్థితులలో రాజకీయం సామాజిక బాధ్యత అన్న సంగతిని అటు పాలకులు, ఇటు పార్టీల అధినేతలు మరిచిపోయారనిపిస్తోంది. ప్రజాస్వామ్య విలువలు తెలిసిన నాయకుల సంగతి అటుంచితే, సూట్‌కేస్‌లలో డబ్బులు అప్పజెప్పి టికెట్లు తెచ్చుకొనే రెడీమేడ్ నాయకులు ఎక్కువవుతున్నారు. 'జనంలో నుంచి, జనం కోసం పుట్టిన నాయకులు' కాకుండా 'ధనం నుంచే, ధనం ఉంటే చాలు అధికారం దక్కించుకోవచ్చనే నాయకుల' కారణంగా ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయి.
ప్రజల కోసం, పార్టీని నమ్ముకుని, పార్టీలో దశాబ్దాల కాలం పాటు ఉన్న కార్యకర్తలకి రాజకీయ అవకాశాలు దక్కడం లేదు. ఈ విషయంలో రాజకీయ పార్టీల తీరు మారడం లేదు. ఒకప్పుడు నాయకులు ప్రజాసేవ కోసం రాజకీయాలు చేస్తే, నేడు రాజకీయ హోదా అనుభవించడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల సమయానికి రెడీమేడ్‌గా సూట్ కేసులతో అధినేతలను ప్రసన్నం చేసుకుని, పార్టీ టికెట్ సంపాదించి రాజకీయ హోదాను అనుభవిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇది అధికం అయింది. సామాన్యులు, మధ్యతరగతికి చెందినవారు కనీసం సర్పంచుగా కూడా పోటీ చేయాలంటే భయపడేలా నేటి రాజకీయం ఉంది. స్వచ్ఛమైన నాయకత్వం, జనాదరణ ఉన్న నాయకులు ధనంలో నుంచి పుట్టే నాయకుల ముందు వంచనకు గురవుతున్నారు.
ధనం, వారసత్వం అర్హత అన్నట్లుగా
ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడినవారు అనేక మంది ఉన్నారు. దశాబ్దాల కాలం పాటు నమ్మిన జెండాను అలాగే పట్టుకొని నాయకుని వెంట నడిచే కార్యకర్తల బతుకులు మాత్రం బజారు పాలవుతున్నాయి. ఎన్నికలంటేనే డబ్బు అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. దీంతో నిజమైన నాయకులు కనుమరుగైపోతున్నారు. వారసత్వ రాజకీయాలు సైతం పెరిగిపోయాయి. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు తమ వారసులను తెర మీదకు తెచ్చి ధన, వారసత్వ రాజకీయాలకు శ్రీకారం చుడుతున్నారు. తెలంగాణలో భూస్వాములు, కోటీశ్వరులే ఎన్నికలలో పోటీ చేయచ్చనే విధంగా రాజకీయాలు మారిపోవడం బాధాకరం.
తెలంగాణ సాధన కోసం సబ్బండ వర్ణాలు, యువత ప్రాణాలకు తెగించి కొట్లాడిన వారున్నారు. విద్యార్థి నాయకులుగా నమ్మిన పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేసే వారికి సైతం భంగపాటు తప్పడం లేదు. కార్యకర్తల శ్రమను, నాయకత్వాన్ని గుర్తించి అవకాశాలు కల్పించడంలో రాజకీయ పార్టీలు విఫలమవుతున్నాయి. ఈ దేశానికి నిజమైన సంపద యువతేనన్న స్వామి వివేకానందుడి మాటను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడం లేదు. యువశక్తి అధికంగా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ, యువతలో రాజకీయ చైతన్యం తక్కువే. ఇది కూడా ఆయా రాజకీయ పార్టీలకు కలిసి వచ్చేలా ఉంది. ఒకప్పుడు అస్సాం రాష్ట్రంలో విద్యార్థి నాయకులు ప్రపుల్ల కుమార్ మహంతా, భృగు కుమార్ ఫుకాన్ 'అస్సాం గణ పరిషత్' పార్టీ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
వారికే పథకాలు, పదవులు
నాయకుల కనుసన్నలలో మెదిలినోళ్లకే సంక్షేమ పథకాలలో ముందుగా అవకాశాలు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి జెండాలు మోసిన వారికి దిక్కు లేదు. నాయకుడికి జై కొట్టినవారు వారి సుపుత్రులకు కూడా జై కొడుతున్నారు. రెడీమేడ్ నాయకులను భుజాన మోస్తూ బలవుతున్నారు. గుణాత్మక విలువలతో కూడిన రాజకీయ నాయకత్వాన్ని ఏర్పాటు చేయడంలో యువత చైతన్యం కావాల్సిన అవసరం ఉంది.
అలాగే యువతకు రాజకీయాలలో అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ధనం ఉన్నోళ్లకు కాకుండా, ప్రజల పట్ల విశ్వాసం గా ఉన్నవారిని రాజకీయాలలో భాగస్వాములను చేసినప్పుడే స్వచ్ఛమైన, మానవీయ విలువలు కలిగిన నాయకత్వం ఏర్పడుతుంది.
సంపత్ గడ్డం
దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు
కామారెడ్డి, 78933 03516