హేతుబద్దీకరణ టీచర్ల సర్దుబాటుకేనా?

by Ravi |   ( Updated:2023-08-17 00:15:57.0  )
హేతుబద్దీకరణ టీచర్ల సర్దుబాటుకేనా?
X

ప్రాథమిక బడులలో ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తాం, పండిట్, పీఈటీ పోస్టులను అప్‌గ్రేడ్ చేస్తాం, టీచర్లకు ప్రమోషన్‌లు ఇస్తాం అని ముఖ్యమంత్రి హామీలు ఇస్తుంటే క్షేత్రస్థాయిలో అధికారులు మాత్రం దానికి భిన్నంగా హేతుబద్దీకరణ అంశాన్ని తెరమీదకు తీసుకురావడం ఉపాధ్యాయ లోకాన్ని విస్మయానికి గురిచేస్తున్నది. ఈ హేతుబద్ధీకరణ వలన ప్రభుత్వ బడులలో చదివే పేద పిల్లలు చదువుకు దూరమవుతున్నరని వివిధ వార్తాపత్రిక కథనాలు, సర్వేలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బడుల హేతుబద్దీకరణను స్వాగతించడమంటే ప్రభుత్వ విద్యావ్యవస్థకు గొడ్డలిపెట్టే అనే వాస్తవాన్ని గుర్తించాలి.

ప్రభుత్వ బడులు నిర్వీర్యం చేసేందుకే..

రాష్ట్రంలో కొన్ని చోట్ల పిల్లలు ఎక్కువగా ఉన్నచోట టీచర్లు తక్కువగా ఉన్నారు. పిల్లలు తక్కువగా లేదా అసలు లేనిచోట టీచర్లు ఎక్కువ సంఖ్యలో పనిచేస్తున్నరనేది వాస్తవం. ఈ అసమతుల్యత సరిచేయడానికి హేతుబద్దీకరణ ప్రక్రియను చేపట్టాలి. ఏ ఉపాధ్యాయుడు పాఠాలు బోధించకుండా ఖాళీగా కూర్చుని జీతాలు తీసుకోవాలని భావించాడు. తప్పకుండా విద్యార్థి టీచరు నిష్పత్తి సవరించాల్సిందే. అయితే, హేతుబద్దీకరణ చేయడానికి కారణం సహేతుకమై ఉండాలి. కేవలం పిల్లలు లేరనే కారణంతో హేతుబద్దీకరణ చేపడితే సర్కారు బడులు మూతపడే అవకాశమే ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వ బడులు నిర్వీర్యమైపోతే అందరికీ విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.

ఒక గ్రామంలో, ప్రాంతంలో ఉన్న సర్కారు బడులలో పిల్లలు తగ్గడానికి, చేరకపోవడానికి గల కారణాలను అన్వేషించాలి. ఈ ప్రక్రియలో ఆయా గ్రామ ప్రజలు, విద్యావేత్తలు, మేధావులు, విద్యా కమిటీ సభ్యులను భాగస్వాములను చేయాలి. వీరందరితో ఏర్పాటైన కమిటీ రూపొందించిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలి. ఇప్పటివరకు అలాంటి సమగ్ర పరిశీలన జరిగిన దాఖలాలే లేవు. అసలు మన పాఠశాల విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ పాఠశాలలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా పాఠశాలలు మొదలగునవి ప్రభుత్వం భాగస్వామ్యంతో నడుస్తుండగా కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ పాఠశాలలు, ఎయిడెడ్, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలున్నాయి. పిల్లలు ఇన్ని రకాల పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో సంఖ్య ఎలా పెరుగుతుంది. అప్పటికీ టీచర్లు బడిబాట పేరుతో గ్రామాల్లో, బస్తీల్లో తిరుగుతూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు తమ వంతు కృషి చేస్తునే ఉన్నారు. వారి కృషికి చేయూతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించాల్సిన అధికారులు హేతుబద్దీకరణ పేరుతో బడుల విలీనానికి, మూసివేతకు సిద్ధపడడం విచారకరం.

డ్రాప్ అవుట్స్ పెరుగుతాయి..

విద్యాహక్కు చట్టంలో లోపాలున్నాయని వాటిని సవరించాల్సిన అవసరం ఉందని గతంలో ముఖ్యమంత్రే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు అటువంటి లోపభూయిష్టమైన చట్టాన్ని పరిగణలోకి తీసుకొని హేతుబద్దీకరణ చేయడం భావ్యం కాదు. దీని వలన ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలకు మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ముందుగా తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. తదుపరి పిల్లల సంఖ్యకు అనుగుణంగా టీచర్ల నియామకం చేపట్టాలి. గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం ఇంగ్లీషు మీడియం బడులలో తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలని ఆసక్తి చూపుతున్న తరుణంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉందని వాటిని మూసివేయడం అంటే వారిని ఇంగ్లీషు మీడియం విద్యకు దూరం చేసినట్లే అవుతుంది. అంతేకాదు బడుల సంఖ్య తగ్గడం ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడానికి ఇష్టపడని పిల్లలు బడిమానివేసే అవకాశమే ఎక్కువ. ముఖ్యంగా బాలికల డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. బాలికా విద్యను ప్రోత్సహించాల్సిన సమయంలో వారిని బడికి దూరం చేసే విధంగా హేతుబద్దీకరణ జరపడం సరికాదు.

సర్కారు బడుల మూసివేతకు ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘం కూడా వంతపాడలేదు. అవసరమైతే ప్రభుత్వ బడుల పరిరక్షణకు ఎలాంటి ఉద్యమాలకైనా వెనుకాడేది లేదన్న విషయాన్ని ప్రభుత్వానికి ఇప్పటికే స్పష్టంగా సూచించాయి. ప్రభుత్వం మన ఊరు మన బడి పేరుతో పాఠశాల రూపు రేఖలను మారుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. అదే కోవలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్దేందుకు నడుం బిగించాలి. ప్రాథమిక స్థాయిలో తరగతి గదికో ఉపాధ్యాయున్ని నియమించి నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రణాళికలు రూపొందించాలి. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు కల్పించి ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరతను నిరోధించాలి. టీచరు పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల దిశగా అడుగులు వేయాలి తప్ప హేతుబద్దీకరణ పేరుతో బడుల విలీనం, మూసివేత ఆలోచనలకు స్వస్తిపలకాలి.

ఏ.వి సుధాకర్

అసోసియేట్ అధ్యక్షులు, STUTS

90006 74747

Advertisement

Next Story

Most Viewed