భరతజాతి ఆణిముత్యాలు

by Ravi |   ( Updated:2024-02-17 00:30:50.0  )
భరతజాతి ఆణిముత్యాలు
X

ఒక్క ఏడాదిలోనే ఐదుగురికి భారతరత్న పురస్కారాలను ప్రకటించి ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను గుర్తు చేసుకుంది. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కృష్ణ అద్వానీతో పాటు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి జీవితాంతం కృషిచేసిన బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కి తొలివిడతగా అత్యున్నత పురస్కారాలు ప్రకటించిన కేంద్రం, అదే కోవలో మరో ముగ్గురు మహనీయులకు భారతరత్న ప్రకటించింది.

అత్యున్నత పురస్కారంతో గౌరవించి..

సంస్కరణల రూపశిల్పి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఆహరోత్పత్తుల్లో స్వయం సమృద్దికి కృషిచేసిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, కర్షక పక్షపాతిగా ఎనలేని సేవలందించిన ఐదో మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ లను అత్యున్నత పురస్కారాలతో గౌరవించింది కేంద్రం. వ్యవసాయరంగ సంస్కరణలపై ధీరోదాత్తుడిగా పోరాడిన లోక్‌దళ్ నేతగా చరణ్‌సింగ్ పేరు పొందారు. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చి హరిత విప్లవానికి ఆద్యునిగా గణుతికెక్కిన శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. ఆహారధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడంలో అవిరళ కృషిచేసిన శాస్త్రజ్ఞుడు. వివిధ రంగాల్లో సమున్నత సేవలందించిన వీరికి అత్యున్నత పురస్కారంతో గౌరవించుకోవడం మన పాలకుల ప్రధాన బాధ్యత కర్తవ్యం కూడా.

ఆపద్బాంధవుడు పీవీ

ప్రపంచంలోనే అత్యంత అప్పులున్న మూడో దేశంగా నిలిచిన భారత్‌ను ఆదుకునేందుకు ఆ సమయంలో ప్రధాని అయిన పీవీ నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్‌ను తోడుగా చేసుకుని సంస్కరణలను పరుగులు పెట్టించారు. లైసెన్స్ రాజ్‌ను బ్రేక్ చేసి విశ్వవిపణికి భారత్ ను అను సంధానం చేసారు. 92 నాటికి ఆర్థిక సంక్షోభం అదుపు చేసి తాను పదవి నుంచి దిగిపోయే నాటికి జీడీపీ వృద్ధిని 7.6 శాతానికి చేర్చిన ఆర్థిక రంగ నిపుణుడు పీవీ. విదేశాంగ విధానంలో తూర్పువైపు చూపు విధానానికి మన పీవీయే ప్రాణం పోసారు. అంతర్గత భద్రతకు పెను సవాళ్లు ఎదురవుతున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్ లో శాంతిభద్రతలు, ఈశాన్య రాష్ట్రాల్లో సామరస్య వాతావరణానికి పీవీ విశేష కృషి చేసారని నిస్సందేహంగా చెప్పాలి 'భారతరత్న'కు పీవీ అర్హుడని చెప్పడం కంటే పీవీకి భారతరత్న ప్రధానంతో ఆ పురస్కారానికే గౌరవం వచ్చిందని భావించాలి.

-సభావట్ కళ్యాణ్

ఏబీవీపీ రాష్ట్ర నాయకులు

90143 22572

Advertisement

Next Story

Most Viewed