ఊరికి 'ఆరోగ్యమిత్ర' కావాలి

by Ravi |   ( Updated:2022-09-03 18:35:14.0  )
ఊరికి ఆరోగ్యమిత్ర కావాలి
X

మ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకం 'ఆరోగ్యశ్రీ' తెల్ల రేషన్ కార్డు ఉన్నవారందరూ ఈ పథకానికి అర్హులు.ఈ పథకం గురించి పేద ప్రజలకు అవగాహన కలిగించడానికి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'ఆరోగ్యమిత్ర'ను నియమించారు. 'ఆరోగ్యమిత్ర' ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గ్రామాలకు చెంది ఉండాలి. ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులను మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జబ్బులను గుర్తించి ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్‌కి పంపించి, ఉచిత చికిత్స అందే విధంగా సహాయ సహకారాలు అందించాలి.

గ్రామాలలో పర్యటించి ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఆరోగ్యశ్రీ చికిత్స పొందిన వారిని పరామర్శించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యుల మీటింగ్‌లో పాల్గొనాలి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌లో పనిచేసే స్పెషలైజేషన్ డాక్టర్లు నెలకు ఒకసారి ప్రతి గ్రామాన్ని సందర్శించి, ప్రజలకు ఉచిత స్క్రీనింగ్, వైద్యం అందించేవారు. వివిధ రకాల పరీక్షలు నిర్వహించి, సమస్యలు ఉంటే 'ఆరోగ్యమిత్ర' ద్వారా కార్పొరేట్ ఆస్పత్రికి రిఫర్ చేసేవారు. మెడికల్ క్యాంపుల నిర్వహణకు సహకరించేవారు.

ఈ విధంగా ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందించడంతో పేద ప్రజలు సంబంధిత ముందస్తు జబ్బులు ఉంటే జాగ్రత్త పడేవారు. రోగి డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు రోగి కోలుకున్నాక ఫాలో అప్ మెడిసిన్ ఇవ్వడం, తేదీలను గుర్తుచేసి ఉచితంగా మందులు అందే విధంగా 'ఆరోగ్యమిత్ర' సహకరిస్తాడు. రోగుల నుంచి కార్పొరేట్ ఆసుపత్రి డబ్బులు వసూలు చేస్తే తిరిగి ఇప్పించే విధంగా కృషి చేస్తాడు. 'ఆరోగ్యమిత్ర' తన విధిలో భాగంగా 14 రకాల రిజిస్టర్లు మెయింటెన్ చేస్తారు.

దోపిడికి దారులు

ఇన్ని కర్తవ్యాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందడంలో కీలక పాత్ర పోషిస్తున్న 'ఆరోగ్యమిత్ర'లను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి ఎలాంటి జీఓ లేకుండా, ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు, ప్రభుత్వ హాస్పిటల్స్‌కు పంపించారు. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గ్రామీణ ప్రజలు ఆరోగ్యశ్రీలో లబ్ధి ఎలా పొందాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఉచితంగా పొందాల్సిన చికిత్సను, అవగాహన లేక ప్రైవేటు ఆసుపత్రి వెళ్లి దోపిడీకి గురి అవుతున్నారు.

'ఆరోగ్యమిత్ర' లేకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద చికిత్స తీసుకున్న రోగుల నుంచి కొన్ని ప్రైవేట్ నెట్‌వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాలు పేషెంట్ దగ్గర ఏదో ఒక రూపాన డబ్బులు వసూలు చేస్తున్నారు. 'ఆరోగ్యమిత్ర'ను నిలువనివ్వడం లేదు. రోగి డిశ్చార్జి రోజు వారికి అనుకూలంగా ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఫీల్డ్ లెవెల్‌లో ఎంక్వయిరీ చేయడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 'ఆరోగ్యమిత్ర' లేకపోవడంతో వారి దోపిడికీ అడ్డులేకుండా పోయింది. వారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో లేకపోవడంతో పేద ప్రజలు ఉచిత చికిత్స అందుకోలేక పోతున్నారు. ప్రభుత్వం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 'ఆరోగ్యమిత్ర' సేవలు కొనసాగేలా చూడాలని కోరుతున్నాం.

గౌతమ్ కేయూ

అంబేద్కర్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి

77021 53467

Advertisement

Next Story