తెలుగు పరిరక్షణ మన బాధ్యత!

by Ravi |   ( Updated:2023-08-29 00:15:58.0  )
తెలుగు పరిరక్షణ మన బాధ్యత!
X

మన మాతృభాషను రక్షించుకోవాలంటే అందులో ముఖ్యపాత్ర తెలుగువారిదే. తెలుగు నేర్పటం ప్రతి తల్లి బాధ్యత. ఎందుకంటే ‘అమ్మ ఒడి మొదటి బడి’. పిల్లవాడికి ఏ మాత్రం అక్షర జ్ఞానం లేకపోయినా, తన భాష ఇదీ అని తెలియకపోయినా తన అమ్మ నేర్పుతుంది కాబట్టి అది అమ్మ భాష! ఇది పిల్లల నరనరాల్లో జీర్ణించుకుపోతుంది‌. కాబట్టి తల్లులందరూ చిన్నప్పటినుంచి తెలుగుభాషనే పరిచయం చేయాలి.

ఫారిన్ వాతావరణం సృష్టిస్తూ...

ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ పదాలను ఉగ్గుపాలతో నూరిపోస్తున్నారు. బడిలో చెప్పవలసిన అవసరం లేకుండా చేస్తున్నారు. ఆంగ్లేయుల అధికారం అంతరించినా వారి పోకడలు ఏమాత్రం తగ్గలేదు. కామన్వెల్త్ దేశాలలో విస్తరించినట్లు వారి భాషను ఖండాంతరాలు వ్యాపింపచేసింది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం మాద్రిగా నేడు ‘రవి’ భాషగా ఇంగ్లీష్ కొనియాడబడుతోంది. తెలుగుభాష మాట్లాడేవారు తగ్గిపోతున్నారని ‘తెలుగుభాష’ ప్రమాద స్థితిలో ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. మన దేశంలో సైతం రెండవ స్థానం నుంచి నాలుగవస్థానానికి పడిపోయినది. పక్క రాష్ట్రాలవారు వారి భాషపై మమకారం పెంచుకుంటూ ఉంటే, మన తెలుగును మనతో సహా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. పక్క రాష్ట్రాలలో భాషా ఉద్యమాలు జరుగుతూ ఉంటే. మనవారు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది ఒక్కరిద్దరి ఉద్యమాల వల్ల సాధ్యము కాదు. ప్రతి తెలుగువాడి గుండెలో ప్రతిస్పందన వస్తేనే విజయం సాధిస్తాము.

నేడు బడిలో అడుగుపెట్టిన రోజే ఏబీసీడీల మెట్లు ఎక్కిస్తున్నారు. అనవసర వ్యామోహంతో ఇంగ్లీష్ పదాలు పలికిస్తున్నారు. పిల్లవాడిని చిన్నప్పుడే అమెరికా పంపుతున్నట్లు, విదేశాలలో ఉన్న వాతావరణం సృష్టిస్తున్నారు. ఈ ధోరణి మంచిది కాదు. మనం మారాల్సిన అవసరం ఉంది. ఇంగ్లీష్ మాట్లాడడం గౌరవప్రదంగా భావించి పిల్లలకు అమ్మ భాషను క్రమేపీ దూరం చేస్తూ ఇంగ్లీష్ గొప్పభాష అని పిల్లవాడికి నూరిపోస్తున్నాము. ఈనాడు విద్యాలయాలు మొట్టమొదట ఇంగ్లీష్ నేర్పిన తర్వాతే తెలుగు అక్షరాలు నేర్పుతున్నారు. కారణం తెలుగు కష్టమంట! అలా తెలుగు నేర్చిన విద్యార్థులు కనీసం తెలుగు చక్కగా రాయడానికి చదవడానికి రావడం లేదు. మాతృభాష వస్తేనే మిగతా భాషలు సులువుగా నేర్చుకోవచ్చు. ఈ విషయం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు గుర్తించి పిల్లలకు మాతృభాషను నేర్పించాలి.

నేడు.. ఏ భాష అయినా ఒక్కటే..

తల్లి భాషలో విద్యాబోధన నేటి తరానికి చాలా అవసరం. ప్రతి విద్యార్థి తన నైపుణ్యం మాతృభాషలోనే సాధించగలడు. ఇతర భాషల్లో అది సాధ్యము కాదని ఎందరో ప్రముఖులు మేధావులు చెప్పారు. అంబేద్కర్ సైతం మాతృభాషలోనే పిల్లలకు మనోవికాసం కలుగుతుందని, నిర్బంధ విద్యావిధానం పనికిరాదని చెప్పాడు. కానీ తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా చూడండి.... ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలు తెలుగు మాధ్యమంలో విద్యాబోధన చేయడమే లేదు. పైగా తెలుగు మాట్లాడితే ఆంక్షలు విధిస్తున్నారు. దానికి తోడు ప్రభుత్వం కూడా తెలుగు మాధ్యమాన్ని తీసివేసి ‘ఆంగ్ల మాధ్యమాన్ని’ ప్రోత్సహిస్తోంది. తెలుగుభాష మాట్లాడుతున్న సందర్భంలోనూ ఈ మధ్యకాలంలో ఆంగ్ల పదాలు ఎక్కువగా చేర్చి మాట్లాడుతున్నాము. అందుకు కారణం నేటి విద్యా విధానం, నివురుకప్పిన నిప్పులా ఆంగ్లం మనందరిలోనూ ప్రవేశిస్తున్నది. మనం ఈ విషయం తెలుసుకొని సాధ్యమైనంత వరకు తెలుగు పదాలను ఉపయోగించాలి.

ఆంగ్లం రాకపోతే ప్రాణం పోతుందా?

నేడు ఎక్కడికి వెళ్ళినా దుబాసీల సహాయంతో ఏ భాషలోకైనా మార్చుకొని మాట్లాడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేవు. దుబాసీలు తర్జుమా చేసి అక్కడి వారికి వినిపిస్తున్నారు. ఎన్నో అంతర్జాతీయ సదస్సులు ఇదే విధానంలో విజయవంతం అవుతున్నాయి. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానంతో మనకు కావలసిన భాషలో మనం మార్చుకొని అర్థం తెలుసుకొనే సౌకర్యం ఉన్నది. కావున తెలుగుభాష నేర్చుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదు. తెలుగు మాధ్యమం చదివిన ఎందరో మేథావులు విదేశాలలో ఉన్నతోద్యోగాలు, పదవులు నిర్వహిస్తున్నారు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. ఆంగ్లం రాకపోతే ప్రాణం పోయినట్లు బాధపడడం మంచిది కాదు. మన భాషలో తెలుగును ఆధునికీకరించుకొని గౌరవించుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత, శాస్త్ర జ్ఞానాన్ని తెలుగులోకి మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

తర్వాతి తరాలకు అందించాలి..

బ్రతుకు కోసం ఏ భాష అయినా నేర్చుకోవచ్చు. కానీ మాతృభాషను మర్చిపోయేంతగా కాదు. తెలుగు మాట్లాడడం నేడు అవమానంగా భావిస్తున్నాం. మన భాషను మనమే తక్కువ చేస్తున్నాం. ఇది ఎంతవరకు సమంజసం? భాషతో పాటు సంస్కృతి సంప్రదాయాలను వదిలేస్తున్నాం అన్న విషయం మనకు తెలియడం లేదు. పరోక్షంగా దీనిపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్య నుండి మనం భాషను కాపాడుకోవాలంటే, భాషావేత్తలు, సాహితీకారులు, భాషాభిమానులతోపాటు ప్రభుత్వం కూడా పరిష్కార మార్గాలు వెతకాలి. అలా చెయ్యకపోతే భావితరాలకు మన భాషను సజీవంగా అందించలేము. మన ఉనికిని కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఆంగ్లాన్ని ఆహ్వానిద్దాం మంచిదే. కానీ మన తెలుగును ప్రమాదంలో నెట్టడం ఏమాత్రం మంచిది కాదు. ‘ఈ ప్రపంచంలో తెలుగు మాధ్యమంలో చదువుకొనే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కాకుండా ఏ కేరళలోనో, మధ్యప్రదేశ్ లోనో లభించదు’... కావున ప్రతి తెలుగు వాడు తెలుగుభాష పరిరక్షణ కుటుంబం బాధ్యతగా గుర్తించి ముఖ్యంగా తల్లులు తన పిల్లలకు మాతృభాషలో మమకారాన్ని పంచితే, మన భాషను కాపాడుకోగలం. తెలుగును తర్వాతి తరాలకు అందించగలం. లేకుంటే మూకుమ్మడిగా తెలుగు జాతి అంతా తెలుగు భాషా ద్రోహులుగా చరిత్రలో మిగిలిపోతాం.

కొప్పుల ప్రసాద్

98850 66235

Advertisement

Next Story