- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల పవిత్రతను కాపాడాలి!
టీటీడీ వ్యాపార సంస్థ కాదు. అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రం. అందుకు తగ్గట్లు దాని పవిత్రను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. శ్రీవారి ప్రసాదాలను అత్యంత భక్తిభావంతో స్వీకరిస్తారు. లడ్డూ ప్రసాదాన్ని తాము తీసుకుని, ఇతరులకు కూడా పంచుతారు. అలాంటి తిరుమల లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచి తగ్గి, కేవలం 24 గంటల్లోనే రంగు మారి వాసన వస్తుందని విమర్శలు ఉన్నాయి. లడ్డూ రుచిగా లేకపోవడానికి నెయ్యి కల్తీ కావడమేననే వాస్తవాన్ని ఇటీవల నేషనల్ డైయిరీ డెవలప్ మెంట్ బోర్డు ఇచ్చిన నివేదిక తేటతెల్లం చేసింది.
గత ప్రభుత్వం ఐదు దశాబ్దాల నుంచి సరఫరా చేస్తున్న నందిని బ్రాండ్ నెయ్యిని పక్కనపెట్టి.. ఏఆర్ డైయిరీ ఫుడ్స్‌కు కట్టబెట్టింది. కేజీ రూ.320కు సరఫరా చేసేట్లుగా ఒప్పందం కుదుర్చుకుంది. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో నెయ్యి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం ఎన్‌డీడీబీకి ఈ ఏడాది జులై 12న పంపించారు. ఆ పరీక్షల్లో నెయ్యిలో జంతువుల కొవ్వు అవశేషాలు ఉన్నాయని తేలింది. పైగా నాసిరకం జీడిపప్పు, బాదంపప్పు తదితర వాటిని వినియోగించడం వల్ల లడ్డూలో నాణ్యత పూర్తిగా తగ్గి పోయింది. అయినప్పటికీ గతంలో 25 రూపాయలు ఉన్న లడ్డూ ధరను రెట్టింపు చేశారు.
నెయ్యి నాణ్యతను గాలికొదిలేసి..
కేజీ ఆవు నెయ్యి రూ.700 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. కానీ కేజీ రూ.320 కే సరఫరా చేయడం ఎలా సాధ్యం? రోజుకు టీటీడీకి 15 టన్నుల నెయ్యి అవసరం. ఇందుకు సుమారు రూ.200 కోట్లు ఖర్చు అవుతుంది. ఇన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పుడు నెయ్యి నాణ్యతను పరిశీలించాల్సిన అవసరం ఉంది. కానీ అవేమీ చేయకుండా కల్తీ నెయ్యిని, నాసిరకం పదార్థాలను లడ్డూ తయారీకి వినియోగించారు. లడ్డూ నాణ్యతపై ఫిర్యాదులు రావడంతో టీటీడీ ఈవో శ్యామలరావు పరీక్షలకు పంపారు. జులై 22న పరీక్షల ఫలితాలు రాగానే ప్రెస్‌మీట్ పెట్టి కల్తీ జరిగిన విషయాన్ని నిర్ధారించారు. ఏఆర్ సంస్థ సరఫరా చేసిన మిగిలిన నెయ్యిని సీజ్ చేసి, ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు.
ప్రపంచవ్యాప్తంగా భక్తుల షాక్!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ జరిగిందని వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు, శ్రీవారి భక్తులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. జగన్ రెడ్డి తీరుపై అన్ని ధార్మిక సంస్థలు, కోట్లాది మంది శ్రీవారి భక్తులు, అన్ని రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో వైసీపీ ఆత్మరక్షణలో పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తిప్పలు పడ్డారు. గత ఏడాది మార్చిలో టెండర్లు ఖరారు చేసి ఏఆర్ సంస్థకు కట్టబెట్టింది వైసీపీ ప్రభుత్వం అయితే జులైలో ఉన్నది టీడీపీ ప్రభుత్వం కదా అనే వితండవాదంకు ఎదురు దాడి చేశారు. పొంతన లేని సమాధానాలు చెప్పి అడ్డంగా దొరికిపోయారు.
టీటీడీ పవిత్రతకు కళంకం!
ఏ మతాన్ని ఆచరించినా ఏ దేవున్ని పూజించినా హిందూ సంప్రదాయాన్ని కూడా గౌరవించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపై ఉంది. కానీ అందుకు భిన్నంగా మొదటి నుంచి కూడా టీటీడీ పవిత్రతను ఆయన ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారు. టీటీడీ బోర్డును రాజకీయ ఉపాధి కేంద్రంగా మార్చేశారు. చట్టప్రకారం టీటీడీ ఛైర్మన్ తో సహా 18 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కానీ 81 మంది సభ్యులతో బోర్డును నింపారు. దీనిపై భక్తులు హైకోర్టును ఆశ్రయించడంతో 23 మందికి కుదించారు. జగన్ రెడ్డి అక్రమ కేసుల్లో సహ నిందితుడిగా ఉన్న ఎన్.శ్రీనివాసన్, అత్యంత అవినీతిపరుడు, వేలకోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల నుంచి దండుకున్న కేతన్ దేశాయ్, లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి, వివాదాస్పదుడైన శేఖర్ రెడ్డికి టీటీడీ బోర్డు పదవి కట్టబెట్టారు.
డిక్లరేషన్ ఇవ్వడానికేం..?
స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించేటప్పుడు సతీసమేతంగా వెళ్లడం ఆచారం. అది జరగకపోగా ఏకంగా కోట్ల రూపాయలతో టీటీడీ సెట్టింగ్‌నే తాడేపల్లి ప్యాలెస్‌లో వేసుకున్నారు. గతంలో జగన్ అన్యమతస్థులు శ్రీవారి దర్శనానికి వెళ్లేటప్పుడు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను ఉల్లంఘించారు. ఇప్పుడు డిక్లరేషన్ అడిగినందుకు తిరుమల పర్యటనే రద్దు చేసుకున్నారు. ఆనాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం సైతం డిక్లరేషన్ ఇచ్చారు. మరి మీకు ఏమైంది. ఈయన హయంలో చైర్మన్‌గా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి సతీమణి చేతిలో ఎప్పుడూ బైబిల్ ఉంటుంది. శ్రీవారి మండపంలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి పేరుతో గోవింద నామాలు వల్లెవేశారు. రెండోసారి టీటీడీ చైర్మన్‌గా నియమితులైన భూమన కరుణాకర్ రెడ్డి క్రిష్టియన్ అని, ఆయన ఇంట్లో జరిగిన వివాహ వేడుకలు క్రిస్టియన్ పద్ధతిలో జరిగినట్లుగా ప్రచారం కూడా ఉంది. ఈవో ధర్మారెడ్డి ప్రముఖులను ప్రసన్నం చేసుకుంటూ రాజకీయ పైరవీలు చేసేవారు.
విచారణ జరిపించాల్సిందే!
జగన్ రెడ్డి ప్రభుత్వంలో గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన అవినీతి, అక్రమాలు, అరాచకాలు, తదితర అంశాలపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. తిరుమలలో జరిగిన అపచారాలపై, ముఖ్యంగా కల్తీ నెయ్యి అంశంపై సమగ్ర దర్యాప్తు చేయాలి. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు సుస్పష్టమైన ఆధారాలు లభించాయి. దీంతో పాటు తిరుమలలో చోటుచేసుకున్న అవినీతి, అన్యమత ప్రచారంపై జగన్ రెడ్డి, ధర్మారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థ, సరఫరా చేసిన ఇతర సంస్థలపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి. టీటీడీ పవిత్రతతో పాటు ప్రపంచ వ్యాప్తంగా హిందువుల మనోభావాలను కాపాడాలి.
మన్నవ సుబ్బారావు
99497 7772