- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
PDSU Reunion: ప్రగతిశీల, అభ్యుదయ శక్తులం ఏకమవుదాం!
రెండవ ప్రపంచ యుద్ధానంతరం ప్రపంచవ్యాప్తంగా వలసవాద వ్యతిరేక ఉద్యమాల వెల్లువ ఊపందుకుంది. ఈ క్రమంలోనే భారత జాతీయోద్యమంలో భాగంగా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని సోషలిస్టు శక్తులు బలంగా ప్రతిఘటించాయి. కాలక్రమేణా స్వాతంత్ర్యం పరిణామాల అనంతరం అంతర్జాతీయంగా వచ్చిన ఉద్యమాల వెల్లువ భారత విద్యావంతులను బలంగానే తాకింది. మరీ ముఖ్యంగా, 1960వ దశకం ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆలోచనల అలజడిని సృష్టించింది. ఆ దశకంలోనే ఒకపక్క ఫ్రెంచ్ విద్యార్థుల వీరోచిత పోరాటం, అమెరికాలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా సాగిన బ్లాక్ పాంథర్స్ ఉద్యమం, మరోపక్క పెట్టుబడిదారి వ్యవస్థల ఆధిపత్య పోకడలకు వ్యతిరేకంగా సోషలిస్టు భావజాలం విద్యావంతులను ఆలోచింపజేసింది. ఈ క్రమంలో శ్రీకాకుళ గిరిజన రైతాంగ, గోదావరి లోయ పోరాటాల వెల్లువ, తెలంగాణ సాయుధ పోరాట వారసత్వ ఆనవాళ్లు బలంగా తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేశాయి.
మతతత్వ అరాచక శక్తులకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ గోల్డ్ మెడల్ సాధించి, అకడమిక్ విద్యలో అత్యున్నత శ్రేణిలో నిలిచిన జార్జిరెడ్డి ఒక ప్రత్యామ్నాయ ప్రగతిశీల ఆలోచనా విధానాన్ని ముందుకు తెచ్చారు. ఈ ఆలోచన కేవలం అకడమిక్ విషయాలకే కాకుండా ప్రాపంచిక విజ్ఞానాన్ని గతి తార్కిక భౌతికవాద నియమాలకు అన్వయించడం ద్వారా నాటితరం విద్యార్థులకు విప్లవ విజ్ఞాన శిఖరంలా స్ఫూర్తినిచ్చారు. తరగతి గోడల నుంచి ప్రజాబాహుళ్యం కోసం విద్యార్థులను కూడగట్టే క్రమంలో మత ఛాందసవాద అరాచక శక్తుల చేతిలో కత్తిపోట్లకు గురయ్యారు. ఆనాడు జార్జిరెడ్డి ఎత్తిన 'పీడీఎస్' జెండా అనతికాలంలోనే పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుని తెలుగు సమాజాన్ని ఆలోచన సంద్రంలో పడేసింది. ఆయన నినాదమైన 'జీనా హైతో మర్ నా సీకో, కదం కదం పర్ లడ్ నా సీకో' ఉత్తేజకరమైన ఉద్యమ నినాదంగా మారి వేలాది మందిని ప్రగతిశీల ఉద్యమంలో భాగస్వాములను చేసింది.
జార్జిరెడ్డి తదనంతరం ఆయన రక్తంతో తడిసిన పీడీఎస్ జెండాను 'పీడీఎస్‌యూ'గా జంపాల చంద్రశేఖర్ తీర్చిదిద్దారు. ఆయనను సైతం ఎమర్జెన్సీ కాలంలో పాలకవర్గం పొట్టన పెట్టుకుంది. అప్పటినుంచి వారి స్ఫూర్తిని హైస్కూల్ నుంచి విశ్వవిద్యాలయాల స్థాయిదాకా లక్షలాది మంది విద్యార్థులు అలవరచుకున్నారు. తొలి తరం పీడీఎస్‌యూ విద్యార్థులు నేడు సీనియర్ సిటిజన్స్‌గా, మలితరం వారు వారి స్ఫూర్తిని ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తమ తమ జీవితాల్లో కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది పత్యేక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే నేడు సమకాలిన రాజకీయ పరిస్థితులలో దేశవ్యాప్తంగా మతోన్మాదం బుసలు కొడుతుంది. ప్రజలకు అందించాల్సిన సౌకర్యాలను పక్కన పెట్టి ప్రజలను మతం, కులం పేరుతో విడగొట్టి సనాతన ధర్మం పేరుతో తిరోగమన భావజాలాన్ని ప్రజలపై రుద్దుతున్నారు. అసలైన ప్రజాచరిత్ర స్థానంలో పురాణాలనే చరిత్రగా ప్రచారం చేస్తున్నారు. మరోప్రక్క భారతరాజ్యాంగ స్ఫూర్తిని నిర్వీర్యం చేయడానికి అనుక్షణం ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రగతిశీల, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల పునరేకీకరణ అనివార్యమైంది. గత స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్త్ తరాలకు ఆ స్ఫూర్తిని అందించడానికి పీడీఎస్‌యూ పూర్వవిద్యార్థులుగా మావంతు బాధ్యతగా ముందుకు వస్తున్నాం. ఇందులో భాగంగానే నేడు పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఈ సమ్మేళనం కేవలం స్నేహితుల కలయికగా మాత్రమే కాకుండా ప్రగతిశీల ఉద్యమ స్ఫూర్తిని నేటి తరానికి అందించే బాధ్యతగా నిర్వహిస్తున్నాం. కాబట్టి, పీడీఎస్‌యూ పూర్వ విద్యార్థులందరూ హాజరు కావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం.
వేదిక: ప్రగతిశీల స్ఫూర్తి ప్రాంగణం, సుందరయ్య విజ్ఞాన కేంద్రం,
బాగ్ లింగంపల్లి, హైదరాబాద్
సమయం: శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పీడీఎస్‌యూ
పూర్వ విద్యార్థుల సమ్మేళన నిర్వహణ కమిటీ
Also Read...