వరల్డ్ వాక్:దారి దీపం ద్వీప దేశం

by Ravi |   ( Updated:2022-09-03 17:41:48.0  )
వరల్డ్ వాక్:దారి దీపం ద్వీప దేశం
X

అధిక జనాభాను అరికట్టేందుకు అవగాహన కల్పించాలి. మూఢ నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాలను పారద్రోలడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.‌ పురాతన ఆలోచనల బూజు దులపాలి. విద్యా విధానంలో మతతత్వం, వస్త్రధారణ వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరాదు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాలు ప్రవేశపెట్టి, భవిష్యత్తు ప్రపంచంలో మనగలిగే విధంగా నేటి తరాన్ని తయారు చేయాలి. అప్పుడు మాత్రమే రాష్ట్రాలు, దేశాలు ఈ పోటీ ప్రపంచంలో నిలబడతాయి. స్వయం సమృద్ధి సాధిస్తాయి. స్వావలంబన దిశగా అడుగులు పడతాయి.‌ అన్ని రంగాల ప్రైవేటీకరణే పరమావధిగా ప్రస్తుత ప్రభుత్వాలు ప్రయాణం చేయడం ఆందోళన కలిగిస్తున్నది.‌

ష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ మీడియాలో హల్‌చల్ చేస్తున్న మరొక అంశం ద్వీప దేశ దయనీయ స్థితి. అదే మన పొరుగు దేశం శ్రీలంక. కనీసం ఒక కప్పు కాఫీ తాగలేని, కనీసం ఒక కోడి గుడ్డు కొనుక్కుని తినలేని పరిస్థితి అక్కడ ఏర్పడింది. ధరలు మండిపోతూ ఉండడంతో సింహళీయులు రోడ్లెక్కి ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కళ్లప్పగించి చూస్తోంది. మనదేశం మినహా మిగిలిన దేశాలు తమకేమీ పట్టనట్టు దూరంగా ఉన్నాయి.‌ ద్వీప దేశానికి ఈ దుస్థితికి కారణం పాలనా వైఫల్యమే. మితిమీరిన అప్పులు, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు, బంధుప్రీతి ఎలాంటి అవస్థలకు దారి తీస్తుందో దాదాపు చాలా దేశాలకు, ముఖ్యంగా మన దేశానికి శ్రీలంక ఒక మేలుకొలుపు (హెచ్చరిక) కావాలి. రాబడికి మించి ఉచిత పథకాలు అందిస్తే ఇదే పరిస్థితి. ఇకనైనా ప్రభుత్వాలు తమ ఆలోచనలు, తీరు మార్చుకోవాలి. లేదంటే ‌‌‌‌‌‌‌‌‌‌‌‌తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వాల నిర్ణయాలు ప్రజల మనుగడకే ప్రమాదకరంగా మారతాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు.

కుటుంబ పాలనతో చిక్కు

శ్రీలంకలో అంతర్యుద్ధం అనంతరం అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాజపక్సే కుటుంబ పాలన, ఎన్నికల హామీలు, కరోనా వైరస్ పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూపాయి. 2019లో దాడులు, విపరీతంగా రుణాలు ఈ రోజు శ్రీలంక శోకానికి, సింహళీయుల కన్నీళ్లకు, ఆర్తనాదాలకు కారణాలయ్యాయి. పరిపాలన మీదనే ఒక దేశ, రాష్ట్ర ప్రజల భవితవ్యం ఆధారపడి ఉంటుందని అందరూ గ్రహించాలి.‌ భవిష్యత్తు దార్శనికతను దృష్టిలో ఉంచుకుని పాలన అందివ్వాలి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రభావాన్ని చూపుతాయో కంటికి కనపడుతోంది.

అధికారంలోకి రావడం కోసం ఎన్నికల వేళ ఓట్లు రాబట్టుకునే విధంగా ప్రజాకర్షణ, జనాకర్షణ పథకాలు ప్రకటించడం, తీరా అధికారంలోకి వచ్చిన తరువాత వాటి అమలు కోసం దొరికిన చోటల్లా అప్పులు చేయడం పరిపాటిగా మారింది. అసలు మాట ఎలా ఉన్నా వడ్డీ కట్టడానికి, దైనందిన అవసరాల కోసం నిరంతరం అప్పులు చేయడంతో ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలి. ప్రజలకు పని కల్పించాలి. ఉత్పత్తి రంగాలకు ప్రాధాన్యం ఇచ్చి తమకు వచ్చే ఆదాయంతో పరిశ్రమలు స్థాపించి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి.‌ ఎగుమతులు పెంచుకోవాలి. విదేశీ మారక ద్రవ్యం ఆర్జించాలి.‌ నూతన ఆవిష్కరణలు ఆలోచనలు చేసే దిశగా యువతకు నైపుణ్యాలు, ఆధునిక విద్య అందించాలి.

మతతత్వాన్ని నిరోధించాలి

అధిక జనాభాను అరికట్టేందుకు అవగాహన కల్పించాలి. మూఢ నమ్మకాలు, ఆచారాలు, విశ్వాసాలను పారద్రోలడానికి ప్రయత్నాలు ముమ్మరం చేయాలి.‌ పురాతన ఆలోచనల బూజు దులపాలి. విద్యా విధానంలో మతతత్వం, వస్త్రధారణ వంటి విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరాదు. ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యాలు ప్రవేశపెట్టి, భవిష్యత్తు ప్రపంచంలో మనగలిగే విధంగా నేటి తరాన్ని తయారు చేయాలి.

అప్పుడు మాత్రమే రాష్ట్రాలు, దేశాలు ఈ పోటీ ప్రపంచంలో నిలబడతాయి.స్వయం సమృద్ధి సాధిస్తాయి. స్వావలంబన దిశగా అడుగులు పడతాయి.‌ అన్ని రంగాల ప్రైవేటీకరణే పరమావధిగా ప్రస్తుత ప్రభుత్వాలు ప్రయాణం చేయడం ఆందోళన కలిగిస్తున్నది.‌ పెరుగుతున్న ధరలు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రెండు రోజులు సమ్మె జరిగినా మీడియాగానీ, పౌరసమాజంగానీ పెద్దగా పట్టించుకున్నట్లు కనబడ లేదు. ఇది ప్రమాదకరమైన ధోరణి. కనీసం వాస్తవ పరిస్థితులు విశ్లేషణ చేయాలి కదా! ప్రభుత్వాలు విద్య వైద్య రంగాలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలి.

స్వావలంబన దిశగా అడుగులు

ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడుతూ, దేశ స్వావలంబన దిశగా అడుగులు వేయాలి. ఎగుమతులు పెంచి, దిగుమతులు తగ్గించాలి. చిన్న, కుటీర పరిశ్రమలు ప్రోత్సహించాలి. ప్రస్తుతం కొన్ని రంగాలను ప్రోత్సహించడం శుభసూచకం. రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తూ నిరుద్యోగాన్ని నిలువరించాలి. ముఖ్యంగా ఎన్నికల వేళ ఉచితాల, విపరీత సంక్షేమ పథకాల ప్రకటనలు మానాలి. బడా పారిశ్రామికవేత్తలకు సబ్సిడీలు, రాయితీలు ప్రోత్సాహకాలు మానండి. ఇప్పటికే మన దేశంలో అనేక రాష్ట్రాలు ఎఫ్ఆర్ఎంఎంబీ పరిధి దాటి విపరీతమైన అప్పులు తెచ్చి మనుగడ సాగిస్తున్నాయి. ఇకనైనా జాగ్రత్తలు తీసుకోవాలి.

అప్పుల ఊబిలో రాష్ట్రాలు కూరుకుపోతే ప్రజల భవిష్యత్తు ఏమిటి? పరిపాలన పారదర్శకంగా, రాజ్యాంగబద్ధం గా ఉండాలి. బంధుప్రీతికి చెక్ పెట్టాలి. సమర్ధులైన వారికి అవకాశాలు ఇవ్వాలి. 'కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి' అన్నారు పెద్దలు. కావున ప్రభుత్వాలు ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుట ద్వారానే సుస్థిర అభివృద్ధి, స్వావలంబన, సుఖశాంతులతో వర్ధిల్లుతుందని గ్రహించాలి. ఆ విధంగా అడుగులు వేయాలి. ప్రస్తుత శ్రీలంక ఒక హెచ్చరిక. అదే సందర్భంలో వివిధ దేశాలకు, రాష్ట్రాలకు మేలుకొలుపు.

ఐ. ప్రసాదరావు

63056 82733

Advertisement

Next Story