ప్రజావాణి - మా పరిపాలనా బాణీ

by Ravi |   ( Updated:2024-07-26 01:00:41.0  )
ప్రజావాణి - మా పరిపాలనా బాణీ
X

నా తెలంగాణ కోటి రతనాల వీణ' దాశరథి శతజయంతి సంవత్సరంలో ఆ మహాకవిని స్మరిస్తూ ఆయన మాటలని అక్షర సత్యాలుగా మార్చాలనే తలంపుతో 2024- 25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రజావాణి తమ పాలనకు బాణిగా భావించి ప్రజాపాలన ఆందించే కృత నిశ్చయంతో 2024-25 పూర్తి స్థాయి రాష్ట్ర బడ్జెట్‌ని ప్రతిపాదించారు. సంక్షేమం అభివృద్ధి సమతుల్యతతో అదనపు రాబడి రాబట్టే విధంగా రానున్న రోజుల్లో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి కోసం పటిష్టమైన పునాదులను రూపొందించే దిశగా ఈ బడ్జెట్ రూపొందించడమైనది.

రాష్ట్రంలో ప్రజాపాలన సాగిస్తామని చెబుతున్న కొత్త ప్రభుత్వం అందుకు తగ్గట్లుగానే సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు, సంక్షేమ పథకాలకు అత్యధిక నిధులు కేటాయించింది. ఇతర ప్రాధాన్య రంగా లకూ పెద్దపీట వేసింది. గ్రామీణాభివృద్ధి - పంచాయతీరాజ్ శాఖ, సాగు నీటి పారుదల, విద్యుత్ శాఖలకు కేటాయింపుల్లో ప్రాధాన్యమిచ్చింది.

హల ధారికి సిరి ధార

గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది సొంత భూములు లేని రైతు కూలీలు. వాళ్లు రైతు కూలీలుగా జీవనం గడుపుతున్నారని, వారి జీవితాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తలచిన తెలంగాణ ప్రభుత్వం రైతు కూలీలకు ఏడాదికి రూ. 12వేలు ఆర్థిక సాయం అందించాలని బడ్జెట్‌లో నిర్ణయించింది. ఇప్పటికే అన్నదాతల కోసం రైతుభరోసా స్కీంను తీసుకువస్తున్నామని ఈ స్కీమ్ ద్వారా ప్రతి ఏడాది రైతులకు ఎకరాకు రూ. 15 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే రూ. 2లక్షల రుణమాఫీ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు కూడా సాయం అందించనున్నారు. లక్ష ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు లక్ష్యంగా బడ్జెట్‌లో నిర్దేశించారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేరి దీని ద్వారా అన్నదాతలకు రైతు బీమాను వర్తింపజేయాలని నిర్ణయించారు. అయితే, ఈ బీమా యోజన కింద రైతులు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది.

నగరాభివృద్ధి కోసం..

ప్రజా రవాణ వ్యవస్థను పటిష్టం చేస్తూ ప్రస్తుతం మూడు ట్రాఫిక్‌ కారిడార్లలో ఆందుబాటులో ఉన్న మెట్రో సౌకర్యం మెట్రో మొదటి దశలో కలిగిన అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం రెండో దశ ప్రతిపాదనలను సమీక్షించి, వాటిని సవరించి, కొత్త ప్రతిపాదనలను రూపొందించనుంది. వివిధ వర్గాల అవసరాలను తీర్చడంతో పాటు నగరంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ప్రభుత్వం 78.4 కి.మీ. పొడవు ఉన్న ఐదు ఎక్స్‌టెండెడ్ కారిడార్లను రూ.24,042 కోట్లతో అభివృద్ధి పరుస్తుందని తెలిపారు. మెట్రో రైలును పాత నగరానికి పొడిగించి దానిని శంషాబాద్‌ విమానాశ్రాయానికి అనుసంధానం చేయనున్నారు. నాగోల్-ఎల్‌.బి నగర్‌-చంద్రాయణగుట్ట స్టేషన్లను ఇంటర్‌ చేంజ్‌ స్టేషన్లగా అభివృద్ధి చేయాలని మియాపూర్‌ నుండి పటాన్‌ చెరువుకు, ఎల్‌.బి.నగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు మెట్రో రైలు సౌకర్యాన్ని పొడిగించాలని కూడా ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రో రూ.100 కోట్లు, హైదరాబాద్ మెట్రో‌రైల్‌కు రూ.500 కోట్లు, పాతబస్తీ మెట్రోకు రూ.500 కోట్లు కేటాయించారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ ఉన్న పలు ప్రాంతాలను అనుసంధానం చేయ టంతో హైదరాబాద్ నగరాభివృద్ధి మరింత వేగవంతమవుతుంది. ఇందులో భాగంగా ఉత్తర ప్రాంతంలోని 158.6 కి.మీ. పొడవున్న సంగారెడ్డి–తూప్రాన్ – గజ్వేల్ – చౌటుప్పల్ రోడ్డును, దక్షిణ ప్రాం తంలోని 189 కి.మీ.ల పొడవున్న చౌటుప్పల్ -షాద్‌నగర్-సంగారెడ్డి రోడ్డును, జాతీయ రహదారులుగా ప్రకటించడానికి వీలుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టు వల్ల ఓఆర్ఆర్‌కు ఆర్ఆర్ఆర్‌కు మధ్య పలు పరిశ్రమలు, వాణిజ్య సేవలు, రవాణా పార్కులు మొదలైనవి అభివృద్ధి చెందుతాయి.

హైదరాబాద్‌కి భారీ కేటాయింపులు..

హైదరాబాద్ మహానగర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. తద్వారా రాబోయే కాలంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. హైదరాబాద్ నగరాభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున 10వేల కోట్ల రూపాయలు కేటాయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు, హెచ్ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ. 500 కోట్లు, తాగునీరు, మురుగునీటి వ్యవస్థను మెరుగుపర్చేందుకు జలమండలికి రూ. 3,385 కోట్లు, హైడ్రాకు రూ. 200 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. మూసీ నది రివర్ ఫ్రంట్ అభివృద్ధిపై సర్కార్ దృష్టి పెట్టింది. లండన్ థెమ్స్ నదిలా మూసీ నదిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో బడ్జెట్‌లో కేటాయింపులు జరిపారు. వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాలనే తలంపుతో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాపాలనను మరింత సమర్థవంతంగా పారదర్శకంగా కొనసాగటానికి తద్వారా అన్ని వర్గాల వారికి సరైన చేయూత నివ్వడానికి దోహదం కాగలదు.

శ్రీధర్ వాడవల్లి

99898 55445

Advertisement

Next Story
null