ప్ర‌జా పాల‌న‌… ప్ర‌జా సంక్షేమానికి గ్యారంటీ!

by Ravi |   ( Updated:2024-02-18 01:01:27.0  )
ప్ర‌జా పాల‌న‌… ప్ర‌జా సంక్షేమానికి గ్యారంటీ!
X

ప్ర‌జా పాల‌న‌లో ప్ర‌జా సంక్షేమమే ల‌క్ష్యంగా పాల‌కులు ప‌ని చేయాలి. ప్ర‌జా సంక్షేమానికే పెద్ద‌పీట వేయాలి. ప్ర‌జా పాల‌న‌లో అంద‌రూ కోరుకునేది కూడా ఇదే. ఆ దిశ‌గానే సీఎం రేవంత్‌రెడ్డి మొద‌టి నుంచి కృషి చేస్తున్నారనే చెప్పుకోవాలి. రేవంత్‌రెడ్డి ప్ర‌తి మాట‌లోనూ ఇది ప్ర‌జా ప్ర‌భుత్వం.. ప్ర‌జ‌లు ఎన్నుకున్న ప్ర‌భుత్వం.. ఆ ప్ర‌జ‌ల సంక్షేమ‌మే ల‌క్ష్యంగా ప్ర‌జా పాల‌న ఉంటుందంటూ ప‌దే ప‌దే చెప్తున్నారు. మాట‌ల్లో కాదు.. ఆచ‌ర‌ణ‌లోనూ ఇది సాధ్యం అనే విష‌యాన్ని తొలి బ‌డ్జెట్‌లోనే చూపించారు. 6 గ్యారంటీల అమ‌లే ల‌క్ష్యంగా బ‌డ్జెట్‌లో నిధుల కేటాయింపు జ‌రిగింది.

రాష్ట్రం మొత్తం రెవెన్యూ రాబ‌డులు రూ. 2.05 ల‌క్ష‌ల కోట్ల‌లో రూ. 53,196 కోట్లు అంటే 25 శాతం 6 గ్యారంటీల‌కే కేటాయించింది. బ‌డ్జెట్‌కు ముందు వ‌ర‌కు 6 గ్యారంటీల అమ‌లు అసాధ్యం అనేవారికి కేటాయింపులే స‌మాధానంగా మిగిలాయి. ఇప్పుడు 6 గ్యారంటీలు హామీలు కాదు.. అమ‌లుకు అడుగులు ప‌డ్డ‌ట్టుగానే భావించ‌వ‌చ్చు. అయితే ఈ బడ్జెట్‌లో కేవ‌లం 6 గ్యారంటీల‌తో సరిపుచ్చ‌లేదు. మిగ‌తా ప్రాధాన్య రంగాల‌కు కూడా పెద్ద‌పీట‌నే వేశారు. గ్రామీణాభివృద్ధి, పంచాయ‌తీరాజ్‌, సాగునీటి పారుద‌ల‌, విద్యుత్తు శాఖ‌ల‌కు సైతం భారీగానే కేటాయింపులు జ‌రిగాయి. గ‌త బ‌డ్జెట్ క‌న్నా రూ.15వేల కోట్లు త‌గ్గిన‌ప్ప‌టికీ, ఈ మూడు రంగాల‌కు మాత్రం గ‌త బ‌డ్జెట్ క‌న్నా నిధుల కేటాయింపులు పెరిగాయి.

ఉచిత ప్రయాణం సూపర్ సక్సెస్

ప్ర‌జా పాల‌న‌లో 6 గ్యారంటీల‌లో మొద‌ట‌గా మ‌హిళ‌ల‌కు ఆర్టీసీ బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం అమ‌లు అన్ని వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ప్ర‌జ‌ల్లోకి అతి త‌క్కువ కాలంలోనే ఎక్కువ‌గా రీచ్ అయింది. చివ‌ర‌కు ప్ర‌తి ప‌క్షాలు సైతం ఆ ప‌థ‌కాన్ని వ్య‌తిరేకించే ప‌రిస్థితి లేదంటే ఎంత ప్ర‌జాధార‌ణ పొందిందో అర్ధం చేసుకోవ‌చ్చు. ఒక‌వైపు ప్ర‌భుత్వం ఆర్టీసీని అన్నిర‌కాలుగా ఆదుకుంటూనే మ‌రోవైపు ప్ర‌జ‌ల‌కు సేవ‌లు అందేలా చ‌ర్య‌లు చేప‌డుతుంది. దీంతోనే ఇప్ప‌టి వ‌ర‌కు 15.21 కోట్ల మంది మ‌హిళ‌లు ఉచితంగా ప్ర‌యాణించ‌గ‌లిగారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క ప్ర‌గ‌తి చ‌క్రానికి మ‌రింత ఊతం ఇచ్చేలా రూ.535 కోట్ల‌ను చెల్లించడం జ‌రిగింది. కొత్త ప్ర‌భుత్వం వ‌చ్చాక మ‌రింత సౌక‌ర్యంగా ఉండేలా మ‌రో 100 బ‌స్సుల‌ను కొత్త‌గా కొన‌డమే కాకుండా అందుబాటులోకి కూడా తెచ్చారు.

పేదల సొంతింటి కల ఫలించేలా..!

పేద‌ల‌కు సొంతింటి క‌ల‌ను నెర‌వేర్చేందుకు ఈ ప్ర‌భుత్వం చిత్త శుద్ధితో ముందుకు సాగుతున్న‌ట్టుగానే బ‌డ్జెట్‌లో కేటాయింపులున్నాయి. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించాల‌నే నిర్ణ‌యం క‌చ్చితంగా అమ‌లైతే రాష్ట్రంలో 4,16,500 కుటుంబాల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు రానున్నాయి. అందులో భాగంగానే బడ్జెట్‌లో రూ.7,740 కోట్ల‌ను కేటాయించింది. మ‌రోవైపు ఇంటి స్థ‌లం ఉంటే ఇంటి నిర్మాణానికి రూ.5 ల‌క్ష‌ల సాయం కూడా అందించ‌నుంది. గృహ‌జ్యోతి ప‌థ‌కానికి సైతం ప్ర‌త్యేకంగా రూ.2,418 కోట్ల‌ను ప‌ద్దులో కేటాయించింది. 200 యూనిట్ల వ‌ర‌కు ఉచితంగా అందించే ల‌క్ష్యంతో విద్యుత్ ప‌థ‌కాన్ని అమ‌లు చేసేందుకు కేటాయింపులు జ‌రిగాయి. గ‌త బ‌డ్జెట్ కంటే కూడా ఈ ప‌థ‌కం అమ‌లు కోసం భారీగానే నిధుల కేటాయింపు జ‌రిగింది. ఈ ప‌థ‌కాన్ని అతి త్వ‌ర‌లోనే అమ‌లు చేసే అవ‌కాశం ఉంది.

ఆస‌రా పింఛ‌న్లు, ఆర్థిక సాయం షురూ..

ఆస‌రా పింఛ‌న్ల సొమ్మును పెంచ‌డం, మ‌హిళ‌ల‌కు న‌గ‌దు సాయం అందించేందుకు కూడా ప్ర‌భుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే బ‌డ్జెట్‌లోనూ కేటాయింపులు పెరిగాయి. పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి సంస్థ‌ల‌కు రూ. 40,080 కోట్ల‌ను కేటాయించింది. గ‌త బ‌డ్జెట్ కంటే రూ. 8,654 కోట్లు అద‌నం. ప్ర‌స్తుతం రాష్ట్రంలో సాధార‌ణ పింఛ‌ను నెల‌కు రూ. 2,016, దివ్యాంగుల‌కు రూ. 3,016 చొప్పున చెల్లిస్తోంది. ఇందుకు ఏటా రూ. 12వేల కోట్లు అవుతుంది. ఎన్నిక‌ల హామీ, గ్యారంటీల అమ‌లులో భాగంగా ఆస‌రా పింఛ‌న్ల‌ను రూ. 4000, రూ. 6000 చొప్పున ఇవ్వాల్సి ఉంది. అందుకే బడ్జెట్‌లోనూ దీనికి రూ.10వేల కోట్లు అద‌నంగా కేటాయింపులు జ‌రిగాయి. మ‌హిళ‌ల‌కు నెల‌కు రూ.2500 ఆర్థిక సాయం అందించేందుకు కూడా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌నే విష‌యం బ‌డ్జెట్ కేటాయింపుతో స్ప‌ష్టం అవుతుంది. ఇందుకు ఏకంగా రూ. 4500 కోట్ల‌ను కేటాయించ‌డం జ‌రిగింది. మొత్తంగా అంటే ఆస‌రా పింఛ‌న్లు, మ‌హిళ‌ల‌కు ఆర్థిక సాయం ఈ రెండింటికీ బ‌డ్జెట్‌లో రూ.26,500 కోట్ల కేటాయింపులు జ‌రిగాయి. అంటే ప్ర‌భుత్వం వీటిని అమ‌లు చేయ‌డ‌మే ఆల‌స్యం.

సంక్షేమానికి పెద్దపీట

ఎన్నిక‌ల హామీలు, 6 గ్యారంటీల‌కే కాకుండా ఇత‌ర ప్రాధాన్య‌త గ‌ల రంగాల‌కు సైతం బ‌డ్జెట్‌లో నిధుల‌ను భారీగానే కేటాయించ‌డం జ‌రిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల సంక్షేమానికి కూడా బ‌డ్జెట్‌లో పెద్ద‌పీట‌నే వేసింది. ఎస్సీ రూ. 21,874 కోట్లు, ఎస్టీ రూ. 13,313 కోట్లు, బీసీ రూ. 8వేల కోట్ల చొప్పున‌ ఈ వ‌ర్గాల‌కు రూ. 45,449 కోట్ల‌ను కేటాయించింది. సంక్షేమానికే కాకుండా ఈ వ‌ర్గాల విద్య అభివృద్ధికి కూడా ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌నే విష‌యాన్ని బ‌డ్జెట్ కేటాయింపుల్లో చూపించింది. రాష్ట్రంలో ఉన్న 1022 గురుకుల పాఠ‌శాల‌ల‌కు సొంత భ‌వ‌నాలు లేవు. అర‌కొర సౌక‌ర్యాల‌తో అద్దె భ‌వ‌నాల్లోనే సాగుతున్నాయి. విద్యార్థుల‌కు ఆధునిక హంగుల‌తో సొంత భ‌వ‌నాల‌ను నిర్మించాల‌నే ప్ర‌భుత్వం గొప్ప ఆలోచ‌న చేసింది. ఇందుకు ఎస్సీ గురుకుల సొసైటీకి రూ. వెయ్యి కోట్లు, ఎస్టీ గురుకుల సొసైటీకి రూ.250 కోట్లు, బీసీ గురుకుల సొసైటీకి రూ.1546 కోట్ల చొప్పున నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింది. ఇవే కాకుండా ఆడ పిల్ల‌ల వివాహానికి అందించే సాయంకు కూడా బ‌డ్జెట్‌లో ఆయా సంక్షేమ శాఖ‌ల‌కు కేటాయింపులు జ‌రిగాయి. గ‌తంలో ఇచ్చే న‌గ‌దు సాయంతో పాటు బంగారం కూడా హామీల‌లో ఉన్నాయి.

డా. ఎన్. యాదగిరిరావు,

అదనపు కమిషనర్, జీహెచ్ఎంసీ

97044 05335

Advertisement

Next Story

Most Viewed