రచయితలుగా....రాజకీయ నాయకులు

by Ravi |   ( Updated:2023-05-09 00:46:14.0  )
రచయితలుగా....రాజకీయ నాయకులు
X

పెయిడ్ న్యూస్ అనే ప్రక్రియ మొదలై దశాబ్దన్నర గడిచింది. మనం దీన్ని స్పష్టంగా గమనించాలి. సరిగ్గా ఒక దశాబ్దం క్రితం భారతదేశపు మీడియా రంగంలో మరొక పోకడ ప్రారంభమై ఇప్పుడు అన్ని పత్రికల్లో, అన్ని భాషల్లో దాదాపు స్థిరపడిపోయింది.

దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగాయని, దాని ఫలితంగానే పెయిడ్ న్యూస్ అనే లోపాయికారీ జర్నలిజం హవా ఒకటి తలెత్తిందనీ చెబుతుంటారు. ఈ పెయిడ్ న్యూస్ అనే మాట జర్నలిజానికీ, ఇంగ్లీషు భాషకూ మన తెలుగు ప్రాంతం తనవంతుగా సృష్టించి ఇచ్చిందనే వ్యంగ్యోక్తి వుంది. పెయిడ్ న్యూస్ అంటే ఎన్నికల సమయంలో అభ్యర్థులకు అనుకూలంగా, ఓటర్లు ఎంతో కొంత మొగ్గు చూపేలా, ఆధార రహితమైన వాస్తవ విరుద్ధమైన సమాచారాన్ని విశ్వసనీయమైన వార్తవలె ప్రచురించి తటస్థ ధోరణిలో ఉన్నవారిని ఒకవైపు మొగ్గు చూపేలా చేసే బలవంతంగా ప్రయత్నమే. నిజానికి దీని స్వరూప స్వభావాలు ఏమిటి, దీనిని ఎలా గుర్తించాలి అనేది పూర్తి అర్థం కాని పరిస్థితి! ఎందుకంటే ప్రజలపట్ల, ప్రజల మొగ్గును గౌరవిస్తూ మీడియా పనిచేయకుండా లోపాయికారీగా ఇటువంటి కాసుల ప్రక్రియకు తెరతీసింది తెలుగునాట జరిగిన హైటెక్ ఎన్నికల అద్భుతాలే అని అంటారు.

పెయిడ్ న్యూస్ మాయావిని మించిన మరొక ప్రక్రియ గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఇటీవల 'జనత' ఆంగ్ల వారపత్రిక మధులిమాయే శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ఒక ప్రత్యేక సంచికను ఏప్రిల్ 30న విడుదల చేసింది. రామ్మనోహర్ లోహియా, మధులిమాయే వంటి మేధావులు, పండితులు పత్రికా వ్యాసాలు రాసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఆశ్చర్యం లేదు. అయితే ఈ పదేళ్ళుగా స్థిరపడిన ప్రక్రియలో గమనించింది ఏమిటంటే మంత్రులూ, ఇతర పదవులు అనుభవిస్తున్న పార్టీ నాయకులు అమాంతంగా ప్రతి సందర్భంలోనూ క్రమం తప్పకుండా సంపాదక పుట వ్యాసాలు ప్రచురించడం. అంతకు ముందు వారు అసలు రచయితలో కాదో తెలియదు. అది కూడా ఒక్క భాషలో కాకుండా దేశ వ్యాప్తంగా అన్ని భాషలలో ప్రధాన పత్రికల్లో ఈ పోకడ కనబడుతోంది. ఈ ధోరణికి సంబంధించి 'సండే మిడ్ డే' పత్రికలో వచ్చిన వ్యాసాన్ని అనువదించి ఒక తెలుగు దినపత్రిక ఇటీవల ప్రచురించింది కూడా. ఈ సమస్య గురించి 2020 జూలై సంచిక 'స్క్రైబ్స్ న్యూస్ ' మాసపత్రికలో నేను నా మీడియా వాచ్ ఆంగ్ల కాలమ్‌లో రాశాను.‌ ఇప్పుడు ఢిల్లీ స్థాయి మీడియా పరిశీలకులు గమనించిన విషయమేమిటంటే ప్రతి మంత్రిత్వ శాఖకు సంబంధించి ఆయా మంత్రులు, సహాయ మంత్రులు, పరపతి ఉన్న ఇతర అధికారులూ ఇటువంటి వ్యాసాలు వ్రాయడం.

అక్షరాస్యత, అవగాహన, మేధావుల దార్శనికత వంటి విషయాల ప్రాతిపదికన... ప్రజాస్వామ్యంలోని ప్రజాప్రతినిధులు, పరిపాలనా వర్గం, న్యాయ వ్యవస్థ ఈ మూడింటికీ సమానమైన గౌరవాన్ని మీడియా పొందింది. ఆమోదించిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిర్ణయాలు చర్చించి, చట్టాలు చేస్తే ; రాజ్యాంగ విలువలను పరిరక్షించే న్యాయవ్యవస్థ అందులోని లోటుపాట్లను గమనించి, అవసరమైతే సవరణలు చేయడం, లేదా ఆమోదించడం ఉంటుంది. తర్వాత ప్రభుత్వ పరిపాలనా వర్గాలు తమ బాధ్యతగా ఈ నిర్ణయాలను అమలు చేస్తాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నికల్లో అభ్యర్థులు నిలబడటం, ఎన్నికలు జరిగే విధానం, చట్ట సభలలో నిర్ణయాలు జరిగే తీరు, దాన్ని అమలు చేసే వర్గాల వ్యవహార సరళి మొదలైన వాటిని అతి సమీపం నుంచి గమనించి, బాగోగులు విప్పిచెప్పే బాధ్యతా, ప్రజల పక్షాన నిలిచి అవగాహన పెంచే పాత్రా కూడా మీడియాదే! రాజ్యాంగం ప్రకారం ఆనాడు ఆలోచించిన బాణీలో వ్యవహారాలు సాగితే సమస్యలు ఉండవు. కానీ, మేధోసంపన్నుడైన జర్నలిస్టు రాజకీయ నాయకుడికి పరోక్షంగా, ప్రచ్ఛన్నంగా తోడ్పడే కొత్త దారులను ఆవిష్కరిస్తున్నారు.

పత్రికలూ రేడియో, టీవీ, మొదలైన మీడియా విభాగాల సామర్థ్యం గమనించిన రాజకీయ వర్గాలు మొదట జర్నలిస్టులను మంచి చేసుకునే ధోరణిలో సాగేవి. తరువాతి దశలో జర్నలిస్టులను కాకుండా మీడియా యజమానులను దగ్గర తీసుకోవడం లేదా తామే మీడియా యజమానులుగా మారడం లేదా తమ మిత్రులను మీడియా యజమానులుగా మార్చడం వంటివి మొదలయ్యాయి. ఈ రెండో దశను కూడా ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో దాటిపోయామని భావించాలి. ఇప్పుడు రాజకీయ వర్గాలే సమాచారపు మేధావులుగా, విశ్లేషకులుగా పరిణమిస్తున్నారు. మొదటి రెండు దశల్లో తమను తాము వార్తలలో వ్యక్తులుగా మలుచుకున్నారు. ఇక మూడో దశలో మేధావులుగా ప్రజల అభిప్రాయాలను ప్రభావితం చేసే రీతిలో విశ్లేషకులుగా తమను తాము రూపుదిద్దుకున్నారు.

ఈ ధోరణి 2014లో ఢిల్లీలో మొదలైందని, దానికి కొందరు తెలుగు నాయకులు కారణమని ఢిల్లీ అంతర్గత వర్గాల అంచనా! సరైన జీతభత్యాలు లేని, ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే ప్రతిభావంతులైన పత్రికా రచయితలు ఈ ప్రలోభాలకు లొంగి ఘోస్ట్ రైటర్సుగా ఈ రాజకీయ నాయకులకు సేవలందిస్తున్నారు. అవినీతి గురించి అయినా, కాలుష్యం గురించి అయినా, సంఘటితంగా మసలాల్సిన అవసరం గురించి అయినా వీరే మాట్లాడాలి అనే ధోరణిని దాదాపు స్థిరపరిచారు.

ఈ మారిన ధోరణికి ఎడిటర్లు వ్యాసాలు అందుకునే కో-ఆర్డినేటర్లుగా, పిఆర్‌ఓలు మారిపోతున్నారు. కొన్ని మీడియా హౌసెస్‌లో అయితే ఆయా మంత్రి వర్గాలను సంప్రదించి వ్యాసాలు అందుకునే బాధ్యతను పత్రికా యజమానులే చేస్తున్నారని భోగట్టా! ఈ ధోరణికి సర్క్యులేషన్‌లో అగ్రస్థానంలో ఉన్న ప్రముఖ ఆంగ్ల పత్రికలన్నీ అతీతం కాదని వాటిలో వెలువడుతున్న వ్యాస రచయితల జాబితాను పరిశీలిస్తే సులువుగా బోధపడుతుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటంటే అంతకు ముందే చర్చించిన విషయాల గురించి కానీ, తీసుకున్న నిర్ణయాల గురించి కానీ ఈ వ్యాసాలు ఉంటున్నాయే కానీ అధికారం లేని అల్ప సంఖ్యాక వర్గాల, లేదా సమాంతర వాదాల గొంతుకలను వినిపించేవి కానే కాదు. కొంత కాలానికి సంపాదకీయపుట రచయితలు లేదా సంపాదక పుట వ్యాసాలూ అనే మాటలు, విధానాలు కూడా ప్రాధాన్యతను కోల్పోవచ్చు.

ఈ ధోరణికి మీడియా సంస్థలే కాదు. ఆయా పత్రికల సంపాదకులూ, పదవీ విరమణ చేసిన సంపాదకులూ కూడా ఒక బలవంతపు మౌనం పాటిస్తున్నారేమోనని తప్పక భావించే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది. ఇది ఏ పరిస్థితికి దారి తీసినా అది ఎంతో కొంత ప్రజాస్వామ్యానికి విఘాతం కల్పించే పనే అవుతుంది!

డా నాగసూరి వేణుగోపాల్

9440732392

Advertisement

Next Story

Most Viewed