'విశ్వ కుటుంబం'గా ముందడుగు..

by Ravi |   ( Updated:2023-09-08 00:00:03.0  )
విశ్వ కుటుంబంగా ముందడుగు..
X

ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే లక్ష్యంతో జి20 సదస్సును భారత నిర్వహిస్తోంది. సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ 20 సదస్సు జరగనుంది. ఈ సమ్మిట్‌కు 29 మంది దేశాధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ఉన్నతాధికారులు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరు కానున్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాల్లోని విలువల ఆధారంగానే ఈ జి20 శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటేనే ఈ ధరిత్రి సురక్షితంగా ఉంటుందని సందేశాన్ని భారత్ ఈ సందర్భంగా ప్రపంచానికి చాటుతోంది. జీ20 అనేది 20 దేశాల సమూహం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రణాళికలను చర్చించే వేదిక. ఈ జీ20 దేశాలు ప్రపంచ ఆర్థిక ఉత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం వాటా కలిగి ఉన్నాయి.

ప్రపంచంలోని మూడొంతుల జనాభాలో రెండొంతులు ఈ దేశాల సొంతం. ఇందులో అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, భారత్, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణ ఆఫ్రికా, దక్షిణ కొరియా, తుర్కియే, యూకే, యూఎస్ ఉన్నాయి. ఈ 19 దేశాలతో పాటు ఇందులో స్పెయిన్ శాశ్వత అతిథిగా ఉంది. జీ20 దేశాల్లోనే మరో చిన్న గ్రూప్ జీ7 సదస్సులకు హాజరవుతాయి. జీ20 దేశాల్లోని బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా దేశాలు కలిసి బ్రిక్స్‌గా ఏర్పడ్డాయి. దానిని విస్తరణలో భాగంగా మరో ఆరు దేశాలకు ఆహ్వానాలు అందాయి. వాటిలో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇరాన్, ఇథియోపియా, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.

సదస్సు నిర్వహణ గర్వకారణం!

వసుధైక కుటుంబం అనే జి-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడం ప్రతి భారతీయుడికి గర్వకారణం. జి20 సదస్సుకు భారత నాయకత్వం వహిస్తోంది. ఒకే ధరిత్రి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే లక్ష్యంతో జి20 సదస్సును భారత్ నిర్వహిస్తోంది. భారత సంస్కృతి సాంప్రదాయాల్లోని విలువల ఆధారంగానే ఈ జి20 శిఖరాగ్ర సదస్సును ఏర్పాటు చేశారు. జీ-20 సదస్సులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి కీలకంగా ప్రస్తావన ఉంటుంది ఆయా దేశాల అధినేతలు ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తారు. తమ తమ వ్యుహలను సభ్యదేశాల అధినేతలతో పంచుకుంటారు. వాణిజ్యం, వాతావరణ మార్పులపై ఈసారి ప్రధాన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశాలకు గైర్హజరు అవుతున్నారు.

చరిత్రలో నిలిచిపోనున్న ఆతిథ్యం!

భారతదేశంలో ఆతిథ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అటువంటి పరిస్థితిలో, జీ-20 సమ్మిట్‌కు హాజరయ్యే అతిధుల గౌరవానికి తగినట్లు.. ఆతిథ్యం విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు.. కనీవినీ ఎరుగని రీతిలో జీ20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీ20 సదస్సుపై ప్రపంచం మొత్తం చూపు భారత్‌పైనే ఉంది. ఇందులో పలు దేశాల అధినేతలు పాల్గొననున్నారు. అతిథులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారత్ ఆహారాన్ని వడ్డించే విధానంలో సంస్కృతి, వారసత్వం, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పనుంది. రకరకాల వంటలను సిద్ధం చేయనున్నారు. అతిథుల కోసం ఏర్పాట్లను సిద్ధం చేయడంపై కళాకారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఒక్కో డిజైన్ వెనుక ఒక్కో ఆలోచన ఉంటుంది. ఈ పాత్రల తయారీలో 200 మంది కళాకారుల శ్రమ ఉంది.

శీతాకాలం వేడిగా, ఎండాకాలం చల్లగా ఉండే పుట్టపాక తేలియా రుమాలు పుట్టపాక చేనేత కళాకారుల ఖ్యాతి.. జీ-20 వేదికపై మెరవనున్న తేలియా రుమాలు పుట్టపాక తేలియా రుమాలును ఇక ప్రపంచం మొత్తం ఘనంగా కీర్తించనున్నది. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలోని గురుగ్రామ్‌లో జరిగే జీ-20 సమావేశాల్లో భారతీయ హస్తకళల ప్రదర్శనలో భాగంగా పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలును ప్రదర్శించనుండడంతో పుట్టపాక చేనేత కళాకారుల ఖ్యాతి ఖండాంతరాలు దాటనున్నది.

పుట్టపాక చేనేత కళాకారులు తయరు చేసిన తేలియా రుమాలు, డబుల్‌ ఇక్కత్‌ చీరె, డబుల్‌ ఇక్కత్‌ డాబిబోన్‌ చీరె, డబుల్‌ ఇక్కత్‌ డాబిబోన్‌ దుబ్బటి తదితర వస్త్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి మండుటెండల్లో సైతం చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉండే తేలియా రుమాలు తయారీ చాలా ప్రత్యేకమైనది. ఈ రుమాలులో వాడే రంగులన్నీ ప్రకృతి సిద్ధంగా లభించేవే. నూనెలు, సహజసిద్ధ రంగులు వాడడం మూలంగా తేలియా రుమాలుకు ఔషధ గుణాలు అందుతాయి కాబట్టే వేసవి తాపం తప్పించి చల్లదనాన్ని అందిస్తుంది.

ఒకే కుటుంబంగా అభివృద్ధి చెందాలని..

జీ 20 సదస్సు చిరకాలం గుర్తుండిపోయేలా చేయడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ గ్రూప్‌లోని 20 దేశాలతోపాటు ఈ సదస్సుకు హాజరవుతున్న తొమ్మిది అతిథి దేశాలకు సంబంధించిన కనీసం ఒక కళాఖండం ఉండేలా ఓ డిజిటల్ మ్యూజియంను ఏర్పాటు చేసింది.

'వసుధైవ కుటుంబం'.. ఈ రెండు పదాల్లో నిగూఢమైన తాత్వికత ఇమిడి ఉంది. దీని అర్థం.. 'ఈ ప్రపంచమే ఒక కుటుంబం'. సరిహద్దులు, భాషా భేదాలు, భావజాలాలకు అతీతంగా అందరం ఒకే విశ్వ కుటుంబంగా పురోగమించడానికి ఈ భావన తోడ్పడుతుంది. భారత్‌ జీ20 అధ్యక్షతన మానవుడు కేంద్రంగా అభివృద్ధి అన్నది ప్రధాన నినాదంగా ముందుకొచ్చింది. ఒకే ధరణిగా ప్రపంచం అభివృద్ధికి మనం ఏకతాటిపైకి వస్తాం. ఒకే కుటుంబంగా అభివృద్ధి చెందడంలో మనమందరం ఒకరికొకరం అండగా నిలుస్తాం. పరస్పరం అనుసంధానితమైన ప్రస్తుత ప్రపంచంలో అందరూ కలిసికట్టుగా ముందుకు సాగుదాం.

(సెప్టెంబరు 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు)

-వాడవల్లి శ్రీధర్

99898 55445

Advertisement

Next Story