- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీచర్ పోస్టులు.. భర్తీ చేయండి!
శతాబ్దాలుగా మన సమాజం సాధించిన ప్రగతి అంతా విద్య వల్లనే. విద్య సంస్కరణలకు పునాది, దేశ పురోగతికి సోపానానికి, ఆవిష్కరణలకు మార్గం సుగమం చేస్తుంది. అటువంటి నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుంది. ప్రభుత్వ బడులలో నాణ్యమైన విద్య అందాలంటే సరిపడా ఉపాధ్యాయులు ఉండాలి. ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా నియామకాలు జరగాలి. కానీ స్వరాష్ట్రంలో నేడు ఆ పరిస్థితి కానరావటం లేదు. చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో బోధన జరగక విద్యార్థులు నష్టపోతున్నారు. ఇటీవలే మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై టెట్‌ను నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం ముదావహం. అయితే, టెట్‌ను నిర్వహించినా తదుపరి ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను చేపడితేనే ప్రయోజనముంటుందని విద్యారంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలకు ముందే..
ఉమ్మడి రాష్ట్రంలో 2012 వరకు సజావుగా కొనసాగిన ఉపాధ్యాయ నియామక ప్రక్రియ రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల పాలనలో కేవలం ఒకే ఒక నోటిఫికేషన్ (టీఆర్టీ-2017) ను విడుదల చేయడం ఆక్షేపణీయం. 2017 అక్టోబరులో 8,792 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి నిర్వహణ బాధ్యతలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించింది. నియామక ప్రక్రియ ఆలస్యం తదితర కారణాలతో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో ఎట్టకేలకు 2021లో నియామకాలను పూర్తి చేసింది. ప్రస్తుతం ఉపాధ్యాయ శిక్షణను పూర్తి చేసుకున్న లక్షలాది మంది అభ్యర్థులు నోటిఫికేషన్ గురించి ఎదురుచూస్తూ దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో నియామక ప్రక్రియ చేపట్టడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అందుకు భిన్న పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 25(1) ప్రకారం ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి కొనసాగడం లేదు. చాలా పాఠశాలల్లో విద్యార్థులు లేని చోట ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. అలాగే విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. పాఠశాలల్లో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూ ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య 10 శాతానికి మించకూడదని చట్టంలో ఉన్నా దానిని పెడచెవిన పెట్టడం శోచనీయం.
అదే విధంగా ఉన్నత పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో బోధించడానికి ప్రత్యేకంగా ఉపాధ్యాయులు లేరు. ప్రభుత్వం వర్క్ అడ్జెస్ట్మెంట్, విద్యా వాలంటీర్లు వంటి తాత్కాలిక పద్దతులను అన్వేషిస్తున్న టీచర్ల నియామక ప్రక్రియ మాత్రమే ఈ సమస్యకు పరిష్కారమన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించిన నాడే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందనడంలో అతిశయోక్తి లేదు. సీఎం కేసీఆర్ విద్యా శాఖపై సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది ఎన్నికలకు ముందే ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు వెంటనే నోటిఫికేషన్(డీఎస్సీ) విడుదల చేస్తూ రాష్ట్రాన్ని విద్యారంగంలో అగ్రగామిగా నిలుపుతారని ఆకాంక్షిస్తున్నాము.
సుధాకర్.ఏ.వి
అసోసియేట్ అధ్యక్షులు STUTS
90006 74747