- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసుల వేటలో ఫార్మా ఇండస్ట్రీ
75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికీ 20 శాతం లోపు ప్రజలకు ప్రభుత్వ వైద్యం సరిగా అందడం లేదు. ప్రజలు కార్పొరేట్ వైద్య వ్యవస్థపై అనివార్యంగా ఆధారపడవలసి వస్తున్నది. అందుకే దోపిడీకి తెర లేస్తున్నది. అత్యవసర జాబితాలో ఉన్న పారసెటమల్, యాంటీ బయాటిక్స్, అజిత్రోమైసిన్‌లాంటి 800 మందుల ధరలలో 10.7 శాతం పెరుగుదలకు ఈ మధ్యనే భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతినిచ్చారు. ఇది వినియోగదారులకు శరాఘాతమే. ప్రభుత్వం నిరుపేద రోగుల కోసం జనరిక్ మందులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ, చాలా మంది వాటిని అంగీకరించడంలేదు. రోగులను దోచుకుంటున్న ఔషధ పరిశ్రమను జాతీయం చేసే ధైర్యం చేయలేకపోయినా, కనీసం వారి అనుచిత వ్యాపారాలను అయినా నిరోధించాలి. రోగులకు సరసమైన ధరలకే ఔషధాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
కోటానుకోట్ల దేశ ప్రజల దైనందిన అవసరాలను తీర్చి వారి మనుగడను సుస్థిరం చేస్తున్న అనేక పరిశ్రమలలో ఔషధ పరిశ్రమ కూడా ఒకటి. లాభాలకన్నా రోగులూ, వారి కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలను పొందడమే లక్ష్యంగా ఔషధ పరిశ్రమ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది. లైఫ్ సేవింగ్ ఇండస్ట్రీగా సమాజంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. కానీ, నేడు మెజారిటీ ఔషధ పరిశ్రమలు సేవా స్ఫూర్తికి తిలోదకాలు ఇచ్చాయి. ఇబ్బడి ముబ్బడిగా లాభాలను సంపాదించుకోవడానికి అనైతిక చర్యలకు తెర లేపుతున్నాయి.'వైద్యో నారాయణో హరి' అనేది లోకోక్తి. ఇది ఇప్పుడు పిడికెడు మంది అంకితభావం కలిగిన డాక్టర్లకే పరిమితం అయ్యింది.
మెజారిటీ డాక్టర్లు మెడికల్ రిప్రెజెంటేటివ్‌ల ద్వారా ఫార్మా కంపెనీలతో కుమ్మక్కు అవుతున్నారు. వైద్య విలువలను పాతరేసి నిషేధించిన ఔషధాలను ప్రత్యేకంగా తయారు చేయించుకొని, స్కీమ్స్, డిస్కౌంట్స్ అంటూ రోగులకు అంటగట్టి నిలువు దోపిడీ చేస్తున్నారు. కంపెనీల మధ్య విపరీతంగా పోటీ పెరిగి, నిషేధిత డ్రగ్ కాంబినేషన్స్ అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడం విచారకరం. వైద్య విద్యలో నిష్ణాతులు కానివారు, పెట్టుబడిదారులు వైద్యాన్ని లాభసాటి వ్యాపారంగా మార్చివేశారు. కార్పొరేట్ వైద్య సంస్థలను నెలకొల్పుతూ గ్రామీణ ప్రాంతాలు, వాటి సమీప పట్టణాలలో ఉండే ఆర్‌ఎంపీ, పీఎంపీల తోడ్పాటుతో రోగులను దోచుకుంటున్నారు.
ఆశలు అడియాశలు చేసి
భారతీయ ఔషధ పరిశ్రమ 2018లో రూ.739 కోట్ల పెట్టుబడులతో ఉండగా, 2020లో రూ.2717 కోట్లకు ఎదిగింది. ప్రపంచ ఔషధ పరిశ్రమ నెగిటివ్ ట్రెండ్‌లో కొనసాగుతున్నప్పటికీ, భారతీయ ఔషధ పరిశ్రమ మాత్రం 18 శాతం వృద్ధితో దూసుకుపోతున్నది. కరోనాలాంటి అనూహ్య రోగాల బారి నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం భారత ప్రభుత్వం 'ఆత్మ నిర్భర్ భారత్' 'మేకిన్ ఇండియా' పథకాలతో ఔషధ పరిశ్రమల స్థాపన, విస్తరణ కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఉత్పత్తి చేసే ఔషధాలను 75 శాతం దేశీయ అవసరాలకు, 10 శాతం ఎగుమతులకు ఉపయోగించాలని నిర్ణయించింది. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో 24.44 బిలియన్ డాలర్ల ఔషధ ఉత్పత్తుల ఎగుమతులను సాధించడం ఇదే మొదటిసారి.
ఇరుగు పొరుగు మిత్ర దేశాలకు సహాయంగా నాలుగు మిలియన్‌ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించింది భారత్. ఫార్మా హబ్‌గా పేరుగాంచిన హైదరాబాద్ నగరంలో కరోనా నివారణ కోసం ధ్రువీకరించిన రెమిడిసీవర్ ఇంజక్షన్‌లను ఉత్పత్తి చేసిన ఫార్మా కంపెనీలు కోట్ల రూపాయల లాభాలను సంపాదించాయి. మన ఫార్మా పరిశ్రమ యజమానులను ప్రపంచ కుబేరులుగా మార్చింది. దీంతో మధ్య తరగతి, అట్టడుగువర్గాలకు చెందిన రోగులకు సరసమైన ధరలకే ఔషధాలను అందించాలన్న ఆశలు అడియాశలయ్యాయి. అధిక శాతం ప్రజలు కొవిడ్ టీకాలను తీసుకోవడంతో కరోనా థర్డ్ వేవ్ నుంచి తక్కువ నష్టంతో మనలను మనం కాపాడుకోగలిగాం.
ప్రభుత్వం ఏం చేయాలి?
నేడో, రేపో కరోనా ఫోర్త్ వేవ్ ఈ దేశ ప్రజలపై దాడి చేయవచ్చునని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్లు నైతిక విలువలను ఆచరించి, రోగులకు సాంత్వన చేకూర్చాలి. మానవాళిని కాపాడే లైఫ్ సేవింగ్ ఇండస్ట్రీగా ఫార్మా తనను తాను రుజువు చేసుకోవాలి. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో నేటికీ 20 శాతం లోపు ప్రజలకు ప్రభుత్వ వైద్యం సరిగా అందడం లేదు. ప్రజలు కార్పొరేట్ వైద్య వ్యవస్థపై అనివార్యంగా ఆధారపడవలసి వస్తున్నది. అందుకే దోపిడీకి తెర లేస్తున్నది.
అత్యవసర జాబితాలో ఉన్న పారసెటమల్, యాంటీ బయాటిక్స్, అజిత్రోమైసిన్‌లాంటి 800 మందుల ధరలలో 10.7 శాతం పెరుగుదలకు ఈ మధ్యనే భారత డ్రగ్ కంట్రోలర్ అనుమతినిచ్చారు. ఇది వినియోగదారులకు శరాఘాతమే. ప్రభుత్వం నిరుపేద రోగుల కోసం జనరిక్ మందులను ప్రజలకు అందుబాటులోకి తెచ్చినప్పటికీ, చాలా మంది వాటిని అంగీకరించడంలేదు. రోగులను దోచుకుంటున్న ఔషధ పరిశ్రమను జాతీయం చేసే ధైర్యం చేయలేకపోయినా, కనీసం వారి అనుచిత వ్యాపారాలను అయినా నిరోధించాలి. రోగులకు సరసమైన ధరలకే ఔషధాలను అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.
నీలం సంపత్
సామాజిక కార్యకర్త
9866767471.