స్వార్థ రాజకీయాలకు... బలైన సిర్పూర్ ప్రజలు

by Ravi |   ( Updated:2023-11-03 01:00:31.0  )
స్వార్థ రాజకీయాలకు... బలైన సిర్పూర్ ప్రజలు
X

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఏడు జిల్లాలకు సాగునీరు, తాగునీరుతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని పరిశ్రమలకు అవసరమైన నీటిని అందించాలని నిర్ణయించి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2008 డిసెంబర్ 16న నాటి ముఖ్యమంత్రి డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా తుమ్మిడి హెట్టి దగ్గర శంకుస్థాపన చేసింది. ప్రాణహిత జన్మస్థలం ప్రస్తుత కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాణహిత జన్మ స్థలం. మహారాష్ట్ర ఎగువ ప్రాంతం నుంచి వచ్చే పెన్ గంగా ఆదిలాబాద్ వైపు నుంచి వచ్చే వర్దా నదుల సంగమమే ప్రాణహిత. ఇక్కడ 200 టీఎంసీ లకు పైగా నీటి నిల్వ సామర్థ్యం ఉండటంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని తుమ్మిడి హెట్టి దగ్గర చేపట్టినట్టు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి దీనికి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ప్రాణహిత సుజల స్రవంతి అని పేరు పెట్టారు.17,875 వేల కోట్లతో, 16 లక్షల 40 వేల ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యం. ఇందులో ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 56 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. మొత్తం 19 ప్యాకేజీల ద్వారా పనులు చేపట్టేందుకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాలువల తీశారు. పనులు నత్తనడకన సాగడంతో రెండేళ్లకు ఒకసారి అంచనా వ్యయం పెరుగుతూ పోయింది. తీరా తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి అంచనా వ్యయం 38,500 కోట్లకు పెరిగింది..

జరిగిన మోసం..

2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యాక, ఉద్యమ పార్టీగా ముద్ర వేసుకున్న నాటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో, ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి పూర్తి చేస్తుందని వ్యవసాయం తప్ప ఏ ఆధారం లేక ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళే అవసరం లేకుండా స్థానికంగానే ఉండి తమ భార్య బిడ్డలతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటూ సాగునీటి సౌకర్యం లేక బీడు పడిపోతున్న తమ భూములలో ఇకపై రెండు పంటలు పండించుకోవచ్చు అని ఆశ పడ్డారు ఈ ప్రాంత ప్రజలు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం రీడిజైన్ పేరుతో ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించింది. దీంతో ప్రాజెక్టు పూర్తయితే ప్రత్యేకించి సిర్పూర్ నియోజకవర్గ ప్రజల బ్రతుకులు మారుతాయని స్వచ్చందంగా ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ప్రభుత్వం మోసం చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 950 కోట్లతో తవ్విన కాలువలు నిరుపయోగంగా మారాయి. కళ్ళ ముందు ఉన్న ప్రాజెక్టు ఇతర ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం తరలించే ప్రయత్నం చేస్తోందని తెలిసి కూడా ఈ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేతో పాటు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడి వారికి జరుగుతున్న అన్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేలా చెయ్యకుండా ఉండిపోయారు. వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం మౌనంగా ఉండటం వల్లనే నాడు ఈ ప్రాజెక్టును ఇతర ప్రాంతాలకు తరలించేశారు.

వెనుకబాటుకు కారణం..

అయితే ఈ ప్రాజెక్టు ఇతర ప్రాంతాలకు తరలించడంతో స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయని భావించి, రాబోయే రెండు సంవత్సరాలలో ఎన్నికలు ఉన్నాయని వ్యూహాత్మకంగా వ్యవహరించి రాష్ట్ర ప్రభుత్వం 2020 డిసెంబర్‌లో వర్డా నదిపై బ్యారేజ్ ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని సైతం పరిశీలించి వెళ్ళారు. ఈ ప్రాజెక్టు వ్యయం 750 కోట్లు ఉంటుందని రాష్ట్ర నీటిపారుదల శాఖ అంచనా వేయగా, అది తాజాగా నీటిపారుదల శాఖ సమర్పించిన డీపీఆర్ ప్రకారం 4,550.73 కోట్లకు పెరిగినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టుని నాలుగు సంవత్సరాలలో పూర్తి చేసి సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజక వర్గాల ప్రజలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. అయితే, అత్యంత ఆధునిక టెక్నాలజీ వినియోగించి దేశంలోనే మొదటి ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరంను సుమారు 1.20 లక్షల కోట్లతో 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో మూడున్నర సంవత్సరాలలోనే పూర్తి చేసి విన్నర్స్ బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్స్, కంట్రీ రికార్డ్స్‌లో స్థానం దక్కిందని గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుతో పోల్చితే అతి తక్కువ ఆయకట్టుతో కేవలం 4550.73 కోట్ల రూపాయలతో నిర్మించే వర్దా బ్యారేజ్ ప్రాజెక్టు పనులు రెండు సంవత్సరాలు కావస్తున్నా కనీసం యాభై శాతం పనులు కూడా ఎందుకు పూర్తి చేయలేదు. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని ప్రజలకు మభ్యపెట్టేందుకు దీనిని ముందుకు తెచ్చారని ప్రజలు అనుకుంటున్నారు. అలాగే నాడు ప్రాజెక్ట్ రీడిజైన్ పేరుతో ఇతర ప్రాంతాలకు తరలించడానికి నాటి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిన సమయంలో నాడు బీజేపీ పార్టీయే మహారాష్ట్రలో అధికారంలో ఉంది. వారు కూడా ప్రాజెక్ట్ రిడీజైన్ చేస్తే, సిర్పూర్ నియోజకవర్గ ప్రజలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా నోరు మెదపలేదని ఈ ప్రాంత వెనకబాటుకు బీజేపీ కూడా ఓ కారణమని ఈ రెండు పార్టీలు సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు చారిత్రక అన్యాయం చేశాయని వీటికి తమ ఓటు ద్వారా తగిన గుణపాఠం చెబుదామని ప్రజలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది.

అంగట్లో అన్నీ ఉన్నా...

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగానే ఉంది. సిర్పూర్ నియోజకవర్గ ప్రజల పరిస్థితి. నియోజకవర్గ ప్రజలకు రెండు పంటలకు సాగునీరు అందించడానికి నీటి సౌలభ్యం సమృద్దిగా ఉండటంతో పాటుగా వందలాది మంది నిరుద్యోగ యువతకు స్థానిక సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లులో ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాలకులకు కుటుంబ,వ్యక్తిగత ప్రయోజనాలపై ఉన్న చిత్తశుద్ధి నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడంపై, అభివృద్ధి చెయ్యడంపై లేదు.ఈ నియోజకవర్గంలో 1957 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే పాల్వాయి పురుషోత్తం రావు రెండు సార్లు, వారి సతీమణి పాల్వాయి రాజ్యలక్ష్మి ఒక సారి, ప్రస్తుత ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మూడు పర్యాయాలు మొత్తం ముప్పై సంవత్సరాలుగా కేవలం రెండు కుటుంబాలే సిర్పూర్ నియోజక వర్గాన్ని పాలిస్తున్నాడు. వీరి అసమర్థ పాలన వలనే... నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాలలో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలోనూ, తెలంగాణలో అత్యంత పేదరికంలో మొదటి స్థానంలో ఉంది. సిర్పూర్ నియోజకవర్గం సైతం ఈ జిల్లాలోనే ఉండటం చాలా బాధాకరం.

మాణిక్ డోంగ్రే

సోషియాలజిస్ట్

99515 87876

Advertisement

Next Story