పార్టీ ఫిరాయింపులు.. ప్రజా విశ్వాసానికి సమాధి!

by Ravi |   ( Updated:2024-07-25 00:46:19.0  )
పార్టీ ఫిరాయింపులు.. ప్రజా విశ్వాసానికి సమాధి!
X

రాజకీయం ఓ సామాజిక బాధ్యత. ప్రజల ప్రతినిధిగా .. చట్టసభల్లో ప్రజల ఆకాంక్షలకు రూపం తెచ్చేలా చట్టం తయారు చేయడంలో ప్రజల చేత ఎన్నికైన రాజకీయ ప్రతినిధులది ప్రధాన పాత్ర. కానీ ఇప్పుడు రాజకీయాలన్నీ అవకాశవాదంతో నిండుకొని ప్రజలను భ్రమల్లో ముంచుతున్నారు. ప్రజల ఆశలే రాజకీయ నాయకులకు అవకాశంగా మారుతున్నాయి. మమ్ముల గెలిపిస్తే అండగా ఉంటామని ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయించుకొని గెలిచిన తర్వాత ఆ నాయకులు తన అసలు రంగును బయటపెడుతున్నారు.

నాయకులు ప్రజల ఆశలను సమాధి చేస్తూ... తన రాజ కీయ భవిష్యత్తు కోసం పాకులాడుతున్నారు. ఏ గుర్తు మీద నమ్మకంతో ఓటేశారో ఆ జెండాను, ఆ గుర్తును ఈసడించుకొని మరో రంగు కండువా కప్పుకుంటున్నారంటే ప్రజల నమ్మకాన్ని ఎంత సమాధి చేస్తు న్నారో అర్థం చేసుకోవాలి. ఒక పార్టీలో గెలిచి.. యథేచ్ఛగా పార్టీ ఫిరాయిస్తూ... నియోజకవర్గ అభివృద్ధి కోసమంటూ కట్టుకథ అల్లుతున్నారు. ఇలా పార్టీలు మారే ప్రజాప్రతినిధుల తీరు చూస్తే రాజకీయానికి మించిన దుర్మార్గం మరొకటి లేదనిపిస్తుంది.

అధికారం చుట్టూ రాబందుల్లా వాలి..

రాజకీయాల్లో అధికారంలోకి రావడానికి అబద్ధపు మాట లు మాట్లాడతారు.. అధికారం ఎక్కడుంటే అక్కడ రాబందుల్లా వాలిపోతారు. అధికారమే పరమావధిగా నమ్మిన ప్రజల నోట్లో మట్టి కొట్టడం నాయకులకు పరిపాటిగా మారింది. ఈ మధ్య తెలంగాణలో రాజకీ య ఫిరాయింపులు జోరందుకున్నాయి. కక్ష రాజకీయాల కోసం ఒక గుర్తుపై గెలిచినోళ్లను మరో పార్టీలోకి స్వాగతించడం అంటే ప్రజలను అవమానించడమే. ఓ ర కంగా ప్రజల తరతరాల వెనుకబాటు తనానికి ఈ రాజకీయ ఫిరాయింపులు కారణమని కూడా చెప్పవచ్చు.

రాజకీయ వలస ఎప్పుడైనా చేటే!

ప్రభుత్వంలోకి వచ్చిన వారు ప్రజలకు ఇచ్చిన హామీలు, వారి జీవిత స్థితిగతులను మార్చాల్సిన బాధ్యతను మరిచి రాజకీయంగా బలపడడానికి చూస్తున్నారు. ప్రజల కోసం నిలబడి గెలిచిన ఎమ్మెల్యేగా ఆయన స్థాయికి కొరత గానీ అధికారం కానీ తగ్గదు. ఎమ్మెల్యే గా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేత ప్రజా ఆవేదనలను పరిష్కరించవచ్చు. కానీ అందుకు ఏం తక్కువవుతుందో తెలియదు కానీ ఈ వలస రాజకీయ నాయకులు ప్రజల విశ్వాసాన్ని సమాధి చేస్తున్నారు.

ప్రక్షాళన తక్షణ అవసరం!

మంచి సమాజం తయారు కావాలంటే వ్యవస్థలను బాగు చేస్తే మాత్రమే సరిపోదు. విలువలను పెంపొందించాలి. రాజకీయ వ్యవస్థ బాగుపడకుండా సమాజం బాగుపడదు అంటే రాజకీయాల్లో నైతిక విలువలు పాటించాలి. చెప్పే మాటలకు ఆచరణ సాక్ష్యాలుగా కార్యాచరణ ఉండాలి. అలా కాకుండా తమ పార్టీలో ఉంటే తమను అనుసరిస్తే మంచోళ్లుగా.. ఇతర పార్టీల్లో ఉంటే చెడ్డొల్లు అనే ముద్ర వేసే మాటలు మానుకోవాలి. స్వార్థ రాజకీయాల కోసం రంగులు మార్చే రాజకీయ రాబందులు ఉన్నాన్నాళ్లు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడవు. రాజకీయ ఫిరాయింపుల చట్టం ఇప్పటి రాజకీయ ప్రక్షాళనకు తక్షణ అవసరం. పదో షెడ్యూల్‌లోని రాజకీయ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలో చేరిన వారిపై వేటు వేయాలి. రాజకీయ సంస్కరణలు అమలు పరచకుండా అభివృద్ది జరుగుతుందను కోవడం ప్రజల భ్రమే. దీనిపై స్పీకర్‌కు ఉన్న అధి కారాన్ని సక్రమంగా వినియోగించాలి.

ఫిరాయింపులతో విశ్వాస భంగం!

పార్టీ ఫిరాయించే, ఆయారాం గయారాంలపై వేటు వేయకుండా ఈ ఫిరాయింపు రాజకీయాలు ఇలాగే కొనసాగితే... పేదలతో పాటు యువత రాజకీయాలకు దూరం అవుతారు. పైగా ప్రజలను ఆశల్లో ముంచి ఓట్ల వేయించుకొని అధికారంలోకి రావడం... ప్రతిపక్షంలో గెలిచినోళ్లు అధికార పార్టీలోకి చేరడం అనేది మున్ముందు ఇలాగే సాగుతుంది. చట్టాన్ని గౌరవించి ప్రజల ఆకాంక్షలను బతికించాలంటే... రాజకీయ అవినీతి అంతం కావాలంటే పార్టీ ఫిరాయింపు చట్టం ఇప్పుడు రాజకీయ పార్టీల కంటే సామాన్యులకే ఎక్కువ అవసరం. ఓటేసి అధికారం ఇచ్చినోళ్లను మోసం చేసినోళ్లను శిక్షించడానికి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తిరిగి గెలవాలి.

యువత క్రియాశీలతే మార్గం!

రాజకీయ వ్యవస్థ బాగుపడనంత కాలం... ప్రజల జీవితాల్లో ఆశించినంత మార్పు కష్టమే. జవాబుదారీగా ఉండే నాయకత్వం అవసరం. అందుకు ప్రస్తుత రాజకీయాలలో యువత పాలుపంచుకోకపోవడం రాజకీయ అవకాశవాదులకు ఆసరా అవుతోంది. యువశక్తి ప్రస్తుత రాజకీయాలను మరింత క్షుణ్ణంగా గమనించాలి. రాజకీయాలలో యువత క్రియాశీలకంగా మారినప్పుడే అవకాశవాద రాజకీయాలు తగ్గుతాయి. రాజకీ య ప్రక్రియలో ఫిరాయింపులే ప్రజల అభివృద్ధికి ప్రధాన అడ్డంకి... ఫిరాయింపు రాజకీయ నేతలను గుర్తిస్తూ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.

సంపత్ గడ్డం

78933 03516

Advertisement

Next Story