పౌరుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేనే..

by Ravi |   ( Updated:2024-08-15 01:00:48.0  )
పౌరుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేనే..
X

భారతదేశం 78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని నేడు జరుపుకుంటోంది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీ వికసిత్ భారత్ @2047 లక్ష్యంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే దృక్పథంతో పనిచేస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవడంతోపాటు వారి ఆశయాలను నెరవేర్చేందుకు ఎంతవరకు కృషి చేస్తున్నామో.. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. స్వాతంత్ర్య సమరయోధుల స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కలలను మనం ఎంతవరకు సాధించాం? దేశ సంక్షేమం పౌరుడి జీవన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. మరి భారతదేశం తన జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుందా?

పెద్ద దేశం అయినప్పటికీ..

మన భారతదేశం 3 ట్రిలియన్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో 5వ అతిపెద్ద దేశం. ప్రస్తుతం దేశ తలసరి ఆదాయం రూ. 2.12 లక్షలు. కానీ ఇప్పటికీ మనం 5% పేదరికంతో బాధపడుతున్నాం. 2023 ప్రపంచ ఆకలి సూచిక ప్రకారం, 125 దేశాలలో భారతదేశం 111వ స్థానంలో ఉంది. సి.ఎం.ఐ.ఈ ప్రకారం, భారతదేశంలో నిరుద్యోగ రేటు జూన్ 2024 నాటికి 9.2 శాతానికి పెరిగింది. ఒక శాతం జనాభా, సంపద వాటా 2022-23లో 40.1%గా ఉంది. 2023-24లో దేశంలోని పొదుపులో 92% సంపన్నులైన 20% మంది కలిగి ఉన్నారు. వీటితో పాటు 2023లో ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ యొక్క కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ ప్రకారం, 100కి 40 అవినీతి భారంతో భారతదేశం ఉంది. భారతదేశం 2023 నాటికి తన స్థూల దేశీయోత్పత్తిలో కేవలం 3-4% విద్యపై ఖర్చు చేస్తోంది. ఆరోగ్య సంరక్షణపై 1.2-1.5% ఖర్చు చేస్తోంది. మానవాభివృద్ధి-సంబంధిత ప్రాంతాలపై మొత్తం వ్యయం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 6-8%గా అంచనా వేయబడింది. సరళీకరణ ఆర్థిక వ్యవస్థలో రెడ్ ట్యాపిజం ఇప్పటికీ తన ప్రభావాన్ని చూపుతోంది. దేశంలో బంధుప్రీతి దాదాపు అన్ని రంగాలలో కనిపిస్తుంది. దురదృష్టవశాత్తు ఇప్పటికీ మనం వరకట్నం, ఆడ శిశుహత్య, లింగ అసమానత, గృహ హింస, అంటరానితనం మొదలైన సాంఘిక దురాచారాలతో బాధపడుతున్నాం.

చట్టాల గురించి తెలుసుకోవాలి..

అయితే, మనదేశానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా.. విభిన్న రంగాలలో చాలా అభివృద్ధిని సాధించింది. మానవ వనరులలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. ఉక్కు, బొగ్గు ఉత్పత్తిలో, మొబైల్ వినియోగంలో వ్యవసాయ ఉత్పత్తిలో ప్రపంచవ్యాప్తంగా 2వ ర్యాంక్, బిలియనీర్ల సంఖ్యలో 3వ ర్యాంక్, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్‌పుట్, స్పేస్‌లో 5వ స్థానంలో ఉంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను స్వీకరించడంలో 8వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే 14వ అతిపెద్ద ఎగుమతిదారు. సాంస్కృతిక వైవిధ్యంలో 17వ ర్యాంక్, ఐ.టీ పరిశ్రమ పోటీతత్వంలో 18వ ర్యాంక్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో 40వ స్థానాన్ని నిలుపుకుంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఫిన్‌టెక్, పునరుత్పాదక శక్తి, బయోటెక్నాలజీ, డిజిటల్ లావాదేవీలు ఉన్నాయి.

సరళీకరణ, ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ యుగంలో నిరంతర ఆర్థికాభివృద్ధి, విభిన్న సంక్షేమ కార్యక్రమాలతో స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. దేశంలోని పౌరులు తమ హక్కులను పరిరక్షించడానికి మానవ హక్కుల సంఘాలు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, ఫోర్త్ ఎస్టేట్, సమాచార హక్కు చట్టం మొదలైన ప్లాట్‌ఫారమ్‌లు చట్టాల గురించి తెలుసుకోవాలి. పౌరుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడినప్పుడే సమానత్వం, సౌభ్రాతృత్వం లభిస్తాయి.

డాక్టర్. పి ఎస్. చారి,

83090 82823

Advertisement

Next Story