అవరోధాలే అవకాశాలు

by Ravi |   ( Updated:2023-06-20 22:45:17.0  )
అవరోధాలే అవకాశాలు
X

‘అవరోధాలనే అవకాశాలుగా మార్చుకుంటే ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు’ అనే స్వామి వివేకానంద చెప్పిన మాటలు ఎప్పటికీ నిజమే. మనిషికి వైకల్యం వున్నా మనసుకు మాత్రం వైకల్యం ఉండకూడదు అంటారు. మానసిక దృఢత్వం ఉన్నవారు శారీరక వైకల్యాలను అధిగమించడమే గాక ఉన్నత ఉద్యోగాలు సాధించి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి స్ఫూర్తిదాయకమైన అంధురాలు పూర్ణ సుందరి ఐఏఎస్.

ఐఏఎస్ కావాలనే కోరికతో..

తమిళనాడు రాష్ట్రం, మదురై జిల్లా, మణినగరం ప్రాంతానికి చెందిన పూర్ణ సుందరి. తండ్రి ఓ సాధారణ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి, తల్లి హోమ్ మేకర్, పూర్ణ సుందరి పుట్టుకతోనే అంధురాలిగా జన్మించలేదు. ఆమె 5 సంవత్సరాల వరకు సాధారణ పిల్లల్లాగే చదువుకుంది, కానీ ఆ తర్వాత అనూహ్య కారణాల వల్ల ఆమె కంటి చూపు క్షీణించడం ప్రారంభించింది. పూర్ణ సుందరి తల్లిదండ్రులు ఆమె చూపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆమె 5 సంవత్సరాల వయసులోనే చూపును కోల్పోయింది. కూతురు చూపు కోల్పోవడం పట్ల ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. అంధకారం అలుముకున్న తమ కూతురి జీవితాన్ని చూసి తల్లిదండ్రులు రోదించిన సందర్భాలెన్నో ఉన్నాయి. అయినా తల్లిదండ్రులు మనోస్థైర్యంతో బిడ్డను ధైర్యంగా ప్రోత్సహించి బంగారు భవిష్యత్తుకు బాటలు వేశారు. అంధత్వం తన కూతురి చదువుకు ఆటంకం కలగకూడదని కన్నతల్లే స్వయంగా పుస్తకాలు చదివి వినిపిస్తుండగా విషయాలను ఆకళింపు చేసుకునేది. పూర్ణ సుందరి స్కూల్ నుండి కాలేజీ వరకు ఎన్నో అవరోధాలను ఎదుర్కొంది. అవరోధాలే అవకాశాలుగా మార్చుకొని చదువులో ఫస్ట్ ర్యాంకులు సాధించింది.

మూడుసార్లు ఫెయిల్... అయినా!

ఐఏఎస్ అధికారి సగాయం, మాజీ ఐఏఎస్ ఉదయ చంద్రన్‌లతో ప్రేరణ పొందిన ఆమెలో ఇంటర్మీడియట్‌లో ఉండగానే ఐఏఎస్ కావాలనే ఆలోచనకు బీజం పడింది. తమ కూతురు సామర్థ్యాన్ని నమ్మి తల్లిదండ్రులు ఆమెను ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా తోటి స్నేహితులు కూడా చదువుల్లో ఆమెకు అర్థం కాని పాఠాలను ఆడియో ద్వారా అందజేసేవారు. తల్లిదండ్రులు, స్నేహితులు, ఉపాధ్యాయుల సహకారంతో డిగ్రీ పూర్తి చేయగలిగింది. అయినప్పటికీ ఆమెకు ఐఏఎస్ కావాలనే కోరిక ప్రబలంగా ఉండేది. తన కలలను సహకారం చేసుకునేందుకు ఆమె మొదటి ప్రయత్నం చేసి యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అయినా కూడా కలత చెందకుండా కఠినమైన ప్రయత్నం చేసినా, రెండోసారి కూడా విజయం సాధించలేకపోయింది. అయినా ఆమె పట్టుదలతో తన ఆకాంక్షను నెరవేర్చేందుకు మూడోసారి కూడా ప్రయత్నించి ఉత్తీర్ణత సాధించలేకపోయింది. అంతటితో తన ప్రయత్నం ఆపకుండా తాను ప్రిపేర్ అయ్యే విధానంలో లోపాలు గమనించి లోతుపాతులు తెలుసుకొని తనకు తెలియని అంశాలను ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటూ, అంతేకాక కంప్యూటర్ నుండి చదవడానికి ఆమె అంధుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ (JAWS) సాఫ్ట్‌వేర్ ఉపయోగించేది. కూతురిపై ఉన్న నమ్మకంతో ఎన్ని ప్రయాసలనైనా ఎదుర్కొని ఆమె కోరుకున్న పుస్తకాలను తండ్రి అందజేసేవారు. బ్రెయిలీ లిపిలో లేని పుస్తకాలను ఆమె తల్లి, స్నేహితులు గంటల తరబడి వివిధ పుస్తకాలు చదివి వినిపించేవారు. యూట్యూబ్‌లో లభించే ఆడియో పాఠాల సహాయంతో కఠోర దీక్షతో, నిరంతర కృషితో నాలుగోసారి ఉత్తీర్ణత సాధించగలిగింది. ఈ మహోత్కృష్ట యజ్ఞంలో ఆమెకు వెన్నుదన్నుగా నిలిచిన తల్లిదండ్రుల కృషి అత్యంత శ్లాఘనీయం.

వారికి మెరుగైన విద్యనందించేందుకు..

అంధత్వంతో బాధపడుతున్నా చదువుకునేందుకు ఆటంకం కాదని అడ్డంకులను అవకాశాలుగా మార్చుకుంటున్నారు. నేటి యువతకు సౌకర్యాలు ఉన్నా అందుబాటులో లేని వనరుల గురించి ఆలోచిస్తూ తమ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. దైనందిన జీవితంలో సమస్యలు అందరికీ సాధారణమే అయినా వాటిని ఎదుర్కొనే శక్తి ఉన్నవారికే విజయం వరిస్తుందనడంలో అతిశయోక్తి లేదు. అంధత్వం కారణంగా చాలా మంది ప్రతిభావంతులైన ఔత్సాహికులకు సివిల్ సర్వీసెస్‌లో చేరే అవకాశం లేకపోవడంతో గతంలో వారి కలలు సాకారం చేసుకునేందుకు అవకాశం లేదు. ఇటీవల ప్రధానమంత్రి మోడీ ప్రత్యేక చొరవ చూపి వంద శాతం అంధత్వం గలవారికి సివిల్ సర్వీసులో చేరే అవకాశాన్ని కల్పించడంతో ఈ కల సాకారమయింది. ఎన్నో అవరోధాలను అధిగమించి అంకుఠిత దీక్షతో విజయాన్ని సాధించిన పూర్ణ సుందరి ఐఏఎస్ నేటి అంగవికలురు యువతకు అద్భుత సందేశాన్ని అందించారు. అసాధ్యాలను సుసాధ్యం చేయాలంటే అంగవికలురు స్వీయం సానుభూతిని పక్కన పెట్టి అడ్డంకులను అధిగమించాలి తప్పా, అడ్డంకులు వచ్చాయని ఆగిపోయే ప్రయత్నం చేయకూడని, అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ ఆశయ సాధనకు ప్రణాళిక రూపొందించుకోవాలని నిరూపించారు. సామాన్య విద్యార్థులతో సమానంగా అంధులకు మెరుగైన విద్యనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందించాలి. అంతేకాకుండా, వారి విద్యకు తగిన బ్రెయిలీ పుస్తకాలు, ఆడియో పాఠాలు అందుబాటులో ఉంచాలి. అంధుల విద్య బలోపేతానికి ప్రత్యేక బడ్జెట్‌ని ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంధుల విద్య కోసం ప్రతి రాష్ట్రంలోనూ, జిల్లాలో ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలి.

జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అవరోధాలుగా భావిస్తూ... కొందరు ఉన్న చోటే ఉండి ముందుకు వెళ్లే ప్రయత్నాన్ని విరమించుకుంటారు. కొందరు వాటిని నివారించడానికి ప్రయత్నిస్తున్నారు. కొంతమంది ఆ అడ్డంకిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు అలాంటి వారే అవకాశాలను ఎదుర్కొంటారు.. వారు అనుభవ సామర్థ్యాలతో నిండి ఉంటారు, ఈ ప్రక్రియలో వారు అనేక విలువలను అలవరచుకుంటారు, నైపుణ్యాలను నేర్చుకుంటారు, జీవిత విలువను తెలుసుకుంటారు.. ఇతరులకు మార్గనిర్దేశం చేసే దాతృత్వాన్ని పొందుతారు.

కోట దామోదర్

9391480475

Advertisement

Next Story

Most Viewed