- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తొమ్మిదేండ్ల తెలంగాణకు ఒరిగిందేమిటి..?
రాష్ట్ర సాధన కోసం, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం ఈ గడ్డపై నిర్విరామమైన పోరాటాలు జరిగాయి. కానీ ప్రత్యేక రాష్ట్రంలో కూడా ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పోరాటాలు నేటికి జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర పాలకులు అభివృద్ధి ఫలాలు ప్రజలందరికి అందించాలన్న ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ప్రజా ఉద్యమాల తావును చెడిపేస్తున్నారు. పోరాటం చేసి, ఎన్నో నిర్భంధాలు ఎదుర్కొని అనేకసార్లు జైలుపాలై రాష్ట్ర ఆవిర్భావానికి కారకులైన శక్తులపై నేడు ఉక్కుపాదం మోపుతున్నారు. సామాజిక, ఆర్థిక మార్పు కోసం జరిగిన తెలంగాణ పోరాటాన్ని కాంట్రాక్టర్ల, కార్పొరేట్ శక్తుల పాదాల దగ్గర తాకట్టు పెట్టారు. ఉద్యమకారులకు ఆత్మగౌరవం లేకుండా పోయింది. ఉద్యమకారులకు గౌరవం దక్కకపోగా, ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాలు కాలరాయబడుతున్నాయి. రాష్ట్రం నిత్య నిర్బంధకాండగా తయారయింది. ఇన్ని గాయాలైన తెలంగాణ గుండెపై 21 రోజుల ఉత్సవాలకు ప్రభుత్వం తెరలేపింది. ఈ సందర్భంగా ఉద్యమకాలం నాటి ప్రధాన ఆకాంక్షలు ఏ మేరకు అమలయ్యాయో పునఃపరిశీలన చేసుకోవలసిన అవసరం తెలంగాణ సమాజంపై ఉన్నది.
నీ(నో)టి మాటలేనా?
క్రిష్ణానది బేసిన్‌లో రాష్ట్రానికి చెందిన నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు నిత్యం కరువు కాటకాలతో అల్లాడి లక్షలాది మంది వలసలు పోయినది యాదికున్నదే కదా.! ఆ బాధలు తీరాలంటే నది జిల్లాల్లో మన వాటా మనం సాధించుకోవాలి కదా.! కానీ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు డీపీఆర్‌లు మార్చడమే తప్ప ప్రత్యేక రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఒక్క టీఎంసీ కూడా సాధించలేదు. మన నీళ్ళు ఆంధ్రావాల్లు ఆనాడు అక్రమంగా తరలించుకపోయినట్లే, నేడు కూడా అదే తరహాలో తరలించుకుపోతున్నారు. కానీ మన పాలకులు మాత్రం మౌనంగా ఉంటున్నారు. పైగా ప్రాజెక్టుల రీడైజన్ పేరుతో నిధులు దుర్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా తయారు చేస్తున్నారు. మన వాటాగా దక్కాల్సిన నీళ్ళు మనకు దక్కకుండా తరలించుకుపోతున్నా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జల దోపిడిపై ముఖ్యమంత్రి సైతం గొంతెత్తకుండా దక్షిణ తెలంగాణపై నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దశాబ్దాలుగా పెండింగులో ఉన్న ఎస్ఎల్బీసీ, డిండి, భీమా, నెట్టంపాడు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు నిధులు కేటాయింపులు అరకొరగానే జరుగుతున్నాయి. కేటాయింపు జరిగినా నిధులు విడుదల కావడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు, రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారా అక్రమ జలాల తరలింపుకు అడ్డుకట్ట వేయకపోతే తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణం శాశ్వతంగా ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు.పైగా ఏపీ ప్రభుత్వం అక్రమ ప్రాజెక్టులు కట్టి సక్రమం చేసుకునే పనిలో ఉంది. కానీ మన పాలకులు సక్రమ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేని పరిస్థితి నెలకొన్నది. అందుకే తెలంగాణ ప్రభుత్వం క్రిష్ణానది కింద ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. అలాగే ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలి.
అప్పుల తిప్పలేనా.! అభివృద్ధి చేయరా?
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎప్పుడు ఏ ఆలోచన వస్తదో, ఏ నిర్ణయం తీసుకుంటారో, ఎవరికోసం తీసుకుంటరో, ఎన్ని లక్షల కోట్లు అప్పు తెస్తారో ఎవరికీ అంతుపట్టని విషయం. ప్రణాళికాబద్ధమైన ఆలోచనలు ఆయనకు ఉండవు. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ‘ఏక వ్యక్తి’ చేతిలో కూరుకునిపోయి ధనవంతమైన తెలంగాణ సుమారు నాలుగు లక్షల కోట్ల అప్పులతో దివాలా తీసింది. పోనీ అప్పులకు తగ్గట్లుగా అభివృద్ధి చెందాలి కదా.! అది జరగకపోగా మేఘా క్రిష్ణారెడ్డి, మై హోం రాజేశ్వర్ రావుల కబంధ హస్తాలలో తెలంగాణ బందీ అయింది. సకల నిధులూ వీరి రాజభవనాలకే చేరుతున్నాయి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గద్దల పాలైందనడానికి వీరే నిదర్శనం. కమీషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామా అనే చందంగా తయారయింది. మా మంత్రే 10% కమిషన్ తీసుకోమన్నాడని వారి ప్రజాప్రతినిధులే బహిర్గతంగా చెబుతున్నటువంటి స్థితి. వీరి కోసమేనా వందలాది మంది విద్యార్థులు ఆత్మార్పణ చేసుకుంది.? విద్యార్థుల త్యాగాలకు విలువ ఏది.?
ఇక్కడి వారికి ఉద్యోగాలు ఇవ్వరా?
తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి తమ పిల్లలను పట్టభద్రులు చేస్తే, ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రం ఏర్పడిన ప్రారంభంలో అసెంబ్లీలో ఇచ్చిన ఒక లక్ష ఏడువేల ఉద్యోగాల హమీ అనేది అరకొర పోలీసు ఉద్యోగాలను మినహాయిస్తే మిగతావన్ని నీటి మీది రాతలుగానే మారినవి. ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వక, ప్రైవేట్ ఉద్యోగాలు దొరకక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పాలకులకు నిమ్మకు నీరెత్తినట్లుగా కూడా లేదు. ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు వేస్తారో తొమ్మిదేండ్లు అవుతున్నా ఉద్యోగాల క్యాలెండర్ కూడా ప్రకటించలేదు. రాష్ట్రంలో ఉన్న అనేక కంపెనీలలో ఈ ప్రాంత నిరుద్యోగులకు ఉపాధి కల్పించరు.! వివిధ జిల్లాల్లోను, హైదరాబాద్ లోను అనేక కంపెనీలు ఉన్నా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వరు. ఆంధ్రా వారికి మాత్రమే అవకాశాలు కల్పిస్తారు. ఆ కంపెనీని స్థానికులకు ఎందుకు ఇస్తలేరని అడుగరు. ఎందుకంటే వారి లాలూచీలకు దాసోహం అవుతారు. తన కుటుంబం బాగోగుల గురించి తప్పా, తెలంగాణ ప్రజల బాగోగులు, నిరుద్యోగుల బతుకుల గురించి ముఖ్యమంత్రికి పట్టింపు లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే చిత్తశుద్ధి ఎక్కడ కనబడటం లేదు. ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసి ఉద్యోగాల భర్తీని పట్టించుకోక ధనార్జనే ధ్యేయంగా విద్యా వ్యాపారం చేస్తున్న వారికి ప్రైవేట్ యూనివర్సిటీలను కట్టబెట్టినారు.
నిర్లక్ష్యాన్ని వీడేదెప్పుడు?
తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే కృష్ణా నదీ జలాలకు సంబంధించి కార్యాచరణ ప్రకటించాలి. అటు కేంద్రంతోను.. ఇటు పక్క రాష్ట్రంతోను కృష్ణానది జలాలలో న్యాయమైన వాటా కోసం బరిగీసి కొట్లాడాల్సిన సందర్భం ఇప్పటికే ఆలస్యమైంది. ప్రాజెక్టుల నిర్మాణానికి కంకణం కట్టుకొని వేగవంతంగా పూర్తి చేయాలి. ఇంకా పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఆలస్యంగా ప్రారంభిస్తామంటే కట్టిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవి అక్రమమైన ప్రాజెక్టులని మన మీద నిందలు వేసే అవకాశాలు లేకపోలేదు. నియామకాలకు సంబంధించి తక్షణమే రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేయాలి. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని పరిశ్రమలలో 90% తెలంగాణ యువతకు దక్కేలా ప్రభుత్వం జీవో తీసి కంపెనీలకు ఆదేశాలను జారీ చేయాలి. నిరుద్యోగ యువతకు ఇస్తానన్న నిరుద్యోగ భృతిని వెంటనే ప్రారంభించాలి. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వానికి సమకూరిన ఆదాయాన్ని, ఐన ఖర్చును, తెచ్చిన అప్పులను ఏయే రంగాలకు ఎలా ఖర్చు చేశారో శ్వేతపత్రం తెలంగాణ సమాజం ముందు ఉంచాలి. సంపద సృష్టించడానికి నూతన వ్యవస్థలను సృష్టించాలి. కొత్త మార్గాలను అన్వేషించాలి. అప్పుడే తెలంగాణ నవ నిర్మాణం జరుగుతుందని తెలంగాణ విద్యావంతుల వేదిక భావిస్తుంది.
పందుల సైదులు
తెలంగాణ విద్యావంతుల వేదిక
9441661192
Also Read: హోదా వారిది.. అధికారం వీళ్ళది!