నడుస్తున్న చరిత్ర: 'ఉత్తర' ఫలితాలు-మనకు పాఠాలు

by Ravi |   ( Updated:2022-09-03 18:20:34.0  )
నడుస్తున్న చరిత్ర: ఉత్తర ఫలితాలు-మనకు పాఠాలు
X

బీజేపీని కాంగ్రెస్సే గెలిపిస్తోంది. అది దిగజారిన కొద్దీ ఇది ఎదిగివస్తోంది. పార్టీ గెలిచినా తాము ప్రధానమంత్రి కాలేమనే కాంగ్రెస్ సీనియర్ నేతల నిరాసక్తత, 'కాంగ్రెస్ మా సొంత పార్టీ, దీనికి ఏది దక్కినా మేమే అర్హులము' అనే కుటుంబ పాలనాతత్వం, ఆ తర్వాత కాంగ్రెస్ సీనియర్ల మాటలు వింటే పార్టీపై తమ పట్టు జారిపోతుందనే భయం, ఇంకా ఇలాంటి ఎన్నో పైత్యాలు కలగలిసి కాషాయ జెండాకు బూస్ట్ హార్లిక్స్‌గా మారాయి. విశేషమేమిటంటే ఇంకా కాంగ్రెస్‌కి దేశవ్యాప్తంగా కార్యకర్తలు, పోటీ చేసేందుకు అభ్యర్థులు పుష్కలంగా ఉన్నారు. ప్రస్తుతానికి అదే గొప్ప విషయం. ఇది పోతే మిగిలేది గత చరిత్రే. కాంగ్రెస్ వట్టిపోవడం వల్ల దేశంలో అగ్రవర్ణాల దాదాపు మొత్తం ఓట్లు, దళిత, బహుజనుల్లోని మతవాద హిందువుల ఓట్లు బీజేపీకి గంపగుత్తగా పడుతున్నాయి. ఇలా దేశంలోని ఓట్లలో సుమారు 25 నుంచి 30 శాతం ఆ పార్టీకి రిజర్వ్ అయ్యాయి. యూపీ విషయంలో మైనారిటీ వర్గాలను కలుపుకోకున్నా హిందువుల్లోనే మరో 10 నుంచి 15 శాతం రాబట్టగలిగితే బీజేపీ గెలుపు ఇక తేలికే అనేది రుజువయింది. దీనికి తోడు రెండో స్థానంలో ఉన్నవాడి గెలుపు అవకాశాన్ని తొక్కివేయడానికి చాటుమాటు ఒప్పందాలు ఉండనే ఉన్నాయి. ఒక రకంగా యూపీలో మజ్లిస్ పార్టీ వంద స్థానాల్లో పోటీ చేస్తుందనగానే అక్కడ బీజేపీ గెలుపు ఖాయమైపోయింది అని విశ్లేషకులు అంచనాకొచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ అవకాశాల్ని మజ్లిస్ గండికొట్టగా మిగిలినదేమన్నా ఉంటే మాయావతి గావు పట్టేసింది. మజ్లిస్ పోటీ వల్ల ఎస్పీ సుమారు 70 స్థానాల్లో విజయావకాశాల్ని కోల్పోయిందని ఓ తెలుగు టీవీ ఛానల్ వ్యాఖ్యానించింది.

గెలుపుకు అదొక్కటే కారణమా?

ఉత్తరప్రదేశ్‌లో రెండోసారి బీజేపీ గెలవడంతో అందరికీ, ప్రత్యేకంగా రాజకీయ విశ్లేషకులకు ఎన్నికల్లో విజయానికి యోగి పాలన పాత్ర ఎంత అనే ఆసక్తి పెరిగింది. ఒక్క హిందూ సెంటిమెంట్‌తో సంపూర్ణ విజయం సాధ్యం కాదని, దానిని అధిగమించేందుకు సాంప్రదాయిక ఓట్లు కాని వర్గాల ఓట్లను కూడా కూడగట్టాలని ఆయన ప్రణాళికాబద్ధంగా కదిలారనే విషయానికి ప్రాధాన్యం వస్తోంది. చట్టాలను, ప్రజాస్వామిక పాలనా విధానాలను పక్కనబెట్టి యోగి నోటి మాటనే ప్రభుత్వ ఉత్తర్వుగా పలు కఠోర నిర్ణయాలు తీసుకున్నారు. జీవో మీద ప్రజలు కోర్టుకు పోయి స్టే తేవచ్చు కానీ, సీఎం ఇచ్చిన మౌఖిక ఆదేశాలకు ఎవరు అడ్డుకట్ట వేయలేరు. గూండాయిజాన్ని అణచివేసే పేరిట ఆయన యాంటీ రోమియో స్క్వాడ్ తెచ్చారు.

2017 వచ్చిన ఈ స్క్వాడ్ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేసిన తీరును, సామాన్య కుటుంబాల యువకులను కిరాతకంగా హింసించిన, అవమానించిన, లాకప్ లో థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వార్తలు, వీడియోలు ఎన్నో బయటికొచ్చాయి.వీటిలో దేనినీ యోగి లెక్క చేయలేదు. ఏ పోలీసునూ తప్పు పట్టలేదు. వాస్తవానికి మాత్రం జాతీయ నేరాల లెక్కల ప్రకారం 2018లో దేశంలో మహిళలపై జరిగిన దాడులు, అత్యాచారాలలో యూపీ 16 శాతంతో ముందు వరసలో ఉంది. 'రోమియో'ల పేరిట ఆయన ఏ వర్గాలను బలి చేశాడో ఈ లెక్కలే చెబుతున్నాయి. ఆయన వాక్చాతుర్యంతో తన నిర్ణయాన్ని గొప్పపనిగా ప్రచారం చేసుకోగలిగారు.

అయినా అరాచకాలు జరిగాయి

ఈ ఎన్నికల్లో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల అదుపు అనే పాజిటివ్ ముద్ర కొన్ని వర్గాల ఓట్లను తెచ్చి బీజేపీ గెలుపును సునాయాసం చేసింది. మహిళలపై ఎన్నో అరాచకాలు జరుగుతున్నట్లు పత్రికల్లో వస్తున్నా యూపీ వీధుల్లో మహిళలు స్వేచ్ఛగా తిరుగగలుగుతున్నారని ప్రచారం మాత్రం ఎన్నికల్లో ఉపయోగపడింది. యోగి ఆదిత్యనాథ్ యూపీ క్యాబినెట్‌కు కేవలం ముఖ్యమంత్రియే కాదు,ఆయన చేతిలో అదనంగా 34 మంత్రిత్వ శాఖలున్నాయి. హోమ్, రెవెన్యూ, సివిల్ సప్లయిస్, జైళ్లు, పునరావాసం, గనులు, నియామకాలు,ప్లానింగ్,రాష్ట్ర ఆస్తుల పరిరక్షణ ఇలా కీలక శాఖలన్నీ ఆయన తన గుప్పిట్లో ఉంచుకున్నారు.

మంత్రివర్గ సమావేశమంటే ఆయనొస్తే అంత మంది మంత్రులు వచ్చినట్లే. దీనివల్ల ఆయన తనకిష్టమైన నిర్ణయాలు యథేచ్చగా అమలు చేయగలిగారు. మంత్రిపదవిలో ఉన్నవారు నాలుగు రాళ్లు వెనుకేసుకొనే శాఖలు తనవద్దే ఉన్నందున ఆ లెక్కలన్నీ ఎలా ఉన్నా ఫైళ్ల కదలిక మాత్రం ఆయన కనుసన్నలలో జరిగేది. దీనివల్ల అవినీతికి, అక్రమాలకు ఆస్కారం తగ్గి పనులు వేగవంతమయ్యాయని పత్రికలు రాశాయి. అదే అదునుగా రాష్ట్రంలో వందలాది అక్రమ కట్టడాలను బుల్డోజర్లతో కూల్చేసిన ఘనుడిగా పేరు తెచ్చుకున్నారు.

పూట గడవడం కూడా ముఖ్యమే

యోగి ప్రభుత్వం గత రెండేళ్లుగా కరోనా కారణంగా పేదలకు ఉచిత రేషన్ సరఫరా చేస్తోంది. నగదు బదిలీని కొనసాగిస్తోంది. బీజేపీ గెలిస్తే మరో అయిదేళ్లపాటు ఇలాగే ఉచిత బియ్యం, తిండి దినుసుల పంపిణీ ఉంటుందని ప్రచారం చేశారు. ఏ మతం పేదలకైనా రెండు పూటలా భోజనం ముఖ్యం. ఇంట్లో బియ్యముంటే ఇంటావిడకు సగం బాధ తీరినట్లే. అందుకే అన్ని వర్గాల మహిళలు బీజేపీకి జైకొట్టారు.ఈ గెలుపు ద్వారా తెలుసుకొన్న కొత్త పాఠమేమిటంటే కేవలం కబుర్లు చెప్పి పాలన చేసే రోజులు పోయాయి.

మతమైనా, ప్రాంతీయ అభిమానమైనా ఓటర్ల సెంటిమెంట్లను వాడుకుంటూనే, వాటికి తోడుగా తప్పనిసరిగా కొంతైన జనాలు సంతృప్తిపడే రీతిలో పాలక నిర్ణయాలు ఉండాలి. సగం సెంటిమెంటు, సగం ప్రజల ఇబ్బందులు తీర్చే రీతిలోనే పాలన ఉండాలి. తెలంగాణ బిడ్డలమని తెలంగాణను తక్కువ చేసి మాట్లాడితే మీకు రోషం పొడుచుకు రావడం లేదా? నీవు తెలంగాణ బిడ్డవు కాదా? అని రెచ్చగొట్టి లాడాయికి దింపితే సరిపోదు. ఆ మాటలతో ఎవరూ సంతృప్తిపడరు. 'జై తెలంగాణ' అన్న కడుపుకు అన్నం కావాలి, నాయకునికి జై కొట్టిన వాడికి నెల ఖర్చు గడవాలి.

హామీలు మరిస్తే అంతే మరి

ప్రజలు పాలకుల హామీల అమలును వెంటనే కోరుకుంటున్నారు. ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చుకుంటూ పోయి చివరకు ఏదో సాకులు చెబుతూ వాటిని పక్కనపెట్టి కాలం గడిపితే వారి సహనం నశిస్తుంది. ఏవో బుదిరికిచ్చే మాటలు చెప్పి, భుజం మీద చెయ్యేసి మాట్లాడి, పక్కన కూచొని బువ్వ తిని ప్రజలను ఎంతో కాలం ఎవరూ సంతృప్తి పరచలేరు. పక్కా పని కావాలె, అన్నది అన్నట్లు కావాలె అదీ జనం కోరుకుంటున్నది. తెలంగాణాలో నాకెవడు పోటీ అని ప్రస్తుత ప్రభుత్వం అనుకునే రోజులు కావివి. కేసీఆర్ మరోసారి అసెంబ్లీలో ఉద్యోగ నియామకం ప్రకటన చేశారు. అదో గొప్ప విషయంగా పార్టీ యంత్రాంగం లీటర్ల కొద్ది పాలతో కేసీఆర్ ఫ్లెక్సీలను తడిపేసింది. ఉద్యోగార్థులు మాత్రం మళ్లీ అడియాశ కావద్దని ఆశిస్తున్నారు. అయితే ఇప్పటి దాకా వేరు, ఇప్పుడు వేరు.

ప్రకటించిన 90 వేల ఉద్యోగాలు చకాచకా పూరిస్తేనే పరువు, ప్రతిష్ట నిలుస్తాయి. లేదంటే విపక్షాలతో కలిసి విద్యార్థిలోకం పెద్ద అందోళననే చేపట్టవచ్చు. పాలకుల నిర్ణయాల వెనుక రాజకీయ ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. ఓట్లు పడ్డాక మరిచిపోవడం పాలకపక్షనేరంగానే భావించాలి. రాబోయే కాలంలో తమ పాలనే కావాలనుకుంటే టీఆర్‌ఎస్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. రోజు రోజుకు రాజకీయ ఉష్ణోగ్రతలు మారుతున్నాయి కాబట్టి ఆదమరచి జారవిడిస్తే ఏ సెంటిమెంట్ పనిచేయదు. మహారాష్ట్ర, బిహార్, యూపీ మార్క్ బీజేపీ ఎంఐఎంల బి-టీమ్ రాజకీయాలు తెలంగాణాలో సాధ్యపడకపోవచ్చు కానీ, రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తామని అసద్ అనడం చిన్నమాట కాదు.

వాస్తవాలు గమనించాలి

ఈ పరిస్థితులలో ప్రజలకిచ్చిన హామీల చిట్టా తీసి ఒక్కొక్కటి అమలు చేయడం లేదా వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించడం టీఆర్‌ఎస్‌కు తక్షణ అవసరం. అదేదీ లేకుండా మళ్లీ ఓట్లు కొల్లగొట్టే కొత్త కథలు చెప్పేందుకు ఎన్నికల వ్యూహకర్తల సాయం తీసుకుంటే మొదటికే మోసం వచ్చే ఛాఉంది. ప్రశాంత్ కిషోర్ ఓ బ్యాండ్ పార్టీలాంటోడు. ఎవరి పెళ్లికైనా బాజా కొడతాడు. ఆయనకు కావలిసింది డబ్బు. అలాంటివారి తోడ్పాటు తీసుకోవడం దేశ రాజకీయాలకే సిగ్గుచేటు.

రోజు ప్రజల్లో తిరిగే నేతలకన్నా అలాంటివారికి ప్రజల నాడి తెలుసునని నమ్మడం మూర్ఖత్వమే. ఓట్ల కోసం, గెలుపు కోసం ఆయన దుష్టపన్నాగాలు సలహాగా ఇవ్వవచ్చు. మతతత్వాన్ని రెచ్చగొట్టమనవచ్చు. లేని గొడవలు సృష్టించమనవచ్చు. దానికి బలయ్యేది మనమే. సామాన్యప్రజలే. పని లాభదాయకంగా లేకపోతే పీకే బిచాణా ఎత్తేసి మళ్లీ విదేశాలకు పోయి హాయిగా బతుకుతాడు. పాలించేందుకు స్వచ్ఛమైన ప్రజా సేవయే నిజమైన మార్గము, అదే ఓటడిగే హక్కు.

బి.నర్సన్

94401 28169

Advertisement

Next Story

Most Viewed