అవినీతి ముందు ఏవీ నిలబడవ్!

by Ravi |   ( Updated:2024-07-11 01:15:22.0  )
అవినీతి ముందు ఏవీ నిలబడవ్!
X

మన దేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే రంగం నిర్మాణ రంగం. అభివృద్ధి పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు బడ్జెట్‌‌లో సగానికి పైగా నిధులు కేటాయిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగక ప్రజల సొమ్ము అవినీతిమయం అవుతోంది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా నిర్మాణంలో ఉన్న పూర్తెన వంతెనలు కూలిపోవడం, కుంగిపోవడంపై వస్తున్న వార్తలు మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం.

ప్రభుత్వాలు ప్రజల అవసరార్థం నదులపై, కాలువలపై వంతెనలు నిర్మిస్తాయి. ఆ వంతెనలు నిర్మించే ముందు సమగ్ర సర్వే చేసి, అంచనాలు తయారు చేసి టెండర్లు పిలుస్తారు. ఆ పనిలో అనుభవజ్ఞులైన గుత్తేదారులను తక్కువ ధర కోట్‌ చేసిన వారిని ఎంపిక చేసి వర్క్‌ ఆర్డర్‌ ద్వారా పనులు మొదలుపెట్టాలని నిర్ణీత గడువును తెలియజేస్తూ సంబంధిత సూపరింటెండెంట్‌ ఇంజనీరు ఆ గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకుంటాడు. మనదేశంలో ఈ పద్ధతి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, రాక ముందు కూడా ఉపయోగించేవారు. రోడ్లు, భవనాలు, వంతెనలు మేజర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులన్నీ ఇదే పద్ధతి అవలంభిస్తారు.

టెండర్ల ప్రక్రియలో..

రెండు దశాబ్ద కాలాల క్రిందట గుత్తేదారులు తమ పనులకు సంబంధించిన టెండర్లను, సీల్డ్‌ కొటేషన్లు నిర్ణీత సమయంలో సూపరింటెండిరగ్‌ అధికారి కార్యాలయంలో ఒక బాక్స్‌లో వేసేవారు. సంబంధిత అధికారులు పోటీలో పాల్గొన్న గుత్తేదారుల సమక్షంలో ఆ బాక్స్‌ యొక్క సీలు తీసి కొటేషన్లను తెరచి తక్కువ కోట్‌ చేసిన వారికి పని టెండరును ఖరారు చేసేవారు. ఈ టెండర్లలో గుత్తేదారు వృత్తి వ్యాపారంలో ఉన్న వారు నేరుగా పాల్గొనేవారు. అభివృద్ధి పేరుతో వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు రోడ్లు, భవనాలు, కాలువలు, వంతెనలు ఎక్కువగా పిలవడం, గుత్తేదారులలో పోటీతత్వం పెరిగి తగాదాలు రావడంతో రాజకీయనాయకులు తలదూర్చడంతో రాను రాను నాయకులు వారి అనుచరులకు టెండర్లు ఇప్పించడం మొదలైంది. కొంతవరకు ఈ వృత్తి వ్యాపారం చేసుకునే వారి ప్రాబల్యం తగ్గి రాజకీయ నాయకులే నేరుగా పనులు చేయడం కూడా జరిగింది. అధికారులను, కంట్రాక్టర్లను బెదిరించి టెండర్లను వేయకుండా బాక్స్‌ దగ్గర రాజకీయ నాయకులు, గూండాలు, ఫ్యాక్షనిస్టులు, బాంబులు, గన్నులతో కాపలా కాసి వారే టెండర్లు వేసేవారు. ఎక్కువ రేటుతో పనులను దక్కించుకొని నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా తమ ఇష్టారాజ్యంగా పనులను చేసి, ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసేవారు.

నేతలను పక్కనబెడితే...

ఇది గమనించిన అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకుండా గుత్తేదారు వృత్తిలో అనుభవం ఉన్నవారే ప్రభుత్వ పనులను చేయాలని, రియలిస్టిక్‌ ఎస్టిమేట్‌ తయారుచేయాలని, పారదర్శకంగా టెండర్‌ పిలవాలని కొన్ని సంస్కరణలు చేసింది. అందుకు అనుగుణంగా టెండరు పర్సెంటెజీలకు క్యాప్‌ పెట్టి జి.ఓ.ఎం.ఎస్‌. నం. 94, తేది 1-7-2003న రిలీజ్‌ చేసింది. రాజకీయ నాయకుల, అధికారుల ప్రమేయం లేకుండా టెండర్లు కూడా ఆన్‌లైన్‌ ద్వారా వారి టెండర్లను దాఖలు చేయడానికి ఆదేశాలిచ్చారు. అనుభవమున్న, అర్హత ఉన్న గుత్తేదారులు ఎక్కడినుంచైనా పని వివరాలు తెలుసుకొని ఆన్‌లైన్‌ ద్వారా ఆ పోర్టల్‌‌లోకి వెళ్లి టెండర్‌ను ఎవరి ప్రమేయం లేకుండా ఆ పని విలువకు తన రేటు వేసుకోవచ్చును. కానీ కమీషన్లకు అలవాటు పడ్డ నాయకులు, వారి అనుచరులు వారు చెప్పిన వారికే టెండర్‌ దొరకాలని మిగతా వారిని టెండర్‌ వెయ్యకుండా కంట్రాక్టర్ల జాబితాను తీసుకొని వారిని బెదిరించో లేదా బుజ్జగించో టెండర్‌ను దక్కించుకుంటున్నారు. రాజకీయ నాయకుల ప్రమేయం లేకుండా టెండర్‌ దక్కించుకుంటే ఖచ్చితంగా టెండర్లను రద్దు చేస్తారు, లేదా అక్కడి అధికారులు పనులు మొదలుపెట్టడానికి ఏ మాత్రం సహకరించరు. ప్రభుత్వ పని తమ ఏరియాలో జరుగుతుంది అంటే అక్కడి శాసనసభ్యునికి కమీషన్లు ఇచ్చుకోవాల్సిందే. లేకుంటే పని సాగదు. దీంతో రాజకీయ నాయకుల కమీషన్‌, అధికారుల కమీషన్లు కలుపుకొని గుత్తేదారులు టెండర్‌ దాఖలు చెయ్యాల్సి వస్తుంది.

కాసులివ్వకుంటే బిల్లు పాస్ కాదు

గత తెలంగాణ ప్రభుత్వంలో నిధులు రిలీజ్‌ చేయడానికి కొంత కమీషన్లు తీసుకున్నారని పత్రికల్లో చదివాం. ఈ కమీషన్లు అన్నీ కలిపితే 15% నుండి 20% వరకు టెండర్లలో పని విలువతో కలుపుకొని కోట్‌ చెయ్యాలి. గత ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టులు అంచనాలను పెంచి టెండర్లకు ఆమోదాలు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. కొంతమంది శాసనసభ్యులు ఎటువంటి కమీషన్లు తీసుకోకుండా తమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని, ప్రజాపనులు ప్రజలకు ఉపయోగపడాలి, మన్నికగా ఉండాలి అని ఆలోచించే వారు ఉన్నారు. దాదాపు 75% మంది అధికారులు డబ్బులు తీసుకోకుండా ఏ బిల్లూ పాస్‌ చేయరు. అక్కడి నుండి ఓడిపోయిన ఎమ్మెల్యే కూడా ఎంతో కొంత వసూలు చేయకుండా ఈ గుత్తేదారుని వదలరు. ఇటువంటి పరిస్థితులలో ఒక వృత్తి పరమైన కంట్రాక్టర్స్‌ టెండర్లు వెయ్యరు. కమీషన్లు ఇచ్చిన కంట్రాక్టర్ల పని నాణ్యతను పరీక్షించగలుగుతారా, ప్రశ్నించగలుగుతారా? దాని ప్రభావమే గుంతల రోడ్లు, కొట్టుకుపోతున్న వంతెనలు, కుంగుతున్న బ్యారేజీలు. కొందరు మంత్రుల హోదాలో కూడా గుత్తేదారుల దగ్గర కొంత కమీషన్లను ఆశిస్తారు. అది వారి హక్కులా భావిస్తారు. కొన్ని సందర్భాల్లో భయపెట్టి కూడా వసూలు చేస్తారు. రాజకీయపార్టీలకు, నాయకులకు రోజువారీ ఖర్చులు, ఎన్నికల ఖర్చులు, కార్యకర్తల మెయింట్‌నెన్స్‌ కొరకు, ప్రజాపనుల కమీషన్లు, రియల్‌ ఎస్టేట్‌ కోసం అక్కడి కంపెనీల దగ్గర వసూలు మీదనే ఆధారపడతారు. ఎన్నికల కమిషన్‌, గుర్తింపు పొందిన పార్టీల ఎన్నికల ఖర్చు భరించినప్పుడు ప్రస్తుత రాజకీయ నాయకుల్లో కొంత మార్పు రావచ్చని ఆశిద్దాం.

సోమ శ్రీనివాసరెడ్డి

కార్యదర్శి, ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌

Advertisement

Next Story

Most Viewed